పెషావర్: క్రికెట్ మ్యాచ్‌లో వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. క్రికెట్ ఆడుకుంటున్న చిన్నారుల మధ్య మొదలైన స్వల్ప వివాదం కాస్తా తుపాకులతో కాల్చుకునే స్థాయికిపోయింది. వివాదం కారణంగా రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్‌లోని కైబర్ పక్తుంక్వా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
డిప్యూటీ సూపరిండింటెంట్ ఆఫ్ పోలీస్ ఇజాజ్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు చిన్నారులు క్రికెట్ ఆడుకుంటుండగా వారి మధ్య ఘర్షణ జరిగింది. ఇది కాస్తా వారి తల్లిదండ్రుల దాకా వెళ్లింది. పిల్లల తల్లిదండ్రులు కూడా గొడవపడి ఫిర్యాదు చేసేందుకు అబోట్టాబాద్ జిల్లాలోని పోలీస్ పోస్టు వద్దకు వచ్చారు. ఈ క్రమంలోనే రెండు గ్రూపులకు చెందిన వారి మధ్య వాగ్వాదం చెలరేగండంతో ఓ గ్రూపుకు చెందిన వారు కాల్పులు జరిపారు. మరో గ్రూపువాళ్లుకూడా కాల్పులు ప్రారంభించడంతో పోలీస్ స్టేషన్ ప్రాంగణం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఈ ఘటనలో ఓ గ్రూపులో ముగ్గురు, మరో గ్రూపులో నలుగురు మృతిచెందారు. మరో వ్యక్తి గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment