హర్యానా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
చండీగఢ్: ఇప్పటికే రగిలిపోతోన్న గోమాంసం వివాదానికి మరింత ఆజ్యంపోస్తూ హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 21తో ఏడాది పాలనను పూర్తిచేసుకోనున్న సందర్భంగా గురువారం ఓ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖట్టార్.. గోమాంసం, దాద్రి ఘటన సహా పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
'భారత్ లోనే ముస్లింలు జీవనాన్ని కొనసాగించవచ్చు. కానీ ఇక్కడుండాలంటే వారు కచ్చితంగా గోమాంస భక్షణ వదులుకోవాల్సిందే. ఎందుకంటే గోవులు అత్యంత పవిత్రమైనవి. గోమాత, భగవద్గీత, సరస్వతీదేవీలను హిందువులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆవు మాంసం తింటూ ముస్లింలు హిందువుల పవిత్రభావజాలాన్ని అవమానిస్తున్నారు' అంటూ గోమాంస భక్షకులపై ఖట్టార్ విరుచుకుపడ్డారు. ఇంకా.. 'మనది ప్రజాస్వామ్యదేశం. ఇక్కడ అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. కానీ దానికీ ఓ హద్దు ఉంటుంది. ఇతరుల భావాలను భంగం కల్గించనంతవరకే స్వేచ్ఛకు పరిమితి ఉంటుంది' అని అన్నారు.
దాద్రి ఘటన అపర్థాల వల్లే సంభవిందని, ఇరు పక్షాలూ పొరపాటు చేశాయని ఖట్టార్ పేర్కొన్నారు. 'నిజానికి ఆ ఘటన జరగకుండా ఉండాల్సింది. అయితే ఈ ఘటనలో బాధిత వ్యక్తి(ఇఖ్లాక్) గోమాతను ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. అతని మాటలు వైరిపక్షాన్ని మరింత రెచ్చగొట్టాయి. అందుకే బీభత్సకాండ చోటుచేసుకుంది. అయినాసరే, ఒక వ్యక్తిని కొట్టి చంపడం ముమ్మాటికీ తప్పే' అని ఖట్టార్ వివరించారు.
కాగా, ఖట్టార్ వ్యాఖ్యలపై పలు పార్టీల్లోని ముస్లిం నాయకులు సహా లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి నేతలూ భగ్గుమన్నారు. ఏడాది కాలంగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు తరచూ వినిపిస్తున్నాయని, అలాంటి వారిపై కేంద్రం చర్యలు తీసుకోవాలని లాలూ డిమాండ్ చేశారు. అయితే ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టార్ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని ఓఎస్డీ జవహర్ యాదవ్ వివరణ ఇచ్చారు. 'ఒకరినొకరు గౌరవించుకోవాలి' అనే ఖట్టార్ మాటలను సదరు దినపత్రిక ఉద్దేశపూర్వకంగా వక్రీకరించిందని ఆయన ఆరోపించారు.
హిందూత్వ సంస్థ ఆర్ఎస్ఎస్ లో కీలక నేత అయిన మనోహర్ ఖట్టార్.. గత ఏడాది జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసి ఆ పార్టీకి విజయంసాధించిపెట్టడంతోపాటు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అధికారం చేపట్టగానే 'ది హర్యానా గోవంశ్ సంరక్షణ', 'గావ్ సంవిధా' తదితర చట్టాలను రూపొందించి హర్యానాలో గోవధను నిషేధించారు. ఆ చట్టాల ప్రకారం ఆవును చంపిన వారికి 10ఏళ్లు, ఆవు మాంసం తిన్నవారికి 5ఏళ్లు శిక్షపడే వీలుంటుంది.