స్వర అభిషేకం
అభిషేక్ రఘురాం.. సంగీతమే అతని శ్వాస. సప్త స్వరాలను పలికించే ఆ గళం సంప్రదాయ సంగీత కుటుంబంలో ఉదయించింది. కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టింది. రాగాల పల్లకిని పలికిస్తుంది. నిత్యం బ్రహ్మ ముహూర్తంలో గొంతుకను సవరించుకునే అభిషేక్.. గమకాల గమనాలతో ప్రపంచ ఖ్యాతి పొందారు. సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ 56వ వార్షికోత్సవంలో భాగంగా బుధవారం రవీంద్రభారతిలో జరిగిన అభిషేక్ సంగీత కచేరీ ఆహూతులను అలరించింది. ఈ సందర్భంగా ఆయనను ‘సిటీప్లస్’ పలకరించింది.
మాది చెన్నై. సంగీత విద్వాంసుల కుటుంబంలో జన్మించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ప్రఖ్యాత మృదంగ విద్వాంసుడు పాల్ఘాట్ ఆర్ రఘు మా తాతయ్య. మా అమ్మ మేనమామ లాల్గుడి జయరామ్ జగమెరిగిన వయోలిన్ విద్వాంసుడు. మేనత్త జయంతి కుమరేశ్ వీణ విద్వాంసురాలు. అందుకే.. ఏడేళ్ల వయసులోనే నా గళం సరిగమలు పలికింది. తర్వాత ప్రముఖ సంగీత విద్వాంసుడు పీఎస్ నారాయణస్వామి దగ్గర శిష్యరికంతో ఆ స్వరాలు రాగాలుగా మారాయి. కర్ణాటక సంగీతంలో ప్రపంచస్థాయికి తీసుకెళ్లింది. నిరంతర సాధనతోనే ఇది సాధ్యమైంది. ఎన్నో ఏళ్ల కఠోర పరిశ్రమ తర్వాత 2001లో నా పేరు ప్రపంచానికి తెలిసింది.
స్వరం మారుతున్నది..
గతంలో చెన్నైతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో సంగీతానికి ప్రాధాన్యం తక్కువనే చెప్పాలి. ఇక్కడ సంగీతానికి సెకండ్ ప్రియార్టీ ఇచ్చేవారు. అయితే ఈ మధ్య కాలంలో హైదరాబాదీలు సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. చాలామంది కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నారు కూడా. ఇది మరింతగా విస్తరించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ జంట నగరాలతో నాలుగేళ్లుగా అనుబంధం ఉంది. వచ్చిన ప్రతిసారీ నా కచేరీలకు హాజరవుతున్న శ్రోతల సంఖ్యను గమనిస్తున్నాను. అప్పటికీ ఇప్పటికీ బాగా పెరిగింది. నడవలేని వాళ్లు సైతం వీల్‌చైర్‌లో వచ్చి కచేరీ పూర్తయ్యే వరకు ఉంటున్నారు.
సాధనమున జయము..
ఈతరంలో అందరూ ఫైనాన్షియల్ సెటిల్మెంట్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే కెరీర్ డెవలప్మెంట్పై దృష్టిపెడుతున్నారు. కళలో రాణించగలిగే నేర్పు ఉన్నా.. లోకం పోకడతో లక్ష్యాన్ని మార్చుకుంటున్న వారెందరో ఉన్నారు. అయితే, ఎంచుకున్న మార్గం కోసం.. కళను పక్కన పెట్టాల్సిన పనిలేదు. మనసు, అంకితభావం ఉండాలే గానీ వృత్తి, ప్రవృత్తి రెండూ సక్సెస్‌ఫుల్‌గా చేసుకోవచ్చు. సాధనతో సాధ్యం కానిది లేదు. ఆ నమ్మకంతో ముందుకు వెళ్తే యువతకు ఏదైనా సాధ్యమే.
..:: కోన సుధాకర్‌రెడ్డి
ఫొటో: అనిల్ కుమార్