చర్చలుండాలంటే చర్యలు తప్పవు
ఉగ్ర కేంద్రాలపై పాక్ చర్యలు తీసుకోవాలి
♦ దీని ద్వారానే పొరుగుదేశం చిత్తశుద్ధి తెలుస్తుంది
♦ ‘డూ ఇట్ యువర్సెల్ఫ్’పై అప్రమత్తత అవసరం
♦ ఉగ్రవాద వ్యతిరేక సదస్సులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్
జైపూర్: భారత్‌లో ఉగ్ర కార్యక్రమాలకు పాక్ గడ్డపైనే వ్యూహాలు రూపొందుతున్నాయనే దానికి స్పష్టమైన ఆధారాలున్నాయని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఈ ఉగ్ర కేంద్రాలపై పాక్ తీసుకునే చర్యలపైనే ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ ఆధారపడి ఉంటుందన్నారు. అటు దక్షిణాసియా ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు కూడా పాక్ నిర్ణయమే కీలకంగా మారిందన్నారు. రాజస్తాన్ ప్రభుత్వం, ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక సదస్సు ప్రారంభోత్సవంలో రాజ్‌నాథ్ మాట్లాడారు. ఉగ్రవాదాన్ని అంతమొందించటంలో పాక్ చిత్తశుద్ధిని చాటుకోవాలన్న రాజ్‌నాథ్.. దేశాల మధ్య చర్చల్లో టైజం ఓ అంశంగా ఉన్నన్ని రోజులు.. ఉగ్రవాదాన్ని ఎదిరించటం ఓ సవాల్‌గా మారుతుందన్నారు.
యువతకు తుపాకులు ఇచ్చి పక్క దేశంలో విధ్వంసం సృష్టించమని చెప్పినన్ని రోజులు స్వయంగా తను ఎదుర్కొంటున్న ఉగ్ర సమస్యకు పాక్ పరిష్కారం వెతుక్కోలేదన్నారు. ప్రపంచంలో మంచి టైస్టులుండరనే విషయాన్ని పాక్ అర్థం చేసుకోవాలని సూచించారు. అల్‌కాయిదా, దాయిష్ సంస్థలు ఇంటర్నెట్ ద్వారా యువతను ప్రభావితం చేసి ఆన్లైన్లో బాంబుల తయారీపై శిక్షణనిచ్చి ‘డూ ఇట్ యువర్సెల్ఫ్’ నినాదంతో విధ్వంసాలకు కుట్రపన్నుతున్నారన్నారు. ఏ ఉగ్ర సంస్థతో సంబంధం లేకుండానే వ్యక్తిగతంగానే కొన్ని గుంటనక్కలు దాడులకు పాల్పడే వీలుందన్నారు. ఇలాంటి వాటిపై భారతదేశం అప్రమత్తంగా ఉండాలన్నారు.
మళ్లీ మళ్లీ అదే తప్పు: జై శంకర్
కొన్ని దేశాలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూ చాలా తప్పుచేస్తున్నాయని భారత విదేశాంగ కార్యదర్శి జై శంకర్ అన్నారు. బయట దేశాల్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాలు.. తమ దేశంలో నెలకొన్న అశాంతిని గుర్తించటం లేదని పాక్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద బాధితులమని పైకి చెబుతున్నప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదంపై పోరాటానికి కొన్ని దేశాలు సహకారం అందించడంలేదన్నారు. టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతున్న ఈ ఆధునిక యుగంలో ఉగ్రవాద దాడికి మూలాలు కనుక్కోవడం పెద్ద సమస్య కాదని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఉగ్రవాదానికి సంబంధించి ఏ సమాజంలోనైనా ఎవరి ప్రయేయం ఉందో కనుక్కోవడం కూడా కష్టం కాబోదన్నారు.
పఠాన్‌కోట్ ఘటన తర్వాత తన స్థాయిలోనూ, జాతీయ భద్రతా సలహాదారు స్థాయిలోనూ.. పాక్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని జై శంకర్ తెలిపారు. తాము ఇచ్చిన సమాచారం ఆధారంగా వారి విచారణలో పురోగతి కనిపిస్తోందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. ఉగ్రవాద కట్టడికి మొత్తం ప్రపంచాన్ని ఉత్తేజం చేయడం భారత దౌత్యపరమైన లక్ష్యాల్లో ఒకటని జై శంకర్ పేర్కొన్నారు. ఉగ్రవాద పోరులో భాగంగా రసాయన ఆయుధాలను నిషేధిస్తూ అంతర్జాతీయ ఒప్పందాల్లాంటివి చేసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉగ్రవాదం నియంత్రణకు మయన్మార్‌తో చర్చలు జరిగాయని వారు కూడా సానుకూలంగా స్పం దించారని తెలిపారు. బంగ్లాదేశ్ సహకారం అందించేందుకు ముందుకు వచ్చిందన్నారు.