సాక్షి, గుంటూరు: పురపాలక ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. గుంటూరు, నరసరావుపేట వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి గురువారం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పురపాలక సంఘాల్లో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ, టీడీపీ మున్సిపాలిటీలను ఏవిధంగా నిర్వీర్యం చేసిందీ వివరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీని నేరుగా ఎదుర్కోలేక టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కైన తీరును తేటతెల్లం చేస్తున్నారు.
గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి బాలశౌరి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు సైతం బాలశౌరితోపాటు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి, తాడేపల్లి పురపాలకసంఘాలకు ఎన్నికలు జరుగుతుండడంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) గత 20 రోజులుగా అభ్యర్థుల విజయానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.
పొన్నూరులో ఎమ్మెల్యే అభ్యర్థి రావి వెంకటరమణ మున్సిపాలిటీలో చైర్మన్ పదవికి ముస్లిం మైనార్టీకి చెందిన అభ్యర్థిని ప్రకటించడంతో అక్కడ విజయం సునాయాసం కానున్నదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. తెనాలిలో సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, కిలారి రోశయ్య పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. బాపట్ల పార్లమెంట్ పరిథిలో బాపట్ల, రేపల్లె మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ వైఎస్సార్‌సీపీకి ఎంపీ అభ్యర్థి లేనప్పటికీ పార్టీ ప్రచారంలో ముందంజలో ఉంది. బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతి, రేపల్లెలో మాజీమంత్రి, ఎమ్మెల్యే అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ పార్టీ అభ్యర్థుల విజయానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
నరసరావుపేట పార్లమెంట్ పరిథిలో నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, మాచర్ల మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి పార్టీ అభ్యర్థుల గెలుపును తన భుజస్కంధాలపై వేసుకుని సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ పార్లమెంట్ పరిధిలో జరిగే మున్సిపాలిటీల్లో చిలకలూరిపేట, పిడుగురాళ్ళ, వినుకొండల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నా పార్టీ శ్రేణులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా భరోసా ఇస్తూ అందర్నీ ఏకతాటిపై నడుపుతున్నారు.
సత్తెనపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు, పిడుగురాళ్ళలో గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి జంగా కృ ష్ణమూర్తి, చిలకలూరిపేటలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్, మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వినుకొండలో ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపనేని సుధ, నరసరావుపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పార్టీ అభ్యర్థుల విజయానికి గత మూడువారాలుగా నిర్విరామంగా కృషిచేస్తున్నారు.
డబ్బు, మద్యం పంపిణీకి సిద్ధమైన టీడీపీ నాయకులు...
నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో గురువారం నుంచే టీడీపీ నాయకులు ఆయా మున్సిపాలిటీల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు డబ్బు, మద్యంతో రెడీ అయ్యారు. ఓటర్ స్లిప్పులతోపాటు డబ్బు కట్టలతో ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. కొన్ని చోట్ల ఓటర్ స్లిప్పులతోపాటు మద్యం స్లిప్పులను ఇచ్చి నేరుగా మద్యం దుకాణాల్లో తాగేలా ఏర్పాట్లు చేశారు.
ప్రధానంగా పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, పిడుగురాళ్ళ, వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేటల్లో టీడీపీ నాయకులు ఈ తరహా రాజకీయాలకు పాల్పడుతున్నారు. దీనిపై ఎన్నికల నిఘా వర్గాలకు సమాచారం ఉన్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అభివృద్ధే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ ప్రచారం
Published Fri, Mar 28 2014 2:10 AM | Last Updated on Wed, Aug 29 2018 6:13 PM
Advertisement
Advertisement