
సాక్షి, హైదరాబాద్/వాషింగ్టన్:
హెచ్1బీ వీసాపై ట్రంప్ సర్కారు భరోసానిచ్చింది! కొద్దిరోజులుగా అమెరికాలోని ఈ వీసాదారులు, భారత్‌లోని వారి కుటుంబాలను కలవరపెడుతున్న వార్తలకు చెక్ పెట్టింది. హెచ్1బీ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయబోమని ప్రకటించింది. లక్షలాది మంది హెచ్1బీ వీసాదారులను అమెరికా నుంచి వెనక్కి పంపే ఎలాంటి ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోబోమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార యంత్రాంగం తాజాగా వెల్లడించింది. దీంతో అమెరికాలో ఈ వీసాపై కొలువులు చేస్తున్న దాదాపు 6 లక్షల మంది భారతీయులు ఊపిరి పీల్చుకున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 1.65 లక్షల మంది ఉన్నారు.
వీరంతా గ్రీన్‌కార్డు కోసం వేచిచూస్తున్న జాబితాలో ఉన్నవారే. ఒకవేళ ట్రంప్ ప్రతిపాదన అమల్లోకి వచ్చే అవకాశం ఉంటే.. ఆరేళ్లకు పైబడి పని చేసిన 1.08 మంది వెంటనే వెనక్కి వచ్చే ప్రమాదం ఉండేంది. మిగతా 57 వేల మంది మూడేళ్ల లోపు వారే కాబట్టి మరో మూడేళ్లు పనిచేసుకునే అవకాశం ఉండేది. అయితే నిబంధనల్లో మార్పేమీ లేదని ప్రకటించడతో ఈ 1.65 లక్షల మంది ఎలాంటి ఆటకం లేకుండా ఉద్యోగం చేసుకునేందుకు మార్గం సుగమమైంది. గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి అన్ని అర్హతలు ఉన్నాయని భావిస్తే అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) ప్రాథమికంగా ‘ఐ140’కార్డు జారీ చేస్తుంది. ఇలా ‘ఐ140’పొందిన వారంతా గ్రీన్‌కార్డు వచ్చేవరకూ హెచ్1బీ వీసాపై శాశ్వతంగా ఉద్యోగం చేసుకునే అవకాశం కలిగి ఉంటారు. ఇదిలా ఉంటే రెండోసారి హెచ్1బీ వీసా పొడిగించే సమయానికల్లా గ్రీన్‌కార్డు దరఖాస్తు ఆమోదం పొందకపోతే ఐ140 కార్డు జారీ చేయరు. అలాంటి వారంతా స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది.
గ్రీన్‌కార్డులపై ఆచితూచి
ప్రస్తుతం అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్(ఓపీటీ)పై ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు. వారిలో 40 శాతం అంటే లక్ష మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే. వీరు 36 మాసాల్లో హెచ్1బీ పొందలేని పక్షంలో స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది. 2.5 లక్షల మందిలో 53 వేల మంది భారతీయులు హెచ్1బీ వీసా ఉండి ‘ఐ140’కోసం ఎదురుచూస్తున్నారు. హెచ్1బీ వీసాతో పని చేస్తున్న దాదాపు 38 వేల మంది గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా అవన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. వీరందరికీ ఐ140 జారీ చేస్తేనే రెండోసారి హెచ్1బీ వీసా పొడిగించుకునేందుకు అర్హత సాధిస్తారు. లేకుంటే తిరుగు పయనం కావాల్సి ఉంటుంది. వీరు కాకుండా 2016, 2017లో హెచ్1బీ వీసా పొందిన మరో 16 వేల మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే యూఎస్‌సీఐఎస్ నుంచి అందిన సూచనల మేరకు భారతీయ ఐటీ కంపెనీలు ఇలాంటి దరఖాస్తులను ప్రాసెస్ చేయడం లేదు.
అమెరికన్ కంపెనీలు కూడా అవసరాన్ని బట్టి గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నాయి. ‘‘నేను రెండేళ్ల పాటు హెచ్1బీ వీసాతో అమెరికన్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేశా. మొదటిసారి హెచ్1బీ రెన్యూవల్‌కు ముందే గ్రీన్‌కార్డు దరఖాస్తు కోసం ప్రాసెస్ చేయాలని కంపెనీ హెచ్‌ఆర్‌ను కోరాను. అయితే వారు అందుకు తిరస్కరించారు. అందుకు మరో కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేస్తే ఆ కంపెనీలో చేరా. గ్రీన్‌కార్డు కోసంఆ కంపెనీ దరఖాస్తు చేసి ఏడాదిన్నర దాటినా పెండింగ్‌లోనే ఉంది’’అని సందీప్ యలమంచిలి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇలా సేవలు అందించిన కన్సల్టెన్సీలు ఇప్పుడు భయపడుతున్నాయని, అమెరికా ప్రభుత్వం నుంచి అందుతున్న సూచనలే అవి పాటిస్తున్నారని రఘపతిరావు నేమాని చెప్పారు. ఇంటర్‌గ్రాఫ్ కంపెనీలో ఐదేళ్లుగా పనిచేస్తున్న ఈయనకు మరో ఆరుమాసాల్లో ‘ఐ140’రాకపోతే రెండోసారి హెచ్1బీ రెన్యువల్‌కు అర్హత ఉండదు. ఇలాంటి వారు వేలాది మంది ఇప్పుడు ఆందోళనలో పడ్డారు.
తదుపరి చర్యలు ‘ఐ140’పైనే..
ఒకసారి గ్రీన్‌కార్డు దరఖాస్తును ఆమోదించి ప్రక్రియ ప్రారంభించారంటే.. సదరు అభ్యర్థికి ‘ఐ140’కార్డు జారీ చేయాల్సి ఉంటుంది. అలా ఐ140 పొందిన వారు గ్రీన్‌కార్డు వచ్చేదాకా శాశ్వతంగా హెచ్1బీపై ఉద్యోగం చేసుకోవడానికి అర్హులవుతారు. ఇప్పుడు ఇదే తమకు గుదిబండగా మారిందని అమెరికన్లు భావిస్తున్నారు. ఇకపై ఐ140 జారీ చేసే విషయంలో తగు చర్యలు చేపట్టడం లేదా తగిన అర్హతలు ఉంటేనే దరఖాస్తులను ప్రాసెస్ చేస్తామన్న నిబంధనలు రూపొందించాలని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు గ్రీన్‌కార్డు ప్రాసెస్‌లో ఉన్న వారిని తిరిగి పంపించాలన్నా.. దానికి న్యాయస్థానాలు అంగీకరించకపోవచ్చని అమెరికా న్యాయ విభాగం సూచించడం వల్లే ఆరేళ్ల ప్రతిపాదనను వెనక్కి తీసుకుందని అక్కడి అధికారవర్గాలు చెబుతున్నాయి.
అసలు గ్రీన్‌కార్డు ప్రతిపాదనలు ఆమోదించని పక్షంలో ఆరేళ్లకు మించి అమెరికాలో హెచ్1బీ వీసాపై పని చేయడానికి ఎటూ అవకాశం లేదు. ఇలాంటి చర్యలను అమెరికన్ కంపెనీలు వ్యతిరేకిస్తున్నా.. స్థానికులకు ఉద్యోగావకాశాల విషయంలో వ్యక్తమవుతున్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని పరిమితంగా గ్రీన్‌కార్డు దరఖాస్తులను ప్రాసెస్ చేస్తున్నాయని ఎ.నరేందర్‌రెడ్డి ఎల్లూరు చెప్పారు. అమెరికన్ ప్రభుత్వ వైద్య సర్వీసుల విభాగంలో పని చేస్తున్న ఈయన అమెరికా పౌరుడు కూడా. ‘‘అమెరికాకు వచ్చేవారికి అన్ని అర్హతలు ఉన్నవాళ్లయితే ఈ పరిస్థితులు వచ్చేవి కావు. కనీస భాషా పరిజ్ఞానం (ఆంగ్లం), సాంకేతిక పరిజ్ఞానం లేకుండానే ఎంఎస్ చేయడానికి వస్తున్నారు. ఇక్కడకు రావడంతోనే చదువు పక్కనబెట్టి డాలర్ల సంపాదనలో పడుతున్నారు. అలాంటి వారందరికీ రానున్నది గడ్డు కాలమే’’అని పేర్కొన్నారు.
హెచ్1బీకి ఈ ఏడాది పాత పద్ధతే
హెచ్1బీ వీసా పొందడానికి కనిష్టంగా 1.35 లక్షల డాలర్ల వార్షిక వేతనం ఉండాలన్న నిబంధనను కూడా ట్రంప్ సర్కారు ఈ ఏడాది అమలు చేయడం లేదు. దానికి అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లేకపోవడమే అందుకు కారణం. అయితే 2019 ఏప్రిల్ నాటికి లాటరీ విధానానికి బదులు మెరిట్ ప్రాతిపదికన హెచ్1బీ వీసా ఇవ్వాలన్న నిబంధన అమల్లోకి వస్తుందని అంటున్నారు. వచ్చే ఏప్రిల్‌లో ఇచ్చే హెచ్1బీ వీసాలు లాటరీ ప్రాతిపదకనే ఉంటాయని యూఎస్‌ఐసీఎస్ ఇప్పటికే ప్రకటించింది.
ఇదీ ఆందోళన...
అమెరికా కాంపిటీటివ్‌నెస్ ఇన్ ట్వెంటీఫస్ట్ సెంచరీ చట్టం(ఏసీ21)లోని 104(సీ) సెక్షన్ నిర్వచనాన్ని మార్చేందుకు ట్రంప్ సర్కారు యత్నిస్తోందన్న వార్తలు భారతీయ ఐటీ నిపుణుల్లో కలవరానికి గురిచేశాయి. హెచ్1బీ వీసాల ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన విదేశీయుల్ని అమెరికా రప్పించడానికి 2000లోనే ఈ చట్టాన్ని చేశారు. 17 సంవత్సరాలుగా ఈ చట్టం అమల్లో ఉంది. గ్రీన్‌కార్డ్ కోసం చేసిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా హెచ్1బీ వీసాలను మూడేళ్లకోసారి ‘ఎన్నిసార్లయినా’పొడిగించుకునే అవకాశం ఈ చట్టంలో ఉంది. అయితే ‘ఎన్నిసార్లయినా’అనే వెసులుబాటును తీసేసి, రెండుసార్లకే పరిమితం చేయాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో లక్షలాది మంది హెచ్1బీ వీసాదారులు అమెరికా వీడాల్సి వస్తుంది. అయితే హెచ్–1బీ వీసాదారుల్ని బలవంతంగా వెనక్కి పంపబోమని, ఆ మేరకు మారుల్పి పరిశీలించడం లేదని యూఎస్‌సీఐఎస్ తాజాగా వెల్లడించింది. తామెప్పుడూ ఈ మార్పులపై ఆలోచన చేయలేదని, తమపై ఒత్తిడి ఉందన్న వార్తల్లో నిజం లేదని యూఎస్‌సీఐఎస్ మీడియా విభాగం అధిపతి జొనాథన్ వితింగ్టన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment