auto rickshaw driver
-
ఒంటరి అమ్మ బతుకు పోరు
27 ఏళ్ల చంచల్ శర్మ ఝాన్సీ లక్ష్మీబాయిని గుర్తుకు తెస్తోంది. ఝాన్సీ తన బిడ్డను కట్టుకుని శత్రువుతో యుద్ధం చేస్తే చంచల్ తన బిడ్డను కట్టుకుని బతుకుపోరు చేస్తోంది. గర్భంతో ఉండగా భర్త నుంచి విడిపోయిన చంచల్ బిడ్డ పుట్టాక ఏడుస్తూ కూచోలేదు. బతకాలని బిడ్డను బతికించుకోవాలని సంకల్పించింది. ఆమె కథ ఇప్పడు నెట్లో వైరల్‌గా మారింది. ఢిల్లీ– నోయిడాలో చంచల్ శర్మ నడిపే ఈ ఆటో రిక్షా అందరికీ తెలుసు. దాని డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉండే ఆమెను అందరూ మెచ్చుకోలుగా చూస్తూ ఉంటారు. ఆశ్చర్యంగా చూస్తు ఉంటారు. గౌరవంగా చూస్తూ ఉంటారు. దాని కారణం ‘కంగారు’లాగా ఆమె కూడా తన ఒక సంవత్సరం కొడుకును పొట్టకు దగ్గరగా కట్టుకుని డ్రైవింగ్ చేస్తూ ఉండటమే. పల్లెల్లో బిడ్డను నడుముకు కట్టుకుని కూలి పనులు చేసే తల్లులు మనకు కొత్త కాదు. కాని ఒక ఆటో రిక్షా నడుపుతూ ఇలా నగరంలో ఒక ఒంటరి తల్లి తన బతుకు కోసం సంఘర్షించడం మాత్రం కొత్త. ఇటీవల ఈమె గురించి మీడియాలో వస్తే సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడారు. మెచ్చుకున్నారు. ఎందుకు? జీవితం సవాలు విసిరినప్పుడు చేతనైన జవాబు చెప్పాలని చంచల్ అనుకోవడమే. భర్త నుంచి విడిపోయి... 27 ఏళ్ల చంచల్ శర్మ పెళ్లయ్యి గర్భం వచ్చాక భర్త నుంచి విడిపోవాల్సి వచ్చింది. ఆమెకు తల్లి తప్ప ఎవరూ లేరు. బతుకు తెరువు లేదు. బిడ్డకు జన్మనిచ్చాక ఒకవైపు భర్త తోడు లేకపోవడం, మరోవైపు బిడ్డ బాధ్యత ఆమెను సతమతం చేశాయి. జీవితంలో ఓడిపోవడమా? పోరాడి నిలవడమా? రెండో మార్గమే ఎంచుకుంది. కొడుకు నెలల బిడ్డగా ఉండగా తల్లి దగ్గరే వదిలి ఈ ఆటో రిక్షా నడపడం మొదలెట్టింది. కాని ఇప్పుడు వాడికి సంవత్సరం నిండింది. తల్లి కోసం బెంగటిల్లుతుంటాడు. అదీగాక తల్లి ఆ పిల్లాణ్ణి చూసుకోలేకపోతోంది. క్రష్‌లో వేద్దామంటే అందుకు కట్టాల్సినంత డబ్బు తన వద్ద లేదు. పైగా క్రష్‌లు కూడా బాగా చార్జ్ చేస్తున్నాయి ఢిల్లీలో. అందుకే తనతోపాటే కొడుకును నడుముకు కట్టుకుని డ్యూటీ చేయాలని నిశ్చయించుకుంది చంచల్ శర్మ. 600 సంపాదన... ఉదయం ఆరున్నరకు కొడుకుతో పాటు డ్యూటీ ఎక్కుతుంది చంచల్ శర్మ. మధ్యాహ్నం వరకూ ఆటో నడిపి ఇల్లు చేరుతుంది. కొడుక్కు స్నానం చేయించి, తినిపించుకుని, కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ డ్యూటీ ఎక్కుతుంది కొడుకుతో. రాత్రి ఎనిమిది వరకూ పని చేస్తుంది. మధ్యలో కొడుకు ఆకలికి ఒక పాల సీసా పెట్టుకుంటుంది. ఇంత శ్రమ చేస్తే ఆమెకు రోజుకు 600 మిగులుతున్నాయి. ఒక్కోసారి కొడుకు పొట్ట మీద నిద్రపోతాడు. ఒక్కోసారి మేలుకుని హుషారుగా ఉంటాడు. ఒక్కోసారి మాత్రం ఏడుస్తూనే ఉంటాడు. కాని పాసింజర్లు విసుక్కోరు. ఆమెను సానుభూతితో అర్థం చేసుకుంటారు. మహిళా పాసింజర్లయితే ఈమె ఆటోనే వెతికి ఎక్కుతారు.. సాయం చేసినట్టు ఉంటుందని. ఎండాకాలం వస్తే మాత్రం బిడ్డను తీసుకుని తిరగడం కష్టం అంటుంది చంచల్. ఆ టైమ్‌లో తల్లి మీద ఆధారపడాల్సి వస్తుంది అంటుంది. ‘నా బిడ్డ కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటుంది చంచల్ శర్మ. ఒంటరి స్త్రీ... సింగిల్ మదర్‌గా జీవించడంలో బెంబేలెత్తాల్సిన పని లేదు. సమాజంలో ఇప్పుడు సింగిల్ మదర్‌కు అండ దొరుకుతుంది. వారు కష్టపడి పని చేయాలనుకుంటే సాయం చేసే వారూ ఉన్నారు. కావలసిందల్లా ఎదురొడ్డే తెగువే. చంచల్ శర్మను చూసి చాలా మంది స్ఫూర్తి పొందుతున్నారు. -
అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆటోలతో స్టంట్స్ .. వీడియో వైరల్
Auto Rickshaw Drivers Dangerous Stunts On Road: అర్ధరాత్రి నడిరోడ్డుపై అత్యంత ప్రమాదకరంగా ఆటోలతో విన్యాసాలు(స్టంట్స్) చేస్తూ.. పెద్దపెద్దగా కేకలు వేస్తూ తోటి వాహనదారులను భయాందోళనకు గురిచేస్తూ.. తోటి వాహనాలు, లారీని ఓవర్ టేక్ చేస్తూ.. భయంకరంగా వ్యవహరించిన ఆరుగురు యువకులను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ వివరాల ప్రకారం.. టోలిచౌకి ప్రాంతానికి చెందిన సయ్యద్ జుబేర్ అలీ(20), సయ్యద్ సాహిల్(21), మహ్మద్ ఇబ్రహీం(22), మహ్మద్ ఇనాయత్(23), గులాం సైఫ్‌ద్దీన్(23), మహ్మద్ సమీర్(19), అమీర్ ఖాన్(20) అద్దెకు ఆటోలను నడుపుతుంటారు. గురువారం అర్ధరాత్రి మూడు ఆటోలతో చాంద్రాయణగుట్ట ప్రాంతానికి వచ్చారు. చాంద్రాయణగుట్ట నుంచి రాత్రి 12.30 గంటలకు బాబానగర్ మీదుగా డీఆర్డీఎల్ సిగ్నల్ వద్ద యూటర్న్ తీసుకొని తిరిగి బాబానగర్ వైపు పయనమయ్యారు. మూడు ఆటోలను ఒళ్లు గగుర్పొడిచే రీతిలో రెండు టైర్లపై క్రాస్‌గా నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురిచేశారు. ట్రాఫిక్‌కు కూడా అంతరాయం కలిగించారు. రోడ్లపై వీరు చేసిన స్టంట్స్‌ను కొందరు ప్రయాణికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఆటోతో పాటు డ్రైవర్ మహ్మద్ ఇబ్రహీం పరారీలో ఉన్నాడు. ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్, చాంద్రాయణగుట్ట అదనపు ఇన్స్పెక్టర్ ఎ.మధుసూదన్‌రెడ్డి, ఎస్సైలు గౌస్‌ఖాన్, గోవర్ధన్‌రెడ్డి ఉన్నారు. Action required @HYDTP !#Santoshnagar#Chandrayangutta !! pic.twitter.com/oruw79VacZ — Dr Chaitanya Singh (@MidnightReportr) February 25, 2022 -
గ్రేట్ జర్నీ స్టీరింగ్ ఉమన్
ఆమె ఆటో రిక్షా నడుపుతుంటే ఆ పట్టణంలోని పిల్లలు ఆసక్తిగా చూస్తారు. ముఖ్యంగా ఆడపిల్లలు... ఇలా కూడా ఉంటుందా? అన్నంత విచిత్రంగా చూస్తారు. నిజమే... వాహనం స్టీరింగ్ ఆడవాళ్ల చేతిలో ఉండడం అంటే వాళ్లకు ప్రపంచంలో ఎనిమిదో వింతను చూడడమే. నడివయసు మగవాళ్లైతే ఆ దృశ్యాన్ని కళ్లెర్రచేసి చూస్తారు. ఆమె తల్లిదండ్రులను, భర్తను తలుచుకుని ఆడపిల్లను ఎలా పెంచాలో, స్త్రీ పట్ల ఎంతటి కట్టుబాట్లు పాటించాలో తెలియని మూర్ఖులు అన్నట్లు ఓ చూపు చూసి, తమ ఇంటి ఆడవాళ్లను గూంగట్ చాటున దాచిన తమ ఘనతను తలుచుకుని మీసం మీద చెయ్యేసుకుంటారిప్పటికీ. ఈ సంప్రదాయ సంకెళ్లను ఛేదించింది నలభై ఏళ్ల మాయా రాథోడ్. ఒక్క సంప్రదాయ సంకెళ్లను మాత్రమే కాదు, పోలియో బారిన పడిన అమ్మాయి జీవితం అక్కడితో ఆగిపోదని, సంకల్పం, పట్టుదల, శ్రమ, అకుంఠిత దీక్ష ఉంటే బతుకుపథంలో అడుగులు చక్కగా వేయవచ్చని కూడా నిరూపిస్తోంది. మరో ముఖ్యమైన విషయం కూడా ప్రముఖం గా గుర్తించాల్సిందే ఉంది. కాలుష్య రహిత సమాజ స్థాపనలో భాగంగా కాలుష్యాన్ని విడుదల చేసే ఆటోరిక్షాలను ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఆటో రిక్షాలను ప్రవేశ పెట్టినప్పుడు మగవాళ్లు ఎలక్ట్రానిక్ స్టీరింగ్ పట్టుకోవడానికి సాహసించలేదు. అలాంటప్పుడు మాయా రాథోడ్ వేసిన ఓ ముందడుగు ఇప్పుడు రాజస్థాన్‌లోని బిల్వారా పట్టణంలో పలువురికి స్ఫూర్తినిస్తోంది. అక్కడి మహిళలకు మాయా రాథోడ్ ఓ రోల్ మోడల్ అయింది. బహుముఖ పోరాటం మాయా రాథోడ్ ఆరేళ్ల వయసులో పోలియో బారిన పడింది. అసలే ఆడపిల్లలు బతికి బట్టకట్టడం కష్టమైన రాజస్థాన్ రాష్ట్రం. ఆడపిల్లలను బడికి పంపించమని ప్రభుత్వాలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాల్సిన పరిస్థితిలో ఉన్న రాష్ట్రం. అలాంటి చోట మాయా రాథోడ్ బతుకు పోరాటం చేసింది. ఏకకాలం లో పోలియోతోనూ సమాజంతోనూ పోరాడింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఆ జీతంతో బతుకు కుదుట పడడం కుదిరే పని కాదని కూడా త్వరలోనే అర్థమైందామెకు. భర్త సంపాదనకు తన సంపాదన కూడా తోడైతే తప్ప పిల్లల భవిష్యత్తుకు మంచి దారి వేయలేమని కూడా అనుకుంది. అదే సమయంలో ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఆటో రిక్షాలను సబ్సిడీ ధరలో ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఆ క్షణంలో మాయా రాథోడ్ తీసుకున్న నిర్ణయమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. బ్యాంకు లోన్ తీసుకుని ఎలక్ట్రానిక్ ఆటో రిక్షా తీసుకున్నది. ఇది జరిగి మూడేళ్లవుతోంది. ఆ క్షణం నుంచి ఆమెను సంప్రదాయ సమాజం విమర్శన దృక్కులతో వేధించింది. అభివృద్ధి పథం లో నడవాలనుకున్న సమాజం ఆమెను ఆదర్శంగా తీసుకుంది. ఆమె మాత్రం... ‘మహిళలు యుద్ధ విమానాలు నడుపుతున్న రోజులివి. ఆటో రిక్షా నడపడాన్ని కూడా ఆక్షేపించే రోజులు కావివి. ఆటో నడపడం నాకు వచ్చో రాదో అనే సందేహాలు వద్దు. నా ఆటోలో ప్రయాణించి చూడండి’ అని సవాల్ విసురుతోంది. ఈ మూడేళ్లలో బిల్వారాలో మంచి మార్పే వచ్చింది. చిల్లర దొంగతనాలు ఎక్కువగా ఉండే ఆ రాష్ట్రంలో రాత్రిళ్లు మగవాళ్ల ఆటోలో ప్రయాణించడం కంటే మాయ ఆటోలో ప్రయాణించడానికి ఆడవాళ్లతోపాటు మగవాళ్లు కూడా ఇష్టపడుతున్నారు. -
18వేల చలానా.. ఫినాయిల్ తాగి
గాంధీనగర్: కొత్త మోటారు వాహన చట్టం వాహనదారులకు చుక్కలు చూపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త చలానాలకు జడిసి ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనల గురించి కూడా చదువుతూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి గుజరాత్లో చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానా చూసి ఆత్మహత్యాయత్నం చేశాడో ఆటో డ్రైవర్. ఈ సంఘటన అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. రాజు సోలంకి అనే ఆటో డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు ఏకంగా రూ.18 వేల చలానా విధించారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురయిన రాజు.. ఫినాయిల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. దాంతో అతడిని ఆస్పత్రిలో చేర్చారు. రాజు మాట్లాడుతూ.. ‘నేను చాలా పేదవాడిని. అలాంటది ట్రాఫిక్ అధికారులు నాకు ఏకంగా రూ. 18వేలు చలానా విధించారు. ఇంత భారీ మొత్తాన్ని నేను ఎలా చెల్లించాలి. నా ఆటోను కూడా సీజ్ చేశారు. ఇప్పుడు నేను నా కుటుంబాన్ని ఎలా పోషించాలి’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రాజు. -
ఆటో డ్రైవర్‌కు రూ. 47,500 జరిమానా
భువనేశ్వర్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహన సవరణ చట్టం-2019 నిబంధనలు పాటించని వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఈ చట్టం ప్రకారం వాహనదారులకు విధించే జరిమానాలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంతమంది కొత్త చట్టం ప్రకారం విధించిన జరిమానాలు చూసి షాక్ తిన్నారు. ఆర్టీవో అధికారులు తాజాగా ఓ ఆటో డ్రైవర్‌కు రూ. 47,500 జరిమానా విధించారు. ఈ ఘటన ఒడిశా భువనేశ్వర్‌లో బుధవారం చోటుచేసుకుంది. సరైన పత్రాలు లేకపోవడం, తాగి వాహనం నడపడం, లైసెన్స్ సక్రమంగా లేకపోవడంతో అధికారులు అతనికి భారీ మొత్తంలో జరిమానా విధించారు. బుధవారం నగరంలో వాహన తనిఖీలు చేపట్టిన అధికారులు మోటార్ వాహన చట్టం నిబంధనలు అతిక్రమించినందుకు ఆటో డ్రైవర్ హరిబంధు కన్హార్కు రూ. 47,500 జరిమానా విధించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి కొత్త చట్టం ప్రకారం ఈ జరిమానా విధించినట్టు పేర్కొన్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోవడంతోపాటు ఆటోను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనపై హరిబంధు మాట్లాడుతూ, తాను ఇంత మొత్తం జరిమానా చెల్లించే పరిస్థితి లేదని తెలిపారు. కావాలంటే అధికారులు తన వాహనాన్ని సీజ్ చేయాలని, లేకుంటే తనను జైలుకు పంపాలని కోరారు. ఇంటి వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆటో డ్రైవర్‌కు విధించిన జరిమానా వివరాలు సాధారణ జరిమానా - రూ. 500 డ్రైవింగ్ లైసెన్స్ సరిగా లేనందుకు - రూ. 5,000 పర్మిట్ లేకుండా వాహనం నడిపినందుకు - రూ. 10,000 మద్యం సేవించి వాహనం నడిపినందుకు - రూ. 10,000 పొల్యూషన్ సర్టిఫికేట్ లేనందుకు - రూ. 10,000 వాహనం నడిపేందుకు వేరే వ్యక్తిని అనుమతించినందుకు - రూ. 5,000 ఆటో రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ లేనందుకు - రూ. 5,000 ఇన్సూరెన్స్ లేనందుకు - రూ. 2,000 -
అడ్డుకున్న పోలీసును చితకబాదారు..!
పట్నా : ఆటవిక రాజ్యం అని గతంలో పేరుపడ్డ బిహార్‌లో మళ్లీ అలాంటి పరిస్థితులే దాపురించాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అక్కడ రక్షకభటులకే రక్షణ లేకుండా పోయింది. రాంగ్‌సైడ్ డ్రైవింగ్ చేస్తున్న ఆటోవాలాను అడ్డుకున్నందుకు విధుల్లో ఉన్న ఓ పోలీసుపై రౌడీయిజం చేశారు. ఆటోవాలా అతని స్నేహితులు దుర్భాషలాడుతూ సదరు పోలీస్ కానిస్టేబుల్‌పై విచక్షణారహితంగా పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఈ ఘటన ముజఫర్‌పూర్‌లోని అఘోరియా చౌక్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, రౌడీ మూక తాట తీసేందుకు పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి వారిని పట్టుకునేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. -
ఆటోడ్రైవరుకు హెల్మెట్ లేదని జరిమానా
సాక్షి, నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆటో కార్మికులపై ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు వ్యతిరేకంగా సీఐటీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులోని ఏబీఎం కాంపౌండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బోసుబొమ్మ వరకు సాగింది. అనంతరం అక్కడ వారు రోడ్డుపై బైటాయించి ట్రాఫిక్ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర అధ్యక్షుడు అజయ్‌కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ఆర్టీఓ, పోలీసులు ఆటో కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆటోడ్రైవర్‌కు హెల్మెట్ లేదని జరిమానా వేసిన ఘనత నెల్లూరు ట్రాఫిక్ పోలీసులకే దక్కుతుందన్నారు. ధ్రువీకరణ పత్రాలన్నీ ఉన్నా ఓ ఆటోడ్రైవర్‌పై 5 నిమిషాల వ్యవధిలో 6 కేసులు రాయడం ఎంతవరకూ సమంజసమన్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ ఓలా ట్యాక్సీలను నిర్వహిస్తుండడంతో ఆటోలను తిరగనీకుండా కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే అధికారులు 700 రెట్లు చలానా పెంచి రూ.170 కోట్లు రాష్ట్ర ఖజానాకు పంపారన్నారు. కాగా దాదాపు రెండు గంటల సేపు నిరసన చేపట్టడంతో వాహనాలు నిలిచి పోయి ప్రయాణికులు ఇబ్బంది పట్టారు. ఈ క్రమంలో ట్రాఫిక్ సీఐ వేమారెడ్డి ఘటనాస్థలానికి వచ్చి ఆన్లైన్ ద్వారా ఈ–చలానా రావడంతో పొరపాట్లు జరిగాయని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర కార్యదర్శి జి,నాగేశ్వరరావు ఆటోయూనియన్ జిల్లా కార్యదర్శి కె.సురేష్, నాయకులు మూలం ప్రసాద్, సూర్యనారాయణ పాల్గొన్నారు. -
ట్వింకిల్, అక్షయ్... ఓ ఆటో
బాలీవుడ్ : సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య వారధిగా నిలుస్తోంది సోషల్ మీడియా. సినిమా, క్రీడా ప్రముఖలు చాలామంది తమ భావాలను, అనుభూతులను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ నటి, రైటర్ ట్వింకిల్ ఖన్నా ఆదివారం ఉదయం తన దినచర్యకు సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తన భర్త అక్షయ్ కుమార్ ఆటో డ్రైవ్ చేస్తుండగా, ట్వింకిల్ వెనకాల కూర్చోన్న ఫొటోను షేర్ చేశారు. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ‘ఉదయం పూట నాలుగు గంటలకు లేచి, రెండున్నర గంటల పాటు ప్రశాంతంగా పుస్తక రచన చేశాను. ఆ తర్వాత నా డాగ్‌ని తీసుకుని వాకింగ్‌కి వెళ్లాను, ఆ తర్వాత ఇలా నా క్యూట్ డ్రైవర్‌తో, ఆటో రిక్షాలో సరదాగా విహరించాను. ఇవన్నీ తొమ్మిది గంటల్లోపే పూర్తయ్యాయి. తొందరగా నిద్రపోవడం వల్లే ఇది సాధ్యమైంది. మీరు కూడా ట్రై చేయండి’ అని ఈ ఫొటోను ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇది ఒక అక్షయ్‌కి మాత్రమే సాధ్యపడుతుందని ఒకరు, క్యూట్ కపుల్ అని మరొకరు.. కామెంట్లు చేస్తున్నారు. -
ముదినేపల్లిలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం
కృష్ణా జిల్లాలో పద్నాలుగేళ్ల బాలికపై ఆటోరిక్షా డ్రైవర్ మానభంగం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కృష్ణా జిల్లా ముదినేపల్లిలోని చిగురుకోట గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం ఆటోరిక్షాలో బాధితురాలిని మూతపడిన ఓఎన్ జీసీ కార్యాలయం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు గుడివాడ రూరల్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ బి జనార్ధన్ రావు మీడియాకు వెల్లడించారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించాం. ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది అని సీఐ తెలిపారు. ముదినేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాం. ఈ వ్యవహారంలో ఇంకా నిందితుడిని అరెస్ట్ చేయలేదు అని తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని.. అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు అని అన్నారు.