అంతా బెయిల్ రాజాలే..!
‘ఎర్ర’ స్మగ్లర్లకు టీటీడీ ఉద్యోగుల జామీను !
కాసులు కురిపిస్తున్న బెయిళ్లు
యాదమరి, గుడిపాల, ఐరాల, తవణంపల్లె, జీడీ.నెల్లూరు వారే పావులు
చిత్తూరులో నకిలీ శాలరీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్న వైనం
జామీను తీగ లాగితే కదులుతున్న బెయిళ్ల డొంక
జిల్లాలో ఎర్రచందనం మాఫియా, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా సరసన ఇప్పుడు బెయిల్ మాఫియా కూడా చేరింది. వివిధ కేసులకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో నిగ్గు తేలిన, తేలుతున్న వాస్తవాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో న్యాయస్థానాల కళ్లకే గంతలు కడుతూ బురిడీ కొట్టిస్తున్న వైనం చివరకు పోలీసుల శ్రమకు ఫలితం దక్కకుండా పోతోంది.
చిత్తూరు (అర్బన్): బెయిల్స్కాం ఉదంతం జిల్లాలో పోలీసు, న్యాయ వ్యవస్థలో సంచలనం సృష్టించింది. పలమనేరు పోలీసులు ఓ జామీను తీగ లాగితే బెయిళ్ల డొంక కదిలింది. జిల్లాలోని పలు న్యాయస్థానాల్లో తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి బెయిల్‌పై తప్పించుకున్న వాళ్లు, వారికి సహకారం అందించిన వారిపై పోలీసులు దృష్టి సారించారు. ఎర్రచందనం స్మగ్లర్లు, హత్య కేసుల్లో నిందితులుగా ఉంటూ బెయిల్‌పై వచ్చిన వారి వివరాల గుట్టును రట్టుచేసే పనిలో ఉన్న పోలీసులకు దర్యాప్తులో సరికొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. టీటీడీలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పట్టుకుబడ్డ నిందితులకు శాలరీ సర్టిఫికెట్ ఇచ్చి జామీనుపై విడిపించినట్లు రికార్డుల్లో నమోదైంది. అయితే, జామీనుదారులను విచారణ చేస్తే అసలు తాము వారు శాలరీ సర్టిఫికెట్లే ఇవ్వలేదని తేలింది.
ఆ ఐదు మండలాల్లోనే ఎక్కువ
బెయిల్ స్కాంలో నిందితులైన చిత్తూరుకు చెందిన ఇద్దరు మధ్యవర్తులు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి రూ.500 ఇచ్చి జామీను ఇచ్చేందుకు పావులుగా వాడుకుంటున్నట్టు తేలింది. వారి నుంచి పొలం పాసు పుస్తకాలు, ఇంటి ధరావత్తు (వాల్యుయేషన్ సర్టిఫికెట్) ధ్రువీకరణ పత్రాలను తీసుకుని జామీనులు ఇప్పిస్తున్నారు. వివిధ కేసుల్లో నిందితులు తమకేమాత్రం తెలియకున్నాజిల్లాలోని యాదమరి, గుడిపాల, ఐరాల, తవణంపల్లె, జీడీ.నెల్లూరు మండలాల్లో కొందరు జామీన్లు ఇస్తున్నట్టు గుర్తించారు. చివరకు దీనిని వారు జీవనోపాధిగా మార్చుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కొందరు న్యాయవాదులే న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తుండటం ఇప్పుడు చర్చకు దారితీసింది.
ఇవిగో సాక్ష్యాలు
2014లో ఐరాల పోలీసులు 23 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.. వీళ్లకు యాదమరి మండలంలోని పీసీ.కండ్రిగ హరిజనవాడకు చెందిన ఆరుగురు బెయిల్ కోసం జామీను ఇచ్చారు. ఒక్కో నిందితుడికి రూ.40 వేల విలువ చేసే ఇంటిని ధరావత్తు పత్రాన్ని న్యాయస్థానానికి అందచేశారు. ప్రస్తుతం నిందితులు న్యాయస్థానానికి హాజరుకాకపోవడంతో జామీను వేసిన వాళ్లు రూ.4.6 లక్షలు కోర్టుకు చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే ఇంటిని జప్తు చేసే అవకాశం లేకపోలేదు.
గత ఏడాది తవణంపల్లె పోలీసులు తమిళనాడులోని తిరువణ్నామలైకు చెందిన ఇద్దరు బడా స్మగ్లర్లను అరెస్టు చేసి, వారి నుంచి రూ.6 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. వీళ్లకు టీడీడీలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు తమ శాలరీ సర్టిఫికెట్లు ఇచ్చి జామీను ఇచ్చినట్లు పత్రాలు ఉండటంపై పోలీసులు అనుమానించారు. ధార్మిక సంస్థలో పనిచేసే వారికి స్మగ్లర్లతో ఉన్న లింకులేమిటని లోతుగా దర్యాప్తు చేస్తే ఆ జామీను వారివ్వలేదని, వారి పేరిట ఆ పత్రాలు సృష్టించి బెయిల్ పొందేలా చేశారని గుర్తించారు. చిత్తూరుకు చెందిన ఓ మధ్యవర్తి ఈ వ్యవహారంలో రాటు తేలాడని గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
గత ఏడాది జూన్‌లో ఓ హత్య కేసుకు సంబంధించి గంగాధరనెల్లూరు మండలం వేల్కూరు చెందిన ఇద్దరు వ్యక్తులు కర్ణాటకకు చెందిన నిందితుడికి జామీను ఇచ్చారు. ప్రస్తుతం నిందితుడి ఆచూకీ లేకపోవడంతో జామీను ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు పొలాలను కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు. 2005లో యాదమరిలో జరిగిన యూనియన్ బ్యాంకు దోపిడీలో 25 కిలోల బంగారం దోచుకున్న నిందితులకు గుడిపాలకు చెందిన వ్యక్తులు జామీను ఇవ్వడంతో అదే నిందితులు బెయిల్‌పై బయటకొచ్చారు. అంతేకాకుండా కేరళలోని ఓ బ్యాంకును కొల్లగొట్టి 18 కిలోల బంగారాన్ని దోచుకున్నారు.
బెయిల్ మాఫియాకు చెక్ పెట్టాలంటే..?
ఎర్రచందనం స్మగ్లింగ్, మరికొన్ని కేసుల్లో జామీనుదారులను న్యాయమూర్తులు నిశితంగా ప్రశ్నిస్తే చాలావరకు బెయిళ్లు పొందకుండా చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా బెయిళ్ల కోసం న్యాయస్థానాలను తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో గంతలు కడుతున్న వారి భరతం కూడా పట్టవచ్చని కొన్ని వర్గాలు సూచిస్తున్నాయి.