Antigua and Barbuda
-
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌కు శుభారంభం.. రసవత్తరంగా సాగిన తొలి మ్యాచ్
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌కు శుభారంభం లభించింది. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ చివరి బంతి వరకు రసవత్తరంగా సాగింది. ఈమ్యాచ్‌లో ఫాల్కన్స్‌పై పేట్రియాట్స్ వికెట్ తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్లో గెలుపుకు ఏడు పరుగులు అవసరం కాగా.. పేట్రియాట్స్ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అన్రిచ్ నోర్జే చివరి బంతికి సింగిల్ తీసి పేట్రియాట్స్ను గెలిపించాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్.. జువెల్ ఆండ్రూ (50 నాటౌట్), ఫఖర్ జమాన్ (43) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కోఫి జేమ్స్ 22, ఫేబియన్ అలెన్ 24 (నాటౌట్), బిల్లింగ్స్ 18 పరుగులు చేశారు. పేట్రియాట్స్ బౌలర్లలో నోర్జే, డొమినిక్ డ్రేక్స్, అష్మెద్ నెడ్, షంషి తలో వికెట్ పడగొట్టారు.164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పేట్రియాట్స్.. 9 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయం సాధించింది. పేట్రియాట్స్ ఇన్నింగ్స్‌లో ఎవిన్ లెవిస్ (29), ఆండ్రీ ఫ్లెచర్ (25), కైల్ మేయర్స్ (39), ఓడియన్ స్మిత్ (27), డొమినిక్ డ్రేక్స్ (17) రెండంకెల స్కోర్లు చేశారు. షమార్ స్ప్రింగర్ నాలుగు వికెట్లు తీసి పేట్రియాట్స్ను భయపెట్టాడు. రోషన్ ప్రైమస్ 2, మొహమ్మద్ ఆమిర్, ఇమాద్ వసీం తలో వికెట్ పడగొట్టారు. రేపటి మ్యాచ్‌లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, గయానా అమెజాన్ వారియర్స్ జట్లు తలపడనున్నాయి. -
అందుకే నన్ను కిడ్నాప్ చేశారు : చోక్సీ వింత వాదన
సాక్షి, ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీ తన కిడ్నాప్ వ్యవహారంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కరేబియన్ దేశానికి భారత్ కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించినందుకుగా ప్రతిగానే తనను కిడ్నాప్ చేసినట్టు ఆరోపించారు. ఆంటిగ్వా అండ్ బార్బుడాకు ఇండియా కరోనా వ్యాక్సిన్లను ఎగుమతి చేయడాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, చోక్సీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనే తన అపహరణకు సంబంధించిన పుకార్లు తన చెవిన పడినట్టు చెప్పుకొచ్చారు. ఒక విమానం వచ్చిందని, చాలా మంది ఫాలో అవుతున్నారనని తనను బయటకు తీసుకెళ్ళి చంపేస్తారని చెప్పారని కూడా తెలిపారు. రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా) ఏజెంట్లు అని చెప్పుకుంటూ గుర్మిత్ సింగ్, గుర్జిత్ భండాల్ ఆంటిగ్వా బార్బుడా నుంచి తనను అపహరింకు పోయారని చెప్పారు. వీరి గురించి తాను చాలా కథలు విన్నాననీ, ప్రపంచవ్యాప్తంగా ద్వీపాలు, ప్రదేశాల చుట్టూనే ఉంటారని చోక్సీ ఆరోపించారు. కాగా సుమారు 14 వేల కోట్ల రూపాయల పీఎన్బీ స్కాం నిందితుడు చోక్సీ 2018 జనవరిలో భారత్ నుంచి ఆంటిగ్వా అండ్ బార్బుడాకు పారిపోయి, అక్కడ తలదాచుకున్నాడు. అయితే ఇటీవల డొమినికాకు పారిపోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. డొమినికాలో దాదాపు 51 రోజుల కస్టడీ తర్వాత వైద్యకారణాలరీత్యా డొమినికా హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. చోక్సి ప్రస్తుతం ఆంటిగ్వా, బార్బుడాలో ఉన్న సంగతి తెలిసిందే. -
Mehul Choksi కిడ్నాప్: డొమినికా ప్రధాని స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్బీ స్కామ్ ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సిని ఆంటిగ్వా నుంచి బలవంతంగా అపహరించడం వెనుక తమ ప్రభుత్వ ప్రమేయం ఉందన్న ఆరోపణలను డొమినికా ప్రధాని రూజ్వెల్ట్ కొట్టి పారేశారు. ఆ దేశంలో ప్రసారమయ్యే ఒక వీక్లీ షోలో పాల్గొన్న రూజ్వెల్ట్, ఇవన్నీ అర్ధం లేని ఆరోపణలని వ్యాఖ్యానించారు. కోర్టు తన పని తాను చేస్తుందని, అలాగే తమ రాజ్యాంగం ప్రకారం చోక్సి ఉన్న హక్కులకు రక్షణ లభిస్తుందని తెలిపారు. భారత్ నుంచి పారిపోయిన చోక్సి 2018 నుంచి ఆంటిగ్వాలో తలదాచుకుంటున్నాడు. ఆదేశం నుంచి చోక్సిని భారత్‌కు రప్పించడంలో కాలయాపన జరుగుతున్నందున అతన్ని భారత ప్రభుత్వంతో కలిసి రూజ్వెల్ట్ ప్రభుత్వం అపహరించిందని డొమినికాలో ఆరోపణలున్నట్లు ఆదేశ మీడియా తెలిపింది. వీటిని రూజ్వెల్ట్ తోసిపుచ్చారు. అలాంటి పనుల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. అయితే ఒకదేశంలో ఒక నేరం చేసి మరో దేశంలో హాయిగా తిరగనివ్వడం మంచిదా? లేక ఆ దేశం నుంచి హంతకుడిని తీసుకువచ్చి శిక్షించడం మంచిదా? ఆలోచించాలని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తులను వారి అంతస్తులను బట్టి తమ దేశం ప్రవర్తించే తీరులో మార్పుఉండదని, అందరినీ చట్టం ముందు సమానంగా చూస్తామని తెలిపారు. అయితే చోక్సి లాయర్లు మాత్రం ఇది ప్రభుత్వాల పనేనని ఆరోపిస్తున్నారు. డొమినికా లేదా ఆంటిగ్వా ప్రభుత్వాలకు ఇందులో ప్రమేయం ఉందని తేలితే అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావాలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. మరోవైపు పారిపోయిన వ్యాపారవేత్తలు మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలపై చట్టపరమైన చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత్ శుక్రవారం (జూలై 2 ) తెలిపింది. మెహుల్ చోక్సీకిడ్నాప్ ఆరోపణలను డొమినికన్ ప్రధాని ఖండించిన నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ)ఈ ప్రకటన చేసింది. మెహుల్, నీరవ్లపై చర్యలు, స్వదేశానికి రప్పించే చర్యలపై ప్రశ్నించినపుడు చట్ట పరమైన అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని విదేశాఖ అధికారిక ప్రతినిధి అరిందం బాగ్చి వ్యాఖ్యానించారు. -
సినీ ఫక్కీలో పరార్.. దొరికిన చోక్సీ!
న్యూఢిల్లీ: సినిమాలో లాగా స్కెచ్ వేసి పరార్ అయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఆచూకీ దొరికినట్లు తెలుస్తోంది. పీఎన్బీ స్కామ్ నిందితుడు, పరారీలో ఉన్న వ్యాపారి చోక్సీ కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న అంటిగ్వా పోలీసులు.. క్యూబాకు అతను పారిపోయి ఉంటాడని అంతా అనుమానించారు. అయితే.. ఆ అనుమానాలకు తగ్గట్లు చోక్సీ ముందుగా కరేబియన్ ద్వీపం డొమినికాకు బోటు ద్వారా చేరుకున్నట్లు తెలుస్తోంది. 62 ఏళ్ల చోక్సీ అక్కడి నుంచి క్యూబాకు వెళ్లాలని స్కెచ్ వేశాడు. ఈలోపు అంటిగ్వా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో చోక్సీకి గుర్తించిన డొమినికా పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని అంటిగ్వా పోలీసులకు అప్పగించే ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు డొమినికా పోలీసులు మీడియాకు తెలిపారు. అయితే అంటిగ్వా మాత్రం చోక్సీ మిస్సింగ్‌ను ఇంతవరకు అధికారికంగా ప్రకటించకపోవడం విశేషం. కాగా, పీఎన్బీ స్కామ్ కేసులో మెహుల్ చోక్సీ భారత్‌ను వీడి ఆంటిగ్వా, బార్బుడాకి పారిపోయిన విషయం తెలిసిందే. రూ.14 వేల కోట్ల కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతన్ని దేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌తో నేరగాళ్ల అప్పగింత ఒప్పందాలు లేని క్యూబాకు చోక్సీ ప్రయత్నించి పట్టుబడ్డాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో వేల కోట్ల రూపాయల రుణ మోసానికి పాల్పడిన ఆరోపణలున్న చోక్సీ చివరిసారిగా ఆదివారం తన కారులో ఆంటిగ్వా, బార్బుడాలో కనిపించాడు. అయితే తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని, ఈడీ అక్రమంగా భారత్‌లో ఉన్న 25 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అక్రమంగా చేసిందని చోక్సీ వాదిస్తున్నాడు. చదవండి: అర్జెంట్‌గా బాత్రూం వెళ్లిన డ్రైవర్, రైల్లో.. -
పీఎన్బీ స్కామ్: కొత్త ట్విస్ట్
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) కుంభకోణం కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. దేశం విడిచి పరారైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ కనిపించకుండాపోయారు. అంటిగ్వా దీవిలో తలదాచుకుంటున్న చోక్సీ.. కనిపించకుండా పోయారని ఆయన తరపు న్యాయవాది విజయ్ అగర్వాల్ వెల్లడించాడు. చోక్సీ అదృశ్యం నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం రాత్రి ఓ రెస్టారెంట్లో విందు కోసం చోక్సీ వెళ్లినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అయితే చోక్సీ వాహనాన్ని రెస్టారెంట్ సమీపంలోని జాలీ హార్బర్లో గుర్తించినట్లు అంటిగ్వా పోలీసులు వెల్లడించారు. దీంతో అంటిగ్వా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆయన కోసం వెతుకుతున్నారు. అయితే ఇండియాకు అప్పగిస్తారనే భయంతోనే ఆయన పరారైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బహుశా ఆయన క్యూబాకి పారిపోయి ఉంటారని ఓ అధికారి చెప్తున్నారు. ఇండియాకు క్యూబాకు మధ్య నేరస్తుల అప్పగింతల ఒప్పందాలేవీ లేవు. అందుకే అక్కడికి వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. చదవండి: నిర్మాత అత్యాచారం, ఆపై గర్భం.. 2017లో మెహుల్ చోక్సీ అంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్నాడు. 2018లో పీఎన్బీ కుంభకోణం బయటపడడంతో నీరవ్‌మోదీతోపాటు మెహుల్ చోక్సీ దేశం విడిచి పారిపోయాడు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ ఇద్దరూ బంధువులు. కాగా, మెహుల్ అప్పగింత అంశంపై అక్కడి పీఎం గాస్టోన్ బ్రౌన్ ఇదివరకే భారత ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడారు కూడా. -
పీఎన్బీ స్కాం: చోక్సీకి భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్నేషనల్ బ్యాంకు కుంభకోణం (పీఎన్బీ స్కాం)లో మరో కీలకపరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు, నీరవ్‌మోదీ మేనమామ, డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీకి భారీ షాక్ తగిలింది. వేలకోట్ల రూపాయల మేర పీఎన్బీ బ్యాంకునకు కుచ్చుటోపీ పెట్టి, ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న చోక్సీ పౌరసత్వాన్ని ఆంటిగ్వా అండ్ బార్బుడా రద్దు చేసింది. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించినట్టు సమాచారం. గత సంవత్సరమే తన పౌరసత్వాన్ని ఆంటిగ్వా రద్దు చేయడంతో, సెయింట్ జాన్‌లోని సివిల్ కోర్టును ఆశ్రయించాడు. చోక్సీ. అయితే భారత బ్యాంకులను మోసం చేసి, తమ దేశంలో స్థిర పెట్టుబడుల పేరుతో తమ దేశంలో ఆశ్రయం పొందటానికి వీల్లేదన్న అక్కడి ప్రభుత్వ నిర్ణయంతో, చోక్సీ పిటిషన్‌ను కొట్టివేసి అవకాశం ఉందని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు ఆంటిగ్వా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌన్ గతంలో హామీ ఇచ్చినట్టుగా చోక్సీని భారత్‌కు అప్పగించే చర్యలు త్వరితగతిన ప్రారంభమవు తాయని వారు తెలిపారు. కాగా దౌత్యపరమైన ఒత్తిడి తరువాత మెహుల్ చోక్సీ పౌరసత్వ ఉపసంహరణకు ఆంటిగ్వా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌన్ గతంలోనేఅంగీకరించారు. నేరస్థులకు, ఆర్థిక నేరాలకు పాల్పడినవారికి తమ దేశంలో చోటు లేదని 2019 జూన్‌లో స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటికే పీఎన్బీ స్కాంకు సంబంధించి లండన్ కోర్టు తీర్పు అనంతరం, ఈ కేసులోప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని దేశానికి తిరిగి రప్పించేందుకు రంగం సిద్ధ మవుతున్న సంగతి తెలిసిందే. -
పీఎన్బీ స్కాం : ఆంటిగ్వా ప్రధాని సంచలన వ్యాఖ్యలు
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కుంభకోణంలో కీలక నిందితుడు, ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ మేనమామ, మెహుల్ చోక్సీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వ రంగ బ్యాంకు పీఎన్బీలో రూ.14\వేల కోట్లు ఎగవేసి భారీ కుంభకోణానికి పాల్పడి ఆంటిగ్వా పారిపోయి, అక్కడి పౌరసత్వంతో ఎంజాయ్ చేస్తున్న చోక్సీపై దొంగ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంటిగ్వాఅండ్ బార్బుడా ప్రధాని గాస్టన్ బ్రౌన్. ఫ్యుజిటివ్ బిలియనీర్ మెహుల్ చోక్సీ ఒక మోసగాడు, వంచకుడు అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని తెలిపారు. సాధ్యమైనంత త్వరలోనే చోక్సిని బహిష్కరిస్తాం..అతన్ని తిరిగి భారతదేశానికి రప్పించుకోవచ్చన్నారు. చోక్సీ ద్వారా దేశానికి ఉపయోగంలేదనీ, త్వరలోనే చోక్సి పౌరసత్వాన్ని ఉపసంహరించుకుంటామని ఆయన స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో భారతీయ అధికారులు ఎప్పుడైనా వచ్చి చోక్సీని విచారించవచ్చు అని ప్రధాని గాస్టన్ తెలిపారు. అతనిపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చన్నారు. అంతేకాదు మంచి వ్యక్తిగా చోక్సిని భారత అధికారులు క్లియర్ చేయడం దురదృష్టకరమని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు భారత అధికారులే బాధ్యత వహించాలని కూడా చురకలంటించారు. కాగా పీఎన్బీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే డైమండ్ వ్యాపారులు నీరవ్ మోదీ, చోక్సీ విదేశాలకు పారిపోయారు. అయితే వీరి పాస్‌పోర్టులను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం, నిందితులను తిరిగి దేశానికి రప్పించేందుకు మల్లగుల్లాలు పడుతోంది. నీరవ్ ప్రస్తుతం లండన్ జైల్లో ఉండగా, అతని రిమాండ్‌ను అక్టోబర్ 17 వరకు పొడిగించింది లండన్ కోర్టు. తాను నిర్దోషినని, తనపై వచ్చిన ఆరోపణలు తప్పుడివి అంటున్న చోక్సీ గతంలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఒక సందర్బంగా ఆంటిగ్వా ప్రభుత్వం చోక్సీని సమర్ధించింది కూడా. అలాగే అనారోగ్యం సాకుతో విచారణకు ఎ గ్గొడుతూ, మూక హత్యలు కారణంగా తాను ఇండియాకు రాలేనంటూ చిలక పలుకులు పలుకుతున్న చోక్సీ, జూన్ 2018 లో ముంబై అవినీతి నిరోధక కోర్టులో దాఖలు చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బిడబ్ల్యు) రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. #WATCH Antigua & Barbuda PM Gaston Browne: Got subsequent information that Mehul Choksi is a crook, he doesn't add value to our country. He will be deported ultimately after he exhausts appeals, Indian officials are free to investigate based on his willingness to participate. pic.twitter.com/FbAaIml0Fv — ANI (@ANI) September 25, 2019 -
‘చోక్సీని భారత్‌కు అప్పగించం’
న్యూఢిల్లీ : పీఎన్బీ స్కామ్‌లో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీని భారత్‌కు రప్పించే ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చోక్సీ ప్రస్తుతం అంటిగ్వా పౌరుడని ఆయనను భారత్‌కు పంపబోమని ఓ అంటిగ్వా అధికారి స్పష్టం చేశారు. రూ 13,500 కోట్ల పీఎన్బీ స్కామ్‌లో నిందితుడైన చోక్సీని దేశానికి రప్పించేందుకు భారత్ ప్రత్యేక విమానాన్ని కరీబియన్ దీవులకు పంపుతోందన్న వార్తల నేపథ్యంలో అంటిగ్వా అధికారి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మెహుల్ చోక్సీ కోసం భారత్ నుంచి అధికారులు అంటిగ్వా, బార్బుడాలకు వస్తున్నారన్న సమాచారం తమ ప్రభుత్వం వద్ద లేదని ప్రధాని గాస్టన్ బ్రౌన్ కార్యాలయ సిబ్బంది చీఫ్ మాక్స్ హర్ట్ పేర్కొన్నట్టు ఇండియా టుడే టీవీ వెల్లడించింది. మెహుల్ చోక్సీ ఇప్పుడు అంటిగ్వా పౌరుడని,ఆయన తన భారత పౌరసత్వాన్ని వదిలివేయడంతో భారత పౌరుడు కారని ఆయన అంటిగ్వా పౌరసత్వాన్ని తాము రద్దు చేయబోమని హర్ట్ పేర్కొన్నారు. వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత బృందం అంటిగ్వాకు రానుందని తాను భావిస్తున్నాన్నారు. చోక్సీని అరెస్ట్ చేయడం లేదా ఆయనను తీసుకువెళ్లేందుకు భారత బృందం అంటిగ్వా వస్తుందని తాము భావించడం లేదన్నారు. జనవరి 31న వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ మ్యాచ్ అంటిగ్వాలో ప్రారంభమవుతుండటంతో భారత అధికారులు అంటిగ్వా రావచ్చని చెప్పుకొచ్చారు. -
కేసుల ఎఫెక్ట్.. పౌరసత్వాన్ని కొనేశాడు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి కరీబియన్ ఐలాండ్ ఆంటిగ్వా పౌరసత్వం లభించింది. కేసు నుంచి తప్పించుకునేందుకు ఇక్కడి నుంచి అక్కడికి పారిపోయిన చోక్సీ ముందుగా ఆంటిగ్వా శరణుకోరారు. ఆ తర్వాత పౌరసత్వాన్నే కొనుక్కున్నారు. ఇక్కడ పౌరసత్వం కొనుక్కోవడం అంటే ఆ దేశంలో వ్యాపారం పేరిట కొంత నిర్ణీత సొమ్మును పెట్టుబడిగా పెట్టడం. ఇలా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల పౌరసత్వాన్ని పెట్టుబడుల రూపంలో కొనుక్కునే అవకాశం ఉంది. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల పౌరసత్వం కావాలంటే కొంత ఎక్కువ ఖర్చు అవుతుంది. కరీబియన్ ఐలాండ్‌లో చాలా సులభంగా పౌరసత్వాన్ని కొనుక్కోవచ్చు. ఆంటిగ్వా, బార్బుడా లాంటి కరీబియన్ దేశాల్లో 25 వేల అమెరికా డాలర్లను పెట్టుబడిగా పెట్టి, ఐదేళ్ల కాలంలో ఐదు రోజులుంటే తక్షణమే పౌరసత్వం, పాస్‌పోర్టు అభిస్తుంది. అదే ఆస్ట్రేలియాలో పౌరసత్వం రావాలంటే 50 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టి ఏడాదికి 40 రోజులు నివాసం ఉంటే ఐదేళ్లకాలానికి పౌరసత్వం, పాస్‌పోర్టు లభిస్తుంది. అదే కెనెడా దేశంలో ఐదు లక్షల కెనడా డాలర్లను పెట్టుబడులుగా పెడితే ఐదేళ్ల కాలానికి 730 రోజులు నివాసం ఉంటే మూడేళ్ల కాలానికి పౌరసత్వం లభిస్తుంది. ఇక అమెరికాలో ఐదు లక్షల డాలర్లను పెట్టుబడులుగా పెట్టి ఏడాదికి 180 రోజులు నివాసం ఉంటే ఏడేళ్ల కాలానికి పౌరసత్వం లభిస్తుంది. -
ఇండియానే క్లీన్ చిట్ ఇచ్చింది
న్యూఢిల్లీ: తాము విచారణ చేసినప్పుడు మెహుల్ చోక్సీకి భారత్ క్లీన్ చిట్ ఇచ్చిందని, ఆ తరువాతే చోక్సీకి పౌరసత్వం ఇచ్చామని ఆంటిగ్వా ప్రభుత్వం వెల్లడించింది. చోక్సీకి పౌరసత్వం మంజూరు చేయడంలో తామేమీ తప్పు చేయలేదని స్పష్టం చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ భారీ కుంభకోణంలో నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీ వాంటెడ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. 2017 మేలో పౌరసత్వం కోసం చోక్సీ దరఖాస్తు చేసుకోగా, భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖ, సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) క్లీన్ చిట్ ఇచ్చాయని ఆంటిగ్వా ప్రభుత్వం పేర్కొంది. తర్వాతే చోక్సీకి పౌరసత్వం ఇచ్చామని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో మోదీ ప్రభుత్వ తీరు తేటతెల్లమవుతోందని కాంగ్రెస్ విమర్శించింది. అసలేం జరిగింది... ఆంటిగ్వా అండ్ బార్బుడా సిటిజన్‌షిప్ బై ఇన్వెస్ట్మెంట్ యూనిట్ (సీఐయూ) చోక్సీకి సంబంధించి స్థానిక మీడియాకు విడుదల చేసిన సుదీర్ఘ ప్రకటనలో పలు వివరాలు వెల్లడించింది. ‘2018 జనవరి మొదటి వారంలో చోక్సీ భారత్‌ను వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. 2017 మేలో చోక్సీ ఆంటిగ్వా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. పలు విచారణలు చేసి అన్నింటిలో క్లీన్ చిట్ వచ్చాకే కిందటేడాది నవంబర్‌లో దాన్ని ఓకే చేశాము. ఇందుకోసం ఆయన ఇన్వెస్ట్మెంట్ పాలసీ కింద రూ.1.3 కోట్లు చెల్లించారు. అంతేకాదు ఈ ఏడాది జనవరి 15న ఆయన ఆంటిగ్వా పౌరుడిగా విధేయతా ప్రమాణం చేశారు. ఇది జరిగిన 15 రోజుల తరువాత అంటే జనవరి 29న కేంద్ర నేర పరిశోధన సంస్థ (సీబీఐ) నీరవ్ మోదీ, చోక్సీపై కేసులు నమోదు చేసి, విచారణ ప్రారంభించింది. చోక్సీ ప్రస్తుతం మా దేశ పౌరుడు కనుక ఆయనను దేశం నుంచి పంపించలేం’ అని వివరించింది. ఆయనకు పాస్‌పోర్టు మంజూరు చేయడంలో పొరపాటు జరగలేదని పేర్కొంది. ఆయనకు మంజూరు చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలంటే చట్టబద్ధమైన ప్రక్రియను చేపట్టవలసి ఉంటుందని, ఆయన ప్రస్తుతం ఆంటిగ్వా చట్టాల రక్షణలో ఉన్నారని తెలిపింది. ఆంటిగ్వా ప్రధాన మంత్రి గాస్టన్ బ్రౌనే మాట్లాడుతూ తన చేతులు కట్టేసి ఉన్నాయన్నారు. చోక్సీకి క్లీన్ చిట్ ఎలా ఇచ్చారు? చోక్సీపై పలు ఫిర్యాదులుండగా విదేశీ వ్యవహారాల శాఖ క్లీన్ చిట్ ఎలా ఇచ్చిందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఈ ఉదంతం దోపిడీదారుల పట్ల మోదీ ప్రభుత్వ తీరును తేటతెల్లం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ఏప్రిల్‌లో ఆంటిగ్వా ప్రధాన మంత్రి గాస్టన్ బ్రౌనేని కలిసినప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. అప్పట్లో కేసుల్లేవు కాబట్టే పీసీసీ ఇచ్చాం ఆంటిగ్వా ప్రభుత్వం విచారణ చేసినప్పుడు మెహుల్ చోక్సీపై కేసులేం లేవని భారత ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముంబై పాస్‌పోర్టు కార్యాలయం అప్పటి పోలీస్ వెరిఫికేషన్ రిపోర్టు (పీవీఆర్)ను అనుసరించి 2016 మార్చి 16న చోక్సీకి క్లీన్ చిట్ ఇచ్చిందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. అప్పటికి అతనిపై కేసులేం లేనందున అతనికి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) ఇచ్చారని తెలిపారు. చోక్సీకి సంబంధించి తామేం క్లీన్ చిట్ ఇవ్వలేదని, అసలు ఆంటిగ్వా నుంచి తమకు ఎలాంటి అభ్యర్థనా రాలేదని, తాము వారికి ఏ సమాచారం ఇవ్వలేదని సెబీ తెలిపింది. -
చోక్సీపై ఆంటిగ్వా ప్రభుత్వం న్యూ ట్విస్ట్
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో కీలక నిందితుల్లో ఒకడైన మెహుల్ చోక్సీ వ్యవహారంలో భారత ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ద్రోహులకు తమ దేశంలో స్థానంలేదు, ఇరుదేశాల స్నేహ సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించిన ఆంటిగ్వా అండ్ బర్బూడా ప్రభుత్వం తాజాగా యూ టర్న్ తీసుకుంది. మెహుల్ చోక్సీకి పౌరసత్వం మంజూరు చేయడంలో తామేమీ తప్పు చేయలేదని ప్రకటించింది. భారత ప్రభుత్వ సానుకూల నివేదిక ఆధారంగాను ఆయనకు పాస్‌పోర్టు మంజూరు చేసినట్టు తెలిపింది. ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాటు జరగలేదని వివరించింది. ఈ కొత్త మలుపుతో చోక్సీని భారత్‌కు రప్పించాలని చూస్తున్న ప్రభుత్వానికి కొత్తతలనొప్పి మొదలైంది. అయితే చోక్సీపై నేరారోపణలకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించిన అనంతరం చోక్సీ అప్పగింత అంశాన్ని పరిగణనలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంటిగ్వా విదేశాంగ మంత్రి వెల్లడించారు. మెహుల్ చోక్సీ 2017 మేలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా, భారతదేశ హోం శాఖ, సెబీ సానుకూల నివేదికలు ఇచ్చాయని ఆంటిగ్వా అండ్ బర్బూడా ప్రభుత్వం ప్రకటించింది. పెట్టుబడిదారుల యూనిట్, క్యాపిటల్ మార్కెట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ద్వారా ప్రభుత్వం నుంచి పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఫ్యుజిటివ్ వ్యాపారవేత్త మెహుల్ చోక్సికి పౌరసత్వాన్ని మంజూరు చేసినట్టు తెలిపింది. అలాగే విదేశీ వ్యవహారాల రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి వచ్చిన ధ్రువపత్రంలోనూ చోక్సీకి సంబంధించి ప్రతికూల అంశాలేమీ లేవని ఆంటిగ్వా వెల్లడించింది. అంతేకాదు చోక్సీ దరఖాస్తుపై నేపథ్య తనిఖీలు కూడా చేశామని తెలిపింది. ఏ సందర్భంలోనూ ఆయన ధరఖాస్తుపై అనుమానాస్పద సమాచారం లేదని పేర్కొంది. ప్రస్తుతం చోక్సీ తమ దేశ పౌరుడు కనుక ఆయనను దేశం నుంచి పంపించలేమని స్పష్టం చేసింది. అయితే చోక్సీ పౌరసత్వాన్ని రద్దు చేయాలంటే చట్టబద్ధమైన ప్రక్రియను చేపట్టవలసి ఉంటుందని పేర్కొంది. -
పట్టుకోండి.. ఎక్కడికీ పారిపోనీకండి!
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు కోట్లాది రూపాయల రుణం ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మోహుల్ ఛోక్సీని అష్టదిగ్బంధనం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. తాను పారిపోలేదని ఆటింగ్వా పౌరసత్వం తీసుకున్నానంటూ ప్రకటించిన చోక్సీకి షాకిచ్చేలా భారత ప్రభుత్వం కదులుతోంది. చోక్సీని నిర్బంధించాల్సిందిగా ఆంటిగ్వా, బర్బుడా ప్రభుత్వాలను కేంద్రం కోరింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. త్వరలోనే భారత రాయబారి ఆటింగ్వాలోని బర్బుడా ప్రభుత్వ ధికారులను కలవనున్నారు. ఆంటిగ్వాలో మెహుల్ చోక్సీ వ్యవహారంపై అక్కడి ప్రభుత్వం స్పందించిన వెంటనే జార్జిటౌన్‌లోని భారత హై కమిషన్ అధికారులు ఆంటిగ్వా , బార్బుడా ప్రభుత్వాలకు లేఖలు రాశారు. చోక్సీ కదలికల గురించి నిఘా పెట్టి.. ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, అతన్నివెంటనే అదుపులోకి తీసుకోవాలని కోరారు. భూ, వాయు లేదా సముద్ర మార్గాల్లో పారిపోకుండా అడ్డుకోవాలని కోరినట్టు ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ స్కాం రూ.13వేల కోట్ల పీఎన్బీ కుంభకోణం కేసులో కీలక నిందితులు, డైమండ్ వ్యాపారులు నీరవ్ మోదీ, చోక్సీని భారత్ రప్పించే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే భారత ప్రభుత్వం వీరి పాస్‌పోర్టులను రద్దు చేసింది. అలాగే పలు ఆస్తులను ఎటాచ్ చేసిన దర్యాప్తు బృందాలు ఈడీ, సీబీఐ దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నాయి. కాగా ద్రోహులకు తమ దేశంలో స్థానం లేదనీ, భారత ప్రభుత్వం కోరితే చోక్సీ అరెస్ట్‌కు తగిన చర్యలు తీసుకుంటామని, భారత ప్రభుత్వానికి సహకరిస్తామంటూ ఆంటిగ్వా విదేశాంగ మంత్రి స్పందించడంతో భారత ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. అయితే తన వ్యాపారాన్ని విస్తృతం చేసుకునేందుకు గతేడాది ఆంటిగ్వా పౌరసత్వం తీసుకున్నట్లు పీఎన్బీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గీతాంజలి సంస్థల అధిపతి మెహుల్ చోక్సీ గతవారం ప్రకటించాడు. తద్వారా 130 దేశాలకు ఎటువంటి వీసా లేకపోయినా ప్రయాణించే అనుమతి ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
చోక్సీకి షాక్ : ప్రభుత్వానికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడు, గీతాంజలి సంస్థల అధిపతి మెహుల్ చోక్సికి దిమ్మతిరిగే వార్త ఇది. వ్యాపార విస్తరణకోసం ఆంటిగ్వా పౌరసత్వాన్ని తీసుకున్నానని ప్రకటించిన చోక్సీకి షాకిచ్చేలా అక్కడి ప్రభుత్వం స్పందించింది. తమదేశ పౌరసత్వం దుర్వినియోగానికి తాము అనుమతించమని స్పష్టం చేసింది. ద్రోహులకు తమ నేలపై దాక్కునేందుకు అవకాశం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆంటిగ్వా , బార్బుడా విదేశాంగ మంత్రి ఇ. పాల్ చెట్ గ్రీన్ ఒక ప్రకటన విడుదల చేశారు. అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంలో నిందితుడుగా ఉన్న డైమండ్ వ్యాపారి చోక్సీకి చెక్ పెట్టే క్రమంలో కేంద్రానికి ఊరట కల్గించేలా ఆంటిగ్వా ప్రభుత్వం స్పందించింది. చోక్సీకి సంబంధించి భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యర్థన తమకు చేరలేదని తెలిపింది. చోక్సీ పౌరసత్వం రద్దు, లేదా అరెస్టు కోసం న్యూఢిల్లీ నుండి అధికారికంగా తమను ఎవరూ సంప్రదించలేదని చెప్పింది. భారతదేశ వ్యాపారవేత్త చోక్సిని బహిష్కరించాలని భావించి, అటువంటి అభ్యర్ధనను గౌరవిస్తామని స్పష్టం చేసింది. ఆర్థిక నేరగాళ్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందనీ, వారికి ఆంటిగ్వా స్వర్గంగా మారిందన్న విమర్శను విదేశాంగ మంత్రి తోసిపుచ్చారు. ఆటింగ్వా ప్రభుత్వ సానుకూల స్పందనపై కేంద్రం ఎలాంటి చర్యల్ని చేపట్టనుందో చూడాలి. భారతదేశంతో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నట్టు గ్రీన్ చెప్పారు. ఇరు దేశాల సంబంధాలకు హాని కలిగించే చర్యల్ని చేపట్టబోమని వెల్లడించారు. మరోవైపు చోక్సీ ఆటింగ్వాకు తలదాచుకున్న వైనం అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచింది. ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఆటింగ్వా ప్రధాని మౌనంపై విమర్శలు గుప్పించాయి. దీనిపై విచారణ జరిపించాల్సిందిగా నాయకులు డిమాండ్ చేశారు. -
ఇర్మా సృష్టించిన పెనువిపత్తు!
-
ఇర్మా సృష్టించిన పెనువిపత్తు!
సాక్షి, వాషింగ్టన్: ఇర్మా తుఫాన్ కరేబియన్ దీవుల్లో పెను విపత్తును సృష్టించింది. ప్రచండమైన గాడ్పులు, వర్షాలతో బుధవారం రాత్రి ఇర్మా తుఫాన్.. అంటిగ్వా, బార్బుడా, ప్యూర్టోరికా, సెయింట్ మార్టిన్ దీవులపై విరుచుకుపడింది. దీంతో ప్రభుత్వ భవనాలు కుప్పకూలాయి. అనేక నివాసాల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. మరోవైపు, 5 కేటగిరి తుఫాన్ తీవ్రతతో దూసుకుపోతున్న దక్షిణ ఫ్లోరిడా దిశగా సాగుతుండటంతో అమెరికా అప్రమత్తమైంది. హరికేన్ ఇర్మా ధాటికి బార్బుడా ఛిన్నాభిన్నమైంది. 'బార్బుడా శిథిలమయంగా కనిపిస్తోంది. గృహసముదాయాలన్నీ ధ్వంసమయ్యాయి. బార్బుడా దీవి పూర్తిగా నేటమట్టమైంది' అని అంటిగ్వా, బార్బుడా ప్రధాని గాస్టన్ బ్రౌన్ మీడియాతో తెలిపారు. ఇర్మా తుఫాన్ ధాటికి బార్బుడా దీవిలో కనీసం ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తోంది. ఇందులో ఒక చిన్నారి ఉంది. ఇక సెయింట్ మార్టిన్ దీవుల్లో ఈ తుఫాన్ ధాటికి ఐదుగురు ప్రాణాలు విడిచారు. వైబ్రంట్ నైట్‌లైఫ్‌కు వేదిక అయిన సెయింట్ మార్టిన్ దీవిలో ఇర్మా పెనువిపత్తును సృష్టించిందని, 95శాతం ఆస్తులు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. 1800 మంది జనాభా గల బార్బుడా దీవి ఏమాత్రం నివాసయోగ్యం కాకుండా సమూలంగా ధ్వంసమైందని, ఇక్కడి ప్రజలంతా నిరాశ్రయులయ్యే పరిస్థితి నెలకొందని ప్రధాని బ్రౌన్ పేర్కొన్నారు. ఇక్కడ ధ్వంసమైన నివాసాలు పునర్నిర్మించేందుకు ఎంతలేదన్న 150మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్టు చెప్పారు.