basvaraju SARAIAH
-
సారయ్యపై సస్పెన్షన్ వేటు
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత బస్వరాజు సారయ్యను పీసీసీ సస్పెండ్ చేసింది. పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆమోదం మేరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ చర్య తీసుకున్నట్టుగా గాంధీభవన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. బస్వరాజు సారయ్య టీఆర్ఎస్లో చేరిక గురించి వాస్తవాలు తెలుసుకోవడానికి పీసీసీ ప్రయత్నించినా ఆయన ఉద్దేశపూర్వకంగానే అందుబాటులోకి రావడం లేదని ఖరారు చేసుకున్న తర్వాత పీసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. -
టీఆర్ఎస్లో చేరిన బస్వరాజు సారయ్య
హైదరాబాద్ : మరో సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బస్వరాజు సారయ్య గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన సోమవారం టీఆర్ఎస్లో చేరారు. బస్వరాజు సారయ్యతో పాటు వరంగల్ అర్బన్ టీడీపీ అధ్యక్షుడు అనిశెట్టి మురళి, వరంగల్ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ తదితరులు టీఆర్ఎస్లో చేరారు. మరోవైపు బస్వరాజు సారయ్యపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. -
అయ్యో.. గిట్లాయెను!
పొన్నాల, సారయ్య ఇక మాజీలే.. రాష్ట్రపతి పాలనతో పోనున్న మంత్రి పదవులు సాదాసీదాగానే.. సాధారణ ఎన్నికలకు సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్రం కల నెరవేరింది.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో అధికార పార్టీ నేతలు, శ్రేణుల్లో హుషారు పెరుగుతోంది. ఇదే సమయంలో జిల్లా మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైందనే ఆనందం వెన్నంటే... వారి మంత్రి పదవులు పోతున్నాయి. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడకుండా రాష్ట్రపతి పాలన వస్తోంది. దీంతో జిల్లా మంత్రులిద్దరూ మాజీ మంత్రులవుతున్నారు. ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటయ్యే పరిస్థితి లేదు. దీంతో వీరిద్దరూ ఎమ్మెల్యేలుగానే ఎన్నికల పోరుకు వెళ్లాల్సి వస్తోంది. శాసనసభ రద్దయితే మాజీ ఎమ్మెల్యేలుగా ఉండాల్సి వస్తుంది. పొన్నాల లక్ష్మయ్య 1985లో మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 1989లో మళ్లీ పోటీచేసి గెలిచారు. 1991లో నేదురుమల్లి జనార్దనరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. 1994లో ఓడిపోరుు.. 2004, 2009 ఎన్నికల్లో గెలిచారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కింది. తర్వాత కె.రోశయ్య, ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లోనూ మంత్రి పదవి వరించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పొన్నాలకు కీలకమైన పదవి వస్తుందని ఆయన సన్నిహితులు చెబుతుండగా.. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ చివరి అంకంలోనే పొన్నాల మంత్రి పదవికి దూరమవుతున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. పొన్నాలకు పదవి వస్తుందో రాదో అని అప్పట్లో బాగా చర్చ జరిగింది. చివరి నిమిషంలో బెర్త్ దక్కింది. వరుసగా పదేళ్లు పదవీకాలం పూర్తి కాకుండానే పొన్నాల ఇప్పుడు మాజీ మంత్రి అవుతున్నారు. ఇక.. మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న బస్వరాజు సారయ్యకు కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తొలిసారిగా మంత్రి పదవి వచ్చింది. 1999 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న సారయ్య కూడా ఇప్పుడు ‘మాజీ’ అవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు... ఎన్నికల తరుణంలో ఇలా మంత్రి పదవి దూరమవడం ఇబ్బందిగానే ఉంటుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. గండ్ర పదవిపై అస్పష్టత తెలంగాణ ఏర్పాటుతో మారిన రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యలు మా జీ మంత్రులవుతున్నారు. మంత్రి హోదాలో ఉండే ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పదవికి మాత్రం ఢోకా లేదు. రాష్ట్రపతి పాలన విధించినా... శాసనభ రద్దు కాకుంటే చీఫ్ విప్ పదవి ఉంటుంది. శాసనసభను రద్దు చేస్తే మాత్రం గండ్ర పదవి కూడా పోతుంది. రాష్ట్రపతి పాలనపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలతోనే దీనిపై స్పష్టత రానుంది. -
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు మేలు
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రైతులకు మేలు జరిగిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. హన్మకొండలోని డీసీసీబీ కార్యాలయ ఆవరణలో ఆదివారం డీసీసీబీ మహాజన సభ జరిగింది. ఈ సందర్భంగా సారయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సోనియా నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం రైతులకు రుణాలు మాఫీ చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చి న సోనియాకు కృతజ్ఞతగా ఉండాలన్నారు. వాణిజ్య బ్యాంకులతో సమానంగా డీసీసీబీ పని చేస్తోందన్నారు. సహకార సంఘాల చైర్మన్లకు వేతనాలు పెంచడం, అవిశ్వాస తీర్మాన సమయాన్ని పెంచడం, ప్రొటోకాల్‌పై చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డితోపాటు తాను ముఖ్యమంత్రితో మాట్లాడుతానన్నారు. చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పీఏసీఎస్ చైర్మన్లు, ఉద్యోగులు సంఘాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ రైతులకు మోసం చేయడం తెలియదని, నిజాయితీగా ఉంటారని, తీసుకున్న రుణాన్ని చెల్లించడంలో ముందుంటారన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు రూ.100 కోట్లతో మడికొండలో టెక్స్టైల్స్ పార్కు మంజూరైందని వివరించారు. అదేవిధంగా టెక్స్టైల్స్ పరిశ్రమ మంజూరుకు కృషి చేస్తున్నానని తెలిపారు. డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ దీర్ఘకాలిక రుణాల వసూలు కోసం రాయితీతో కూడిన వన్‌టైం సెటిల్మెంట్ పథకాన్ని పునరుద్ధరించినట్లు చెప్పారు. రాణిరుద్రమ డిపాజిట్ పథకం ప్రారంభం.. డీసీసీబీ అత్యధిక వడ్డీతో కూడిన రాణిరుద్రమ పథకాన్ని బస్వరాజు సారయ్య ప్రారంభించారు. ఈ పథకం కింద డిపాజిట్ చేసిన మొత్తానికి మిగతా బ్యాంకుల కంటే అధికంగా వడ్డీ వ స్తుంది. దీంతో పాటు రైతులకు దీర్ఘకాలిక రుణాల కిం ద ట్రాక్టర్లు అందించారు. డీ సీసీబీలో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ను ప్రారంభించారు. రేబర్తి, నర్మెట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రూ పొందించిన క్యాలెండర్లను మంత్రి బస్వరాజు సారయ్య, చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఆవిష్కరించారు. జిల్లా సహకార అధికారి బి.సంజీవరెడ్డి, డీసీసీబీ సీఈఓ వి.సురేందర్, ఆప్కాబ్ డీజీఎం ఉదయ్‌భాస్కర్, ఆప్కో డెరైక్టర్ మూర్తి, డీసీసీబీ వైస్ చైర్మన్ రాపోలు పుల్లయ్య, డెరైక్టర్లు జయపాల్‌రెడ్డి, జనార్దన్, సుధీర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, బిక్కు, రేబర్తి పీఏసీఎస్ చైర్మన్ కామిడి రమేష్‌రెడ్డి, నర్మెట పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
టీడీపీకీ స్నేహ‘హస్తం’
అసంతృప్తులకు కాంగ్రెస్ వల =రంగంలోకి మంత్రి బస్వరాజు సారయ్య =స్థానిక నేతల్లో అసంతృప్తి వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : టీడీపీ నాయకులకు కాంగ్రెస్ స్నేహ హస్తం అందిస్తోంది. ఆ పార్టీలోని అసంతృప్తులకు వల విసురుతోంది. టీడీపీలో ఉన్న అసమ్మతిని ఆసరా చేసుకుని తమ పార్టీలోకి చేర్చుకునేందుకు స్వయంగా మంత్రి బస్వరాజు సారయ్య రంగంలోకి దిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో టీడీపీ వైఖరిపై విసిగిపోయిన ఆ పార్టీలోరి పలువురు నాయకులను తమవైపు తిప్పుకునే దిశగా సాగుతున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో ఇటీవల టీడీపీ మాజీ కార్పొరేటర్ నాగపురి కల్పన, పార్టీ నాయకుడు నాగపురి సంజయ్ దంపతులతోపాటు పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. మరి కొందరు నాయకులు సైతం మంత్రి సారయ్యతో మంతనాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదే క్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే టీడీపీ ఖాళీ కాగా... మిగిలిన కొందరిని తమ వైపు తిప్పుకునేందుకు సైతం ప్రయత్నిస్తున్నారు. మొత్తానికీ... నగరంపై కోల్పోయిన పట్టును సాధించేందుకు యత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డివిజన్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. టీఆర్ఎస్కు చెక్ పెట్టే దిశగా... మూడున్నరేళ్లుగా డివిజన్ స్థాయిలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఆ పార్టీ నేతలు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పూర్తిగా విస్మరించారని, ఎన్నికల సమయంలో శ్రమించిన వారికి సైతం కనీస గుర్తింపు దక్కలేదని పలువురు బాహాటంగానే ఆరోపణలకు దిగారు. పార్టీకి దూరమైన నాయకులు తమ అనుచరవర్గానికే పరిమితమై కార్యకలాపాలు నిర్వహించారు. దీనికి తోడు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటోంది. పార్టీ నేతల్లో గ్రూపులు, అంతర్గత విభేదాల కారణంగా శ్రేణుల్లో అసహనం నెలకొంది. ఈ నేపథ్యంలో తమ లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రాధాన్యమిస్తున్నారు. టీఆర్ఎస్ వైపు వెళ్లకుండా చెక్ పెట్టే దిశగా సాగుతున్నారు. తెలంగాణ ఇస్తున్న పార్టీగా రానున్న రోజుల్లో భవిష్యత్ ఉంటుందనే భరోసాను వారిలో కల్పిస్తున్నారు. స్థానిక లీడర్లలో వ్యతిరేకత కాంగ్రెస్ నేతలు ఇతర పక్షాలకు వలవేస్తుండడంపై సొంత పార్టీలోని స్థానిక లీడర్లలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లుగా కష్టనష్టాలకోర్చి తాము పార్టీ కోసం పనిచేశామని, ఇంతకాలం ఇతర పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరిన వారు ఆధిపత్యం చెలాయిస్తే తామెలా సహిస్తామని ప్రశ్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరే మళ్లీ టికెట్లు ఆశించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న గ్రూపు విభేదాలు మరింత పెరుగుతాయని వ్యాఖ్యానిస్తున్నారు. -
పేదలకు విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యం
=ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి =స్పోర్ట్స్ మీట్ ముగింపులో మంత్రి బస్వరాజు సారయ్య ఆరెపల్లి (హసన్‌పర్తి), న్యూస్‌లైన్ : నిరుపేదలకు విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. వడుప్సా జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఆరెపల్లిలో ఎన్ఎస్ఆర్ పాఠశాలలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ ఆదివారం ముగిసింది. ముఖ్య అతిథిగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సర్కార్‌కు రెండు కళ్లలాంటివన్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న తనను ప్రైవేట్ పాఠశాలల యాజమానులు రాజకీయాల్లోకి తీసుకొచ్చారని ఆయన గుర్తు చేశారు. మంత్రి పదవనేది ఔట్ సోర్సింగ్ లాంటిదన్నారు. జిల్లా వాసిగా పదవీ ఉన్నా... లేకున్నా... అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. భారత దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్‌కుమార అన్నారు. వడుప్సా ఆధ్వర్యంలో ఏటా క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. తొలుత విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈసందర్భంగా వడుప్సా డెరైక్టరీని మంత్రి ఆవిష్కరించారు. వడుప్సా జిల్లాశాఖ అధ్యక్షుడు భూపాల్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లక్ష్మీనర్సింహారావు, కోశాధికారి రవీందర్‌రెడ్డి, ఎన్ఎస్ఆర్ పాఠశాల కరస్పాండెంట్ ఎన్.సంపత్‌రావు, చీఫ్ అడ్వయిజర్ నారాయణరెడ్డి, వర్ధన్నపేట నియోజక వర్గ అధ్యక్షుడు వలస జ్ఞానేశ్వర్రావు, రాంబాబు, కాసం చంద్రారెడ్డి, ఆకుతోట రమేష్, భరద్వాజ నాయుడు, ముక్తిశ్వర్, తిరుమలేశ్వర్‌రెడ్డి, స్పోర్ట్ కన్వీనర్ దేవేందర్‌రెడ్డి, సరిత, పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు. కాగా, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ యూనిఫాంతోపాటు స్కాలర్షిప్లు ఇవ్వాలని వడుప్సా నేతలు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని ఈ సందర్భంగా సారయ్య వారికి హామీ ఇచ్చారు. -
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యం
కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతు సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో రూ.10 కోట్లతో నిర్మించిన 25 వేల మెట్రిక్ టన్నుల గోదాములు, రూ.116.83 లక్షలతో నిర్మించిన ఫైర్‌స్టేషన్, ఇంజిన్, రూ.కోటితో నిర్మించిన సీసీ రోడ్డుతో పాటు మక్కల కొనుగోలుకు ఏర్పాటుచేసిన మార్క్‌ఫెడ్ సెంటర్‌ను ఆయన ఎంపీ రాజయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌తో కలిసి గురువారం ప్రారంభించారు. ఆ తర్వాత వారు పాలకవర్గం, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జేసీ పౌసుమి బసు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆరు కేంద్రాలు జిల్లా రైతాంగానికి ఎంతో ఉపయోగపడాలనే భావనతో మార్కెట్ ఆవరణలో రూ.పది కోట్లతో ఐదు భారీ గోదాములు నిర్మించామని మంత్రి సారయ్య తెలిపారు. ఇంకా మక్క రైతులకు మద్దతు ధర అందేలా రాష్ట్రంలో ఆరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయగా, అందులో ఒకటి జిల్లాకు మంజూరైందని తెలిపారు. అయితే, ఇప్పటికే చాలా మంది రైతులు అమ్ముకున్నారు, కేంద్రం వల్ల ఎవరికి లాభమని విలేకరులు ప్రశ్నించగా.. తమ దృష్టికి రాగానే ఏర్పాటుచేయించామని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగానే ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయిస్తామని హామీ ఇచ్చారు. కాగా, గన్నీ సంచుల వ్యవహారం బట్టబయలు చేయాల ని జేసీ పౌసుమి బసును ఆదేశించినట్లు మంత్రి తెలి పారు. ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ జిల్లాలో వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణంలో భాగంగా రూ.14 కోట్లు మంజూరయ్యాయని, రూరల్ డెవలప్మెంట్ కింద రోడ్ల మరమ్మతుకు రూ.5 కోట్లు మంజూరైన ఈరోజు శుభదినమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తదితరులను చైర్మన్ మంద వినోద్‌కుమార్‌తో పాటు డెరైక్ట ర్లు సన్మానించారు. కాగా, దడువాయి, గుమస్తా, హమాలీలతో పాటు వివిధ సంఘాల బాధ్యులు మంత్రి సారయ్యను కలిసి తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమాల్లో ఆయా సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ డెరైక్టర్లు మార్త శ్యాం సుందర్, పస్తం నర్సింగం, మల్లేశం, శ్రీనివాస్, తాడిశెట్టి విద్యాసాగర్, ఓని భాస్కర్, తత్తరి లక్ష్మణ్, రోకుల భాస్కర్, ఎంబాడి రవీందర్, కేడల జనార్దన్, పద్మ, వేముల నాగరాజు, గుత్తికొండ నవీన్, దూపం సంపత్‌కుమార్, బొజ్జ సమ్మయ్య, కందుకూరి పూర్ణచందర్, రాజబోయిన యాకయ్య, సారయ్య, ఖయ్యూం, కట్కూ రి బాబు, బాదావత్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు. తెలంగాణను అడ్డుకోవడం ఎవరితరం కాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను సీమాంధ్ర ప్రజాప్రతినిధులే కాదు.. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం ఆపలేరని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సార య్య అన్నారు. మార్కెట్‌కు వచ్చిన సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ సీమాంధ్రలో రాజకీయ పెత్తనం కోసం కోసం ఆరాటపడుతున్న చం ద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులకు తెలంగాణను అడ్డుకోవడం సాధ్యం కాదనే విషయం తెలుసన్నారు. ఎంపీ రాజయ్య మాట్లాడుతూ సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉండాలని కోరారు. మొదటిరోజు 35 క్వింటాళ్లే మార్కెట్‌కు గురువారం 8వేల క్వింటాళ్ల మక్కలు రాగా, కేవలం 35 క్వింటాళ్లు మాత్రమే రూ.1310 చొప్పున మార్కఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు. అలాగే, మంత్రి సారయ్య వస్తుండడంతో పత్తి వ్యాపారులు క్వింటాకు రూ.4550 చెల్లించగా, పల్లి యార్డులో మాత్రం జీరో దందా యథావిథిగా సాగింది. -
మాటకు కట్టుబడిన సోనియా
పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ నాలుగున్నర కోట్ల ప్రజలకు ఇచ్చిన మా టకు కట్టుబడి ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని కొత్తవాడ 80 ఫీట్ రోడ్లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపంను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సారయ్య మాట్లాడుతూ సీడబ్ల్యూసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సోనియా గాంధీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాను సీఎం కాకముందు ఉన్న ఆస్తులను, తర్వాత వాటిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ అమరుల త్యాగాలను అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్న సోనియాగాంధీ చిత్రపటాన్ని తమ ఇళ్లలో ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలన్నారు. తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును ఆలస్యం చేయకుండా త్వరతిగతిన పూర్తి చేయాలని కోరారు. అనంతరం తెలంగాణ సాయుధ పోరాట యోధులను, స్వాతంత్య్ర సమర యోధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు యెలుగం శ్రీనివాస్, దామెర సర్వేష్, బస్వరాజు కుమారస్వామి, కాంగ్రెస్ నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు, బూర రమేష్, రమేష్, డేగల గంగాధర్, వావిలాల సదానందం పాల్గొన్నారు. మంత్రి సారయ్య పర్యటనలో ఉద్రిక్తత బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని కొత్తవాడలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించేందుకు మంత్రి సారయ్య హాజరయ్యారు. అయితే స్థూపాన్ని తెలంగాణగాంధీ భూపతి కృష్ణమూర్తితో ఆవిష్కరించాలని అమరవీరుల స్థూపం నిర్మాణ కమిటీ కన్వీనర్ కటకం విజయ్‌కుమార్ పట్టుబట్టారు. దీంతో విజయ్‌కుమార్ వాదనకు అక్కడున్న వారు ఏకీభవించకుండా మంత్రి సారయ్యతో స్థూపాన్ని ఆవిష్కరింపజేశారు. తెలంగాణ వాదులను కొట్టించిన కాంగ్రెస్ మంత్రితో అమరుల స్థూపాన్ని ఎలా ఆవిష్కరింపజేశారని జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల మరణానికి కారణమైన వారితో అమరవీరుల స్థూపంను ఎలా ఆవిష్కరిస్తారని ప్రశ్నించా రు. తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తితో ఆవిష్కరించాలని పట్టుబడంతోనే నాపై దాడి చేసేందుకు కొందరు ప్రయత్నించారన్నారు. -
రైతులకు అండగా ప్రభుత్వం
కరీమాబాద్, న్యూస్‌లైన్ : ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉందని బీసీ సంక్షేమ శాఖా మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. ఆదివారం నగర ంలోని వరంగల్ ఫోర్ట్‌రోడ్ రోటరీ క్లబ్ భవన్లో ఖిలావరంగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) రెండో సర్వసభ్య సమావేశం సంఘ చైర్మన్ కేడల జనార్దన్ అధ్యక్షతన జరిగింది. ఈ సంద ర్భంగా రైతులకు *17లక్షల70 వేల పంట రుణాలను మొత్తం 70 మంది రైతులకు అందించారు. అదే విధంగా ఒక ట్రాక్టర్‌ను కూడా రైతుకు అందించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సారయ్య మాట్లాడుతూ దేశానికి వెన్నుముక అయిన రైతుల సంక్షమానికి ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు పంట రుణాలు అందిస్తూ వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా చూస్తున్నట్లు చెప్పారు. ఖిలా వరంగల్ పీఏసీఎస్ భవన నిర్మాణానికి కృషి చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మంద వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ బొలుగొడ్డు సారయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎం. దేవేందర్‌రెడ్డి, నాయకులు ఎంబాడి రవీందర్, కేడల పద్మ, పోశాల పద్మ, కర్ర కుమార్, హన్మంత్‌రావు, బస్వరాజు కుమార్, డెరైక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు. -
నేడు ముగింపు.. డిక్లరేషన్ ప్రకటన
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : రాజకీయ పక్షాల జెండాలు మోసినంత కాలం బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయమే జరుగుతుందని వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్ మాజీ చైర్మన్, జస్టిస్ ఎం.ఎన్.రావు అన్నారు. జెండాపట్టే మనస్తత్వం పోతేనే నాయకులవుతారని పేర్కొన్నారు. జెండాలు మోసే వారు మోస్తూనే ఉంటారని... అగ్రకుల నాయకులు, వారి కొడుకులు, అల్లుళ్లు, చివరకు మనుమలు నాయకులుగా వస్తారని హెచ్చరించారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో రెండు రోజుల పాటు జరగనున్న బీసీల ఆత్మగౌరం, బీసీ డిక్లరేషన్ జాతీయ స్థాయి సమావేశం శనివారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన ఎంఎన్.రావు మాట్లాడుతూ దేశంలో మెజార్టీ వర్గంగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కలేదన్నారు. రాజ్యాధికారం రావాలంటే రాజకీయ పార్టీ అవసరమని.. అరుుతే ప్రస్తుతం ఆ స్థితి లేదన్నారు. కర్నాటకలో సిద్ధరామయ్య బీసీ వర్గాలను కలుపుకుని పోయారని గుర్తు చేశారు. ఇప్పుడున్న పార్టీల్లో బీసీలకు తగిన వాటా, ప్రాధాన్యం లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా జనాభా దామాషా ప్రకారం బీసీలకు అన్ని పార్టీలు టికెట్లు కేటాయించాలనే ఒత్తిడి పెంచితే, ఏ పార్టీ నుంచైనా 100 నుంచి 150 మంది బీసీలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యే అవకాశం ఉందన్నారు. సామాజిక న్యాయం ప్రశ్నార్థకం ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ వల్ల సామాజి క న్యాయం ప్రశ్నార్థకంగా మారుతోందని జస్టిస్ ఎంఎన్.రావు అన్నారు. 50 శాతం మంది సంపన్నులు, మరో 50 శాతం మం ది దరిద్రులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తలసరి ఆదాయాన్ని లెక్కి స్తే పైకి బాగానే కన్పించినా... కొందరు 90 శాతం ఆదాయాన్ని పొందితే మరికొంద రు 10 శాతం కూడా దక్కించుకోలేకపోవ డం అందులో దాగి ఉన్న మర్మమని వివరించారు. సగం కాలిఫోర్నియాగా మారితే సగం ఆఫ్రికా ఏడారిగా మారుతుందని అ మర్త్యసేన్ చెప్పిన అంశాలను ఉదహరిం చారు. ప్రపంచీకరణ ముసుగులో బడుగువర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో మాత్రమే రి జర్వేషన్లు అమలు చేస్తున్నారని ఎంఎన్.రావు వివరించారు. ప్రైవేట్ రంగంలో రిజ ర్వేషన్లు అమలు చేయకుంటే రానున్న రోజుల్లో బీసీ వర్గాలకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై గతంలో చంద్రబాబు హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదన్నారు. ప్ర భుత్వ రాయితీలు, బ్యాంకుల పెట్టుబడు లు, వనరుల కల్పనతో ఏర్పాటవుతున్న ప్రైవేట్‌రంగంలో కచ్చితంగా రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఆర్థికాభివృద్ధిపై లోతుగా ఆలోచించాలి బీసీల్లో ఆర్థిక పురోగతి లేదని, ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో వెనుకబడి ఉన్నారని ఎంఎన్.రావు తెలిపారు. పరిశ్రమలకు కావాల్సిన పెట్టుబడులన్నీ అగ్రకులాలకే చెందుతున్నాయని, బ్యాంకులు కూడా వారికే అప్పులిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారం, పెట్టుబడులు, అప్పు లు లేకుండా ఏ ప్రైవేట్ వ్యవస్థ కొనసాగడం లేదని వివరించారు. వెనుకబడిన వ ర్గాలకు అప్పులివ్వడం నిరర్ధకమనే భావన బ్యాంకుల్లో నెలకొందన్నారు. ఆర్థికాభివృద్ధి చెందకుండా బీసీలు ఎలా ముందుకు సా గుతారని ప్రశ్నించారు. ఈ అంశాన్ని లోతు గా ఆలోచించాలన్నారు. న్యాయవ్యవస్థలోనూ అగ్రకులాలే.. న్యాయవ్యవస్థలో కూడా అగ్రకులాలదే అ ధికారం కొనసాగుతోందని జస్టిస్ ఎంఎన్.రావు అన్నారు. మెజార్టీ జడ్జీలు అగ్రకులాలకు చెందిన వారేనని వివరించారు. ఏ రంగంలో ఉన్నా... బీసీలు ఆత్మగౌరవంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రా జకీయ రంగంలో బీసీలను అగ్రకులాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. బీసీ ల హక్కుల కోసం పనిచేసే నిజాయితీ గల నాయకులు అవసరమన్నారు. రాజ్యాధికారం దక్కించుకునేందుకు బీసీలు ఐక్యం గా ముందుకు సాగాలన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ఐక్యత సాధించాలన్నారు. సమావేశానికి అకాడమీ ఆఫ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ (ఏ బీసీడీఈ) అధ్యక్షుడు డాక్టర్ మురళీమనోహర్ అధ్యక్షత వహించగా మంత్రి బస్వరాజు సారయ్య, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు నరేందర్‌బాబు, రవీందర్, సారంగపాణి, బొబ్బిలి, కూరపాటి వెంకటనారాయణ, తిరుమలి, విశ్వేశ్వర్రావు, బీసీ ప్రజాసంఘాల నాయకులు సాంబశివరా వు, డాక్టర్ బండాప్రకాష్, తిరునహరి శేషు, కులసంఘాల నాయకులు వేణుమాధవ్, పులిసారంగపాణి, గోపు సుధాకర్, అశోక్‌కుమార్, తాడిశెట్టి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.