American Institute of Oncology
-
అమరావతిలో అమెరికన్ క్యాన్సర్ కేర్ సెంటర్
త్వరలో విశాఖకు విస్తరణ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ కొత్త క్యాన్సర్ కేర్ సెంటర్‌ను ప్రారంభించింది. ఇక్కడి ఎన్నారై హాస్పిటల్లో వంద పడకల ఈ క్యాన్సర్ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో క్యాన్సర్ చికిత్సను అందిస్తున్నామని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ) ఒక ప్రకటనలో తెలిపింది. పాశ్చాత్య దేశాల ప్రమాణాలకు తీసిపోకుండా నాణ్యమైన క్యాన్సర్ చికిత్సను పూర్తి స్థాయిలో అందించడమే లక్ష్యమని ఏఓఐ ఈడీ జోసెఫ్ ఏ.నికొలస్ తెలిపారు. త్వరలో విశాఖపట్టణం, తదితర నగరాలకు విస్తరించనున్నామని పేర్కొన్నారు. -
ఇప్పుడు రొమ్ము క్యాన్సర్‌కు అమెరికా స్థాయి చికిత్స ఇక్కడే...!
గతంలో రొమ్ము క్యాన్సర్ వస్తే రొమ్ము తొలగించాల్సి వచ్చేది. కానీ అమెరికాలో లభ్యమయ్యే చికిత్స ఇప్పుడు మన హైదరాబాద్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లోనే దొరుకుతుంది. దాంతో ఇప్పుడు రొమ్ము తొలగించాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి ఆపదా రాకుండా చికిత్స చేయడం సాధ్యమవుతుంది. అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటాలజిస్ట్లలో డాక్టర్ సుగుణ చిర్ల ఏకైక మహిళ. ఇలాంటి అత్యాధునిక విద్యార్హతలు కలిగిన నిపుణులున్న అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ లాంటి చోట్ల ఈ రొమ్ము క్యాన్సర్ చికిత్స మరింత సులభం. ఆ వివరాలు తెలుసుకోవడం కోసమే ఈ కథనం. మన శరీరంలో నిత్యం వేల సంఖ్యలో కణాలు పుడుతూ, చనిపోతూ ఉంటాయి. ఈ ప్రక్రియ అంతా జన్యువుల నియంత్రణలో జరుగుతుంటుంది. కొన్నిసార్లు జన్యువుల నియంత్రణ తప్పి, కణవిభజన ప్రక్రియ అదుపుతప్పి కణాలు విశృంఖలంగా పుడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు అదనంగా ఏర్పడ్డ కణాలు ఒక కణితిగా రూపొందుతాయి. ఈ కణుతులు హానికరం కావుగాని... కొన్ని సందర్భాల్లో మాత్రం హానికరంగా పరిణమిస్తాయి. అవే క్యాన్సర్ కణుతులు. ఇది రొమ్ము భాగంలో ఏర్పడ్డప్పుడు దాన్ని రొమ్ము క్యాన్సర్ అంటారు. ఈ క్యాన్సర్ రొమ్ములోగాని, నిపుల్కు పాలను సరఫరా చేసే నాళాల్లోగాని రావచ్చు. కానీ ముందే గుర్తిస్తే రొమ్మును తొలగించకుండానే చికిత్స చేయవచ్చు. క్యాన్సర్‌కు వయసును కూడా ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్‌గా పరిగణించవచ్చు. అలాగే రొమ్ము క్యాన్సర్ వంశపారంపర్యం కాదు. కాకపోతే తల్లికి, అక్కచెల్లెళ్లలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉంటే రిస్క్ కాస్త ఎక్కువ. ఒకవేళ ఇదివరకు ఒక రొమ్ములో క్యాన్సర్ వస్తే రెండో రొమ్ముకూ వచ్చే అవకాశాలు ఉండవచ్చు. అంతేగాని వంశపారంపర్యంగా కానీ, ఒక రొమ్ముకు వస్తే మరో రొమ్ముకు తప్పనిసరిగా వస్తుందని చెప్పలేము. లేటు వయసులో పెళ్లిళ్లు, గర్భధారణ... పెరిగే వయసు రొమ్ము క్యాన్సర్‌కు ఒక రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పుకున్నాం. ముప్ఫయి ఏళ్లు దాటిన ప్రతి 233 మంది మహిళల్లో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 60 ఏళ్లు దాటిన ప్రతి 27 మందిలో ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన పడవచ్చు. త్వరగా పెళ్లిచేసుకుని గర్భం దాల్చడం అన్నది రొమ్ము క్యాన్సర్ అవకాశాలను తగ్గించే అంశం. ఎందుకంటే గర్భధారణ వల్ల నెలసరులు తగ్గుతాయి. ఆ మేరకు ఈస్ట్రోజెన్ ప్రభావం కూడా తగ్గుతుంది. కాబట్టి రొమ్ముక్యాన్సర్‌కు అవకాశాలు కూడా తగ్గుతాయి. రిస్క్‌ను తగ్గించే రొమ్ము పాలు: బిడ్డకు రొమ్ము పాలు పట్టడం కూడా రొమ్ముక్యాన్సర్ రిస్క్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. ఎంతకాలం బిడ్డకు రొమ్ము పాలు పడుతూ ఉంటే రొమ్ము క్యాన్సర్ రిస్క్ అంతగా తగ్గుతుంది. దీనివల్ల బిడ్డ కూడా ఆరోగ్యంగా ఎదుగుతుంది. కాబట్టి బిడ్డ పుట్టాక కనీసం ఏడాది పాటైనా రొమ్ము పాలు పట్టేలా చూసుకోవాలి. గుర్తించడం ఎలా?: రొమ్ము క్యాన్సర్ కణుతుల్లో సాధారణంగా నొప్పి ఉండదు. కొన్నిసార్లు ఈ కణుతులు మెత్తగా ఉండవచ్చు. లేదా గట్టిగా కూడా ఉండవచ్చు. రొమ్ములో ఎలాంటి మార్పు కనిపించినా అశ్రద్ధ చేయకూడదు. రొమ్ములో వాపు, నొప్పి, నిపుల్స్ లోపలికి వెళ్లడం, ఎరుపెక్కడం, పాలు కాకుండా నిపుల్ నుంచి ఇతరత్రా ద్రవాలు స్రవించడం, చంకలో గడ్డలు ఏర్పడటం లాంటి మార్పులు కనిపిస్తే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. రొమ్ము క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్స అంత సులువవుతుంది. పైగా పూర్తిగా నయమయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి. రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రఫీ అనే పరీక్ష చేస్తారు. దీనిద్వారా అతి సులువుగా, తక్కువ సమయంలో బయాప్సీ చేయవచ్చు. ఇప్పుడు ఆధునిక డిజిటల్ మామోగ్రఫిక్ ప్రక్రియలో బెడ్ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి సౌకర్యంగా కూర్చుని లేదా పడుకుని, అత్యంత వేగంగా ఒక నిమిషం కంటే తక్కువ సమయంలోనే ఫలితాలు పొందవచ్చు. మామోటోమ్ లాంటి పరికరాలు మరింత కచ్చితంగా మల్టిపుల్ బయాప్సీ చేస్తాయి. దాంతో రేడియేషన్ మోతాదు కూడా 50 శాతం తగ్గుతుంది. కాబట్టి రేడియేషన్ దుష్ర్పభావాలు కూడా తక్కువే. పరిష్కారాలు: రొమ్ముక్యాన్సర్ అనగానే చాలామంది రొమ్ము తొలగించాల్సి వస్తుందేమోనని భయపడతారు. కానీ నిజానికి ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్స వల్ల రొమ్ము తొలగించకుండానే క్యాన్సర్‌కు చికిత్స చేసే వీలుంది. రొమ్ములో ఏర్పడ్డ చిన్న కణుతులను సర్జరీ ద్వారా తీసేస్తారు. అవే పెద్ద కణుతులైతే రెండుమూడు సార్లు కీమోథెరపీ ఇచ్చి వాటి పరిమాణం తగ్గించి, ఆ తర్వాత ఆపరేషన్ ద్వారా మిగిలిన కణుతులను కూడా తీసేస్తారు. ఆంకోప్లాస్టిక్ సర్జరీ: పాడైన రొమ్ము ఆకృతిని సరిచేసే చికిత్స ఇది. బ్రెస్ట్ రీ-కన్స్ట్రక్షన్: అసహజాకృతిలో ఉండే రొమ్మును సరిచేయడం. బ్రెస్ట్ ఇంప్రూవ్మెంట్: ఇంప్లాంట్స్ ద్వారా రొమ్ము సైజ్‌ను పెంచడం. బ్రెస్ట్ లిఫ్ట్: నిపుల్ దగ్గర చిన్న గాటు పెట్టి కావలసిన ఆకృతికి, పరిమాణానికి రొమ్మును సరిచే యడం. కీమోథెరపీ: ఆపరేషన్ తర్వాత మిగిలిపోయిన క్యాన్సర్ కణాలను పూర్తిగా నాశనం చేయడానికి కీమోథెరపీ చేస్తారు. దీని వల్ల క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టే అవకాశం తగ్గుతుంది. అవసరాన్ని బట్టి మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ కూడా అందిస్తారు. ఈ తరహా చికిత్సను నాలుగోదశకు చేరిన క్యాన్సర్‌కు కూడా ఉపయోగించవచ్చు. వీఎంఏటీ: దీన్నే వాల్యుమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ అంటారు. ఇది రేడియేషన్ మోతాదును తగ్గిస్తుంది. రెండు నిమిషాల కన్నా తక్కువ సమయంలోనే ఈ చికిత్స పూర్తి చేయవచ్చు. నివారణ చాలా సులభం: క్యాన్సర్ రాకుండా నివారించడం మన చేతిలో ఉన్నదే. పెరిగే బరువు, స్థూలకాయం క్యాన్సర్‌కు కారణాలు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో బరువును నియంత్రించుకోవడం, స్థూలకాయం రాకుండా కాపాడుకోవడంతో క్యాన్సర్‌ను నివారించవచ్చు. మంచి ఆహారంతో క్యాన్సర్ నివారణ చాలా తేలిక. మాంసాహారాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడం, కొవ్వు పదార్థాలను పరిహరించడం, తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం. వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయటం ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఒత్తిడి, ఆందోళన లాంటి వాటికి దూరంగా ఉండటం క్షేమకరం. రెండు పదుల వయసు దాటిన తరువాత ప్రతి మహిళ ఎక్కడైనా గడ్డల్లా ఉన్నాయేమోనని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. 40 ఏళ్లలోపు వాళ్లందరూ ప్రతి మూడేళ్లకు ఒకసారి డాక్టర్ చేత పరీక్ష చేయించుకోవాలి. 40 దాటినవాళ్లు ప్రతి ఏటా పరీక్ష చేయించుకోవాలి. ప్రతి రెండేళ్లకు ఒకసారి డిజిటల్ మామోగ్రఫీ ద్వారా పరీక్ష చేయించుకోవడం మంచిది. 50 దాటితే ప్రతి ఏటా ఈ పరీక్ష తప్పనిసరి. డాక్టర్ సుగుణ చిర్ల ఎండీ, అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటాలజిస్ట్ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ శేరిలింగంపల్లి, హైదరాబాద్ email:drsuguna@americanoncology.com -
రొమ్ముక్యాన్సర్‌పై అపోహలు వద్దు...
రొమ్ము క్యాన్సర్ పట్ల ప్రజల్లో చాలా చాలా అపోహలున్నాయి. నిజానికి ముందుగా దీన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా తగ్గే వ్యాధి ఇది. తొలిదశలోనే చికిత్స చేస్తే మునుపు ఉన్నంత ఆరోగ్యంగా తయారయ్యే ఈ వ్యాధి వల్ల కాపురాలే కూలిపోవడం విషాదకరమంటున్నారు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో సర్జికల్ ఆంకాలజీ విభాగానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు. సిటిజెన్స్ హాస్పిటల్ భాగస్వామ్యంతో అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ సర్జికల్ ఆంకాలజీ సేవలందిస్తోంది. ఈ సేవల్లో భాగంగానే సాధారణ ప్రజల్లోని అపోహలను తొలగించడానికి పలు అంశాలను వివరించారు డాక్టర్ చంద్రశేఖర్‌రావు. అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ తరఫున ఆయన తెలియజేసిన అనేక ఆసక్తికరమైన సంగతులివి... రొమ్ము క్యాన్సర్ అన్నది వంశపారంపర్యం అని మనలో చాలామందికి ఒక అపోహ. కానీ ఇది వాస్తవం కాదు. కేవలం ఐదు శాతం మందిలో మాత్రమే ఇది వంశపారంపర్యంగా వస్తుంది. అలా వచ్చేవారిని గుర్తించడానికి కొన్ని మార్గదర్శకాలున్నాయి. ఉదాహరణకు ఒకరి కుటుంబంలో అమ్మకు, సోదరికీ రొమ్ము క్యాన్సర్గాని, ఒవేరియన్ క్యాన్సర్గాని వచ్చి ఉండి, ఆ మహిళకు 45ఏళ్ల కంటే తక్కువ ఉంటే అలాంటివారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే తోడబుట్టిన వారిలో ఒక సోదరికి రొమ్ముక్యాన్సర్ ఉన్నంత మాత్రాన రెండోసోదరికీ అది రావాలని లేదు. రొమ్ముక్యాన్సర్ వచ్చిన సోదరికి రెండురొమ్ముల్లోనూ క్యాన్సర్ వస్తేనే మరో సోదరికి అది వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆయుష్షు పెరగడం మంచిదేగా... మరి అదే కీడు ఎలా అయ్యింది? ఇటీవల ఆడవాళ్ల ఆయుఃప్రమాణం పెరిగింది. ఆయుష్షు పెరగడం మంచిదే. కానీ వయసు పైబడటం రొమ్ము క్యాన్సర్‌కు ఒక రిస్క్ ఫ్యాక్టర్ కాబట్టి అదే రోగుల సంఖ్యనూ పెంచింది. అయితే దీన్ని నివారించేందుకూ మార్గం ఉంది. సాధారణంగా యాభైఏళ్లు దాటాక ఆడవాళ్లకు మెనోపాజ్ వస్తుంది. ఇలా జరిగిన వాళ్లలో మామూలుగానైతే ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ తగ్గాలి. కానీ రుతుక్రమం ఆగి, బరువు పెరగడం మొదలైతే వాళ్లలో కొవ్వు ఎక్కువగా పెరుగుతుంది. ఇలా పెరిగే కొవ్వులో అరోమెటేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఆ అరోమెటేజ్కు అడ్రినల్హార్మోన్నూ, మెనోపాజ్ తర్వాత పెరిగే ఆండ్రోజెన్ హార్మోన్‌నూ... ఈస్ట్రోజెన్‌గా మార్చే గుణం ఉంటుంది. దాంతో సాధారణంగా జరగాల్సినదానికి భిన్నంగా... రివర్స్ ప్రక్రియ జరుగుతుంది. ఇలా ఈస్ట్రోజెన్ పెరగడం అన్నది రొమ్ముక్యాన్సర్‌కు దోహదం చేసే అంశం. కాబట్టి మెనోపాజ్ తర్వాత బరువు పెరిగే వాళ్లలో రొమ్ముక్యాన్సర్‌కు అవకాశం ఎక్కువ. మరి నివారణ ఎలా? బరువు పెరగడం వల్ల రొమ్ముక్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది కాబట్టి బరువు పెరగకుండా చూసుకోడానికి మెనోపాజ్ తర్వాత కొవ్వులు, నూనెలు తక్కువగా ఉండే ‘లో-ఫ్యాట్’ ఆహారం తీసుకోవాలి. అలాగే మెనోపాజ్‌కు చేరిన మహిళలు తప్పనిసరిగా వాకింగ్ వంటి వ్యాయామం చేయాలి. రొమ్ముక్యాన్సర్‌ను గుర్తించడం ఎలా? దీనికీ చాలా తేలిక మార్గాలున్నాయి. వాటిలో కొన్ని... రుతుక్రమం ఆగిపోయాక ఒకవైపు రొమ్ము నుంచే రక్తస్రావం జరుగుతోందా అని చూడాలి.అలా అయితే దాన్ని రొమ్ముక్యాన్సర్గా అనుమానించాలి. రుతుక్రమం తర్వాత రొమ్ములో ఏవైనా గడ్డలు కనిపిస్తున్నాయా? ఒకసారి పరీక్షచేయించుకోవాలి. ఆమాటకొస్తే రుతుక్రమం ముందుకూడా రొమ్ములో గడ్డలు రావచ్చు. కానీ అవి పెరుగుతుంటే మాత్రమే వాటిని ప్రమాదకరమైనవిగా అనుమానించాలి. చికిత్స రొమ్ము క్యాన్సర్‌ను రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది మెనోపాజ్ కంటే ముందు వచ్చే హార్మోనల్ డిపెండెంట్ తరహా క్యాన్సర్. ఇందులో టొమాక్సిఫెన్ అనే మందును 20 ఎంజీ మోతాదులో ఐదేళ్ల పాటు ఇవ్వాలి. దీన్ని పరగడుపున తీసుకోవాలి. ఇది యాంటీ ఈస్ట్రోజెన్ కావడం వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్‌ను అరికడుతుంది. ఇక రెండో రకమైన మెనోపాజ్ తర్వాతి దశలో వచ్చే హార్మోనల్ డిపెండెంట్ తరహా క్యాన్సర్. ఇందులో అరోమెటేజ్ అనే ఎంజైమ్‌ను అరికట్టే ఇన్హిబిటర్ను వాడటం ద్వారా చికిత్స చేస్తారు. ఈ అరోమెటేజ్ ఇన్హిబిటర్ను ఐదేళ్లపాటు వాడాలి. ఇందులో రెండు రకాల మందులు ఉన్నాయి. అనెస్టెజోల్ లేదా లెట్రజోల్ అనే ఈ రెండు మందుల్లో ఒకదానిని ఐదేళ్లపాటు వాడాల్సి ఉంటుంది. హార్మోనల్ ఇండిపెండెంట్ క్సాన్సర్కి మాత్రం కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. రొమ్ముక్యాన్సర్‌లో శస్త్రచికిత్స రెండు రకాలుగా చేయవచ్చు. ఒకవేళ రొమ్ములోని క్యాన్సర్ గడ్డ 2 సెం.మీ. నుంచి 4 సెం.మీ. పరిమాణంలో ఉంటే దానికి రొమ్మును తొలగించాల్సి అవసరం ఉండదు. అయితే అంతకంటే మించి ఉంటే రొమ్ము తొలగించాల్సి వస్తుంది. చంక నుంచి గడ్డను తొలగించడాన్ని ‘ఆక్సిలరీ క్లియరెన్స్’ అంటారు. ఆక్సిలరీ క్లియరెన్స్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు గడ్డ తొలగించిన వైపున ఉన్న చేతికి గాజులు వేసుకోకూడదు. గడ్డ తొలగించాక ఆ వైపు చేతితో కత్తిపీటను వాడకూడదు. గడ్డ ఉన్న వైపున ఉండే చేతికి ఇంజెక్షన్ కూడా వేయించుకోకూడదు. ఆ వైపున ఉన్న చేతికి దోమలు కుట్టకుండా చూసుకోవడం మంచిది. అందుకోసం ఆపరేషన్ తర్వాత ఫుల్స్లీవ్స్ ఉండే దుస్తులు (జాకెట్లు) కుట్టించుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అపోహలు వీడండి... చాలామంది రొమ్ముక్యాన్సర్ ఉన్నవారి కుటుంబంలోని మహిళలను పెళ్లి చేసుకోడానికి వెనకాడుతుంటారు. కానీ ఇది ఎంతమాత్రమూ అంటువ్యాధి కాదు. కుటుంబంలోని వారిలో ఒకేలాంటి జన్యువులు ఉన్నప్పటికీ... అదే కుటుంబానికి చెందిన వారిలో ఇది రాకపోవచ్చు. అలాంటిప్పుడు ఎవరిలో ఇది వస్తుందనడానికి కొన్ని సూచనలూ ఉన్నాయి. ఉదాహరణకు జన్యుపరీక్షలో బీఆర్సీఏ 1, బీఆర్సీఏ 2 అనే జన్యువుల్లో తేడాలు ఉన్నప్పుడు క్యాన్సర్ వచ్చేందుకు రిస్క్ పెరుగుతుంది. అలాగే పి 10 అనే జన్యువు, పి 53 అనే జీన్ మ్యూటేషన్జరిగిన వారిలోనే ఇది వస్తుంది. అంటే కుటుంబ చరిత్రలో రొమ్ముక్యాన్సర్ వచ్చిన దాఖలా ఉన్నా ఆ కుటుంబంలో అందరికీ ఇది వచ్చే అవకాశాలు ఉండవు. కాకపోతే రిస్క్ మాత్రం ఉంటుందంతే. చాలామంది దీన్ని అంటువ్యాధి అనుకుంటారు. బాగా చదువుకున్నవారిలోనూ చాలామందిలో ఈ అపోహ ఉంది. కానీ బాగా ముదిరిన దశతో సహా ఏ దశలోనూ ఇది అంటువ్యాధి కానేకాదు. ఒకసారి శస్త్రచికిత్స జరిగి క్యాన్సర్ ఉన్న భాగాన్ని తొలగించాక వారు పూర్తిగా ఆరోగ్యవంతులైనట్లే. అంటే క్యాన్సర్ రాకముందు వారు ఎలాంటి జీవితం అనుభవించారో, అలాగే గడపవచ్చు. దాంపత్య జీవితం, సెక్స్‌తో సహా. మనదేశంలో రోగి పట్ల సానుభూతి చూపడం ఎక్కువ. కానీ ఒకసారి వ్యాధికి చికిత్స తీసుకుని పూర్తిగా తగ్గినవారు ఇక అన్నివిధాలుగా పూర్తిగా ఆరోగ్యవంతులు కాబట్టి బంధువులంతా పరామర్శల పేరిట వారికి సానుభూతి పంచడం, తమ అపోహలను వారిపై రుద్ది వారిని లేనిపోని భయాందోళనలకు గురిచేయడం ఎంతమాత్రమూ సరికాదని గుర్తుంచుకోండి. డాక్టర్ చంద్రశేఖర్‌రావు చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్