BR Ambedkar birth anniversary
-
అంబేద్కర్ జయంతి.. గెజిటెడ్ హాలీడే
ప్రతీ ఏడాది ఏప్రిల్ 14న డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా.. దేశవ్యాప్తంగా వేడుకలు, రకరకాల కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. భారత రాజ్యాంగ రూపకర్తకు గౌరవసూచీకగా, ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఈ తేదీన అంబేద్కర్‌కు ఘనంగా నివాళులు అర్పిస్తుంటుంది కూడా. అయితే.. అంబేద్కర్ జయంతి అనేది పబ్లిక్ హాలీడే అవునా? కాదా? అనే చర్చ తరచూ తెర మీదకు వస్తుంటుంది. అందుకు కారణం.. అంబేద్కర్ జయంతిని చాలాకాలం పాటు జాతీయ సెలవు దినంగా కేంద్రం గుర్తించకపోవడం. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, గాంధీ జయంతి.. ఇలా ప్రత్యేక రోజుల్లాగా కాకుండా అంబేద్కర్ జయంతిని పరిమితుల మధ్య జరుపుకుంటోంది దేశం. కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత రాష్ట్రాల్లో కొన్ని మాత్రమే పబ్లిక్ హాలీడేగా ఆచరిస్తున్నాయి. అయితే.. 2020 కరోనా టైంలోనే కేంద్రం అంబేద్కర్ జయంతిని గెజిటెడ్ నోటిఫికేషన్ ద్వారా జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. ఆ తర్వాత సంవత్సరాల్లో మిగతా సెలవుల్లో అంబేద్కర్ జయంతి కలిసిపోతూ వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్రం అంబేద్కర్ జయంతిని గెజిటెడ్ పబ్లిక్ హాలీడేగా ప్రకటించింది. 1881 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 25 ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14, 2023ను క్లోజ్డ్ హాలీడేగా ప్రకటిస్తూ ఓ గెజిట్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. మరోవైపు ఈ నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండానే సుప్రీం కోర్టు సెలవు ప్రకటించుకోవడం గమనార్హం. సీజేఐ డీవై చంద్రచూడ్ ఆదేశాలనుసారం దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు అదే రోజున సిక్కులకు పెద్ద పండుగ వైశాఖి (బైశాఖి) ఉంది. కొన్నిరాష్ట్రాల ప్రభుత్వాలకు ఈ పండుగకు సెలవు ప్రకటించడంతో.. విద్యా సంస్థలు, వ్యాపారాలు స్వచ్ఛందంగా మూతపడనున్నాయి. -
న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం ఎక్కడ?
సాక్షి, అమరావతి: న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం అమలు కావడం లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, బలహీనవర్గాలకు చెందిన న్యాయవాదుల విషయంలో సామాజిక న్యాయం నేతిబీర చందంగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో 1,104 మంది జడ్జిలు ఉంటే, అందులో కేవలం 92 మంది మహిళా న్యాయమూర్తులే ఉన్నారని చెప్పారు. అలాగే 16 మంది ఎస్సీ, ఎనిమిది మంది ఎస్టీ జడ్జీలు మాత్రమే ఉన్నారని తెలిపారు. 16 హైకోర్టుల్లో అసలు ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యమే లేదన్నారు. ఈ గణాంకాలు సామాజిక న్యాయం అమలు తీరుకు ప్రతిబింబమని చెప్పారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం హైకోర్టులో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. అపర మేధావి, అభ్యుదయవాది, రాజ్యాంగ రూపకర్త అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ఓ కుల నాయకుడిగా చిత్రీకరించడం దారుణమని చెప్పారు. అంబేడ్కర్ తన జీవితాన్ని సామాజికన్యాయం కోసం ధారపోశారన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ దేశంలో సామాజికన్యాయం అమలు కావడం లేదని చెప్పారు. మనదేశం కులవ్యవస్థకు ప్రాధాన్యతనిస్తోందని, అందుకే అంబేడ్కర్‌ను ఓ కులానికి నాయకుడిగా చూపుతున్నారని తెలిపారు. అంతకుముందు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా మాట్లాడుతూ అంబేడ్కర్ వ్యక్తిత్వాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన భావజాలాన్ని ప్రజలందరికీ చేరువ చేయాలని పిలుపునిచ్చారు. జస్టిస్ శేషసాయి మాట్లాడుతూ అంబేడ్కర్‌ది మహోన్నత వ్యక్తిత్వమని చెప్పారు. అంబేడ్కర్ మార్గాన్ని అందరూ అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. జస్టిస్ గంగారావు మాట్లాడుతూ సమాజంలో అందరూ సమానమేనంటూ, అందరి హక్కుల పరిరక్షణకు అంబేడ్కర్ ఎంతో కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కోనపల్లి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సిటీలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, రూట్లు ఇవే!
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ కొత్వాల్ అంజనీకుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్యాంక్‌బండ్ చౌరస్తా కేంద్రంగా ఈ నెల 14న (బుధవారం) ఉదయం 6 నుంచి కార్యక్రమం ముగిసే వరకు ఇవి అమలులో ఉంటాయి. ఆహూతులకు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు. కర్బలామైదాన్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సైలింగ్ క్లబ్ వద్ద నుంచి కవాడిగూడ చౌరస్తా, డీబీఆర్ మిల్స్, ధోబీఘాట్, కట్టమైసమ్మ టెంపుల్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా పంపిస్తారు. ఎన్టీఆర్ ఘాట్ నుంచి లిబర్టీ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను అంబేడ్కర్ స్టాచ్యూ వైపు అనుమతించరు. వీరు తెలుగుతల్లి చౌరస్తా నుంచి రైట్ టర్న్ తీసుకుని ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, పోలీసు కంట్రోల్‌రూమ్, బషీర్‌బాగ్ మీదుగా వెళ్లాలి. సైఫాబాద్ పాత పోలీసుస్టేషన్ నుంచి లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు అంబేడ్కర్ స్టాచ్యూ వైపు వెళ్లకుండా ఇక్బాల్ మినార్ నుంచి రవీంద్రభారతి, పోలీసు కంట్రోల్‌రూమ్, బషీర్‌బాగ్ మీదుగా వెళ్లాలి. సాధూరామ్ కంటి ఆస్పత్రి నుంచి సెక్రటేరియట్ వైపు వెళ్లే ట్రాఫిక్ లిబర్టీ నుంచి కుడి వైపు తిరిగి మొఘల్ దర్బార్ హోటల్, జీహెచ్ఎంసీ కార్యాలయం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. (చదవండి: బాలుడికి ఊపిరి పోసిన ‘సాక్షి’ కథనం ) -
చెరగని చిరస్మృతి అంబేడ్కర్
శాస్త్రీయ దృక్పథం జాతి జీవనంలో భాగం కావాలని కోరుకున్న మాన్యుడు బి.ఆర్. అంబేడ్కర్. ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అనే అపభ్రంశపు వ్యాఖ్యలను ఆయన పుట్టిన గడ్డపైనే చేసే సీఎంలను చూస్తున్నాం. పాలకులు ఆయన సమస్త స్వప్నాలకూ నేడు తూట్లు పొడుస్తున్నారు. కులాల పునాదులను తుదకంటా కదల్చాలని ఒక మహనీయుడు చెప్పిన నేలపై అవే కులాలు వెయ్యి అడుగుల లోతు పునాదిపై దృఢంగా పాతుకునిపోతున్నాయి. సమానత్వాన్ని జాతి జనులు పాడుకునే గీతంగా పరిమళింపజేసే రాజ్య వ్యవస్థను ఆయన కోరుకుంటే, అసమానతలకు ఆజ్యం పోసి నరనరానా కుల స్వభావాన్ని, కులాహంకారాన్ని, కులపీడనను జాతి గుండెల్లో ప్రతిష్టింపజేసే పనిలో పాలకులు మునిగి పోతున్నారు. పౌరుల గౌరవాన్ని పెంచే పాలనను ఆయన కలగంటే పౌరుల సమస్త హక్కులనూ రకరకాల ముసుగులతో తొక్కివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సకల జీవన రంగాల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొం దించాలని ఆయన ఆశిస్తే, ఆ భావననే రాజ్యాంగంలోంచి తొలగించే సాహసానికి నేటి పాలకులు పూనుకుంటున్నారు. ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అనే అపభ్రంశపు వ్యాఖ్యలు చేసే ముఖ్యమంత్రులను మనం చూస్తున్నాం. పరిణామవాదమా గాడిదగుడ్డా అంటూ ఎకసెక్కాలు చేసే కేంద్ర మంత్రిపుంగవులను చూస్తున్నాం. ఇలా ఒకటేమిటి? అంబేడ్కర్ ఆశయాలను భూస్థాపితం చేసే ప్రయత్నాలు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఇన్ని చేస్తూ కూడా అంబేడ్కర్ మావాడంటే మావాడంటూ పాలకులు ఆయన విగ్రహాలను కౌగిలించుకుంటూ, పంచుకుంటూ బతికేస్తున్న కాలాన్ని మనం చూస్తున్నాం. మోదీ నుంచి చంద్రబాబు దాకా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌ను తమవాడిగా నిలబెడుతూ ఆయన అసలు అభిమతానికి తూట్లుపొడుస్తూ అంబేడ్కర్ భజన చేయడంలో పోటీ పడుతున్నారా అనిపిస్తోంది. శాస్త్రీయ దృక్పధాన్ని సకల జీవన రంగాల్లోనూ పెంపొందించాలని ప్రగాఢంగా కాక్షించి, ఆ భావనను భారత రాజ్యాంగంలో పొందుపర్చిన మాన్యుడు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి నేడు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు శాస్త్రీయ చింతనపై ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా, శాస్త్ర పరిశోధనలను ప్రోత్సహించాలనే డిమాండుతో ఏర్పడిన ’గ్లోబల్ మార్చ్ ఫర్ సైన్స్’ డే కూడా ఇదే రోజు రావడం కాకతాళీయమే కావచ్చు. ఏడు దశాబ్దాల క్రితం అంబేడ్కర్ జాతి చైతన్యంలో భాగం కావాలని ఆశించిన శాస్త్రీయ చింతన నేడు ప్రపంచవ్యాప్తంగా వేలాది శాస్త్రజ్ఞుల సామూహిక వాణిగా రూపొందుతుండగా, పాలకులు మాత్రం పరిణామవాద వ్యతిరేక సిద్ధాంతాలకు, ఆధ్యాత్మక భావజాలానికి ప్రాధాన్యతనిస్తూ సమాజంలో శాస్త్రీయ దృక్పథానికి మంగళం పలుకుతున్నారు. అంబేద్కర్ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతాం అంటూ ప్రధాని నరేంద్రమోదీ నాలుగేళ్లుగా ప్రతి సందర్భంలోనూ చాటిచెబుతున్నారు. అదే సమయంలో ఇప్పటి విమానం కంటే ముందే భారత దేశంలో పుష్పక విమానం ఉండేదని, వినాయకుడికి ఏనుగుతల పెట్టడం ద్వారా ఆనాడే ప్లాస్టిక్ సర్జరీలు ఉన్నాయని మన వేదాలు చెబుతున్నాయంటూ సైన్స్ మహాసభల్లోనే ఆయన మాట్లాడి, వందలాది శాస్త్రజ్ఞుల సమక్షంలోనే శాస్త్రీయ దృక్పధాన్ని అపహాస్యం చేశారు. సాక్షాత్తూ ప్రధాని ఆలోచనలే ఇలా ఉంటే తామేం తక్కువ తినలేదన్నట్లుగా కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్.. చార్లెస్ డార్విన్ సూత్రీకరించిన పరిణామవాదాన్నే అశాస్త్రీయం అనేశారు. ఒక కోతి మనిషిగా మారడాన్ని ఎవరూ చూడలేదంటూ ఎద్దేవా చేశారు. ఇక కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ మరో ఎత్తుకు వెళ్లి ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం కంటే ఉత్తమమైన సిద్ధాంతం వేదాల్లోని ఉన్నట్లుగా స్టీఫెన్ హాకింగ్ వంటి సుప్రసిద్ధ శాస్త్రవేత్త పేర్కొన్నారంటూ వివాదానికి తెరలేపారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల పాలకులు తమ వ్యక్తిగత విశ్వాసాలను, నమ్మకాలను పాలనలో భాగం చేస్తూ శాస్త్ర చింతన, శాస్త్హీయ దృక్పథానికే దూరం జరుగుతున్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ విలువలకు అడుగడుగునా తూట్లు పొడుస్తూ, ధిక్కరిస్తూ ఫిరాయింపుల సంస్కృతిని బలపర్చడంలో తెలుగు పాలకులు పోటీ పడ్డారు. అటు తెలంగాణ, ఇటు ఏపీలో డజన్ల సంఖ్యలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి ఫిరాయింపచేశారు. వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి ఫిరాయింపచేయడం ద్వారా చంద్రబాబు ఆయారాం గయారాం సంస్కృతిని కొత్తపుంతలు తొక్కించారు. వారిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. పైగా, ఎవరయినా దళితులుగా పుట్టాలనుకుంటారా అంటూ ఏపీ సీఎం దేశంలో దళితుల పుట్టుకను, ఉనికినే ప్రశ్నార్థకం చేసి అవమానించేశారు. అన్నిటికీ మించి ప్రత్యేక హోదాపై వైఎస్సార్సీపీ తదితర పార్టీలు కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకే రాకుండా పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేయడం రాజ్యాంగ స్ఫూర్తి ఉల్లంఘనకు పరాకాష్ట. ఈ నేపథ్యంలో అంబేద్కర్ నిజమైన వారసత్వం ఏమిటి అనే ప్రశ్న వేసుకోవాలి. మనుషులు మనుషులకే కానీ దేవుడి పాదాల నుంచి జన్మించలేదంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. మహిళల సాధికారత అవసరమంటూ విస్తారంగా రచనలు చేశారు. ప్రధానంగా హిందూ లేక ఇతర మత ఆధారిత జాతి భావనను అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. రాజ్యాంగంలో శాస్త్రీయ దృక్పథం అనే పదాన్ని చేర్చడంలో అవిరళ కృషి చేశారు. ప్రజాస్వామ్యం అనేది అంబేడ్కర్ ప్రతి భారతీయుడికి అందించిన వెలలేని కానుక. కానీ, హిందూ కోడ్ బిల్లును జనసంఘ్ తీవ్రంగా వ్యతిరేకించిన కారణంగానే అంబేడ్కర్ తన పదవికి రాజీ నామా చేయాల్సి వచ్చిందన్న విషయం మరవరాదు. విజ్ఞానంతో సూర్యుళ్లనే మండించాలని అంబేడ్కర్ కాంక్షించారు. కానీ అజ్ఞానంతో, అశాస్రీయ భావాలతో వెలుగును, పురోగతిని ఆపాలని నేడు పాలకులు ప్రయత్నిస్తున్నారు. పైగా జీడీపీలో శాస్త్ర పరిశోధనా రంగానికి కేవలం 1 శాతం, ఉన్నత విద్యకు 3 శాతం మాత్రమే కేటాయించడం ద్వారా పాలకులు సైన్స్ వ్యాప్తిని అడ్డుకుంటున్నారు. అధికార స్థానాల్లోని ప్రముఖులు, ప్రయోజన బృందాలూ అశాస్త్రీయ భావాలను ప్రచారం చేస్తున్నారని, శాస్త్ర పురోగతి విషయంలో భారత్ నిజమైన దోహదాన్ని మర్చిపోతూ మన ప్రాచీన గతం విషయంలో పరిహాసాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఐఐఎస్ఇఆర్ కొల్‌కతాకు చెందిన ప్రొఫెసర్ సౌమిత్రో బెనర్జీ వ్యాఖ్యానించడం గమనించాలి. ప్రపంచ వ్యాప్తంగా 600 నగరాల్లో భారత్‌లోని 16 ముఖ్య నగరాల్లో వేలాది మంది శాస్త్రజ్ఞులు నేడు శాస్త్ర పరిశోధనల ఆవశ్యకతను ఎత్తిచూపుతూ భారీ ప్రదర్శనలు చేయనున్నారు. భారత రాజ్యాంగంలో అంబేడ్కర్ పొందుపర్చిన శాస్త్రీయ దృక్పథానికి ఇది నిజమైన నివాళి. పాలకుల అశాస్త్రీయ చింతనకు, తిరోగమన తత్వానికి భిన్నంగా ప్రజానీకం ప్రదర్శించే ఇలాంటి చైతన్యపూర్వక ప్రయత్నాలే అంబేడ్కర్ ఆశయాలకు నిజంగా జీవం పోస్తాయి. (నేడు బి.ఆర్. అంబేడ్కర్ జయంతి, గ్లోబల్ సైన్స్ మార్చ్ సందర్భంగా) – కె. రాజశేఖర రాజు -
యూపీ చుట్టూ మోదీ చక్కర్లు
లక్నో: వచ్చే నెలలో ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ రెండుసార్లు పర్యటించనున్నారు. బీజేపీ రాష్ట్ర యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నట్టు మంగళవారం ఆ పార్టీ వర్గాలు అధికారకంగా వెల్లడించాయి. ఏప్రిల్ 14న రాజ్యంగ పితామహుడు, దళితులకు స్పూర్తిప్రధాత, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జన్మదినం సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అంబేద్కర్ జన్మదిన కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. అంబేద్కర్ జన్మదినం నుంచి మొదలుకుని ఈ కార్యక్రమాలు ఏప్రిల్ 24 అగ్రాలో జరిగే కార్యక్రమంతో ముగుస్తాయని బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పట్నాయక్ మీడియాకు తెలిపారు. 2014 ఎన్నికల అనంతరం రాజకీయంగా ఎదురుదెబ్బలు తగలడంతో దళితుల ఓట్లు చేజారియే ప్రమాదం ఉందని భావించిన బీజేపీ.. 2017 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్టీ ప్రచారం జోరుగా నిర్వహించాలని యోచిస్తోంది.