సాక్షి, చెన్నై : ప్రధాన నగరాల్లో సాగుతున్న ఆటో చార్జీల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో చెన్నైలో రాష్ట్ర ప్రభుత్వం ఆటో చార్జీలను తప్పనిసరి చేసింది. కనీస చార్జీగా 1.5 కిలోమీటర్ దూరానికి రూ.25, ఆ తర్వాత కిలో మీటరుకు రూ. 12 వసూలు చేయాలంటూ నిబంధనలను ప్రకటించింది. రాత్రుల్లో 50 శాతం అదనపు చార్జీ వసూలు చేసుకునే వీలు కల్పించారు. ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత గత ఏడాది ఆగస్టు 25న రాష్ట్ర రాజధాని నగరంలో కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయి. అయితే, దీన్ని అమలు చేయించేందుకు ప్రభుత్వం కుస్తీలు పడుతోంది. అధికారులు కొరడా ఝుళిపిస్తున్నా, చార్జీల అమల్లో ఆటో డ్రైవర్లు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. వీరి తీరుపై హైకోర్టు సైతం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఆటో డ్రైవర్ల భరతం పట్టే విధంగా సిగ్నల్స్‌లో ప్రయాణికుల హెల్ప్ లైన్లను నంబర్లను సూచిస్తూ ఏర్పాట్లు చేశారు. దీని ఆధారంగా ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం ఆటో డ్రైవర్ల భరతం పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో ఆటో డ్రైవర్లకు పండుగలా మారింది.
మళ్లీ దోపిడీ: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో అధికారులందరూ ఆ పనుల్లో బిజీ అయ్యారు. దీంతో ఆటో డ్రైవర్లు మీటర్లను పక్కన పడేశారు. తాము నిర్ణయించిన చార్జీలను ఇవ్వాల్సిందేనని ప్రయాణికుల మీద ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. మీటర్లు వేయడం లేదు బాబోయ్ అంటూ ప్రయూణికులు ఫిర్యాదులు చేసినా, పట్టించుకున్న అధికారులు ఏ ఒక్కరూ లేదు. ఇందుకు కారణం అందరు అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది ఎన్నికల పనుల మీద దృష్టి కేంద్రీ కరించడమే. రెండు నెలలుగా మీటర్లను పక్కన పెట్టి చార్జీల దోపిడీకి పాల్పడుతూ వచ్చిన ఆటోవాలాలపై మళ్లీ కన్నెర్ర చేయడానికి ప్రభుత్వం సిద్ధం అయింది.
తనిఖీలు ముమ్మరం: ఎన్నికల కోడ్ సడలించడంతో అధికారులు విధులబాట పట్టారు. ఆటో వాలాలపై ఫిర్యాదులు కొకొల్లలుగా వచ్చి పడడంతో, వాటిపై దృష్టి కేంద్రీకరించే పనిలో ఆర్టీఏ, ట్రాఫిక్ అధికారులు సిద్ధం అయ్యారు.
శనివారం ఉదయాన్నే ఆటోవాలాల భరతం పడుతూ అధికారులు రోడ్డెక్కారు. పలు మార్గాల్లో మాటేసిన అధికారులు అటు వైపుగా వెళ్తున్న ఆటోలను నిలిపి, ప్రయాణికుల వద్ద వాకబు చేశారు. కొన్ని ఆటోలు నామమాత్రంగా చార్జీలు పెంచినట్టు తేలడంతో వాటికి జరిమానాల మోత మోగించారు. పదిహేను చోట్ల ఉదయం నుంచి తనిఖీలు చేయగా, సాయంత్రం నుంచి జన సంచారం అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో, మాల్స్, థియేటర్ల పరిసరాల్లో అధికారులు తిష్ట వేశారు. ఆటోలకు మీటర్లు వేస్తున్నారా? అని మఫ్టీలో పరి శీలించే పనిలో నిమగ్నం అయ్యారు. ఉదయం నుంచి జరిపిన తనిఖీల్లో అత్యధికంగా చార్జీలను వసూళ్లు చేసిన 46 ఆటోలను అధికారులు సీజ్ చేశారు. ఈ తనిఖీలు కొనసాగుతాయని, ఇక మీటర్లు వేయకుంటే, సీజ్ చేసి తీరుతామంటూ ఆటో వాలాలకు హెచ్చరికలు ఇచ్చారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ సిబ్బంది ఆటో చార్జీలతో కూడిన కరపత్రాలను ప్రయాణికులకు పంపిణీ చేశారు. ఒకే సారి పదిహేను చోట్ల ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగిన సమాచారంతో కొందరు ఆటో డ్రైవర్లు ఆగమేఘాల మీద తమ ఆటోలకు మీటర్లు బిగించడం గమనార్హం.
ఆటోవాలా దోపిడీకి కళ్లెం
Published Sun, May 25 2014 12:41 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement