ఆకాశరామన్న ఉత్తరాలపై విచారణ
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యవసాయశాఖకు సంబంధించి కొందరు అధికారులు ఆకాశరామన్న పేరుతో పరస్పరం ఉత్తరాల ద్వారా కమిషనరేట్ కార్యాలయానికి ఫిర్యాదులు సమర్పించిన నేపథ్యంలో వాటిపై విచారణ చేయడానికి శనివారం కమిషనరేట్ నుంచి అడిషినల్ డైరెక్టర్ సుశీల జిల్లాకు వచ్చినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి, సస్పెన్షన్లో ఉన్న ఏడీఏ కె.మల్లికార్జున, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ బాలభాస్కర్, మరికొందరు అధికారులతో పాటు కార్యాలయ సిబ్బందిని కూడా పిలిపించి ఉత్తర ఫిర్యాదులపై ఆరాతీసినట్లు తెలుస్తోంది.
ఇలాంటి వ్యవహారాలను సీరియస్గా తీసుకోవాలని జేడీఏను ఆదేశించినట్లు సమాచారం. ఏదైనా ఉంటే నేరుగా ఫిర్యాదులు చేస్తే సముచితంగా ఉంటుందని, పేరు ఊరు లేకుండా ఫిర్యాదులు చేయడం వల్ల వ్యవసాయశాఖ పరువు బజారున పడుతుందని హితోపదేశం చేశారని తెలుస్తోంది. ఈ అంశంపై అడిషినల్ డైరెక్టర్ వివరణ కోరిని సమాచారం వెల్లడించేందుకు నిరాకరించారు.