అన్ని రోజుల్లో అదనపు బిల్లులకు అనుమతి
బిల్లులు సమర్పించే గడువు ఎత్తివేసిన ఆర్థిక శాఖ
హైదరాబాద్: ఉద్యోగుల వేతన సవరణకు సంబంధిం చిన అదనపు బిల్లులు సమర్పించేందుకు నిర్దేశించిన గడువును ఆర్థిక శాఖ ఎత్తివేసింది. మే, జూన్ నెలల్లో పని దినాల్లోనూ బిల్లులు స్వీకరించాలని డెరైక్టర్ ఆఫ్ ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న మార్గదర్శకాల ప్రకారం ప్రతి నెలా 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మాత్రమే ట్రెజరీల్లో అదనపు బిల్లులు స్వీకరిస్తారు. మంగళవారంతో ఈ గడువు ముగిసింది. తిరిగి ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు రెగ్యులర్ పే బిల్స్‌తో పాటు అదనపు బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది.
కానీ.. ఈ తక్కువ వ్యవధిలో బిల్లులు సమర్పించడం సాధ్యంకాదని.. పదో పీఆర్సీ ప్రకారం పెరిగిన వేతనాలు మరో నెల అందే పరిస్థితి లేదని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ గడువును పెంచి.. జూన్ 1న కొత్త వేతనాలు అందుకునే వీలు కల్పించాలని విజ్ఞప్తి చేశాయి. ట్రెజరీ అధికారులు ఈ విషయాన్ని ఆర్థికశాఖకు నివేదించిం ది. స్పందించిన అధికారులు గడువు పెంచేందుకు అనుమతిం చారు. రెండు నెలలపాటు పనిదినాలన్నింటా అదనపు బిల్లుల ఆడిట్ చేయాలని మంగళవారం తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు సర్క్యులర్ జారీ చేశారు. గడువు పెంచినా సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాలను సరిదిద్దకపోవడంతో పీఆర్సీ బిల్లులు తప్పుల తడకలుగా వస్తున్నాయని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.