పిట్ట కొంచెం కూత ఘనం అనిపించిన అన్వితా
పిట్ట కొంచెం కూత ఘనంలా.. నిజమైన ప్రతిభకు వయసుతో సంబంధం లేదని నిరూపించింది ఓ తొమ్మిదేళ్ల బాలిక. అప్పుడే విషయాలను అర్థం చేసుకునే వయసులో ప్రపంచానికి గణనీయమైన సహకారం అందించింది. యాపిల్ కోసం వివిధ యాప్ లను రూపొందించి ఆ టెక్ దిగ్గజం నిర్వహించే వార్షిక డెవలపర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొనే అరుదైన అవకాశం దక్కించుకుంది. అంతేకాక ఈ ఈవెంట్ పాల్గొన్న అతిచిన్న అభ్యర్థిగా ఈ అమ్మాయే నిలిచింది. భారతీయ సంతతికి చెందిన తొమ్మిదేళ్ల అన్వితా విజయ్ ఆస్ట్రేలియాలో నివసిస్తోంది. ఈ బాలికను యాపిల్ స్కాలర్ షిప్ వరించింది.
ప్రతీ ఏడాది యాపిల్ నిర్వహించే డబ్ల్యూడబ్ల్యూడీసీ కాన్ఫరెన్స్ లో తన డివైజ్ ల కోసం యాప్ లను రూపొందించిన వారికి స్కాలర్ షిప్ లను అందిస్తుంటోంది. ఈ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ లో విజేతలైన వారికి ఈ ఈవెంట్ లో పాల్గొనే అవకాశంతో పాటు ఉచితంగా టిక్కెట్లను కూడా ఇస్తోంది. మొత్తం 350 మంది విజేతల్లో, 120 మంది 18ఏళ్ల లోపు వారే ఉన్నారు. వారిలో అతి చిన్న అమ్మాయిగా అన్వితా నిలిచింది. యాపిల్ నిర్వహించే ఈ వార్షిక సమావేశం అతిముఖ్యమైన టెక్ కాన్ఫరెన్స్ లో ఒకటి.
ఏడేళ్ల వయసులోనే అన్విత మొబైల్ యాప్ లు రూపొందించాలనే కలలు కనేదట. ఈ కలలను సాకారం చేసుకునేందుకు అన్వితా ఒక ఏడాదిపాటు ఫ్రీ కోడింగ్ ట్యూటోరియల్స్ ను ఆన్ లైన్ లో చూసి నేర్చుకుంది. అనంతరం ప్రొగ్రామింగ్ బేసిక్స్ పై దృష్టిసారించింది. కోడింగ్ అనేది చాలా చాలెంజింగ్ గా ఉంటుందని అన్విత విజయ్ తెలిపింది. 'కానీ నాకు చాలా గర్వంగా ఉంది. నేను దానిలో ఇరుక్కుపోయిందుకు' అని అన్వితా తన సంతోషాన్ని వెల్లబుచ్చింది.
యాపిల్ సీఈవో టిమ్ కుక్ ను కలవడం, డబ్ల్యూడబ్ల్యూడీసీలో పాల్గొనడమే తన కలగా ఉండేదని ఆ బాలిక పేర్కొంది. తన సోదరి స్ఫూర్తితో చిన్న పిల్లల కోసం ఈ యాప్ లను అన్వితా అభివృద్ది చేసింది. మొదట స్మార్ట్ కిన్స్ యానిమల్స్ ఐఓఎస్ యాప్ ను డెవలప్ చేసింది. ఈ యాప్ ద్వారా 100 వివిధ జాతుల జంతువులను పేర్లు, అరుపులను తెలుసుకోవచ్చు. అనంతరం చిన్న పిల్లల కోసం వివిధ రకాల ఎడ్యుకేషనల్ ఐఓఎస్ యాప్ లను రూపొందించింది.