‘బార్’కోడ్ బాదుడు!
వైన్ షాపులు, బార్లలో బార్కోడ్ స్కానర్లు
ఒక్కొక్కరూ రూ.80వేలు చెల్లించాల్సిందే..
జిల్లా వ్యాపారులపై రూ.3.50కోట్లకు పైగా భారం
31లోపు స్కానర్లు కొనకపోతే మద్యం సరఫరాకు బ్రేక్
ఆందోళనలో వ్యాపారులు
గుడివాడ : మూలిగే నక్కపై తాటికాయ పడినట్టుంది మద్యం వ్యాపారుల పరిస్థితి. తీవ్ర ఉత్కంఠ పోటీలో మద్యం షాపు దక్కించుకుని కాసుల వేట సాగించాలని ‘చుక్క’ల లోకంలో విహరిస్తున్న వారి ఆశలపై ఎక్సైజ్ శాఖ నీళ్లు చల్లుతోంది. ఇప్పటికే ఎమ్మార్పీకే విక్రయించాలని, బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేయొద్దని, పర్మిట్ రూముల కోసం అదనంగా రూ.2లక్షలు చెల్లించాలని ఆదేశించిన ఎక్సైజ్ శాఖ తాజాగా బార్కోడ్ స్కానర్ల పేరుతో మరోమారు బాదుడుకు తెరలేపింది.
ఈ నెలాఖరులోపు అన్ని మద్యం షాపులు, బార్లలో బార్కోడ్ స్కోనర్లు ఏర్పాటుచేయాలని ఆదేశించింది. ఇందుకోసం రూ.80వేలు చొప్పున చెల్లించాలని స్పష్టంచేసింది. ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే సరుకు సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు. బార్కోడ్ స్కానర్లు ఏర్పాటుచేయని షాపులు, బార్లకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి మద్యం సరఫరాను నిలిపివేస్తామని చెబుతున్నారు. దీనిపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రజాప్రయోజనం కోసం కాదని, ఏదో ఒక హార్డ్‌వేర్ కంపెనీకి లాభం చేకూర్చేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నారు.
బార్ కోడ్ స్కానర్లు ఉంటేనే అమ్మకాలు
జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 301 వైన్ షాపులు, 150కి పైగా బార్లు ఉన్నాయి. వీటిలో ‘హలో గ్రాఫిక్ ఎక్సైజ్ అడిసివ్ లేబుల్ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టం(హీల్) పేరుతో బార్ కోడ్ స్కానర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా ప్రతి మద్యం బాటిల్‌పై ఉండే లేబుల్‌ను స్కాన్ చేసిన తర్వాతే విక్రయించాల్సి ఉంటుంది. ఇందుకోసం కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. స్కాన్ చేసిన ప్రతి బాటిల్‌కు వచ్చే ప్రింటెడ్ బిల్లును మద్యం వినియోగదారుడికి అందజేయాల్సి ఉంది. ఈ హీల్ స్కానర్‌ను ఎక్సైజ్ శాఖ నేరుగా కొనుగోలు చేసి అందిస్తుంది. ఇందుకోసం ప్రతి వైన్‌షాపు, బార్ లెసైన్సుదారులు రూ.80వేలను డీడీ రూపంలో ఎక్సైజ్ శాఖకు చెల్లించాలి. ఈ లెక్కన జిల్లాలోని మద్యం వ్యాపారులపై రూ.3.50 కోట్లకు పైగా భారం పడుతుంది.
హీల్ మిషన్ వల్ల ఉపయోగాలు..
ప్రతి బాటిల్‌ను బార్కోడ్ స్కానర్‌తో స్కాన్ చేయటం వల్ల ఎప్పుడు తయారు చేశారు. ఎక్కడ చేశారు. బ్యాచ్ నంబర్, ఎంఆర్పీ తదితర పూర్తి వివరాలు బిల్లులో వస్తాయి.
ఎవరైనా మద్యం తాగి అస్వస్థతకు గురై మరణిస్తే అతను తాగిన బాటిల్ స్కాన్ చేస్తే చాలు. దాని బ్యాచ్ నంబర్ సహా మొత్తం వివరాలు వెలుగులోకి వస్తాయి. ఏ షాపులో విక్రయించారనే విషయం కూడా తెలుస్తుంది.
బెల్టు షాపుల్లో పట్టుబడిన బాటిల్స్ ఏ షాపు నుంచి సరఫరా చేశారనే విషయం తెలుస్తుంది.
షాపుల్లో ఏయే బ్రాండ్ ఎంత అమ్మకాలు జరిగాయి. ఎంత స్టాకు ఉంది.. అనే వివరాలు తెలుసుకోవచ్చు.