సేవా 'బలగం'
ఔనయ్యా.. నా సైన్యమే
చంద్రబాబుకు ఒకటే మాట చెబుతున్నా.. అవునయ్యా, వీళ్లు (వలంటీర్లు) మంచి చేస్తున్న ప్రభుత్వానికి, మంచి చేస్తున్న ముఖ్యమంత్రికి బ్రాండ్ అంబాసిడర్లే. ప్రజా సేవకులు, స్వచ్ఛంద సైనికులే. జగనన్న సైన్యం వీరే. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఇంతకు ముందెప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ప్రభుత్వం చేసిన ప్రతి మేలు, మంచి పనికీ, ప్రతి సంక్షేమ పథకానికీ, ఆ మంచి పనుల ద్వారా చోటుచేసుకుంటున్న మార్పులకు సాక్షులు వలంటీర్లేనని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పేదల ప్రభుత్వంపై చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా తప్పుడు ప్రచారాలతో నిందలు వేస్తుంటే సత్య సారథులు, సత్య సాయుధులుగా మారి ప్రతి గడపకూ వెళ్లి ఐదు కోట్ల మంది ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యతను వలంటీర్లు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఆ హక్కు, నైతికత కేవలం వలంటీర్లకు మాత్రమే ఉందన్నారు. ‘రాష్ట్ర ప్రజలంతా గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల అరాచకాలు ఎలా ఉంటాయో చూశారు. ఈరోజు అవేవీ లేవు. వాటి స్ధానంలో మనందరి ప్రభుత్వం తీసుకొచ్చిన తులసి మొక్క లాంటి వ్యవస్థే వలంటీర్లు. జగనన్న ప్రభుత్వంలో పేదలందరికీ చేసిన ప్రతి ఒక్క మంచి మీ చేతుల మీదుగా, మీ ద్వారానే జరిగింది.
ప్రతి ఒక్కరికీ నిజాలు చెప్పే హక్కు, చెప్పాల్సిన బాధ్యత కూడా మీ భుజసంధ్కాలపైనే ఉందని మరిచిపోవద్దు’ అని పేర్కొన్నారు. తనకున్న అతి పెద్ద బలం ప్రతి గడపకూ నేరుగా వెళ్లే వలంటీర్లేనన్నారు. వరుసగా మూడో ఏడాది ఉత్తమ వలంటీర్లకు అవార్డులతో పాటు నగదు బహుమతి అందజేసే ‘వలంటీర్లకు వందనం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్‌లో లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఆ వివరాలివీ...
మీ జగనన్న నమ్మకం మీరు..
‘నాలుగేళ్లుగా మన ప్రభుత్వాన్ని ప్రతి గడప వద్దకూ తీసుకెళ్లాం. ఈరోజు ప్రతి గడప వద్దకు వెళ్లి నీకు మంచి జరిగిందా? లేదా? అని నీతిగా, నిజాయితీగా ప్రతి అక్కనూ అడగగలిగే నైతికత మన ప్రభుత్వానికి ఉంది. అది వలంటీర్ల వల్లే సాధ్యపడింది. ఎక్కడా వివక్ష చూపలేదు, లంచాలకు తావులేదు. మంచే కానీ, ఎక్కడా చెడు చేయలేదు. మీ జగనన్న పెట్టుకున్న నమ్మకం మీరు. ప్రజలకు, ప్రజా ప్రభుత్వానికి మధ్య వారధులు, సంక్షేమ సార«థులు మీరే.
ఆ హక్కు మీకు మాత్రమే ఉంది..
తూర్పున సూర్యుడు ఉదయించకముందే ప్రతి అవ్వాతాతకు ఒక మంచి మనవరాలిగా, మనవడిగా.. వితంతువులు, దివ్యాంగులకు ఒక మంచి చెల్లెమ్మలా, అక్కలా, తమ్ముడిలా, అన్నలా ప్రతి నెలా ఒకటో తారీఖున 64 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్న గొప్ప సేవకులు, సైనికులు మన వలంటీర్లు.
జగనన్న పాలనలో మాదిరిగా ఇలా మీ ఇంటికే వచ్చి ఒకటో తారీఖునే పెన్షన్ ఇస్తున్న వ్యవస్థను గత ప్రభుత్వంలో ఏనాడైనా చూశారా? అని ఆలోచింపచేసేలా ప్రజలను అడగగలిగే నైతిక హక్కు మీకు మాత్రమే ఉంది. అమ్మ ఒడి, ఆసరా, చేయూత, ఇళ్ల పట్టాలు, ఇళ్లు, రైతు భరోసా.. ఇలా అనేక పథకాలను గత ప్రభుత్వంలో ఏనాడైనా చూశారా? అని అడిగే నైతికత మీకు మాత్రమే సొంతం.
కడుపు మంటతో ఓర్వలేకపోతున్నారు..
మన నవరత్నాల పాలన, బటన్ నొక్కి నేరుగా రూ.2.10 లక్షల కోట్లను అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయడం, నాన్ డీబీటీ కూడా కలిపితే మొత్తంగా రూ.3 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చటాన్ని చూసి కొందరు కడుపు మంటతో ఓర్వలేకపోతున్నారు. గతంలో ఎప్పుడూ మంచిచేసిన చరిత్ర లేని వారంతా ఈరోజు ఎలా మాట్లాడుతున్నారో, ఏ రకంగా అబద్ధాలు చెబుతున్నారో, ఎల్లో మీడియా, సోషల్ మీడియాల ద్వారా ఎలా దుష్పచారం చేస్తున్నారో మీరంతా చూస్తున్నారు. ఇంత మంచి చేస్తున్న పేదల ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు, నిందలు వేస్తోంటే ప్రతి గడప వద్దకూ వెళ్లి నిజాలు చెప్పగలిగిన సత్య సారథులు, సత్య సాయుధులు మీరే (వలంటీర్లు).
చంద్రబాబు ఏమన్నారో మర్చిపోవద్దు..
చంద్రబాబు ఆయన ఎల్లో మీడియా, దుష్ట చతుష్టయానికి వలంటీర్ వ్యవస్ధ అంటేనే కడుపులో మంట. ఎంత కడుపు మంట అంటే.. ఒక డజన్ ‘జెలూసిల్’ మాత్రలు వేసినా కూడా తగ్గనంత మంట! ఈ వ్యవస్థ గురించి, వలంటీర్ల గురించి ఎంత దుర్మార్గంగా విమర్శలు చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే వాళ్లు మనుషులేనా? అనిపించేది. వలంటీర్లపై నిరంతరం దుష్ప్రచారం, విమర్శలు చేస్తూనే ఉన్నారు.
వలంటీర్లను చంద్రబాబు, ఎల్లో మీడియా వెటకారం చేస్తూ ఏమన్నారో బాగా గుర్తు పెట్టుకోండి. ‘ఏం పని వీళ్లకు? తెల్లవారుజామున వెళ్లి తలుపులు తడుతున్నారు..’ అంటూ దురుద్దేశాలు ఆపాదించిన చంద్రబాబును బాగా గుర్తు పెట్టుకోండి. ఇదే పెద్దమనిషి వలంటీర్లను చులకనగా చూపించేందుకు.. ‘మద్యం తాగి వస్తారు.. వీళ్లు చేసేది మూటలు మూసే ఉద్యోగం.. వీళ్లంతా అల్లరి మూకలు’ అని కూడా చంద్రబాబు అన్నాడు.
తమకు అధికారం వస్తే వెంటనే వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి తిరిగి జన్మభూమి కమిటీలను తెస్తానన్నాడు. వలంటీర్ల వ్యవస్థ పనిచేయకుండా కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ వలంటీర్ల సేవలను ప్రజలు గుర్తించి మెచ్చుకోవడంతో ఇదే చంద్రబాబు ఇప్పుడు ‘ఈ వలంటీర్లు అంతా జగన్ సైన్యం.. వాళ్లు వద్దు.. మాకు అధికారం వస్తే కొత్త వలంటీర్ల వ్యవస్థను తెస్తాం’ అంటున్నారు.
ఆలోచన రేకెత్తించాలి..
రాష్ట్రంలో ప్రతి ఇంటికి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా వెళ్లాలి. జరిగిన మంచిని చూపించాలి. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను వివరించాలి. ఇంతకుముందు ప్రభుత్వంలో ఇలాంటి మంచి జరిగిందా? అని ఆలోచింపజేసేలా అడగాలి. ప్రతి మాట అడిగి అందరినీ ఆలోచించేలా చేయాల్సిన బాధ్యత మీదే. ప్రజలందరికీ వ్యత్యాసాన్ని తెలియచేయాల్సిన బాధ్యత కూడా మీపైన ఉంది.
మీ హక్కులకు ఏ ఆటంకాలుండవు..
2019లో మనం అధికారంలోకి రాగానే నవరత్నాల ఫిలాసఫీ నచ్చి మీ జగనన్నకు తోడుగా ఉండేందుకు స్వచ్ఛందంగా పేదలకు సేవ చేసేందుకు ముందుకొచ్చిన 2.66 లక్షల మంది మహా సైన్యమే వలంటీర్ వ్యవస్థ. దాదాపు 25 సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో కులమతాలు, ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి పేదకూ మంచి చేయాలని తపనతో అడుగులు వేస్తున్న గొప్ప సైన్యం వలంటీర్లు.
వలంటీర్లు చేస్తున్నది సేవ మాత్రమే. ఇది ప్రభుత్వ ఉద్యోగం పరిధిలోకి వచ్చే సేవ కాదు. ఇది స్వచ్ఛంద సేవ. దీనిపేరే వలంటీర్. ఇక్కడ పని చేస్తున్న ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కారు. మీ అటెండెన్స్ కూడా ఎప్పుడైనా ప్రభుత్వ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మార్కు చేసే కార్యక్రమం మాత్రమే. ఎవరైనా మిమ్మల్ని ఫలానా పని మీరు చేయకూడదంటే గట్టిగా సమాధానం చెప్పండి.
మీ రాజకీయ హక్కులకు, మీ అభ్యుదయ ఆదర్శ భావాలకు ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు ఉండవని స్పష్టం చేస్తున్నా. వలంటీర్లను ఉద్దేశించి నేను చేసిన మొదటి ప్రసంగంలోనే మిమ్మల్ని లీడర్లుగా చేస్తానని చెప్పా. ఆ మాటను గుర్తు పెట్టుకోండి. నవరత్నాల ఫిలాసఫీకి సారథులుగా, మంచి చేస్తున్న ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా, ప్రజలందరికీ మోటివేటర్లుగా, మన ప్రభుత్వానికి అండగా మీరంతా నిలబడాలని పిలుపునిస్తున్నా.
పది రోజుల పాటు కార్యక్రమాలు..
వరుసగా మూడో ఏడాది సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అనే మూడు అవార్డులతో పది రోజులపాటు వలంటీర్లను రాష్ట్రవ్యాప్తంగా సత్కరించే కార్యక్రమాన్ని ఇక్కడ నుంచే ప్రారంభిస్తున్నాం. ఈ ఏడాది ఉత్తమ సేవలందించిన 2,33,719 మంది వలంటీర్లను సన్మానిస్తున్నాం. ఇది మీరు చేసిన సేవలకు కల్పిస్తున్న గుర్తింపు. ఇందుకోసం ఈ ఏడాది రూ.239 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
మొదటి స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా 2,28,624 మంది సేవామిత్రలకు సత్కారంతో పాటు రూ.10 వేలు నగదు, ప్రశంసా పత్రంతో ప్రతి మండలంలో సన్మానాలు జరుగుతాయి. రెండో స్థాయిలో ప్రతి మండలంలో ఐదుగురు, మున్సిపాల్టీలు నగరపాలక సంస్థలలో 10 మంది చొప్పున ఎంపిక చేసిన 4,220 మంది సేవారత్నలకు రూ.20 వేలు నగదు బహుమతితో కూడిన సన్మానాలు జరుగుతాయి. మూడో స్థాయిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున 875 మంది సేవా వజ్రలకు రూ.30 వేలు నగదు, మెడల్, బ్యాడ్జితోపాటు సర్టిఫికెట్ ఇచ్చి సన్మానిస్తాం.
ఇలా ప్రతి సంవత్సరం మీరు చేస్తున్న సేవలకు గుర్తింపు రావాలని, మీ సేవలపై ప్రజల్లో చర్చ జరగాలని, మీలో ఏ ఒక్కరికీ లంచాలు, వివక్ష ఆలోచనలే మనసులోకి రాకూడదనే ఉద్దేశంతో ఆత్మస్ధైర్యాన్ని పెంచుతూ, గుర్తింపునిస్తూ ఈ అవార్డులు అందిస్తున్నాం. మూడు విడతల్లో వలంటీర్ల పురస్కారాల కోసం ప్రభుత్వం రూ.705 కోట్లు ఖర్చు పెట్టింది.
మా ధైర్యం, నమ్మకం, భవిష్యత్తు మీరే
వలంటీర్‌గా చేరిన తొలిరోజుల్లో జన్మభూమి కమిటీల ఆగడాలను గుర్తు చేసుకున్న ఓ కుటుంబం మీరైనా రేషన్ కార్డు మంజూరు చేస్తారా? అని అడిగింది. కేవలం 4 గంటల్లోనే రేషన్ కార్డు తీసుకెళ్లి వారి చేతికి అందించా. మరో ఘటనలో మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగిన ఓ దివ్యాంగ మహిళకు పింఛన్ అక్కడికే వెళ్లి అందచేశా.
రవాణా చార్జీలను తిరస్కరించడంతో భావోద్వేగానికి గురై నమస్కరించింది. నన్ను పంపింది జగనన్న కాబట్టి అన్నకు నమస్కరించాలని కోరా. వలంటీర్లంటే మూటలు మోసేవారని విమర్శించిన వారే మమ్మల్ని ఇప్పుడు పొగుడుతున్నారు. మాకు ప్రజల ఆశీస్సులు, ఆశీర్వాదాలే గొప్పవి. మా వలంటీర్ల అందరి తరపునా చెబుతున్నా.. మా ధైర్యం, నమ్మకం, భవిష్యత్తు మీరే జగనన్నా. – ఉప్పాల నరేష్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వలంటీర్
ఈ గౌరవం మీవల్లే..
నా పరిధిలో 75 కుటుంబాలు ఉండగా 62 కుటుంబాలు సంక్షేమ పథకాలు పొందాయి. పెన్షన్ కానుక గురించి ఒక పెద్దాయనతో ఈ కేవైసీ కోసం వెళితే ఆయనకు ఇల్లు లేదు. సమాధుల పక్కన చెట్టుకింద ఉన్నారు. నాకు బాధ వేసి ఓల్డేజ్ హోమ్‌లో చేర్చా. తర్వాత పెన్షన్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు ఆయన కళ్లలో చూసిన సంతోషం ఎప్పటికీ మరిచిపోలేను.
పేదలందరికీ ఇల్లు పథకం కింద ఇంటి పట్టా అందుకున్న ఓ మహిళ.. నాకు ఆడపిల్లలు లేరు. నువ్వే వచ్చి పాలు పొంగించాలని కోరినప్పుడు సంతోషమేసింది. ఈ గౌరవం మీవల్లే దక్కింది జగనన్నా! మరో మహిళకు రేషన్ కార్డు, ఫించన్ ఇప్పించినప్పుడు తన కన్నబిడ్డ కూడా ఇంత చేయలేదని కృతజ్ఞతలు తెలిపింది. ఆ దీవెనలన్నీ మీకే జగనన్నా..! –హేమ, విజయవాడ తూర్పు నియోజకవర్గ వలంటీర్
కరోనాలో కాపాడిన సైన్యం..
గొప్ప సంకల్పంతో తెచ్చిన వలంటీర్ వ్యవస్థలో నేను ఉన్నందుకు గర్వపడుతున్నా. గతంలో నేను ఓ ఇంటికి వెళితే ‘నాకు ఏ పథకాలూ వద్దు.. మీకు జీతాలైనా ఇస్తారా?’ అని హేళన చేశాడు. ఆయన కరోనా బారినపడినప్పుడు సొంత పిల్లలు దగ్గర లేకపోవడంతో మేమే అన్నీ చేసుకున్నాం. కోలుకున్నాక ఆయన రెండు చేతులూ జోడించి ప్రాణభిక్ష పెట్టారని కృతజ్ఞతలు తెలియచేశారు. కరోనా సమయంలో ఎన్నో ప్రాణాలను కాపాడింది ఈ వ్యవస్థే. –దరికా మురళీ, వలంటీరు, మైలవరం నియోజకవర్గం