ఆటో...ఎటో...
- నత్తనడకన మీటర్ల సవరణ..
- కొత్త చార్జీలకు అనుగుణంగా రెడీ కాని మీటర్లు
- ఆర్టీఏ పట్టించుకోదు.. తూ.కొ. శాఖ దృష్టిపెట్టదు
- ఇష్టారాజ్యంగా ఆటోడ్రైవర్లు చార్జీల వసూలు
- ప్రయాణికుల జేబులకు చిల్లు
- 10 వేల ఆటోలకైనా పూర్తి కాని సవరణ
ఆనంద్ ఉదయమే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు దిగి బయటకొచ్చాడు.
నేరుగా ఆటో వద్దకు వెళ్లి ‘‘పంజగుట్ట వెళ్లాలి’’ అన్నాడు.
డ్రైవర్- ‘‘రూ.250 అవుతుంది’’ అన్నాడు.
‘‘మీటర్ ఉంది కదా?’’ అని ఆనంద్ ప్రశ్నించాడు.
‘‘కొత్త మీటర్ ఇంకా రాలేదు.. అదైనా అంతే అవుతుంద’’ని డ్రైవర్ బదులిచ్చాడు.
ఒకపక్క సమయం గడిచిపోతోంది.. డ్యూటీకి వెళ్లాలి.. ఆ సమయంలో అందుబాటులో మరే ఇతర రవాణా సాధనాలు లేవు. చేసేది లేక ఆనంద్ ఆటో ఎక్కాడు. చాలామంది నిత్యం నగరంలో ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: చార్జీలు పెంచిన మూడు నెలల్లోపు ముగియవలసిన ఆటోమీటర్ల సవరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటికీ పట్టుమని 10 వేల ఆటోలకూ మీటర్లను అధికారులు సవరించలేకపోయారు. దాంతో గడువు ముగిసినప్పటికీ గ్రేటర్ నగరంలో ఇంకా లక్షా 10 వేల ఆటోలు మీటర్ల సవరణ లేకుండా, యథేచ్ఛగా తిరుగుతూ ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నాయి.
ఆటో సంఘాల డిమాండ్‌తో ప్రభుత్వం ఫిబ్రవరిలో మీటర్ చార్జీలను పెంచింది. వీటికి అనుగుణంగా ఏప్రిల్ వరకు 3 నెలల్లో మీటర్లను సవరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీఏ, తూనికలు కొలతలు శాఖ అధికారులను ఆదేశించింది. కానీ ఈ రెండు విభాగాల మధ్య సమన్వయ లోపం ప్రయాణికులకు శాపంగా మారింది.
నాలుగు నెలలైనా ఇంకా మీటర్లను సవరించకపోవడంతో ఆటోడ్రైవర్లు ప్రయాణికుల నుంచి ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. కొందరు డ్రైవర్లు పాత మీటర్ రీడింగ్‌పైన అదనపు చార్జీ తీసుకుంటుండగా పలువురు మీటర్ రీడింగ్‌తో నిమిత్తం లేకుండా ఇష్టానుసారం బేరానికి దిగుతూ రేట్లు నిర్ణయిస్తున్నారు.
బాధ్యత ఎవరిది?
నగరంలో లక్షా 20 వేల ఆటోలు తిరుగుతున్నాయి. చార్జీలు పెంచిన ప్రతిసారీ ఈ ఆటోల మీటర్లను కొత్త చార్జీలకు అనుగుణంగా సవరించి సీళ్లు వేయాల్సిన బాధ్యత తూనికలు-కొలతలు శాఖపై ఉంటుంది. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పన, ప్రతి డ్రైవర్ తన ఆటో మీటర్‌ను సవరించుకొనేలా చర్యలు తీసుకోవడం రవాణాశాఖ బాధ్యత.
పాత మీటర్లను కొత్త చార్జీలకు అనుగుణంగా సవరించేందుకు తూనికలు-కొలతలు శాఖ నగరంలోని 20 మంది మెకానిక్‌లకు లై సెన్స్‌లనిచ్చింది. వీరి వద్ద మాత్రమే ఆటోడ్రైవర్లు మీటర్లను సవరించుకోవాలి. సవరించిన మీటర్లకు తూనికలు-కొలతల శాఖ అధికారులు సీళ్లు వేయాలి. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడా సమన్వయం కుదరట్లేదు.
గడువు ముగిసినా మీటర్ల సవరణ లేకుండా తిరుగుతున్న ఆటోలపై రవాణాశాఖ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. నగరంలోని అత్తాపూర్, సింగరేణి కాలనీ, నాగోల్ , తిరుమలగిరిలలో మీటర్ సీళ్లు వేసేందుకు తూనికలు కొలతలు శాఖ ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ప్రస్తుతం అత్తాపూర్, సింగరేణి కాలనీలోని కేంద్రాలే పని చేస్తున్నాయి. ఆటోడ్రైవర్లు రాకపోవడం వల్ల రెండు కేం ద్రాలను ఎత్తివేసినట్లు అధికారులు చెబుతున్నారు.
సవరణ భారం ఎక్కువే...
మీటర్ల సవరణకు మెకానిక్‌లు ఇష్టారాజ్యం డబ్బులు తీసుకుంటున్నారని ఆటోసంఘాలు ఆరోపిస్తున్నాయి.
అందువల్లే ఆటోడ్రైవర్లు ముందుకు రావట్లేదని అంటున్నాయి. గతంలో రూ.250కే మీటర్లను సవరించిన మెకానిక్‌లు ఇప్పుడు రూ.350 నుంచి రూ.450 వరకు పెంచేశారని ఇది ఆటోడ్రైవర్లకు భారంగా ఉందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. మొత్తానికి సవరణ ప్రక్రియ రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కి అన్నట్టు మారింది. ఫలితంగా సగటు ప్రయాణికుడు మూల్యం చెల్లించాల్సి వస్తోంది.
ప్రక్రియ తీరుతెన్నులు..
ప్రభుత్వం ఫిబ్రవరి 14న ఆటో చార్జీలను పెంచింది
1.6 కిలోమీటర్ల దూరానికి ఉన్న కనీస చార్జీ రూ.16 నుంచి రూ.20కి పెరిగింది
ఆపై ప్రతి కిలోమీటర్‌కు చార్జీని రూ.9 నుంచి రూ.11కు పెంచారు
పెరిగిన చార్జీలకనుగుణంగా ఆటోలు 3 నెలల్లోపు మీటర్లను సవరించుకోవాలి
ఇప్పటికి 4 నెలలైంది. 10 వేల ఆటోలకు కూడా మీటర్లు సవరించలేదు