alla ayodhyarami reddy
-
శ్రీలంకతో ఏపీని ఎలా పోలుస్తారు?: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీలంకతో పోలికలెందుకు? కేంద్రం తన ఆర్థిక పరిస్థితి చూసుకుంటే మంచిదని వైఎస్సార్సీపీ ఎంపీల హితవు పలికారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో గురజాడ హాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు డాక్టర్ తలారి రంగయ్య, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎన్.రెడ్డప్ప మీడియా సమావేశంలో మాట్లాడుతూ, శ్రీలంకతో రాష్ట్రాలను ఎలా పోలుస్తారు? ఆర్థిక క్రమశిక్షణ కేంద్రానికీ అవసరమే కదా? అంటూ ప్రశ్నించారు. చదవండి: ఒక్కసారిగా మారిపోయిన సీన్.. అక్కడ ఎకరం కోటి రూపాయలపైనే.. కేంద్రంతో పోలిస్తే రాష్ట్రం అప్పులు తక్కువ. శ్రీలంక జీడీపీ కన్నా, రాష్ట్ర జీఎస్డీపీ ఎక్కువ. వాణిజ్య ఎగుమతుల్లోనూ చాలా ముందున్నాం. ఏటేటా వాణిజ్య ఎగుమతులు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్ర అప్పుల్లో ప్రతి రూపాయి సద్వినియోగమవుతోంది. ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేరుగా పంపిణీ అవుతుందన్నారు. మూడేళ్లలో డీబీటీ ద్వారా రూ.1.65 లక్షల కోట్లు. టీడీపీ ప్రభుత్వం మాదిరిగా వ్యయం చేయలేదు. అనుత్పాదక రంగాల్లోనే ఆ ప్రభుత్వం నిధుల వ్యయం. మా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని వైఎస్సార్సీపీ ఎంపీలు గుర్తు చేశారు. ఇకనైనా వాస్తవాలు గుర్తించి దుష్ప్రచారాలు మానాలని, శ్రీలంకతో రాష్ట్రాన్ని అస్సలు పోల్చవద్దు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు వద్దు’’ అని ఎంపీలు స్పష్టీకరించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు ఏం మాట్లాడారంటే..: శ్రీలంకతో పోల్చడం సరికాదు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శ్రీలంకతో పోల్చడం ఏ మాత్రం సరికాదు. మనది ఒక రాష్టం. శ్రీలంక ఒక దేశం. ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ పతనం కావడానికి వేర్వేరు కారణాలున్నాయి. అందువల్ల ఏ విధంగా కూడా రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చలేం. అక్కడి పరిస్థితులు పూర్తిగా వేరు. ఉదాహరణకు కొన్ని అంశాలు చూస్తే.. గణనీయంగా వాణిజ్య ఎగుమతులు: శ్రీలంకలో వాణిజ్య ఎగుమతులు గత మూడేళ్లలో చూస్తే తగ్గాయి. అదే సమయంలో రాష్ట్రంలో వాణిజ్య ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. శ్రీలంకలో వాణిజ్య ఎగుమతులు 2019-20లో 19 బిలియన్ డాలర్లు కాగా, ఆ తర్వాత ఏడాది 2020-21లో అవి 13 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 2021-22లో 14 బిలియన్ డాలర్ల వాణిజ్య ఎగుమతులు నమోదయ్యాయి. అదే ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్లలో వాణిజ్య ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2019-20లో ఇక్కడి నుంచి వాణిజ్య ఎగుమతుల మొత్తం 11 బిలియన్ డాలర్లు కాగా, అవి 2020-21లో 15 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆ తర్వాత ఏడాది 2021-22లో వాణిజ్య ఎగుమతుల మొత్తం ఏకంగా 25 బిలియన్ డాలర్లు. అంటే మూడేళ్లలో వాణిజ్య ఎగుమతులు 14 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఇక దేశ పరిస్థితి చూస్తే 2019-20లో 535 బిలియన్ డాలర్ల వాణిజ్య ఎగుమతులు జరగ్గా, 2020–21లో 500 బిలియన్ డాలర్లు, 2021–22లో దాదాపు 600 బిలియన్ డాలర్ల వాణిజ్య ఎగుమతులు జరిగాయి. మన జీఎస్డీపీ బాగా మెరుగు: అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందన్నది వాస్తవం. రాష్ట్ర జీఎస్డీపీని శ్రీలంక జీడీపీతో పోల్చితే మన జీఎస్డీపీ చాలా బాగుంది. శ్రీలంక జీడీపీ 81 బిలియన్ డాలర్లు కాగా, మన జీఎస్డీపీ 160 బిలియన్ డాలర్లు. అంటే ఒక దేశం కంటే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంది. కేంద్రం అప్పులు ఎక్కువ: అప్పుల్లో కూడా మన రాష్ట్రానికి, శ్రీలంకకు ఎక్కడా పోలిక లేదు. నిజం చెప్పాలంటే మన రాష్ట్ర అప్పుల కంటే ఇవాళ కేంద్రం చేసిన అప్పులే ఎక్కువ. జీడీపీలో అప్పులు (డెట్ టు జీడీపీ) శ్రీలంకలో 101 శాతం ఉంటే, మన రాష్ట్రంలో చూస్తే అది 32.4 శాతం మాత్రమే. అదే కేంద్రంలో చూస్తే.. డెట్ టు జీడీపీ 59 శాతంగా ఉంది. దీనికి కేంద్రం ఏం సమాధానం చెబుతుంది?. ఇవాళ కేంద్రం అప్పులు ఏకంగా 133 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కాబట్టి కేంద్రం తన ఆర్థిక పరిస్థితి చూసుకుంటే మంచిది. అందుకే ఇంకా ప్రజలను మభ్య పెట్టొద్దు. వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు. వాస్తవం ఇలా ఉంది కాబట్టే కేంద్ర మంత్రి వ్యాఖ్యలను మిగతా రాష్ట్రాలు కూడా ఖండించాయి. ప్రతి రూపాయికి లెక్క ఉంది: రాష్ట్ర అప్పుల్లో ప్రతి రూపాయికి లెక్క ఉంది. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లు నగదు బదిలీ (డీబీటీ) ద్వారా నేరుగా ప్రజలకు చేరాయి. ఎక్కడా అవినీతికి తావు లేకుండా, పూర్తి పారదర్శకంగా అది జరిగింది. అదే గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసి అనుత్పాదక రంగాలపై ఖర్చు చేసింది. కరోనా కష్టకాలంలో నిరుపేద కుటుంబాలను అనేక పథకాల ద్వారా ఆదుకున్నాం. నగదు బదిలీ ద్వారా వారు నిలదొక్కకోగలిగారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడింది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. ఒక్కో కుటుంబానికి కనీసం లక్ష నుంచి దాదాపు రూ.10 లక్షల వరకు అందింది. అభివృద్ధి -సంక్షేమం: ప్రభుత్వం ఇస్తున్న ప్రతి రూపాయి నిరుపేదల ఖాతాల్లో చేరుతోంది. ఇంక నాడు–నేడు కార్యక్రమంతో స్కూళ్లు, ఆస్పత్రుల రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. ఆ విధంగా ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. అందుకే శ్రీలంకతో రాష్ట్రాన్ని అస్సలు పోల్చవద్దు. విపక్షం ఇకనైనా విమర్శలు విడనాడాలి పోలవరం బాధ్యత కేంద్రానిదే: పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. అందుకే ఆ ప్రాజెక్టు బాధ్యత పూర్తిగా కేంద్రానిదే. అయితే నిర్మాణ బాధ్యతను గత ప్రభుత్వం తీసుకుంది. అందుకే ఇప్పుడు కూడా నిర్మాణం పనులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్లానింగ్, డిజైన్ బాధ్యతలు పూర్తిగా కేంద్రానివే. -
అభివృద్ధే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ప్రచారం
సాక్షి, గుంటూరు: పురపాలక ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. గుంటూరు, నరసరావుపేట వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి గురువారం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పురపాలక సంఘాల్లో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ, టీడీపీ మున్సిపాలిటీలను ఏవిధంగా నిర్వీర్యం చేసిందీ వివరిస్తున్నారు. వైఎస్సార్సీపీని నేరుగా ఎదుర్కోలేక టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కైన తీరును తేటతెల్లం చేస్తున్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి బాలశౌరి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు సైతం బాలశౌరితోపాటు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి, తాడేపల్లి పురపాలకసంఘాలకు ఎన్నికలు జరుగుతుండడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) గత 20 రోజులుగా అభ్యర్థుల విజయానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. పొన్నూరులో ఎమ్మెల్యే అభ్యర్థి రావి వెంకటరమణ మున్సిపాలిటీలో చైర్మన్ పదవికి ముస్లిం మైనార్టీకి చెందిన అభ్యర్థిని ప్రకటించడంతో అక్కడ విజయం సునాయాసం కానున్నదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. తెనాలిలో సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, కిలారి రోశయ్య పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. బాపట్ల పార్లమెంట్ పరిథిలో బాపట్ల, రేపల్లె మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ వైఎస్సార్సీపీకి ఎంపీ అభ్యర్థి లేనప్పటికీ పార్టీ ప్రచారంలో ముందంజలో ఉంది. బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతి, రేపల్లెలో మాజీమంత్రి, ఎమ్మెల్యే అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ పార్టీ అభ్యర్థుల విజయానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. నరసరావుపేట పార్లమెంట్ పరిథిలో నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, మాచర్ల మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి పార్టీ అభ్యర్థుల గెలుపును తన భుజస్కంధాలపై వేసుకుని సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ పార్లమెంట్ పరిధిలో జరిగే మున్సిపాలిటీల్లో చిలకలూరిపేట, పిడుగురాళ్ళ, వినుకొండల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నా పార్టీ శ్రేణులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా భరోసా ఇస్తూ అందర్నీ ఏకతాటిపై నడుపుతున్నారు. సత్తెనపల్లిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు, పిడుగురాళ్ళలో గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి జంగా కృ ష్ణమూర్తి, చిలకలూరిపేటలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్, మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వినుకొండలో ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపనేని సుధ, నరసరావుపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పార్టీ అభ్యర్థుల విజయానికి గత మూడువారాలుగా నిర్విరామంగా కృషిచేస్తున్నారు. డబ్బు, మద్యం పంపిణీకి సిద్ధమైన టీడీపీ నాయకులు... నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో గురువారం నుంచే టీడీపీ నాయకులు ఆయా మున్సిపాలిటీల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు డబ్బు, మద్యంతో రెడీ అయ్యారు. ఓటర్ స్లిప్పులతోపాటు డబ్బు కట్టలతో ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. కొన్ని చోట్ల ఓటర్ స్లిప్పులతోపాటు మద్యం స్లిప్పులను ఇచ్చి నేరుగా మద్యం దుకాణాల్లో తాగేలా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, పిడుగురాళ్ళ, వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేటల్లో టీడీపీ నాయకులు ఈ తరహా రాజకీయాలకు పాల్పడుతున్నారు. దీనిపై ఎన్నికల నిఘా వర్గాలకు సమాచారం ఉన్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
6న నరసరావుపేటకు జగన్
సాక్షి, నరసరావుపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మార్చి ఆరో తేదీన నరసరావుపేట రానున్నట్టు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి తెలిపారు. ఆ రోజు నరసరావుపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు కానుందని, ఆ సందర్భంగా తాను పార్టీలో అధికారికంగా చేరనున్నట్టు వెల్లడించారు.నరసరావుపేట బ్యాంకు స్ట్రీట్‌లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. నరసరావుపేటలో జరిగే సభకు భారీగా కార్యకర్తలు తరలి రావాలని ఆయన కోరారు. కార్యకర్తలు, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేందుకే తాను ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాననీ, ఇక్కడినుంచే ఎన్నికల జైత్రయాత్ర కొనసాగిస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించుకుని జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే ధ్యేయంగా పనిచేయాలని కోరారు. తద్వారా వైఎస్ ఆశయాలను సాధించుకుందామని పిలుపునిచ్చారు. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో కార్యాలయం ఏర్పాటు ద్వారా తాము ఎన్నికలకు పూర్తిగా సన్నద్ధమైనట్టేనని చెప్పారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ నాయకులు డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, డాక్టర్ పరమేశ్వరరెడ్డి, డాక్టర్ కరుణాకరెడ్డి, డాక్టర్ ఓరుగంటి శేషిరెడ్డి, వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సర్తాజ్ఆలీ, జిల్లా ప్రచార కార్యదర్శి జి.ఉత్తమరెడ్డి, వైఎస్సార్ టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరెడ్డి, యువజన విభాగ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.గాబ్రియేలు తదితరులు పాల్గొన్నారు.