ర్యాగింగ్ జరిగిందని రుజువైతే...కేసు మారుస్తాం: సీఐ
విశాఖ : విశాఖ భీమిలీలోని ఎన్ఆర్ఐ కళాశాల హాస్టల్ భవనంపై నుంచి పడి గాయపడిన ఫార్మసీ విద్యార్థి ప్రశాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈనెల 19న ప్రశాంత్ భవనం పైనుంచి పడిపోయిన విషయం తెలిసిందే. అతడిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కేర్ ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. మరోవైపు ర్యాగింగ్ వల్లే తమ కుమారుడు మృతి చెందాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ర్యాగింగ్‌కు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ర్యాగింగ్ తట్టుకోలేకే తన తమ్ముడు భవనంపైనుంచి దూకాడని ప్రశాంత్ సోదరి సంధ్య ఆరోపించారు. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం వివరణ ఇచ్చేవరకూ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయటానికి వీలు లేదని పట్టుబట్టారు. కాగా ప్రశాంత్ వారం క్రితం తల్లిదండ్రులకు ఫోన్ చేసి సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని.. హాస్టల్లో ఉండలేకపోతున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ విషయాన్ని తల్లిదండ్రులు అంతగా పట్టించుకోలేదని సమాచారం.
ఈ ఘటనపై భీమిలీ సీఐ అప్పలనాయుడు మాట్లాడుతూ విద్యార్థి మృతిపై ప్రస్తుతం ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేశామన్నారు. ఒకవేళ ర్యాగింగ్ జరిగిందని రుజువైతే ...ర్యాగింగ్ కేసుగా మార్చుతామని ఆయన తెలిపారు. మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా ఎన్ఆర్ఐ కళాశాల యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. కాగా కళాశాల యాజమాన్యం మాత్రం తమ కళాశాలలో ర్యాగింగ్ అనేదే లేదని, ప్రశాంత్ మానసిక ఒత్తిడిని తట్టుకోలేకే ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని చెబుతోంది.