ajc
-
జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
ఒంగోలు సబర్బన్: సాధారణ ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఇప్పటికీ నెరవేర్చక పోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థి జేఏసీ హెచ్చరించింది. శుక్రవారం స్థానిక ఎన్జీఓ హోంలో జిల్లాలోని హామీలను నెరవేర్చుకునేందుకు చేపట్టిన న్యాయ ధర్మ పోరాట దీక్షలో విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. న్యాయ ధర్మ పోరాట దీక్షలో జిల్లా అభివృద్ధి వేదిక చైర్మన్ చుండూరి రంగారావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై నాలుగేళ్లు దాటినా జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఒక్క యూనివర్శిటీ కూడా ఏర్పాటు కాలేదంటే జిల్లాపై పాలకులకు ఎంత చిత్తశుద్ధి ఉందో అట్టే అర్ధమవుతుందన్నారు. కనీసం జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదని అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థి, యువత ఉద్యమించాల్సిన అవసరం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. కేంద్రం నిధులతో ఏర్పాటు చేయాల్సిన రామాయపట్నం ఓడరేవును నిర్మించాలని, తద్వారా జిల్లా రూపురేఖలే మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ పోరాటాలతోనే హామీలను నెరవేర్చుకోవాలని యువతకు, విద్యార్ధులకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రకాశం జిల్లాపై వివక్షత చూపుతున్నారని, గతంలో పలు రాజకీయపార్టీ నాయకులు వెళ్ళి జిల్లా సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసినప్పుడు స్వయంగా జిల్లా ప్రజలు తన పార్టీకి ఓటు వేయలేదు కాబట్టి ఎలాంటి అభివృద్ది చేయను అని ఖరాఖండిగా చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని గుర్తు చేశారు. అంటే ఓట్లేస్తే ఒకన్యాయం...వేయకపోతే మరో న్యాయమా....జిల్లావాళ్ళు ప్రజలు రాష్ట్ర ప్రజలు కాదా అని ద్వజమెత్తారు. చంద్రబాబు చెప్పే మోసపు మాటలు విని ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు. విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ మాట్లాడుతూ పామూరులో ఐఐఐటీ ఏర్పాటు వలన జిల్లా విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒంగోలులో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినా నేటికీ అమలు చేయలేక పోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకరరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా మరిచి పోయిందని, జిల్లాను అభివృద్ధి నిరోధకంగా తయారు చేసిన ఘనత చంద్రబాబుదేనని ధ్వజమెత్తారు. సీపీఐ కార్యదర్శి పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా వెనుకబాటు తనంతో ఉందని విశ్వవిద్యాలయం ఏర్పాటు ద్వారా బలహీన వర్గాల వారు సైతం ఉన్నత విద్యను అభ్యసిస్తారన్నారు. సీపీఐ నాయకుడు ఎంఎల్.నారాయణ మాట్లాడుతూ విద్యార్థి జేఏసీ న్యాయ ధర్మ పోరాట దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికైనా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సుపరిపాలన వేదిక నాయకులు చుంచు శేషయ్య, జిల్లా అభివృద్ది వేదిక నాయకులు కొమ్మూరి కనకారావు, అన్నెం కొండలరావు, ఇతర పార్టీల నాయకులు చెరుకూరి కిరణ్, పుష్పరాజు, సాహిత్, రావూరి బుజ్జి, శివశంకర్, రమణారెడ్డి, విద్యార్థి జేఏసీ నాయకుడు పి.మురళితో పాటు పలువురు పాల్గొన్నారు. -
హోదా ఇవ్వకుంటే బీజేపీ పతనమే
కర్నూలు(అర్బన్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పొందుపరిచిన హామీలన్నింటినీ అమలు చేయకపోతే బీజేపీకి రాజకీయంగా పతనం తప్పదని విద్యార్థి, జేఏసీ నేతలు హెచ్చరించారు. జేఏసీ రాష్ట్ర నాయకుడు జే లక్ష్మినరసింహ అధ్యక్షతన బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో ‘ ద బిగ్ ఫైట్ ’ పేరుతో కోటి మంది విద్యార్థుల మానవహారం కార్యక్రమంలో భాగంగా భారీ బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ కర్నూలు అసెంబ్లీ ఇన్చార్జీ హఫీజ్‌ఖాన్, సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టీ షడ్రక్, జిల్లా కార్యదర్శి కే ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ (ఎంఎల్) జిల్లా కార్యదర్శి యు మల్లికార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హాదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో నరేంద్రమోదీ దుర్మార్గ వైఖరి వెల్లడైందన్నారు. నాలుగు సంవత్సరాలుగా మన రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ కన్వీనర్ శ్రీరాములుగౌడ్, కో కన్వీనర్లు కారుమంచి, భాస్కర్, సురేంద్ర, నాగేష్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వరకు హోదా కంటే ప్యాకేజి మే లని వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు ప్రజలను నమ్మించేందుకు చేసిన ప్రయత్నాన్ని ప్రజలు వ్యతిరేకించారన్నారు. చేసేదేమి లేక వారు తిరిగి హోదా అంటూ ప్లేటు మార్చారని ఆరోపించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై విద్యార్థి, యువజనులు గళమెత్తాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థి, యువజనులు రాజ్‌విహార్ సెంటర్, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో మానవహారంగా ఏర్పడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిపిఐ నగర కార్యదర్శి పీ గోవిందు, సహాయ కార్యదర్శి జీ చంద్రశేఖర్, జనసేన నాయకులు హర్శద్, జేఏసీ నాయకులు సోమన్న, ప్రతాప్, శరత్, శివకృష్ణ, సాయి, నమణ, మహిళా నాయకురాళ్లు నిర్మల, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి
బనగానపల్లెరూరల్: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని విద్యార్థి, యువజన జేఏసీ బనగానపల్లె కన్వీనర్ శ్రీరాములుగౌడ్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాములుగౌడ్ మాట్లాడుతూ విభజన సమయంలో అప్పటి బీజేపీ నేత వెంకయ్యనాయుడు రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారని, అయితే అధికారంలోనికి వచ్చాక ప్రత్యేక హోదా అంశం మాట్లాడక పోవడం బాధాకరమన్నారు. బీజేపీతో నాలుగేళ్లు కలిసి ఉన్న టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ నుంచి బయటికి వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాటుతున్నట్లు నాటకలాడడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, కడపలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయడంతో పాటు విభజన హామీలన్నింటినీ అమలు చేయాలనిడిమాండ్ చేశారు. జేఏసీ కో–కన్వీనర్ కారుమంచి, నాయకులు ధనుంజయ, నాగరాముడు, రాజు, రవితేజ, బడేసాహేబ్ పాల్గొన్నారు. బనగానపల్లె : పార్లమెంటులో ఏపీ ప్రత్యేక హోదా బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని సీపీఐ మండల సహాయ కార్యదర్శి శివయ్య, ఏఐటీయూసీ నాయ కులు బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక పెట్రోల్ బంక్ కూడలి వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ, టీడీపీలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హమీలను నేరవేర్చడంలో విఫలమయ్యాయన్నారు. పార్లమెంటులో ప్రత్యేక హోదా బిల్లును ప్రవేశపెట్టకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఎర్రబాషా, మండల సహాయ కార్యదర్శి శివయ్య, సీనియర్ నాయకులు సంజీవులు, సామాజిక హక్కుల వేదిక కన్వీనర్ పెద్దమునెయ్య, ఏఐటీయూసీ నాయకులు అంజి, గబ్బర్‌సింగ్, మాలమహానాడు నాయకులు నాగరాజు, వెంకటస్వామి, అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్ల అసోసియేషన్ అ««ధ్యక్షులు ఎం రంగన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ, టీడీపీ భరతం పడతాం
ఎమ్మిగనూరు రూరల్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాబోవు రోజుల్లో బీజేపీ ప్రభుత్వం భరతం పడతామని విద్యార్థి జేఏసీ నాయకుడు శ్రీరామ్‌గౌడ్, సురేంద్ర, కారుమంచి, ధనుంజయ్, రవి, రాజు హెచ్చరించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాపై చేపట్టిన జీపుజాత మంగళవారం పట్టణానికి చేరుకుంది. స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో జరిగిన సభలో వారు మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్రుల హక్కు అని, పోరాటాల ద్వారా సాధించి తీరతామని స్పష్టం చేశారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇవ్వాలంటే ప్రతిపక్షనేతగా ఉన్న వెంకయ్యనాయుడు 15 సంవత్సరాలు కావాలని చెప్పి, గద్దెనెక్కిన తరువాత అందరినీ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగేళ్లు బీజేపీతో కలసి ఉండి ప్యాకేజీ కోసం హోదా అంశాన్ని తాకట్టుపెట్టాడని మండిపడ్డాడు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు హోదా అంశాన్ని లేవనెత్తుతూ బీజేపీ మోసం చేసిందంటూ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. బాబు మాటలను ఎవరూ నమ్మే స్థితిలో లేరని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి తన సచ్చీలతను నిరూపించుకోవాలని సూచించారు. రాబోవు రోజుల్లో బీజేపీ, టీడీపీ పార్టీలకు తగిన గుణపాఠం తప్పదని స్పష్టం చేశారు. ఈ నెల 25న కోటి మందితో మానవహారం చేసి ప్రభుత్వాలకు తమ సత్తా చూపిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో విద్యార్థి జేఏసీ నాయకులు విజేంద్ర, రంగస్వామి, శేఖర్, మహేంద్ర, వీరేష్, రాజీవ్, షమివుల్లా, తిమ్మగురుడు, ఉసేని, నవీన్, గిరి,మహబుబ్, సురేష్, ప్రతాప్, రవితేజ, రాజు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
95శాతం పుష్కర పనులు పూర్తి
వాడపల్లి(దామరచర్ల): వాడపల్లి పుణ్యక్షేత్రంలో 95 శాతం మేర పుష్కర పనులు పూర్తయినట్లు పుష్కర ప్రత్యేక అధికారి ఏజేసీ వెంకట్రావ్ తెలిపారు. శనివారం వాడపల్లి శ్రీమీనాక్షి అగస్త్యేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మిగిలిన పనులన్నీ ఆదివారం పూర్తవుతాయన్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే 650 టాయ్లెట్లు పూర్తయ్యాయని,మరో 150 నిర్మాణంలో ఉన్నాయన్నారు. సురక్షిత తాగునీటి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. పుష్కరాలకు 450 మంది సివిల్ సిబ్బంది, 800 మంది పారిశుద్ధ్య కార్మికులు,150 మంది ఎలక్ట్రికల్ కార్మికులు,450 మంది వలంటీర్స్ మూడు షిప్టుల్లో పని చేస్తారన్నారు. ఏజేసీ మొదలుకొని స్వీపర్ వరకూ అక్షయ పాత్ర అందించే ఒకే రకమైన బోజనం తింటారన్నారు. వరదలు వచ్చినా సురక్షితంగా స్నానాలు చేసే విధంగా స్నానఘాట్ల వద్ద ఏర్పాట్లు చేస్తామన్నారు. 8 ఘాట్లవద్ద కంట్రోల్ రూమ్స్, ఒకచోట సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. సమావేశంలో అధికారులు బాలకృష్ణ, యుగేందర్, శ్రీధర్, తహసీల్దార్ గణేష్, ఎంపీడీఓ ఉమాదేవి పాల్గొన్నారు. -
ట్రిబ్యునల్ ఏర్పాటుకు కృషి : ఏజేసీ
నల్లగొండ టౌన్ః వృద్ధుల రక్షణ చట్టం అమలు నిమిత్తం రెవెన్యూ డివిజన్ అధికారులతో సంప్రదించి ట్రిబ్యునల్ ఏర్పాటుకు కృషిచేస్తామని ఏజేసీ వెంకట్రావ్ అన్నారు. శనివారం స్థానిక రెవెన్యూ భవన్లో జరిగిన సీనియర్ సిటీజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 12 వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంఘానికి జాతీయ స్థాయిలో అవార్డు రావడం అభినందనీయమన్నారు. వృద్దుల సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్డీఓ వెంకటాచారి మాట్లాడుతూ 2014 నుంచి సుమారు 40 కేసులను పరిష్కరించి వృద్ధులకు రక్షణ కల్పించామన్నారు. ప్రతి మంగళవారం సంతానం నుంచి ఆపదలను ఎదుర్కొంటున్న వారికి అవగాహన కల్పిస్తామన్నారు.కార్యక్రమంలో అసోసియేషన్ జాతీయ ప్రతినిధి శ్యాంప్రసాద్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రాల మల్లికార్జున్, కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, ఎండి.రియాజ్అలి, విద్యాసాగర్, మట్టపల్లి, యాదయ ఎల్లయ్య, ఉప్పలయ్య పాల్గొన్నారు. -
రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రవేశాలు
నల్లగొండ : ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా యాదగిరిగుట్టలో సెక్స్ వర్కర్ల కుటుంబాలకు చెందిన పిల్లలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఏజేసీ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం కింద యాదగిరిగుట్టలో సెక్స్ వర్కర్ల కుటుంబాలకు చెందిన 26 మంది పిల్లలను జిల్లా ఎస్పీ గుర్తించినందున వారిని సంక్షే మ శాఖల రెసిడెన్షియల్ స్కూళ్లలో చేర్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 11 మంది బాలికలు, 15 బాలురు ఉన్నారని వీరికి ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించేందుకు అధికారులు చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో రవినాయక్, సంక్షేమ శాఖల అధికారులు రాజశేఖర్, వేణుగోపాల్, నరోత్తమ్‌రెడ్డి, ఆర్వీఎం పీవో కిరణ్‌కుమార్, రాజాపేట ఎస్ఐ బీసన్న పాల్గొన్నారు. -
ఎస్ఎంసీ ఎన్నికలను సజావుగా జరపాలి
జిల్లా అదనపు జేసీ తిరుపతిరావు విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)ల ఎన్నికలను సజావుగా జరపాలని జిల్లా అదనపు జేసీ, సర్వశిక్షాభియాన్ జిల్లా ప్రాజెక్టు ఇన్చార్జి ఆఫీసర్ ఎస్.తిరుపతిరావు ఎంఈఓలను కోరారు. మంగళవారం హన్మకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంఈవోలకు, స్ట్రాంగ్ టీచర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆగస్టు 1 నుంచి 10వ తేదీలోపు ఎస్‌ఎంసీల ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. విద్యాహక్కు చట్టం 2009 అనుసరించి పాఠశాల నిర్వహణ చూసుకునేందుకు గాను పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేసి ఈ కమిటీల పటిష్టపరిచేలా చూడాలన్నారు. ఎంఈవోలు, హెచ్ఎంలు, పాఠశాలల తల్లిదండ్రులు అందరూ భాగస్వాములయ్యేలా చూడాలన్నారు. పాఠశాలల్లో తల్లిదండ్రుల సభ్యులలో సామాజిక వర్గాల వారిగా ప్రాతిని««దl్యం ఉండాలన్నారు. హెచ్ఎంలు ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులు 50 శాతం పాల్గొనేలా చూడాలని, లేకపోతే రద్దు చేయాలన్నారు. డీఈఓ పి.రాజీవ్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి తదితర కార్యక్రమాల్లో ఎస్ఎంసీ కమిటీలు ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు. సమావేశంలో సెక్టోరియల్ అధికారులు వేణుఆనంద్, టి.శ్రీలత, ఎం.శ్రీదేవి, సంధ్యరాణి, రిసోర్స్ పర్సన్లు సీహెచ్.నాగేశ్వర్రావు, డి.వేణుగోపాల్ పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు. -
పొగాకు నియంత్రణ చట్టం అమలుకు చర్యలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: పొగాకు నియంత్రణ చట్టం అమలుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జేసీ–2 పి.రజనీకాంతారావు ఆదేశించారు. తన చాంబర్లో జిల్లాస్థాయి పొగాకు నియంత్రణ కార్యక్రమం అమలు కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. పొగాకు నియంత్రణ చట్టం 2003 ప్రకారం సిగరెట్లు, సిగార్లు, బీడీలు, గుట్కా, పాన్ మసాలా, ఖైనీలను ఆస్పత్రులు, విద్యా సంస్థలు, గ్రంథాలయాలు, ఆడిటోరియం, స్టేడియం, రైల్వేస్టేషన్లు, బస్‌స్టాప్ వంటి ప్రాంతాల్లో అమ్మకం, సేవించడం నిషేధమన్నారు. పొగాకు ఉత్పత్తులపై ప్రచారం చేస్తే శిక్షార్హులని పేర్కొన్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులతో ర్యాలీ, మానవహారం నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మెండ ప్రవీణ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ రత్నకుమారి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ధవళ భాస్కరరావు, డీఐఓ డాక్టర్ ఎ.హేమంత్, దంతవైద్యులు డాక్టర్ వినోద్, డిప్యూటీ డీఈఓ ప్రభాకరరావు, ఆర్వీఎం పీఓ పాల్గొన్నారు. -
మమ అనిపించారు
- కాకతీయ హైస్కూల్‌పై విచారణ - ఇలా వచ్చి అలా వెళ్లిన డీఈఓ, ఏజేసీ - నోటీసు గడువు ముగిసినా చర్యలకు వెనుకంజ తూప్రాన్: మాసాయిపేట దుర్ఘటనలో 18 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, యావత్ దేశం అయ్యోపాపమంటూ కన్నీరుమున్నీరైంది. ఈ ఘటనలో కాకతీయ హైస్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తినా, అధికారులు మాత్రం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైలు ప్రమాద పూర్వాపరాలు, పాఠశాల యాజమాన్యం పాత్ర తదితర అంశాలపై విచారణ చేపట్టేందుకు శనివారం కాకతీయ హైస్కూల్‌లుకు వచ్చిన ఏజేసీ మూర్తి, డీఈఓ రాజేశ్వర్‌రావు, ఆర్వీఎం అధికారిని యాసీన్‌బాషాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ప్రమాద ఘటనపై పాఠశాల పాత్ర ఏమిటన్నదానిపై మూడు రోజుల కిందటే పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేశామని, శనివారంతో ఆ గడువు కూడా ముగిసిందన్న డీఈఓ..స్కూల్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటామన్న దానిపై స్పష్టత ఇవ్వలేకపోయారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో చర్చించి వారిచ్చే సూచన మేరకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. మరోవైపు ఏజేసీ మూర్తి కూడా కేవలం పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడటంతోనే సరిపెట్టారు. ఇక ఆర్వీఎం అధికారిని యాసీన్‌బాషా మాత్రం ప్రేక్షకపాత్ర పోషించారు. పాఠశాల తెరవాలంటూ తల్లిదండ్రుల పట్టు! విచారణ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న సుమారు 600 పైగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాఠశాలను వెంటనే తెరువాలని పట్టుబట్టారు. ఇప్పటికే యూనిఫాం, పుస్తకాలు తీసుకోవడంతో పాటు మొదటి విడత ఫీజులు చెల్లించామని ఏజేసీ దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాల అనుమతులు రద్దు చేస్తే తమ పిల్లల భవిష్యత్తు ఆగమ్యగోచరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంలో పాఠశాలకు చెందిన 18 మంది చిన్నారులు దుర్మరణం చెందడం, మరో 18 మంది ఆస్పత్రిలో చికిత్సలు పొందడం చాలా బాధకరమని, ఇందుకు తాము సైతం చింతిస్తున్నట్లు అదనపు జేసీ ముందు వాపోయారు. ఈ సందర్భంగా అదనపు జేసీ స్పందిస్తూ ఈ పాఠశాలకు చెందిన చిన్నారులను స్థానిక ప్రభుత్వ పాఠశాల, ఇతర ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తామన్నారు. ఇందుకు ఒప్పుకోని తల్లిదండ్రులు కాకతీయ పాఠశాలను తెరిపించాలని పట్టుబట్టారు. దీంతో తమ అభిప్రాయాలను రాసి డీఈఓ రాజేశ్వర్‌రావుకు అందిస్తే ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామని ఏజేసీ మూర్తి వారితో తెలిపారు. విద్యార్థుల సంఖ్య కూడా తప్పే కాకతీయ హైస్కూల్లో సుమారు 600 మంది విద్యార్థులు చదువుతుండగా, కేవలం 378 మంది విద్యార్థులే ఉన్నట్లు కాకతీయ హైస్కూల్ యాజమాన్యం వెల్లడించిందని డీఈఓ రాజేశ్వర్ తెలిపారు. అందువల్లే జిల్లాలోని అన్ని పాఠశాలకు చెందిన విద్యార్థుల సంఖ్యను తరగతుల వారీగా సమాచారం అందించాలని అన్ని మండలాలకు చెందిన ఎంఈఓలను ఆదేశించినట్లు డీఈఓ తెలిపారు. ఇందుకోసం ఈ నెల 5న సంగారెడ్డిలో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 15 స్కూల్ బస్సులు సీజ్ చేయగా, నిబంధనలకు విరుద్ధంగా 19 ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నట్లు గుర్తించి ఆయా పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశామన్నారు.