రాజమండ్రి టు రామ్‌పూర్
నటి, మాజీ ఎంపీ జయప్రద, సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజమ్‌ఖాన్ మధ్య పదేళ్ల రాజకీయ వైరం రామ్‌పూర్ లోక్‌సభ స్థానంలో వారి మధ్య మరోసారి పోరుకు తెరతీసింది. ఎస్పీ అభ్యర్థిగా ఆజమ్ (70), బీజేపీ టికెట్‌పై జయప్రద (57) పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఈ స్థానంలో పోటీకి దిగుతున్నారు. సగానికి పైగా ముస్లింలున్న రామ్‌పూర్ ఈ ఎన్నికల్లో దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాజమండ్రిలో పుట్టిన జయప్రద.. 1994 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. టీడీపీ.. నారా చంద్రబాబునాయుడు చేతుల్లోకి వచ్చాక 1996లో ఆమెను రాజ్యసభకు పంపారు. అనంతరం ఆమెను మళ్లీ రాజ్యసభకు నామినేట్ చేయలేదు. అలాగే, రాజమండ్రి నుంచి లోక్‌సభకు పోటీచేసే అవకాశం కూడా టీడీపీ ఇవ్వలేదు. బాలీవుడ్‌తో మంచి సంబంధాలున్న అప్పటి ఎస్పీ ప్రధాన కార్యదర్శి అమర్‌సింగ్‌తో ఉన్న సాన్నిహిత్యం జయప్రద మరో ప్రాంతీయ పార్టీలో చేరడానికి తోడ్పడింది. ఈ క్రమంలో 2004లో ఆమె ములాయంసింగ్ నేతృత్వంలోని ఎస్పీలో చేరారు. వెంటనే రామ్‌పూర్ లోక్‌సభ టికెట్ ఆమెకు దక్కింది. అప్పటి ఎస్పీ మంత్రి మహ్మద్ ఆజమ్‌ఖాన్ తోడ్పాటుతో జయప్రద తన కాంగ్రెస్ ప్రత్యర్థి, రామ్‌పూర్ నవాబు కుటుంబసభ్యురాలైన బేగం నూర్బానోను 85 వేలకు పైగా మెజారిటీతో ఓడించారు.
ఆజమ్–అమర్ వైరంతో జయకు ఇబ్బంది
సోషలిస్టు, గ్రామీణ నేపథ్యమున్న ములాయంకు బాలీవుడ్, కార్పొరేట్ ప్రపంచాన్ని అమర్‌సింగ్ పరిచయం చేశారు. అలాంటి అమర్‌కు ఆత్మీయురాలైన జయప్రదకు ఎస్పీలో కాస్త ఎక్కువ గౌరవమే లభించింది. జయ–అమర్ జోడీకి పార్టీ అధినేత ములాయం స్థాయికి మించిన విలువ ఇవ్వడం ఆజమ్‌కు నచ్చలేదు. ములాయంతో ఉన్న సన్నిహిత సంబంధాలు దెబ్బతిన్నాయి. అమర్–ఆజమ్ కీచులాటలు జయప్రదపై ప్రభావం చూపాయి. తన ఇలాఖా అయిన రామ్‌పూర్ నుంచే 2009లో రెండోసారి జయప్రదకు ఎస్పీ టికెట్ దక్కడంతో.. ఆజమ్ ఆమెను ఓడించడానికి లోపాయికారీగా ప్రయత్నించారు. యాభై శాతానికి పైగా ముస్లింలున్నప్పటికీ వారికి ములాయంపై ఉన్న అభిమానం ఫలితంగా జయప్రద వరుసగా రెండోసారి గెలుపొందారు. ఆజమ్ తెరచాటు ప్రయత్నాల వల్ల కాంగ్రెస్ అభ్యర్థి నూర్బానోపై జయ మెజారిటీ 30 వేలకు పడిపోయింది. అఖిలేశ్‌తో వచ్చిన విభేదాల వల్ల ఎంపీలు అమర్, జయప్రదను 2010లో ఎస్పీ బహిష్కరించింది. వీరిద్దరూ బయటికి పోవడంతో ఆజమ్‌ఖాన్ మళ్లీ ములాయంకు దగ్గరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో (2012) రామ్‌పూర్ నుంచి గెలిచి ఆయన అఖిలేశ్ కేబినెట్లో మంత్రి అయ్యారు.
యాసిడ్ దాడికి ఆజమ్ కుట్ర: జయప్రద
ఎస్పీ నుంచి బయటపడ్డాక ఆజమ్‌పై జయప్రద తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై యాసిడ్ దాడి చేయించడానికి ఆజమ్ ప్రయత్నించారని ఆమె ప్రకటించారు. మార్ఫింగ్ చేసిన తన నగ్న చిత్రాలను ఆయన ఇంటర్నెట్లో ప్రచారంలో పెట్టించారని కూడా జయప్రద ఆరోపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అమర్–జయప్రద ద్వయం కాంగ్రెస్‌లో చేరాలనుకుని చివరికి దాని మిత్రపక్షమైన ఆరెల్డీలో చేరారు. పశ్చిమ యూపీలోని బిజ్నోర్ నుంచి జయప్రద పోటీచేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. రాజకీయపక్షాలు, ప్రముఖుల మధ్య సంధి కుదిర్చే ‘దళారి’ (వీలర్–డీలర్)గా ముద్రపడిన అమర్ తర్వాత కాలంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు దగ్గరయ్యారు. ఈ సాన్నిహిత్యంతోనే జయప్రదను ఆయన బీజేపీలో చేర్పించడం, ఆమెకు రామ్‌పూర్ బీజేపీ టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఎస్పీలో ఉన్న రోజుల్లో ఆజమ్‌తో జయప్రదకు మొదలైన శత్రుత్వం ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఒకరితో మరొకరు తలపడే పరిస్థితికి దారితీసింది. యూపీలో ఎస్పీ–బీఎస్పీ కూటమిలో లేని కాంగ్రెస్ రామ్‌పూర్‌లో అభ్యర్థిని నిలపడం లేదని ప్రకటించింది. దీంతో ఆజమ్, జయప్రద మధ్య ప్రత్యక్ష పోరుకు తెరలేచింది. రాజమండ్రి నుంచి రాజ్యసభకు, అక్కడి నుంచి రామ్‌పూర్‌కు సాగిన జయప్రద రాజకీయ ప్రయాణం 2014లో బిజ్నోర్‌లో ఆగిపోయింది. తనకు రెండుసార్లు గెలుపునిచ్చిన రామ్‌పూర్‌లో ఆమె చేస్తున్న తాజా ప్రయత్నం ఏమౌతుందో?.