సీఎం నివాసంలో ఏసీల తొలగింపు
న్యూఢిల్లీ: నూతన గృహంలోని అన్ని ఎయిర్ కండిషనర్లను తొలగించాలంటూ ప్రజా పనుల విభాగం (పీడబ్ల్యూడీ) అధికారులను ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన నివసిస్తున్న ఇల్లు అధికార కార్యకలాపాలకు సరిపోనందున నత్వరలో ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న 6, ఫ్లాగ్స్టాఫ్ రోడ్లో ఉన్న గృహంలోకి మారబోతున్నారు. ఈ నాలుగు పడకల ఇంటిలో నుంచి ఏసీలను తొలగించి కిటికీలను పెట్టాలని చెప్పినట్లు పీడబ్ల్యూడీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ ఇంటిలో బెడ్రూంలతో పాటు రెండు లాన్లు, డ్రాయింగ్, డైనింగ్ రూంలు, సర్వెంట్ క్వార్టర్లు ఉన్నాయి. ఇంతకు ముందు ఈ ఇంటిలో అసెంబ్లీ స్పీకర్ నివసించారు. ‘ నూతన ఇంటిలోని అన్ని ఏసీలను తొలగించాలని సీఎం ఆదేశించారు.
ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. వీటిని తొలగిస్తే దాదాపు ఇంటిని మళ్లీ పునర్నిర్మించినట్లే. ఎందుకంటే ఏసీలు తొలగిస్తే గోడలు బోసిపోతాయి. చాలా ఖాళీ వస్తుంది. ఆ ప్రాంతంలో కిటికీల వంటి కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. మరోసారి ముఖ్యమంత్రికి చెప్పి చూస్తాం. ఆయన వెనక్కి తగ్గకపోతే మేము తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది’ అని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఈ మార్పుల కోసం అధికంగా సమయం, డబ్బు వినియోగించవద్దని సీఎం సూచించినట్లు తెలిపారు. అలాగే ఎక్కువ మార్పులు కూడా చేయొద్దని చెప్పినట్లు తెలియజేశారు. కాగా, ఈ పునరుద్ధరణ పనులు మరో రెండు రోజుల్లో పూర్తవుతాయని చెప్పారు. ఇదిలాఉండగా సచివాలయంలో కూడా ఏసీలు వినియోగించడానికి కేజ్రీవాల్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది.