
న్యూఢిల్లీ: ఆకాశంలో మరో అద్భుతానికి వేళయింది. ఓ వైపు సంపూర్ణ చంద్ర గ్రహణం, మరోవైపు సూపర్ మూన్ ఒకేసారి దర్శనమివనున్నాయి. ప్రాంతాన్ని బట్టి ఆదివారం అర్ధరాత్రి లేదా సోమవారం వేకువజామున ఇది చోటుచేసుకోనుంది. సుమారు మూడు గంటల పాటు కొనసాగే ఈ దృశ్యం ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంత ప్రజలకు కనిపించదు. ఉత్తర, దక్షిణ అమెరికా, ఐస్‌లాండ్, గ్రీన్‌లాండ్, స్వీడన్, నార్వే, బ్రిటన్, పోర్చుగల్ , ఫ్రాన్స్, స్పెయిన్ తదితర దేశాల్లో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం, సూపర్‌మూన్‌లను పూర్తిగా వీక్షించొచ్చు.
2019, 20 సంవత్సరాల్లో చోటుచేసుకోబోతున్న ఏకైక సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే. చంద్రుడు భూమికి సమీపంగా రావడం వల్ల సాధారణం కన్నా ప్రకాశవంతంగా మెరుస్తూ సూపర్‌మూన్‌లా కనిపిస్తాడు. ఈ ఏడాది మరో రెండు సూపర్ మూన్‌లు కనిపించనున్నాయి.