జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి | Students JAC Protests For Prakasam District Development | Sakshi
Sakshi News home page

జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

Published Sat, Jul 28 2018 10:55 AM | Last Updated on Mon, Aug 20 2018 6:10 PM

Students JAC Protests For Prakasam  District Development - Sakshi

 మాట్లాడుతున్న బత్తుల బ్రహ్మానంద రెడ్డి

ఒంగోలు సబర్బన్‌:  సాధారణ ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఇప్పటికీ నెరవేర్చక పోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థి జేఏసీ  హెచ్చరించింది. శుక్రవారం స్థానిక ఎన్‌జీఓ హోంలో జిల్లాలోని హామీలను నెరవేర్చుకునేందుకు చేపట్టిన న్యాయ ధర్మ పోరాట దీక్షలో విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. న్యాయ ధర్మ పోరాట దీక్షలో జిల్లా అభివృద్ధి వేదిక చైర్మన్‌ చుండూరి రంగారావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై నాలుగేళ్లు దాటినా జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఒక్క యూనివర్శిటీ కూడా ఏర్పాటు కాలేదంటే జిల్లాపై పాలకులకు ఎంత చిత్తశుద్ధి ఉందో అట్టే అర్ధమవుతుందన్నారు. కనీసం జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదని అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థి, యువత ఉద్యమించాల్సిన అవసరం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.

కేంద్రం నిధులతో ఏర్పాటు చేయాల్సిన రామాయపట్నం ఓడరేవును నిర్మించాలని, తద్వారా జిల్లా రూపురేఖలే మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ పోరాటాలతోనే హామీలను నెరవేర్చుకోవాలని యువతకు, విద్యార్ధులకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రకాశం జిల్లాపై వివక్షత చూపుతున్నారని, గతంలో పలు రాజకీయపార్టీ నాయకులు వెళ్ళి జిల్లా సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసినప్పుడు స్వయంగా జిల్లా ప్రజలు తన పార్టీకి ఓటు వేయలేదు కాబట్టి ఎలాంటి అభివృద్ది చేయను అని ఖరాఖండిగా చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని గుర్తు చేశారు. అంటే ఓట్లేస్తే ఒకన్యాయం...వేయకపోతే మరో న్యాయమా....జిల్లావాళ్ళు ప్రజలు రాష్ట్ర ప్రజలు కాదా అని ద్వజమెత్తారు. చంద్రబాబు చెప్పే మోసపు మాటలు విని ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు.  విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్‌ మాట్లాడుతూ పామూరులో ఐఐఐటీ ఏర్పాటు వలన జిల్లా విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒంగోలులో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినా నేటికీ అమలు చేయలేక పోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకరరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా మరిచి పోయిందని, జిల్లాను అభివృద్ధి నిరోధకంగా తయారు చేసిన ఘనత చంద్రబాబుదేనని ధ్వజమెత్తారు.  సీపీఐ కార్యదర్శి పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా వెనుకబాటు తనంతో ఉందని విశ్వవిద్యాలయం ఏర్పాటు ద్వారా బలహీన వర్గాల వారు సైతం ఉన్నత విద్యను అభ్యసిస్తారన్నారు.

సీపీఐ నాయకుడు ఎంఎల్‌.నారాయణ మాట్లాడుతూ విద్యార్థి జేఏసీ న్యాయ ధర్మ పోరాట దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికైనా నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో సుపరిపాలన వేదిక నాయకులు చుంచు శేషయ్య, జిల్లా అభివృద్ది వేదిక నాయకులు కొమ్మూరి కనకారావు, అన్నెం కొండలరావు, ఇతర పార్టీల నాయకులు చెరుకూరి కిరణ్, పుష్పరాజు, సాహిత్, రావూరి బుజ్జి, శివశంకర్, రమణారెడ్డి, విద్యార్థి జేఏసీ నాయకుడు పి.మురళితో పాటు పలువురు  పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement