Annanagar
-
అయ్యో తల్లి.. ఎంత ఘోరం జరిగిపోయింది
సాక్షి, చెన్నై(అన్నానగర్): ఆర్టీసీ బస్సు ఢీకొని స్కూటర్‌పై వెళుతున్న అమ్మమ్మ, మనవరాలు మృతిచెందిన ఘటన తేనిలో జరిగింది. చిన్నారి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వివరాలు.. తేని జిల్లా వరుసనాడు సమీపంలోని మురుకోడై గ్రామానికి చెందిన అమావాసై, భార్య రాణి (44) కేరళ మున్నార్ సమీపంలోని బూపరాయ్ ప్రాంతంలో ఉంటూ తోట పని చేసేవారు. వీరి కుమారుడు సత్యరాజ్, కుమార్తె యోగాన కుటుంబం కూడా బూపరాయ్ ప్రాంతంలోనే ఉంటోంది. కొద్ది రోజుల క్రితం రాణి, ఆమె కుమారుడు కుమార్తె కుటుంబంతో కలిసి స్వగ్రామమైన తేని జిల్లా మురుకోడై వచ్చారు. మంగళవారం మోటారు సైకిల్, స్కూటర్‌పై బూపరాయ్ బయలుదేరారు. మోటారు సైకిల్‌ను రాణి అల్లుడు జయప్రకాష్ నడుపుతున్నాడు. అక్కడ అతని భార్య, కూతురు రుద్రశ్రీ (04), బంధువు జగతీశ్వరన్ (15) ఉన్నారు. స్కూటర్లో రాణి, ఆమె కోడలు వానతి (25), వానతి కుమారుడు ఉద్గేశ్వరన్ (07)లు వున్నారు. వానతి స్కూటర్ నడిపింది. తేని బోడి రోడ్డులోని తీర్థతొట్టి సమీపంలోని ఓ దుకాణం వద్ద ఆపి టీ తాగారు. తరువాత రుద్రశ్రీ అమ్మమ్మతో కలిసి స్కూటర్‌పై వెళ్లింది. తొప్పుపట్టి సమీపంలో రోడ్డు మలుపు వద్ద పెరియకుళం నుంచి వచ్చిన ప్రభుత్వ బస్సు వెనుక నుంచి ఢీకొంది. బస్సు చక్రం ఎక్కిదిగడంతో రాణి, రుద్రశ్రీ అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నారి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని తల్లిదండ్రులు రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. 108లో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తేని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. పళని శెట్టిపట్టి పోలీసులు తామరైకులంకు చెందిన బస్సు డ్రైవర్ అయ్యన్న స్వామి (52)పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. వదిలేయాలని వేడుకున్నా..) -
నివేదన ప్రేమవివాహం.. ఇంటికి వచ్చి చూసే సరికి..
సాక్షి, చెన్నై: కూతురు ప్రేమ వివాహం చేసుకుందని సోమవారం తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. పరమత్తివేలూరు తాలూకా పాండమంగళం సమీపంలోని నెట్టైయం పాళయానికి చెందిన వీరప్పన్ (55) కూలి. ఇతని భార్య భానుమతి. వీరికి నివేద (22) అనే ఏకైక కుమార్తె ఉంది. ఈమె ఎమ్.ఎస్.సి చదువుకుని ఇంట్లో ఉంటోంది. ఈక్రమంలో నివేద అదే ప్రాంతంలోని బెల్లం ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సేలం జిల్లా మకుడం చావడికి చెందిన యువరాజ్ (25)ను ప్రేమించింది. నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి వారు పెళ్లి చేసుకుని మకుడంచావడిలో నివాసం ఉంటున్నారు. ఇటీవల వీరప్పన్ తన కుమార్తె నివేదను భర్తతో కలిసి పట్టణానికి రావాలని ఆహ్వానించాడు. అయితే నివేద రావడానికి నిరాకరించింది. దీంతో వీరప్పన్ సోమవారం కుమార్తెను తీసుకురమ్మని భార్య భానుమతిని మకుడం చావడికి పంపాడు. అయితే నివేద ఇంటికి రావడానికి నిరాకరించిందని, దీంతో చేసేది లేక తిరిగి వస్తున్నానని భానుమతి భర్తకు చెప్పింది. ఇంటికి వచ్చి చూసే సరికి భర్త తాడుతో ఉరివేసుకుని ఉండడంతో వేలూరు పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వీరప్పన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. -
ఏ దిక్కూలేక తాత ఇంటికి చేరింది.. మృగాళ్లలా మారి ఆరుగురు..
మేం.. విడిపోతున్నామనే పేరుతో తల్లిదండ్రులు వదిలేశారు. ఏ దిక్కూలేని ఆ పసితల్లి దీనంగా తాత ఇంటికి చేరింది. ఒక్కపూట బువ్వకోసం ఇంటి చాకిరీ మొత్తం చేసింది. ఆ బిడ్డను చూసి జాలిపడాల్సిన లోకం పట్టించుకోలేదు. దిక్కూమొక్కులేదని తెలియడంతో అయినా వారే ఆ చిన్నారి పాలిట రాబందులుగా మారారు. కర్కశంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. కాటికి కాళ్లు చాపిన తాత.. తండ్రి తర్వాత తండ్రిగా భావించే బాబాయిలు, వరసకు సోదరులైన ఇద్దరు యువకులు తోడేళ్లుగా మారి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంతటి బాధను పంటి బిగువన భరించిన ఆ 13 ఏళ్ల బాలిక టీచర్ల సాయంతో ఆ కీచకులను కటకటాలపాలు జేసింది. సాక్షి, అన్నానగర్: కంచే చేను మేసిందన్న చందంగా.. అయినా వారే ఓ ఆడబిడ్డ పాలిట జంతువుల్లా ప్రవర్తించారు. సభ్య సమాజం తలదించుకునేలా మృగాలను తలపించారు. వివరాలు.. మైలాపూర్ ప్రాంతానికి చెందిన ఓ జంట వివాహం అనంతరం కొన్నేళ్లకు విడిపోయింది. దీంతో వీరి కుమార్తె (13) అనాథగా మారింది. నా అనేవాళ్లు లేక తాతయ్య ఇంటికి చేరింది. అక్కడే స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. అయితే ఆ బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాల్సిన కుటుంబ సభ్యులే 2016, 2017లో పలుమార్లు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాలిక పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులకు తెలియజేసింది. దీంతో పాఠశాల యాజమాన్యం జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేసింది. చివరికి ఈ అకృత్యంపై మైలాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మృగాలకు తగిన శాస్తి.. ఈ కేసు విచారణ సమయంలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. బాలికపై ఏకంగా ఆరుగురు కుటుంబ సభ్యులు నెలల తరబడి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో బలాత్కారం చేసిన ఆమె తాత, ముగ్గురు బాబాయిలు (తాత కొడుకులు), చిన్నాన కుమారులు ఇద్దరు (బాలిక సోదరులు) సహా ఆరుగురిపై పోక్సో కేసు నమోదైంది. అనంతరం వారిని అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో చెన్నైలోని పోక్సో కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాజలక్ష్మి ముందుకు మంగళవారం ఈ కేసు విచారణకు వచ్చింది. కాగా నేరం రుజువు కావడంతో బాలిక తాత, ముగ్గురు బాబాయిలకు యావజ్జీవ శిక్ష, తలా రూ. లక్ష జరిమానా, బాలిక సోదరుల్లో ఒకరికి 10 ఏళ్ల జైలుశిక్ష, మరొకరికి ఐదేళ్ల జైలుశిక్ష, తలా రూ.5,000 జరిమానా విధించారు. అలాగే బాధిత బాలికకు తమిళనాడు ప్రభుత్వం తరపున రూ. 10 లక్షలు పరిహారం ఇవ్వాలని కూడా న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఇక సమాజంలో ఏ ఆదరణ లేని బాలికల పరిస్థితి దుర్భరంగా ఉందని, తన..మన అనే భేదం లేకుండా ఇష్టారాజ్యంగా మానవ మృగాలు రెచ్చిపోతున్నాయని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. అబలల ఆక్రందనలను ప్రభుత్వాలు పట్టించుకోవాలని, ఇలాంటి విషయాల్లో పోలీసులు సైతం కఠినంగా వ్యవహరించాలని సూచించారు. నిందితులపై ఎలాంటి కనికరం చూపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. -
పెళ్లయి 13 రోజులే.. బెడ్రూంలో ఉరేసుకుని నవవధువు..
సాక్షి, చెన్నై(అన్నానగర్): తండయార్‌పేటలో పెళ్లయిన 13వ రోజే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చెన్నై తండయార్‌పేటకు చెందిన ప్రకాష్, గౌరి దంపతుల కుమార్తె రేఖ(35) రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో లేబొరేటరీ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఈమెకు టి.నగర్ గిరియప్ప రోడ్డుకు చెందిన రాజశేఖర్ (40)కు వడపళని మురుగన్ ఆలయంలో ఈ నెల 14వ తేదీ వివాహం జరిగింది. ఈ నెల 19వ తేదీ రేఖ తండయార్‌పేటలోని పుట్టింటికి వచ్చింది. ఆదివారం బెడ్ రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న ఆర్కే నగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. పెళ్లయి 13 రోజులే కావడంతో తండయార్‌పేట ఆర్డీఓ విచారణకు ఆదేశించారు. ఆర్కే నగర్ ఇన్స్పెక్టర్ రవి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (షూటింగ్ కోసం నెల్లూరుకు వెళ్లిన సందర్భంలో శారీరకంగా ఒక్కటై..) -
నిత్య పెళ్లికొడుకు అరెస్టు.. నాలుగు పెళ్లిళ్లు చేసుకొని..
సాక్షి, చెన్నై(అన్నానగర్): ఒకరికి తెలియకుండా మరొకరిని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. రామనాథపురం జిల్లా కడలాడి సమీపంలోని బోధికులం గ్రామానికి చెందిన సతీష్ (38) కట్టెల వ్యాపారి. అదే గ్రామానికి చెందిన రేఖను వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఆమె నుంచి విడిపోయి లతను పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత మురుగలక్ష్మితో పరిచయం ఏర్పడి ఆమెను వివాహమాడాడు. అరుప్పుకోటైలో ఆమెతో కలిసి నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో మేకలు మేపుతున్న 17 ఏళ్ల యువతితో సతీష్‌కి పరిచయం ఏర్పడింది. మాయమాటలు చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో తన కూతురు కనిపించడం లేదని బాలిక తండ్రి అరుప్పుకోటై తాలూకా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఉళుందూరుపేటలోని సోదరి ఇంట్లో ఉన్న బాలికను గుర్తించిన పోలీసులు ఆమెను రక్షించి విరుదునగర్‌లోని ఆశ్రమంలో ఉంచారు. సతీష్ అరుప్పుకోటై సమీపంలోని పాలవనత్తం ప్రాంతంలో తలదాచుకున్నట్లు బుధవారం సమాచారం అందడంతో పోలీసులు పోక్సో చట్టం కింద సతీష్‌ను అరెస్టు చేశారు. చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. భర్త పలుమార్లు హెచ్చరించినా..) -
వివాహం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు.. తల్లిదండ్రులను పిలిపించి..
సాక్షి, చెన్నై(అన్నానగర్): తిరుచ్చి సుబ్రమణ్యపురానికి చెందిన కార్తీక్ (23) బీఏ చదివి బిస్కెట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో పని చేస్తున్న సెంతనీర్ పురం సమీపంలో ఉన్న వరగనేరి పిచ్చై పట్టణానికి చెందిన అంగుస్వామి కుమార్తె అభినయ(19)ను ప్రేమించాడు. వారిద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో తల్లిదండ్రులు తమను విడదీస్తారనే భయంతో సమయపురంలోని ఆది మారియమ్మన్ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం సమయపురం పోలీసులను ఆశ్రయించారు. సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి చర్చలు జరిపారు. రాజీ కుదరడంతో పెళ్లికూమార్తెను వరుడితో పాటు పంపించారు. చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. భర్త పలుమార్లు హెచ్చరించినా..) -
యువకుడితో వివాహేతర సంబంధం.. భర్త పలుమార్లు హెచ్చరించినా..
సాక్షి, చెన్నై(అన్నానగర్): సేలంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తని హత్య చేసిన కేసులో భార్యకి కోర్టు మంగళవారం యావజ్జీవ శిక్ష విధించింది. సేలం జిల్లా మేట్టూరు సమీపంలోని గుంజాండి ఊరుకు చెందిన సెల్వరాజ్ (31) ఫైనాన్షియర్. భార్య వనిత (30). వీరికి కుమారుడు ఉన్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో వనితకి వివాహేతర సంబంధం ఏర్పడింది. సెల్వరాజ్ హెచ్చరించినా వనిత వివాహేతరసంబంధాన్ని వదలలేదు. 2011 సెప్టెంబర్ 5న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అదే రోజు రాత్రి సెల్వరాజ్ నిద్రపోతున్న సమయంలో వనిత అతని గొంతు నులిమి చంపింది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలులో ఉంచారు. మంగళవారం మేట్టూరు అదనపు జిల్లా కోర్టు ఈ కేసును విచారించింది. హత్య చేయడం నిరూపితం కావడంతో వనితకు యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ కుమార శరవణన్ తీర్పు వెలువరించారు. చదవండి: (ఉదయం ప్రేమవివాహం.. సాయంత్రానికి శవమైన సాఫ్ట్వేర్ ఇంజినీర్) -
పదో తరగతి విద్యార్థిని మృతి.. ఆస్పత్రి ముట్టడి
సాక్షి, చెన్నై(అన్నానగర్): మన్నడి ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన పదో తరగతి విద్యార్థిని చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మృతి చెందినట్టు ఆరోపిస్తూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై తండయార్ పేట ఎంపీటీ కాలనీకి చెందిన రమేష్ చెన్నై పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి భార్య వసంతి, కుమార్తె నందిని (15) ఉన్నారు. కుమార్తె నందిని తండయార్ పేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. రమేష్, వసంతి దంపతులకు నందిని ఏకైక సంతానం కావడంతో అల్లారుముద్దుగా పెంచారు. ఈ స్థితిలో నందినికి కడుపునొప్పి రావడంతో రెండు రోజుల క్రితం చెన్నైలోని మన్నడి ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ నందిని బుధవారం సాయంత్రం చికిత్స ఫలించక మృతి చెందింది. ఈ వార్త విని దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు కూతురి మృత దేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె చనిపోయిందంటూ నందిని తల్లిదండ్రులు, బంధువులు ప్రైవేట్ ఆస్పత్రిని ముట్టడించి డాక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించారు. -
డీఎంకే నాయకుడి హత్య
తిరువొత్తియూరు: అన్నానగర్‌కు చెందిన టి.పి.సత్రం 16వ వీధికి చెందిన డీఎంకే నాయకుడు సంపత్‌కుమార్ (48)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. చెన్నై అన్నానగర్ పోలీస్‌స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి సంపత్‌కుమార్ బైకులో వెళ్తుండగా.. ఆటోలో నుంచి కిందకు దిగిన ముగ్గురు కత్తులతో దాడి చేసినట్లు తెలిసింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. భర్త దాడిలో భార్య మృతి: అంబత్తూరు సమీపం సూరప్పటు జేపీ ఏపీ నగర రెండవ వీధికి చెందిన ముత్తు (40) బేకరీ నడుపుతున్నాడు. భార్య విజయలక్ష్మి (34). వీరికి దీపశ్రీ (14) అనే కుమార్తె, వసంత్ (10) అనే కుమారుడు ఉన్నారు. గత 14వ తేది భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో ఆగ్రహం చెందిన ముత్తు భార్య ముఖంపై తీవ్రంగా దాడి చేశాడు. మరుసటిరోజు ఆమె ముఖం వాపు ఏర్పడి వాంతులు కావడంతో ఆమెను చికిత్స కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ విజయలక్ష్మి గురువారం ఉదయం మృతి చెందారు. పోలీసులు ముత్తును అరెస్టు చేశారు. పెట్రోల్ చోరీని అడ్డుకున్నందుకు.. తిరువళ్లూరు జిల్లా నందిబాక్కం రైల్వేస్టేషన్ సమీపంలోని మీంజూర్ మేలూరు జోసెఫ్ వీధికి చెందిన వ్యక్తి రాజేష్ (24). తన బైక్‌ను రైల్వేస్టేషన్ పక్కన నిలిపి బుధవారం కట్టడ పనులకు వెళ్లాడు. రాత్రి రైల్వేస్టేషన్ చేరుకున్నాడు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఇతడి బైక్ నుంచి పెట్రోల్ చోరీ చేస్తున్నారు. దీంతో వారిని రాజేష్ పట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే వారు కత్తులతో దాడి చేయడంతో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. -
బాలికకు ప్రేమ లేఖ ఇచ్చిన వృద్ధుడి అరెస్ట్
అన్నానగర్ : 16 ఏళ్ల బాలికకు ప్రేమ లేఖ ఇచ్చిన వృద్ధుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. వివరాలు.. కోవై పొత్తనూర్ భజన ఆలయ వీధికి చెందిన మహమ్మద్ బీర్ బాషా (66) 16 ఏళ్ల బాలికపై కన్నేశాడు. ఆ బాలికకి ప్రేమలేఖ రాసి ఇచ్చాడు. ఇందులో ‘నాకు నువ్వు నచ్చావు, నీకు ఓకేనా’ అని రాసి ఉంది. బాలిక ఆ లేఖను తన తల్లికి ఇచ్చింది. దీంతో బాలిక తల్లిదండ్రులు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు బుధవారం మొ హమ్మద్ బీర్ బాషా మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. -
సినీ ప్రముఖుడి కూతురి కిడ్నాప్ కలకలం
పెరంబూర్: చెన్నైలో సినీ ప్రముఖుడి కూతురిని దుండగులు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. స్థానిక అన్నాశాలైలోని వాణిజ్య సముదాయంలో ఈ ఘటన జరిగింది. ఈ మేరకు టీ.నగర్లో చిత్రనిర్మాణ కార్యాలయం నిర్వహిస్తున్న ప్రసాద్(56) అన్నాశాలై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కూతురు అన్నాశాలైలోని ఒక షాపింగ్ మాల్ వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. అక్కడ ఓ వ్యక్తి తన కూతురి కిడ్నాప్‌నకు ప్రయత్నించి, చివరకు సెల్‌ఫోన్, డబ్బుతో అక్కడి నుంచి పారిపోయాడని పేర్కొన్నారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు స్థానిక అన్నానగర్‌లో దుండగుడి ఆచూకీ లభించడంతో అక్కడ గాలిస్తున్నట్లు తెలిపారు. -
మహిళ ఆత్మహత్య
అన్నానగర్: కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది చిన్నారితో సహా బావిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బోడి సమీపంలో చోటు చేసుకుంది. బోడి సమీపంలోని బి. మీనాక్షిపురం కన్డియమ్మన్ ఆలయ వీధికి చెందిన కాళియప్పన్ కుమార్తె అరసమణి (28). ఈమెకు పెరియకుళం దేవదానపట్టికి చెందిన గణేషన్ (30)తో వివాహం జరిగింది. వీరికి పెళ్లై రెండేళ్లైనా సంతనం కలగలేదు. దీంతో అహల్య (ఒకటిన్నర ఏళ్ల)అనే చిన్నారిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. ఈ స్థితిలో భార్యభర్తలకు మధ్య తరచూ కలహాలు వస్తుండడంతో అరసమణి తన తల్లిదండ్రుల ఇంటికి చిన్నారిని తీసుకొని వెళుతున్నాని చెప్పి అక్కడి నుంచి వెళ్లింది. ఈ విషయాన్ని ఈమె తల్లిదండ్రులకు భర్త గణేషన్ తెలిపాడు. కాని వారిద్దరు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు బంధువుల ఇంట్లో వెతికారు. వారి ఆచూకి లభించలేదు. ఈ క్రమంలో బోడి సమీపంలోని మేలసొక్కనాథపురంలోని ఓ బావిలో చిన్నారితో మహిళ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి మృతి చెందిన వారిని బయటకి తీశారు. విచారణలో మృతి చెందింది అరసరమణి, అహల్య అని తేలింది. కుటుంబ సమస్యలతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని అరసమణి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. -
చెట్టును ఢీకొన్న కారు
అన్నానగర్: చెట్టును కారు ఢీకొన్న ప్రమాదంలో తండ్రి,కుమార్తె సహా నలుగురు మృతిచెందారు. ఈ సంఘటన తెన్‌పసియారు సమీపంలో చోటుచేసుకుంది. రామనాథపురం జిల్లా సాయల్‌కుడి సమీపంలో ఉన్న ఎస్.దురైపాండి గ్రామానికి చెందిన మారిసెల్వం (52). ఇతను కుటుంబంతో కలిసి ఆంధ్రాలో ఉన్న తన ఇంటికి వెళ్లాలని కారులో బయలుదేరారు. వారితో పాటు బంధువులైన శాంతి, పుష్పలను కూడా తీసుకువెళ్లారు. చెన్నై– తిరుచ్చి హైవే రోడ్డులో వెళుతుండగా తెన్‌పసియారు బస్టాండ్ సమీపంలో అదుపుతప్పిన కా రు చెట్టును ఢీకొని, రోడ్డుపక్కన ఉన్న గుంతలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మారిసెల్వం, దివ్య, శాంతి, పుష్ప సంఘటన స్థలంలోనే మృతి చెందారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదంపై విచారణ చేస్తున్నారు. -
వివాహిత ఆత్మహత్య
అన్నానగర్ : మాడంబాక్కంలో భార్య, భర్తల మధ్య జరిగిన ఘర్షణలో మనస్తాపం చెందిన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మాడంబాక్కం, పద్మావతి నగర్, 23వ వీధికి చెందిన షణ్ముగం(40). కేళంబాక్కంలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని భార్య రేఖ(34). వీరికి మూడు సంవత్సరాల కుమార్తె ఉంది. ఈ చిన్నారికి త్వరలో పుట్టినరోజు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం చిన్నారి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించే విషయంలో భార్యభర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో షణ్ముగం చిన్నారిని తీసుకుని తన తల్లి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో రేఖ ఒంటరిగా ఉంది. అంతకుముందు జరిగిన ఘర్షణతో మనస్తాపం చెందిన రేఖ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి ఇంటికి వచ్చిన షణ్ముగం భార్య ఉరి వేసుకుని శవంగా కనిపించడంతో దిగ్భ్రాంతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న సేలైయూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
వరదల్లో హనీమూన్ జంట
అన్నానగర్ : తిరువేర్కాడులో గత నెల 27న వివాహం చేసుకున్న గౌరీ, రాజశేఖర్ కాశ్మీరు వరదల్లో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే, నగర రవాణా సంస్థ డ్రైవర్ ఎం.కరుణానిధి తన కుమార్తె అయిన గౌరీని రాజశేఖర్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. హనీమూన్ కోసం ఈ దంపతులు సెప్టెంబరు 2వ తేదీన కాశ్మీరుకు వెళ్లారు. వీరు సెప్టెంబరు 6వ తేదీన తిరిగి చెన్నై చేరుకోవాల్సి ఉండగా, నేటి వరకూ ఈ హనీమూన్ ప్యాకేజ్ టూర్‌ను బుక్ చేసిన సదరు ట్రావెల్ ఏజెంట్ వధూ-వరుల తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారమూ ఇవ్వలేదు. కానీ బుధవారం గౌరీ తన తల్లిదండ్రులకు ఢిల్లీ నుంచి ఫోన్ చేసి తాము సురక్షితంగా ఉన్నామని తెలపడంతో పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం తమను చెన్నైకు పంపడానికి ఢిల్లీలోని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు గౌరీ ఫోన్లో తెలిపిందన్నారు. ఈ నెలాఖరుకి కొత్త పెళ్లి కొడుకైన రాజశేఖర్ కతార్‌లోని కొత్త ఉద్యోగంలో చేరవలిసి ఉందని కరుణానిధి తెలిపారు. -
రోగాలను నిరోధించే పచ్చికొబ్బరి
అన్నానగర్: పచ్చి కొబ్బరిలో కేవలం 50 శాతానికి మించి కొవ్వు ఆమ్లాలు లేవని, వీటిని మన దేహం పూర్తిగా శక్తిగా మారుస్తుందే కానీ మిగిలిన నూనెలకు మల్లే శరీరంలోని కొవ్వును వృద్ధి చేయదని న్యూట్రీషనిస్టులు చెప్పారు. కొబ్బరిలోని మోనోలారిన్ అనే పదార్థం మెదడును ఆరోగ్యంగా ఉంచి పక్షవాతం రాకుండా నివారిస్తుందని తెలిపారు. ఇది బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి జీవులను శరీరంలో ఎదగనివ్వదన్నారు. కొబ్బరి తినేవారికి ఇన్ఫెక్షన్లు సోకవని పేర్కొన్నారు. కొబ్బరిలో సిలీనియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, ఐరన్, మాంగనీస్, కాపర్ వంటి లోహాలున్నాయన్నారు. అదేవిధంగా అకాల వృద్ధాప్యాన్ని నివారించే విటమిన్ ఈ, శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసే విటమిన్ సితో పాటుగా బి-వన్, బి-త్రీ, బి-ఫైవ్, బి-సిక్స్‌లు సమృద్ధిగా ఒక్క కొబ్బరిలోనే లభ్యం అన్నారు. వాస్తవానికి కొబ్బరి వాడకపోవడం వల్లనే పిల్లల్లో పోషకాహార లోపాలు కన్పిస్తున్నాయని న్యూట్రీషనిస్టులు స్పష్టం చేశారు. ఉదయం తొమ్మిది గంటల లోపల కొబ్బరితో చేసిన పదార్థాలు తింటే ఎంతో మంచిదన్నారు. ఉదయం వేళ నూనెతో చేసిన వస్తువులను తినరాదని అయితే నూనె శాతం తక్కువ కలిగిన కొబ్బరి పదార్థాలు అంటే కొబ్బరి చట్నీ వంటి వాటిని తీసుకుంటే మెదడు ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు. ఎండుకొబ్బరి కంటే అప్పటికప్పుడు కొట్టిన పచ్చి కొబ్బరి వల్ల ఎన్నో లాభాలున్నాయన్నారు. కొబ్బరిలో పాలీశాచ్యురేటడ్ తైలాలు ఎక్కువ అన్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదన్నారు. కొబ్బరి జాతి వాస్తవానికి ఆస్ట్రేలియా దేశానిదని అయితే ఇవి భారతీయుల జన జీవనంలో ఒక ప్రధాన భాగమైపోయాయన్నారు. ఎండు కొబ్బరిని కొంచెం తక్కువగా వాడటం మంచిదని వీరు చెబుతున్నారు. వ్యాపార ప్రయోజనాల కోసం కొన్ని కంపెనీలు కొబ్బరి మంచిది కాదని చెప్పడం విచారకరమన్నారు. -
అతిపొడవైన వంకాయ
అన్నానగర్: ఆర్గాన్ వ్యవసాయ శాస్త్రవేత్త కన్యాకుమారి గీతా ఇంటి పెరటిలో 15 అంగుళాల పొడవున్న వంకాయ కాచి స్థానికులను సంభ్రమకులను చేసింది. అదే వంగ చెట్టుకు 11 అంగుళాలున్న మరో వంకాయ కాసిందని గీత తెలిపారు. సేంద్రీయ ఎరువులు వాడడంతో కాయల పరిమాణం, బరువు, పోషకాల్లో గణనీయమైన వృద్ధి వుంటుందన్నారు. ఇందుకు తన పెరటిలో కాచిన వంకాయే నిదర్శనం అని ఆమె చెప్పారు. కోడిగుడ్ల పెంకులు, వాడి పారేసిన టీ, కాఫీ పొడుల ముద్దలు, ఉల్లిపాయ తొక్కలు, తరిగి తీసిన తొక్కలు(కూరగాయలవి), వాడి పోయిన పూలు, పేడ వంటి వాటినే తాను ఎక్కువగా పెరటిలోని మొక్కలకు ఎరువుగా వాడుతుంటానన్నారు. పెరడులో రాలిపోయిన పండుటాకులను అక్కడే ఒక చిన్న గొయ్యితీసి పాతిపెడితే అదే కొద్ది రోజుల తర్వాత ఆర్గానిక్ ఎరువులా పని చేస్తుందన్నారు. దీనిని ప్రత్యేకంగా తీసి మొక్కల పొదల్లో వేయాల్సిన పని లేదన్నారు. భూమి ద్వారానే ఈ చెత్త ద్వారా ఆర్గానిక్ మిశ్రమాలు మొక్కలను వాటంతట అవే అందుతాయన్నారు. -
అపోలోలో తొలి ఎస్కేపీ సర్జరీ
ఏక కాలంలో కిడ్నీ,పాంక్రియస్ల మార్పిడి సర్జరీ విజయవంతమని అపోలో ప్రకటన అన్నానగర్, న్యూస్‌లైన్: దక్షిణాది వైద్య చరిత్రలోనే మొదటిదిగా చెప్పబడుతున్న సైమల్టేనియస్ కిడ్నీ - పాంక్రియాస్ సర్జరీ (ఎస్కేపీ)ను అపోలో వైద్యులు విజయవంతం చేశారని ఆ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. అపోలో ఎండీ ప్రీతారెడ్డి మాట్లాడుతూ త్వరలో అపోలో ఒక మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్‌ను ప్రారంభిస్తుందని తెలిపారు.నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ సర్జరీకు చెందిన విశేషాలను వివరించారు. పాండిచ్చేరికి చెందిన 52 ఏళ్ల పరమేశ్వరీ రాజశేఖర్ మధుమేహ వ్యాధితో చెడిపోయిన కిడ్నీతో తమ వద్దకు వైద్యం కోసం వచ్చారు. ఈ శస్త్ర చికిత్సకు సారథ్యం వహించిన డాక్టర్ ఆనంద్ కక్కర్ తెలిపారు. బాగా ఆలోచించిన మీదట ఆమెకు చెడిపోయిన కిడ్నీతో పాటు, చక్కెర స్థాయిని నియంత్రించే పాంక్రియాస్ గ్రంధిని కూడా పూర్తిగా తొలగించి వాటి స్థానంలో అవయవదాతల నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన కిడ్నీ - పాంక్రియాస్‌లను అమర్చడం వలన ఆమెను మధుమేహం నుంచి పూర్తిగా విముక్తిరాల్ని చేయవచ్చు. ఈ క్రమంలో తన సహవైద్యులైన డాక్టర్ మనీష్ వర్మ, డాక్టర్ ఆనంద్ రామమూర్తి, డాక్టర్ మహేష్‌లతో కల్సి ఈ సరికొత్త ఎస్కేపీ సర్జరీను పరమేశ్వరికి చేసి విజయం సాధించామన్నారు. టైప్టూ మధుమేహంతో బాధపడుతున్న పరమేశ్వరీ ఈ సర్జరీ అనంతరం పూర్తి స్థాయి ఆరోగ్యంతో ఉన్నారని, ఆమె పాంక్రియాస్, కిడ్నీలు బాగా పని చేస్తున్నాయని కక్కర్ తెలిపారు. ఈ విధానం ఉత్తర భారతావనిలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉందన్నారు. రోగి పరమేశ్వరి విలేకరులతో మాట్లాడుతూ ఈ సర్జరీ తర్వాత తాను అన్ని పదార్థాలనూ యథేచ్ఛగా తినగల్గుతున్నానని తెలిపారు. మరో ఆరు నెలల తర్వాత స్వీట్లను కూడా తాను తినవచ్చునని వైద్యులు తెలిపారన్నారు. తాను వ్యాధి సోకక ముందు ఎలా ఉన్నానో సర్జరీ తర్వాత కూడా అంతే ఉత్సాహం, ఆరోగ్యంతో ఉన్నానని ఆమె చెప్పారు. అపోలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ విభాగం వైద్యుడు డాక్టర్ భామ, అపోలో వైద్యులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు. -
బహుముఖ ప్రజ్ఞాశాలి
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో ఆణిముత్యాలను వెండితెరకెక్కించిన మహనీయుడు అక్కినేని లక్ష్మీ వరప్రసాదరావు. దర్జీ క్లీనర్‌గా జీవితం మొదలుపెట్టి, దర్శకుడిగా అత్యున్నత శిఖరాలను అధిరోహిం చారు. భారతీయ చలన చిత్ర నిర్మాతగా, నటుడిగా, దర్శకునిగా, సినిమాటోగ్రాఫర్‌గా, వ్యాపార వేత్తగా, సంఘ సేవకుడిగా బహుముఖాలను ప్రదర్శించిన ప్రజ్ఞాశాలి. ఆయన్ను అందరూ ఎల్వీ ప్రసాద్‌గా పిలుస్తారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. - న్యూస్‌లైన్, అన్నానగర్ ఆణిముత్యాలెన్నో ఆలంఅరా, భక్త ప్రహ్లాద, కాళిదాసు, సీతా స్వయంవరం (హిందీ) బోండాం పెళ్లి, బారిష్టర్ పార్వతీశం, చదువుకున్న భార్య, రాజాపార్వై (తమిళ) వంటి చిత్రాల్లో ప్రసాద్ నటించారు. తెనాలి రామకృష్ణ - ఘరానా దొంగ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. ఈ చిత్రాల్లో నటించారు కూడా. 25 హిందీ చిత్రాలకు, మరికొన్ని వొరియా, బెంగాలీ చిత్రాలకు ప్రసాద్ దర్శక - నిర్మాతగా వ్యవహరించారు. నటుడిగా పలుపాత్రలు పోషించారు. గృహ ప్రవేశం, ద్రోహి, పల్నాటి యుద్దం, పెంపుడు కొడుకు, కల్యాణం పన్నిపార్ (తమిళం), రాణి (తమిళం) పెళ్లిచేసి చూడు, పరదేశీ, పూంగోదై (తమిళం), మిస్సమ్మ, మంగైర్తిలకం (తమిళం), భాగ్యవతి (తమిళం), కడన్‌వాంగి కల్యాణం (తమిళం), అప్పు చేసి పప్పుకూడు, తాయిల్లా పిళ్లై (తమిళం), ఇరువరు వుల్లం (తమిళం) చిత్రాలకు దర్శకత్వం వహించారు. అవార్డులు, రివార్డులు దాదాసాహెబ్ పాల్కే అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు, ఆంధ్ర రత్న, కళాప్రపూర్ణ, కళాతపస్వి, ఉద్యోగపాత్ర (జాతీయ అవార్డు), రాజు శాండో స్మారక అవార్డు (తమిళనాడు) వంటి పలు అవార్డులు ఆయనలోని కళా సరస్వతికి దాసోహం అన్నాయి. సంఘ సేవ కోసం ఆయన పలు చోట్ల కంటి ఆస్పత్రులను నిర్మించారు. 86 ఏళ్ల వయసులో ఎల్వీ.ప్రసాద్ జూన్ 22, 1994లో కాలధర్మం చెందారు. కళకు - కళాకారులకు కాలధర్మం వర్తిం చదని చెప్పడానికే ఆయన తన పేరిట దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నేత్ర చికిత్సాలయాలను నెలకొల్పారు. పేదలకు సైతం కారు చవకగా వైద్యసేవలు అందించడమే తన ఆస్పత్రుల ధ్యేయమని ఆయన తన తొలి ఐ హాస్పిటల్ ప్రారంభోత్సవ సందర్భంలో చెప్పిన మాటలు ఆయన జయంతి రోజున స్మరించుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులోని సోమవరప్పాడులో 1908 జనవరి 17న ఎల్వీ ప్రసాద్ జన్మించారు. తల్లిదండ్రులైన అక్కినేని శ్రీరాములు - బసవమ్మకు ప్రసాద్ రెండో సంతానం. వయసుకు మించిన తెలివితేటలు ఆయన్ను విద్యాధికుడ్ని చేయలేకపోయినా అంతకుమించిన ప్రజ్ఞాశాలిని చేశాయి. రామషకీల్ సినిమా డేరాల్లో చూపించే పాత ఫిల్మ్‌ల షోలు, నాటకాలు ప్రసాద్‌ను చిన్నప్పుడే ఆకట్టుకున్నాయి. 1924లో ప్రసాద్‌కు 17 ఏళ్ల వయసప్పుడు ఆయన మేన మామ కూతురైన సౌందర్య మోహనమ్మతో వివాహమైంది. తండ్రి శ్రీరాములు అప్పుల బాధ తాళలేక ఐపీ పెట్టడంతో ప్రసాద్ చూపు మద్రాసు వైపు మళ్లింది. అయితే చెన్నైలో ఆయనకు అవకాశాలు లభించకపోవడంతో ఉత్తర భారతంలోని దాదర్‌కు మకాం మార్చారు. అక్కడ కోహినూర్ స్టూడియోస్‌లో కొద్ది రోజులు పని చేశారు. కారణం ఆయనకు హిందీ, ఇంగ్లీష్ భాషలు రాకపోవడమే. దాదర్‌లోనే ఒక దర్జీ షాపులో క్లీనరుగా ప్రసాద్ చేరారు. కానీ అక్కడ ఇక్కడ ఉండలేక వీనస్ ఫిల్మ్ కంపెనీలో జీతంలేని ఉద్యోగిగా ఉంటూ అక్కడి నుంచి ఇండియా పిక్చర్స్ కంపెనీకి మారారు. అక్కడ సిక్తర్ నవాజ్ అనే వ్యక్తి ప్రసాద్‌కు స్టార్ ఆఫ్ ది ఈస్ట్ మూకీ చిత్రంలో ఒక చిన్న వేషం ఇచ్చారు. అయితే దురదృష్టవశాత్తు ఇది రిలీజ్ కాలేదు. వీనస్ ఫిల్మ్ కంపెనీ యజమాని ధన్లాల్ సోదరి మోతీ ఇచ్చిన ప్రోత్సాహంతో భారతీయ తొలి టాకీ అయిన ఆలంఅరాలో ప్రసాద్‌కు ఒక చిన్న పాత్ర లభించింది. 1931లో అలంఅరా రిలీజ్ తర్వాత ప్రసాద్‌కు ఎన్నో లఘుపాత్రలు లభించాయి. అనంతరం హెచ్ ఎం రెడ్డి కాళిదాసు చిత్రంలో ప్రసాద్‌కు ఒక గుర్తింపులేని పాత్రను ఇచ్చారు. అప్పటికే చిన్నచిన్న పాత్రలు వేసి విసిగిపోయిన ప్రసాద్‌కు సోమవర పాడులోని తన తల్లిదండ్రులు గుర్తుకురావడంతో తిరిగి సొంతఊరు చేరారు. అయితే తిరిగే కాలు - తిట్టే నోరు వూరికే వుండవన్న సామెతను రుజువు చేస్తూ ప్రసాద్ సకుటుంబంగా బొంబాయికి చేరారు. ఆమీషా తన కమర్ - ఆల్ - జమాన్ చిత్రానికి ప్రసాద్‌ను అసిస్టెంట్ డెరైక్టర్‌గా నియమించారు. ఈ చిత్రం నుంచి ప్రసాద్ పేరును షార్టుకట్ చేసి ఎల్.వి.ప్రసాద్‌గా టైటిల్స్‌ను చూపడం మొదలైంది. ప్రసాద్ సహాయ దర్శకుడిగా పని చేసిన కష్టజీవి చిత్రం అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఆయన పృధ్విరాజ్కపూర్ నిర్వహిస్తున్న పృథ్వి థియేటర్లో చేరి మంచి నటుడిగా గుర్తింపు పొందారు. పృథ్వి రాజ్‌కపూర్ కుమారుడైన రాజ్‌కపూర్‌తో ప్రసాద్ తన మొట్టమొదటి హిందీ చిత్రం శారదాను నిర్మించడంతో ఆయన సుడి తిరిగింది. నిర్మాతగా ఇది ప్రసాద్‌కు తొలి హిందీ చిత్రం. 1943లో గృహప్రవేశం చిత్రానికి సహాయక దర్శకుడిగా పని చేసిన ప్రసాద్ విధి విలాసంలో భాగమై అదే చిత్రానికి దర్శకుడిగా పని చేయడమే కాక, ప్రధాన భూమికను పోషించి ఆ చిత్రాన్ని ఒక క్లాసిక్ హిట్‌గా విజయవంతం చేశారు. ఈ చిత్రాన్ని చూసిన దర్శకుడు కె.ఎస్.ప్రకాశరావు తన ద్రోహి చిత్రంలో ప్రధాన పాత్రను ఇచ్చారు. అదీ మంచి హిట్ కావడంతో దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం తన పల్నాటి యుద్ధం చిత్రంలో మిగిలిన భాగాన్ని దర్శకత్వం వహించాలని కోరారు. (ఈ చిత్రం సగంలో ఉండగా రామబ్రహ్మం జబ్బునపడ్డారు). 1949లో మన దేశం చిత్రాన్ని డెరైక్టు చేశారు. ఇందులో ఎన్టీరామారావును ఒక చిన్న పాత్ర ద్వారా తెరంగేట్రం చేయించింది ప్రసాద్. 1950లో విజయా పిక్చర్సు వారు తమ షావుకారు చిత్రానికి దర్శకత్వం చేయూలని కోరడంతో అందులో నటించిన ఎన్టీఆర్ - జానకిలకు గొప్ప పేరు వచ్చింది. జానకి ఆనాటి నుంచి షావుకారు జానకిగా ప్రఖ్యాతి పొందింది. అదే సంవత్సరం ఎన్టీఆర్ - ఏఎన్నార్‌తో ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం బంపర్ హిట్ అయ్యింది. జూపిటర్ ఫిల్మ్స్ తమిళం తెలుగు - హిందీ భాషల్లో నిర్మిస్తు న్న మనోహర చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అఖండ విజయంతో అటు ఎల్వీ ప్రసాద్‌కు, ఇటు నటుడు శివాజీ గణేశన్‌కు ఎదురులేకుండా పోయింది. 1955లో ఆయన దర్శకుడు డి.యోగానంద్ను పిలిచి తన ఇలవేల్పు చిత్రాన్ని దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పించారు. -
రేపు రజనీ పుట్టిన రోజు వేడుకలు
తమిళసినిమా, న్యూస్‌లైన్: సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజు వచ్చిందంటే ఆయన అభిమానులకు పండగే. రజనీ తన జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకున్నా అభిమానులు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. రజనీ కాంత్ గురువారం 64వ వసంతంలోకి అడుగిడుతున్నారు. ఈ వేడుకను ఆయన అభిమానులు విశేషంగా జరుపుకుంటున్నారు. నగరంలో నాలుగు రోజులపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగం గా అన్నానగర్‌లో 64 పంచెలు, 64 చీరలు ఉచితంగా అందించనున్నారు. వారందరికీ అన్నదానం చేయనున్నారు. తాంబరంలోని వికలాంగులకు ఇస్త్రీపెట్టెలు, కుట్టుమిషన్లను రజనీ అభిమానులు ఉచితంగా అం దించనున్నారు. నెల్సన్ మాణిక్యం రోడ్డులోని నివాస్ బాలల ఆశ్రమంలో వంద మంది బాలబాలికలకు అన్నదానం చేయనున్నారు. 12వ తేదీ ఉదయం ఏడు గం టలకు రాఘవ లారెన్స్ ట్రస్ట్‌కు చెందిన పిల్లలకు అన్నదానం చేయనున్నట్లు అభిమానులు తెలిపారు. టీనగర్‌లోని తిరుమ ల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వలసరవాక్కం రజనీ అభిమాన సంఘం ఆధ్వర్యంలో నేశం ఆశ్రమంలో అన్నదానం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంబత్తూర్ రజనీ అభిమాన సంఘం ఆధ్వర్యంలో కొరట్టూర్ సరస్వతి అమ్మాళ్ ఆశ్రమంలో ఈ సందర్భంగా అన్నదానం చేయనున్నారు. -
కాల్షియం డ్రాప్స్ వికటించి.. చిన్నారులకు అస్వస్థత
బోయిన్పల్లి/కంటోన్మెంట్, న్యూస్‌లైన్: కాల్షియం డ్రాప్స్ వికటించి దాదాపు 30 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. డోసులు తీసుకున్న వెంటనే చిన్నారులు నురగలు కక్కుతూ పడిపోయారు. దీంతో తల్లిదండ్రులు ఆర్తనాదాలతో ఆస్పత్రులకు పరుగులు తీశారు. బోయిన్పల్లి పరిధి అన్నానగర్‌లో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. ఘటనకు కారకుడైన వైద్యునిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. గురు, శుక్రవారాల్లో కొందరు వాలంటీర్లు అన్నానగర్, రసూల్‌పురా, ఇందిరమ్మ నగర్, సీబీఎన్ నగర్, శ్రీలంకబస్తీ ప్రాంతాల్లో పిల్లలకు కాల్షియం డ్రాప్స్ వేస్తున్నామంటూ కార్డులు పంచారు. వాటిని తీసుకుని శనివారం కవిత హాస్పిటల్‌కు రావాలని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.12, ఒక్కో డోసుకు రూ.20 చొప్పున చెల్లించాలన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం చేపట్టినట్టు ప్రచారం చేశారు. దీంతో మొదటి డోసు కోసం శనివారం సాయంత్రం పెద్దసంఖ్యలో చిన్నారులను తీసుకుని తల్లిదండ్రులు కవిత హాస్పిటల్‌కు చేరుకుని పిల్లలకు డ్రాప్స్ వేయించారు. ఇది జరిగిన రెండు గంటల తర్వాత దాదాపు 30 మంది పిల్లలు నురగలు కక్కుకుంటూ పడిపోయారు. కొందరు అస్వస్థతకు గురయ్యారు. దీంతో తల్లిదండ్రులు వెంటనే కవిత హాస్పిటల్‌కు వెళ్లగా నిర్వాహకులు జాడలేరు. హాస్పిటల్ యాజమాన్యం తమకేమీ తెలియదనడంతో మోసపోయినట్లు గ్రహించారు. వెంటనే చిన్నారులను తల్లిదండ్రులు సమీపంలోని పలు ప్రైవేటు ఆసుపతుల్లో చేర్పించారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నప్పటికీ ఎవరికీ ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. 108 వాహనాలు పెద్దసంఖ్యలో అన్నానగర్ చౌరస్తాకు చేరుకోవడం, తల్లిదండ్రుల ఆందోళనతో అంతటా ఉద్విగ్నత నెలకొంది. ఘటన దరిమిలా స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కాగా, వాలంటీర్లు పంచిన కరపత్రాలు, కార్డుల్లో డాక్టర్ పేరు సయ్యద్ అబ్బాస్, బీయూఎంఎస్ అని ఉందని స్థానికులు చెప్పారు.