Auto meters
-
Hyderabad: క్యాబ్‌లు, ఆటోల్లో అడ్డగోలు వసూళ్లు.. ప్రేక్షకపాత్రలో రవాణాశాఖ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి జూబ్లీబస్‌స్టేషన్‌కు మధ్య దూరం కేవలం రెండున్నర కిలోమీటర్లు. ఆర్టీసీ చార్జీ రూ.10 ఉంటుంది. కానీ కాస్త లగేజీతో ఉన్న ప్రయాణికుడు ఏదో ఒక ఆటో బుక్ చేసుకోవాలనుకొని ఆశిస్తే కనీసం రూ.100 సమర్పించుకోవలసిందే. రాత్రి ఎనిమిది దాటినా, తెల్లవారు జామున ఐదైనా ఈ చార్జీ కాస్తా రూ.150 కూడా దాటొచ్చు. ► ఉప్పల్ బస్టాండ్ నుంచి మెట్రో స్టేషన్ వరకు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆటోలో వెళ్లాంటే రూ.80 పైనే వసూలు చేస్తారు. ► ఖైరతాబాద్, ఎర్రమంజిల్, పజగుట్ట, తదితర మెట్రో స్టేషన్ల నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఎక్కడికెళ్లినా సరే రూ.100 పైన సమర్పించుకోవలసిందే. ► ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో, మెట్రో రైళ్లలో చెల్లించే చార్జీలకు ఇది రెట్టింపు. బర్కత్‌పురా నుంచి సికింద్రాబాద్ వరకు నేరుగా ఆటోలో వెళితే రూ.350 నుంచి రూ.400 వరకు చెల్లించాల్సిందే. మీటర్లు లేని ఆటోల్లో మాత్రమే కాదు. ఓలా, ఉబెర్, రాపిడో వంటి క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలకు అనుసంధానంగా ఉన్న ఆటో రిక్షాల్లోనూ చార్జీల మోత మోగుతోంది. ఎలాంటి నియంత్రణ లేకుండా అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. అగ్రిగేటర్ సంస్థలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఆటో రిక్షాలపైన రవాణాశాఖ నియంత్రణ కొరవడింది. దీంతో అన్ని రకాల ఆటోలు ప్రయాణికులపై నిలువుదోపిడీ కొనసాగిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితు ల్లో ఆటోలో వెళ్లే వారి జేబులను లూఠీ చేస్తున్నారు. క్యాబ్ ఆటోల్లోనూ అంతే... మీటర్లు లేని ఆటోల్లో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వసూళ్లకు దిగితే అగ్రిగేటర్ సంస్థలకు చెందిన ఆటోలు బుకింగ్ సమయంలోనే హడలెత్తిస్తున్నాయి. కొద్దిపాటి దూరానికే రూ.వందల్లో చార్జీలు విధిస్తున్నాయి. ఈ సంస్థల చార్జీలకు ఎలాంటి ప్రామాణికత లేకపోవడం గమనార్హం. సాధారణంగా ఆటోలు, క్యాబ్‌లలో మోటారు వాహన చట్టం ప్రకారం మీటర్ రీడింగ్ ద్వారా చార్జీలను నిర్ధారించవలసిన రవాణాశాఖ చాలా ఏళ్ల క్రితమే చేతులెత్తేసింది. కర్ణాటక తరహా ఆంక్షలేవీ... అగ్రిగేటర్ సంస్థల ఆటోలపైన తాజాగా కర్ణాటక రవాణాశాఖ ఆంక్షలు విధించింది. రెండు కిలోమీటర్ల దూరానికే రూ.వందకు పైగా వసూలు చేస్తున్న ఓలా,ఉబెర్, రాపిడో ఆటోలను మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అదే తరహాలో హైదరాబాద్‌లోనూ ఆంక్షలు విధించి అడ్డగోలు చార్జీలను అరికట్టాలని యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ప్రధాన కార్యదర్శి బీటీ శ్రీనివాసన్ డిమాండ్ చేశారు. ఏళ్లు గడిచినా పత్తాలేని మీటర్లు గ్రేటర్ హైదరాబాద్‌లో ఆటోరిక్షాలకు 2012లో మీటర్లను బిగించారు. మొదటి 1.6 కిలోమీటర్లకు రూ.20 , ఆ తరువాత ప్రతి కిలోమీటర్‌కు రూ.11 చొప్పున రవాణాశాఖ చార్జీలను నిర్ణయించింది. ఆటోడ్రైవర్లు కచ్చితంగా ఈ నిబంధన పాటించాలి. నిబంధనలకు విరుద్ధంగా చార్జీలు వసూలు చేసే ఆటోలపైన ఆర్టీఏ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు అవకాశం ఉంది. కానీ మీటర్లు బిగించిన మొదటి ఏడాది కాలంలోనే డ్రైవర్లు ఈ నిబంధనలను తుంగలో తొక్కారు. మీటర్లకు సీళ్లు వేయడంలో తూనికలు కొలతల శాఖ విఫలమైంది. మీటర్ రీడింగ్ లేకుండా ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేసే ఆటోరిక్షాలపైన ఆర్టీఏ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆటోడ్రైవర్లు మీటర్ రీడింగ్‌ను పూర్తిగా గాలికి వదిలేసి అడ్డగోలు వసూళ్లకు దిగారు.మీటర్ రీడింగ్‌పైన చార్జీలు చెల్లించాలనుకొంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే నగరంలో ఏ ఒక్క ఆటోకు కూడా ఇప్పుడు మీటర్లు పని చేయడం లేదు. ‘మీటర్ వేయాలని అడిగితే దౌర్జన్యానికి దిగినంత పని చేస్తారు. వాళ్లు అడిగినంత ఇచ్చి రావడమే మంచిది.’ అని సీతాఫల్‌మండికి చెందిన కిరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. (క్లిక్: వనపర్తి–మంత్రాలయం మధ్య నేషనల్ హైవే!) -
ఆటో...ఎటో...
నత్తనడకన మీటర్ల సవరణ.. కొత్త చార్జీలకు అనుగుణంగా రెడీ కాని మీటర్లు ఆర్టీఏ పట్టించుకోదు.. తూ.కొ. శాఖ దృష్టిపెట్టదు ఇష్టారాజ్యంగా ఆటోడ్రైవర్లు చార్జీల వసూలు ప్రయాణికుల జేబులకు చిల్లు 10 వేల ఆటోలకైనా పూర్తి కాని సవరణ ఆనంద్ ఉదయమే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలు దిగి బయటకొచ్చాడు. నేరుగా ఆటో వద్దకు వెళ్లి ‘‘పంజగుట్ట వెళ్లాలి’’ అన్నాడు. డ్రైవర్- ‘‘రూ.250 అవుతుంది’’ అన్నాడు. ‘‘మీటర్ ఉంది కదా?’’ అని ఆనంద్ ప్రశ్నించాడు. ‘‘కొత్త మీటర్ ఇంకా రాలేదు.. అదైనా అంతే అవుతుంద’’ని డ్రైవర్ బదులిచ్చాడు. ఒకపక్క సమయం గడిచిపోతోంది.. డ్యూటీకి వెళ్లాలి.. ఆ సమయంలో అందుబాటులో మరే ఇతర రవాణా సాధనాలు లేవు. చేసేది లేక ఆనంద్ ఆటో ఎక్కాడు. చాలామంది నిత్యం నగరంలో ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సాక్షి, సిటీబ్యూరో: చార్జీలు పెంచిన మూడు నెలల్లోపు ముగియవలసిన ఆటోమీటర్ల సవరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటికీ పట్టుమని 10 వేల ఆటోలకూ మీటర్లను అధికారులు సవరించలేకపోయారు. దాంతో గడువు ముగిసినప్పటికీ గ్రేటర్ నగరంలో ఇంకా లక్షా 10 వేల ఆటోలు మీటర్ల సవరణ లేకుండా, యథేచ్ఛగా తిరుగుతూ ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఆటో సంఘాల డిమాండ్‌తో ప్రభుత్వం ఫిబ్రవరిలో మీటర్ చార్జీలను పెంచింది. వీటికి అనుగుణంగా ఏప్రిల్ వరకు 3 నెలల్లో మీటర్లను సవరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీఏ, తూనికలు కొలతలు శాఖ అధికారులను ఆదేశించింది. కానీ ఈ రెండు విభాగాల మధ్య సమన్వయ లోపం ప్రయాణికులకు శాపంగా మారింది. నాలుగు నెలలైనా ఇంకా మీటర్లను సవరించకపోవడంతో ఆటోడ్రైవర్లు ప్రయాణికుల నుంచి ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. కొందరు డ్రైవర్లు పాత మీటర్ రీడింగ్‌పైన అదనపు చార్జీ తీసుకుంటుండగా పలువురు మీటర్ రీడింగ్‌తో నిమిత్తం లేకుండా ఇష్టానుసారం బేరానికి దిగుతూ రేట్లు నిర్ణయిస్తున్నారు. బాధ్యత ఎవరిది? నగరంలో లక్షా 20 వేల ఆటోలు తిరుగుతున్నాయి. చార్జీలు పెంచిన ప్రతిసారీ ఈ ఆటోల మీటర్లను కొత్త చార్జీలకు అనుగుణంగా సవరించి సీళ్లు వేయాల్సిన బాధ్యత తూనికలు-కొలతలు శాఖపై ఉంటుంది. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పన, ప్రతి డ్రైవర్ తన ఆటో మీటర్‌ను సవరించుకొనేలా చర్యలు తీసుకోవడం రవాణాశాఖ బాధ్యత. పాత మీటర్లను కొత్త చార్జీలకు అనుగుణంగా సవరించేందుకు తూనికలు-కొలతలు శాఖ నగరంలోని 20 మంది మెకానిక్‌లకు లై సెన్స్లనిచ్చింది. వీరి వద్ద మాత్రమే ఆటోడ్రైవర్లు మీటర్లను సవరించుకోవాలి. సవరించిన మీటర్లకు తూనికలు-కొలతల శాఖ అధికారులు సీళ్లు వేయాలి. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడా సమన్వయం కుదరట్లేదు. గడువు ముగిసినా మీటర్ల సవరణ లేకుండా తిరుగుతున్న ఆటోలపై రవాణాశాఖ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. నగరంలోని అత్తాపూర్, సింగరేణి కాలనీ, నాగోల్ , తిరుమలగిరిలలో మీటర్ సీళ్లు వేసేందుకు తూనికలు కొలతలు శాఖ ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ప్రస్తుతం అత్తాపూర్, సింగరేణి కాలనీలోని కేంద్రాలే పని చేస్తున్నాయి. ఆటోడ్రైవర్లు రాకపోవడం వల్ల రెండు కేం ద్రాలను ఎత్తివేసినట్లు అధికారులు చెబుతున్నారు. సవరణ భారం ఎక్కువే... మీటర్ల సవరణకు మెకానిక్‌లు ఇష్టారాజ్యం డబ్బులు తీసుకుంటున్నారని ఆటోసంఘాలు ఆరోపిస్తున్నాయి. అందువల్లే ఆటోడ్రైవర్లు ముందుకు రావట్లేదని అంటున్నాయి. గతంలో రూ.250కే మీటర్లను సవరించిన మెకానిక్‌లు ఇప్పుడు రూ.350 నుంచి రూ.450 వరకు పెంచేశారని ఇది ఆటోడ్రైవర్లకు భారంగా ఉందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. మొత్తానికి సవరణ ప్రక్రియ రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కి అన్నట్టు మారింది. ఫలితంగా సగటు ప్రయాణికుడు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ప్రక్రియ తీరుతెన్నులు.. ప్రభుత్వం ఫిబ్రవరి 14న ఆటో చార్జీలను పెంచింది 1.6 కిలోమీటర్ల దూరానికి ఉన్న కనీస చార్జీ రూ.16 నుంచి రూ.20కి పెరిగింది ఆపై ప్రతి కిలోమీటర్‌కు చార్జీని రూ.9 నుంచి రూ.11కు పెంచారు పెరిగిన చార్జీలకనుగుణంగా ఆటోలు 3 నెలల్లోపు మీటర్లను సవరించుకోవాలి ఇప్పటికి 4 నెలలైంది. 10 వేల ఆటోలకు కూడా మీటర్లు సవరించలేదు -
ఆటోవాలా దోపిడీకి కళ్లెం
సాక్షి, చెన్నై : ప్రధాన నగరాల్లో సాగుతున్న ఆటో చార్జీల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో చెన్నైలో రాష్ట్ర ప్రభుత్వం ఆటో చార్జీలను తప్పనిసరి చేసింది. కనీస చార్జీగా 1.5 కిలోమీటర్ దూరానికి రూ.25, ఆ తర్వాత కిలో మీటరుకు రూ. 12 వసూలు చేయాలంటూ నిబంధనలను ప్రకటించింది. రాత్రుల్లో 50 శాతం అదనపు చార్జీ వసూలు చేసుకునే వీలు కల్పించారు. ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత గత ఏడాది ఆగస్టు 25న రాష్ట్ర రాజధాని నగరంలో కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయి. అయితే, దీన్ని అమలు చేయించేందుకు ప్రభుత్వం కుస్తీలు పడుతోంది. అధికారులు కొరడా ఝుళిపిస్తున్నా, చార్జీల అమల్లో ఆటో డ్రైవర్లు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. వీరి తీరుపై హైకోర్టు సైతం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఆటో డ్రైవర్ల భరతం పట్టే విధంగా సిగ్నల్స్‌లో ప్రయాణికుల హెల్ప్ లైన్లను నంబర్లను సూచిస్తూ ఏర్పాట్లు చేశారు. దీని ఆధారంగా ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం ఆటో డ్రైవర్ల భరతం పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో ఆటో డ్రైవర్లకు పండుగలా మారింది. మళ్లీ దోపిడీ: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో అధికారులందరూ ఆ పనుల్లో బిజీ అయ్యారు. దీంతో ఆటో డ్రైవర్లు మీటర్లను పక్కన పడేశారు. తాము నిర్ణయించిన చార్జీలను ఇవ్వాల్సిందేనని ప్రయాణికుల మీద ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. మీటర్లు వేయడం లేదు బాబోయ్ అంటూ ప్రయూణికులు ఫిర్యాదులు చేసినా, పట్టించుకున్న అధికారులు ఏ ఒక్కరూ లేదు. ఇందుకు కారణం అందరు అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది ఎన్నికల పనుల మీద దృష్టి కేంద్రీ కరించడమే. రెండు నెలలుగా మీటర్లను పక్కన పెట్టి చార్జీల దోపిడీకి పాల్పడుతూ వచ్చిన ఆటోవాలాలపై మళ్లీ కన్నెర్ర చేయడానికి ప్రభుత్వం సిద్ధం అయింది. తనిఖీలు ముమ్మరం: ఎన్నికల కోడ్ సడలించడంతో అధికారులు విధులబాట పట్టారు. ఆటో వాలాలపై ఫిర్యాదులు కొకొల్లలుగా వచ్చి పడడంతో, వాటిపై దృష్టి కేంద్రీకరించే పనిలో ఆర్టీఏ, ట్రాఫిక్ అధికారులు సిద్ధం అయ్యారు. శనివారం ఉదయాన్నే ఆటోవాలాల భరతం పడుతూ అధికారులు రోడ్డెక్కారు. పలు మార్గాల్లో మాటేసిన అధికారులు అటు వైపుగా వెళ్తున్న ఆటోలను నిలిపి, ప్రయాణికుల వద్ద వాకబు చేశారు. కొన్ని ఆటోలు నామమాత్రంగా చార్జీలు పెంచినట్టు తేలడంతో వాటికి జరిమానాల మోత మోగించారు. పదిహేను చోట్ల ఉదయం నుంచి తనిఖీలు చేయగా, సాయంత్రం నుంచి జన సంచారం అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో, మాల్స్, థియేటర్ల పరిసరాల్లో అధికారులు తిష్ట వేశారు. ఆటోలకు మీటర్లు వేస్తున్నారా? అని మఫ్టీలో పరి శీలించే పనిలో నిమగ్నం అయ్యారు. ఉదయం నుంచి జరిపిన తనిఖీల్లో అత్యధికంగా చార్జీలను వసూళ్లు చేసిన 46 ఆటోలను అధికారులు సీజ్ చేశారు. ఈ తనిఖీలు కొనసాగుతాయని, ఇక మీటర్లు వేయకుంటే, సీజ్ చేసి తీరుతామంటూ ఆటో వాలాలకు హెచ్చరికలు ఇచ్చారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ సిబ్బంది ఆటో చార్జీలతో కూడిన కరపత్రాలను ప్రయాణికులకు పంపిణీ చేశారు. ఒకే సారి పదిహేను చోట్ల ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగిన సమాచారంతో కొందరు ఆటో డ్రైవర్లు ఆగమేఘాల మీద తమ ఆటోలకు మీటర్లు బిగించడం గమనార్హం.