beef issue
-
‘బీజేపీ.. బీఫ్ జనతా పార్టీ’
-
‘బీజేపీ.. బీఫ్ జనతా పార్టీ’
సాక్షి, బెంగళూర్ : బీజేపీకి కాంగ్రెస్ పార్టీ సరికొత్త భాష్యం ఇచ్చింది. బీఫ్ జనతా పార్టీ అంటూ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఓ సెటైరిక్ వీడియోను తయారు చేసింది. బీజేపీ వేషాలు ఎలా ఉన్నాయో చూడండంటూ పేర్కొంటూ అందులో పలు విషయాలను ప్రస్తావించింది. ‘‘పారికర్(గోవా ముఖ్యమంత్రి) ఏమో దిగుమతి చేసుకుంటానంటారు. యోగి(యూపీ సీఎం) ఏమో ఎగుమతి చేస్తారు. రిజ్జూ(కేంద్ర మంత్రి) ఏమో తింటానంటారు. సోమ్( యూపీ బీజేపీ ఎమ్మెల్యే) ఏకంగా అమ్ముతున్నారు. బీఫ్‌తో వ్యాపారం కాదు.. వీళ్లు చేసేది ముమ్మాటికీ రాజకీయమే. బీజేపీ ఇక నాటకాలు చాలూ’’ అంటూ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్వీటర్ పేజీలో ఓ వీడియోను పోస్టు చేసింది. ఇక వీడియోలో పేర్కొన్న బీఫ్ లవర్స్ విషయాలను ఓసారి పరిశీలిస్తే.. కర్ణాటక నుంచి గోవాకు బీఫ్ దిగుమతిని అడ్డుకోవటంతో అక్కడి బీఫ్ వ్యాపారస్థులు ఆందోళన చేపట్టారు. దీంతో సీఎం పారికర్ న్యాయపరమైన దిగుమతిని అనుమతిస్తానని హామీ ఇవ్వటంతో వారు శాంతించారు. ఇక గతంలో ఓసారి బీజేపీనే బీఫ్ బ్యాన్ తెరపైకి తీసుకొచ్చినప్పుడు.. తాను మాత్రం తింటానని.. అడ్డుకోగలరా? అని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిరెన్ రిజ్జూ ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే అయిన సంగీత్ సోమ్ అల్ దువా పేరిట ఓ బీఫ్ కంపెనీని స్థాపించారు. అంతేకాదు 2008 దాకా ఆ కంపెనీకి ఆయనే డైరెక్టర్ కూడా. వీరితోపాటు కేరళ బీజేపీ నేత మోనే, మేఘాలయా బీజేపీ చీఫ్ షీబున్, కేంద్ర మంత్రి ఆల్ఫోన్స్ కేజే చేసిన కామెంట్లను కూడా వీడియోలో చేర్చింది. ఇక యోగి ఆదిత్యానాథ్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యల మధ్య ‘బీఫ్’ గురించి జరిగిన మాటల యుద్ధం తెలిసిందే. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ ఇలా ఇలా బీజేపీపై విమర్శల పర్వం కొనసాగిస్తోందన్న మాట. #BeefJanataParty Parrikar wants to import it, Yogi wants to export it, Rijiju wants to eat it, Som wants to sell it. Do not mix Beef and Business. Mixing Beef and Politics, a definite YES! Enough of your hypocrisy @BJP4India pic.twitter.com/f6DMDzreOi — Karnataka Congress (@INCKarnataka) 21 January 2018 -
అఖ్లాక్ కుటుంబంపై చర్య తీసుకోవాలి
దేశంలో 'అసహనం' వ్యాఖ్యలకు దారితీసిన దాద్రి ఘటన గుర్తుండే ఉంటుంది కదూ. హత్యకు గురైన మహ్మద్ అఖ్లాక్(50) కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్థానిక కోర్టు ఆదేశించింది. గతేడాది యూపీలోని దాద్రి ప్రాంతంలో 50 ఏళ్ల మహ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తి ఇంట్లో ఆవు మాంసం ఉందని కొందరు వ్యక్తులు అతడిని ఇంట్లోంచి బయటకు లాగి హత్యచేశారు. ఆ దాడిలో ఆయన కుమారుడు డానిష్ అక్లాక్ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందాడు. బిసాడాకు చెందిన కొందరు వ్యక్తులు అఖ్లాక్ కుటుంబంపై కేసు నమోదు చేయాలని, చర్యలు తీసుకోవాలని పిటీషన్ దాఖలు చేశారు. అఖ్లాక్ ఫ్యామిలీ ఆవును చంపేశారని, అతడి సోదరుడు జాన్ మహ్మద్ జంతువు తలను పారవేయడం చూశామని బిసాడా గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన స్థానిక కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఆవు లేదా దూడ మాంసమేనని ఫోరెన్సిక్ పరీక్షలో గత నెలలో వెల్లడైంది. తొలుత అది మటన్ అనే తాము భావించామని, కానీ తర్వాత అది ఆవుమాంసం అన్న విషయం తేలిందని యూపీ డీజీపీ జావేద్ అహ్మద్ ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం తెలిపారు. యూపీలో ఆవుమాంసం తినడం నేరం కాదు గానీ, ఆవులను చంపడం మాత్రం నేరమే. అఖ్లాక్ హత్య కేసులో అరెస్టయిన 18 మందిలో స్థానిక బీజేపీ నేత కుమారుడు కూడా ఉన్నారు. -
'మా ఇంటికి ఎప్పటికీ వెళ్లను'
లక్నో: దాద్రి ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ యువకుడు డానిష్ అక్లాఖ్ తిరిగి ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదంటున్నాడు. గత సెస్టెంబర్ 28న దాద్రి సమీపంలోని బిసడ గ్రామంలో గోవధ వదంతుల నేపథ్యంలో సుమారు వంద మంది స్థానికులు వీరి కుటుంబంపై దాడిచేశారు. ఈ ఘటనలో తండ్రి మహ్మద్ అక్లాఖ్(50) చనిపోగా, కుమారుడు డానిష్ అక్లాక్ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆ దుర్ఘటన నుంచి కోలుకున్న డానిష్ మాట్లాడతూ... మాపై దాడి చేసిన వాళ్లు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆ దాడి జరుగుతున్నప్పుడు.. 'ఈ రోజు నేను చచ్చిపోయినట్లే' అని భావించినట్లు తెలిపాడు. మా తప్పు లేకుండానే మమ్మల్ని కొట్టారు. అకారణంగా మమ్మల్ని కొట్టిన ఆ గ్రామానికి తాను వెళ్లనని అక్లాక్ పేర్కొన్నాడు. ఆ రోజు జరిగిన దాడిలో తల, గుండెపై, కంటిపై గాయాలయ్యాయని.. రెండు నెలల చికిత్స తర్వాత కోలుకున్నట్లు చెప్పాడు. ఆదివారం నాడు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇంటికి వెళ్లాడు. తమపై జరిగిన దాడి గురించి సీఎంకి వివరించాడు. తన తండ్రిని చంపినవాళ్లలో 6౦-70 శాతం మంది తనకు తెలుసునని, స్కూళ్లో కూడా ఎప్పుడు తాను ఎవరితోనూ గొడవకు దిగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అతడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్న తన సోదరుడు సర్తాజ్తో కలిసి చెన్నైలో నివాసం ఉంటున్నాడు. చుట్టుపక్కల వారి నుంచి భయాందోళనలకు గురవుతున్నారా అని సర్తాజ్ని అడిగిన ప్రశ్నకు.. 'సారే జహాసే అచ్చా హిందుస్తాన్ హమారా' అని సమాధానమిచ్చాడు. -
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
-
సీఎం తల తెగ్గొడతానన్న నేత అరెస్టు
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు స్థానిక బీజేపీ నాయకుడొకరు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తనకు ఇష్టం వచ్చిన తిండి తింటానని, బీఫ్ తినకుండా తనను ఎవరూ అడ్డుకోలేరని అన్న ముఖ్యమంత్రికి దమ్ముంటే షిమోగా వచ్చి అక్కడ ఏదైనా ఆవును చంపి తినాలని బీజేపీ జిల్లా కార్యదర్శి ఎస్ఎన్ చెన్నబసప్ప సవాలు చేశారు. ఆయన వచ్చి అలా చేస్తే.. సీఎం తల తెగ్గొట్టి దాంతో ఫుట్‌బాల్ ఆడుకుంటామని హెచ్చరించారు. సిద్దరామయ్య చెబుతున్నది, చేస్తున్నది అంతా తప్పని అన్నారు. అయితే ఇలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు చెన్నబసప్పను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. తాను ఇంతవరకు ఎప్పుడూ బీఫ్ తినలేదని, అయితే తాను తినాలనుకుంటే మాత్రం ఎవరూ ఆపలేరని సీఎం సిద్దరామయ్య గత వారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాను తినాలనుకునే బీఫ్, పోర్క్ లేదా మరే ఇతర మాంసమైనా తింటానని చెప్పారు. బీఫ్ తినే విషయమై అంతకుముందు తాను చేసిన వ్యాఖ్యల మీద బీజేపీ నుంచి నిరసనలు రావడంతో మరింత ఘాటు పెంచి అలా అన్నారు. కానీ దీనిపై చెన్నబసప్ప తీవ్రస్థాయిలో మండిపడి ఏకంగా సీఎం తల తీసేస్తానని హెచ్చరించడం విశేషం. -
'కేరళ హౌస్‌పై అసలు దాడి చేయలేదు'
అందరూ చెబుతున్నట్లుగా అసలు తమ పోలీసు సిబ్బంది కేరళ హౌస్ మీద దాడి చేయనేలేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. అక్కడ బీఫ్ వండి వడ్డిస్తున్నట్లు పోలీసు కంట్రోల్ రూంకు తప్పుడు ఫోన్ కాల్ వచ్చిందని, అయితే ఇలాంటి సందర్భంలో మతపరమైన అల్లర్లు జరిగే ప్రమాదం ఉన్నందున తమ సిబ్బంది వెంటనే అక్కడకు వెళ్లిన మాట వాస్తవమే గానీ, వాళ్లు అక్కడ సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా మాత్రమే వెళ్లారన్నారు. విష్ణుగుప్తా, అతడి అనుచరులు అక్కడ ఏమైనా వివాదం సృష్టిస్తే అడ్డుకునేందుకు మాత్రమే వాళ్లు వెళ్లారన్నారు. కేరళ హౌస్‌పై అసలు పోలీసులు దాడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కంట్రోల్ రూంకు ఫోన్ చేసిన విష్ణు గుప్తా అనే వ్యక్తి ఇప్పటికే పోలీసుల దృష్టిలో ఉన్నాడని, కానీ ఈ ఘటన విషయంలో ఎవరూ అతడిపై ఫిర్యాదు చేయలేదని బస్సీ చెప్పారు. అయినా సెక్షన్ 182 (తప్పుడు సమాచారం) కింద అతడిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. -
హర్యానా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
చండీగఢ్: ఇప్పటికే రగిలిపోతోన్న గోమాంసం వివాదానికి మరింత ఆజ్యంపోస్తూ హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 21తో ఏడాది పాలనను పూర్తిచేసుకోనున్న సందర్భంగా గురువారం ఓ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖట్టార్.. గోమాంసం, దాద్రి ఘటన సహా పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. 'భారత్ లోనే ముస్లింలు జీవనాన్ని కొనసాగించవచ్చు. కానీ ఇక్కడుండాలంటే వారు కచ్చితంగా గోమాంస భక్షణ వదులుకోవాల్సిందే. ఎందుకంటే గోవులు అత్యంత పవిత్రమైనవి. గోమాత, భగవద్గీత, సరస్వతీదేవీలను హిందువులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆవు మాంసం తింటూ ముస్లింలు హిందువుల పవిత్రభావజాలాన్ని అవమానిస్తున్నారు' అంటూ గోమాంస భక్షకులపై ఖట్టార్ విరుచుకుపడ్డారు. ఇంకా.. 'మనది ప్రజాస్వామ్యదేశం. ఇక్కడ అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. కానీ దానికీ ఓ హద్దు ఉంటుంది. ఇతరుల భావాలను భంగం కల్గించనంతవరకే స్వేచ్ఛకు పరిమితి ఉంటుంది' అని అన్నారు. దాద్రి ఘటన అపర్థాల వల్లే సంభవిందని, ఇరు పక్షాలూ పొరపాటు చేశాయని ఖట్టార్ పేర్కొన్నారు. 'నిజానికి ఆ ఘటన జరగకుండా ఉండాల్సింది. అయితే ఈ ఘటనలో బాధిత వ్యక్తి(ఇఖ్లాక్) గోమాతను ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. అతని మాటలు వైరిపక్షాన్ని మరింత రెచ్చగొట్టాయి. అందుకే బీభత్సకాండ చోటుచేసుకుంది. అయినాసరే, ఒక వ్యక్తిని కొట్టి చంపడం ముమ్మాటికీ తప్పే' అని ఖట్టార్ వివరించారు. కాగా, ఖట్టార్ వ్యాఖ్యలపై పలు పార్టీల్లోని ముస్లిం నాయకులు సహా లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి నేతలూ భగ్గుమన్నారు. ఏడాది కాలంగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు తరచూ వినిపిస్తున్నాయని, అలాంటి వారిపై కేంద్రం చర్యలు తీసుకోవాలని లాలూ డిమాండ్ చేశారు. అయితే ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టార్ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని ఓఎస్డీ జవహర్ యాదవ్ వివరణ ఇచ్చారు. 'ఒకరినొకరు గౌరవించుకోవాలి' అనే ఖట్టార్ మాటలను సదరు దినపత్రిక ఉద్దేశపూర్వకంగా వక్రీకరించిందని ఆయన ఆరోపించారు. హిందూత్వ సంస్థ ఆర్ఎస్ఎస్ లో కీలక నేత అయిన మనోహర్ ఖట్టార్.. గత ఏడాది జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసి ఆ పార్టీకి విజయంసాధించిపెట్టడంతోపాటు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అధికారం చేపట్టగానే 'ది హర్యానా గోవంశ్ సంరక్షణ', 'గావ్ సంవిధా' తదితర చట్టాలను రూపొందించి హర్యానాలో గోవధను నిషేధించారు. ఆ చట్టాల ప్రకారం ఆవును చంపిన వారికి 10ఏళ్లు, ఆవు మాంసం తిన్నవారికి 5ఏళ్లు శిక్షపడే వీలుంటుంది.