విపక్షాల మేధోమథనం: యాంటీ భేటీ.. ఫ్రెండ్స్ పోటీ
జాతీయ రాజకీయాల తీరుతెన్నులను నిర్ణాయక మలుపు తిప్పగల కీలక పరిణామాలు మంగళవారం చోటు చేసుకోనున్నాయి. అటు బెంగళూరులో కాంగ్రెస్ చొరవతో సోమవారం మొదలైన 26 విపక్షాల కీలక సమావేశం మంగళవారం పూర్తిస్థాయిలో జరగనుంది. ఇటు అందుకు దీటుగా బీజేపీ సారథ్యంలో అధికార ఎన్డీఏ కూటమి ఏకంగా 38 పార్టీలతో హస్తినలో పోటీ భేటీ తలపెట్టింది. ఇరు పక్షాల నుంచీ ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సోనియా, రాహుల్, ఖర్గే తదితర కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటు నితీశ్ సహా పలు విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు... ఇలా మొత్తం 26 విపక్ష పార్టీల అధినేతలు సోమవారమే బెంగళూరు చేరారు.
మంగళవారం చర్చించాల్సిన అంశాలపై సాయంత్రం నుంచి రాత్రి విందు భోజనం దాకా సుదీర్ఘ మంతనాల్లో మునిగి తేలారు. మరోవైపు బీజేపీ కూడా ఎల్జేపీ (పాశ్వాన్)ని సోమవారం ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడం ద్వారా విపక్షాల సవాలుకు దీటుగా స్పందించింది. మంగళవారం జరిగే ఎన్డీఏ పూర్తిస్థాయి భేటీలో ఎల్జేపీ, హిందూస్తానీ అవామ్ మోర్చా వంటి కొత్త మిత్రులతో కలిపి ఏకంగా 38 పార్టీలు పాల్గొంటాయని కూడా బీజేపీ వర్గాలు వెల్లడించాయి! హస్తిన, బెంగళూరు వేదికలుగా జరగనున్న అధికార, విపక్ష కూటముల పోటాపోటీ భేటీల మీదే ఇప్పుడిక అందరి కళ్లూ నిలిచాయి. అతి కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల కురుక్షేత్ర సమరానికి ఈ భేటీలను వైరి కూటముల తొలి సన్నాహకంగా పరిశీలకులు భావిస్తున్నారు.
బెంగళూరు: 2024 ఎన్నికల్లో కేంద్రంలో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో విపక్షాలు కొంతకాలంగా చేస్తున్న ముమ్మర ప్రయత్నాలు కీలక దశకు చేరుకున్నాయి. ఇందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు తలపెట్టిన రెండు రోజుల సమావేశాలు సోమవారం బెంగళూరులో మొదలయ్యాయి. కాంగ్రెస్ సహా 26 విపక్ష పార్టీల అధినేతలు, అగ్ర నేతలు సాయంత్రానికల్లా సమావేశ వేదిక వద్దకు చేరుకున్నారు. రాత్రి పొద్దుపోయేదాకా చర్చోపచర్చల్లో మునిగి తేలారు. బీజేపీని నిలువరించడమే ఏకైక అజెండాగా ఉమ్మడి కార్యాచరణకు రూపమిచ్చేందుకు మంగళవారం రోజంతా కీలక మేధోమథనం జరపనున్నారు.
కాంగ్రెస్ అగ్ర నేత సోనియా సారథ్యంలో కొత్త కూటమి ఆవిర్భావం జరగవచ్చని తెలుస్తోంది. సోనియాతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్‌గాం«దీ, ప్రియాంకగాంధీ వద్రా, విపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు నితీశ్‌కుమార్ (జేడీ–యూ), మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), ఎంకే స్టాలిన్ (డీఎంకే), అరవింద్ కేజ్రీవాల్ (ఆప్)తో పాటు ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్, జేఎంఎం నేత హేమంత్ సొరేన్, అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన–యూబీటీ), ఫరూక్ అబ్దుల్లా (ఎన్సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, జయంత్చదరి (ఆరెల్డీ), వైకో (ఎండీఎంకే) తదితరులు సోమవారం సమావేశంలో పాల్గొన్నారు.
బెంగళూరు నగరమంతటా ఎటు చూసినా ‘కలుద్దాం, నిలుద్దాం’ నినాదంతో విపక్ష కూటమి నేతలందరి ఫొటోలతో కూడిన భారీ బ్యానర్లే కని్పంచాయి. ఇక కాంగ్రెస్‌తో చిరకాలంగా ఉప్పూనిప్పుగా ఉన్న మమత విందు భేటీలో సోనియా పక్కనే కూర్చోవడం ప్రధానాకర్షణగా నిలిచింది. ఆ సందర్భంగా వారిరువురూ 20 నిమిషాల పాటు చర్చలు కూడా జరిపారు. పార్టీలో చీలికతో సతమతమవుతున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోమవారం భేటీకి హాజరు కాలేదు. మంగళవారం కుమార్తె సుప్రియా సులేతో పాటు ఆయన చర్చల్లో పాల్గొంటారని విపక్ష వర్గాలు తెలిపాయి. విపక్షాలతో తలపడేందుకు తానొక్కన్నే చాలని గొప్పలకు పోయిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు 30కి పైగా పార్టీలతో జట్టు కట్టేందుకు ఎందుకు తహతహలాడుతున్నారని ప్రశ్నించారు. జేడీ(ఎస్)తో పాటు బీజేపీ ఓటమి కోరే భావ సారూప్య పార్టీలన్నింటికీ కూటమిలోకి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తెలిపారు.
సయోధ్య ఏ మేరకు సాధ్యం?
అయితే పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు–తృణమూల్ సహా పలు రాష్ట్రాల్లో విపక్షాల మధ్యే సహజ వైరం నెలకొని ఉన్న నేపథ్యంలో వాటి మధ్య సయోధ్య ఏ మేరకు సాధ్యమవుతుంన్నది ఆసక్తికరం. తృణమూల్‌తో బెంగాల్లో ఎలాంటి పొత్తూ ఉండబోదని సమావేశ వేదిక వద్దే సీపీఎం ప్రధాన కార్యదర్శి కుండబద్దలు కొట్టారు. అయితే, విపక్షాల ఓటు బ్యాంకులో చీలికను నివారించేందుకు కలిసి పని చేస్తామంటూ
ముక్తాయించారు.
భేటీలో పాల్గొంటున్న పార్టీలు
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్సీపీ, శివసేన (యూబీటీ), ఎస్పీ, జేడీ(యూ), ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, ఆరెస్పీ, సీపీఐ–ఎంఎల్, ఫార్వర్డ్ బ్లాక్, అప్నాదళ్, మణిథనేయ మక్కల్ కచ్చి (ఎంఎంకే) సహా మొత్తం 26 పార్టీలు. వీటన్నింటికీ కలిపి లోక్‌సభలో 150 మంది దాకా ఎంపీల బలముంది!
కూటమి కన్వీనర్‌గా నితీశ్...?
కొత్త కూటమి పేరు కూడా మంగళవారం నాటి చర్చల అజెండాలో ఉన్నట్టు సమాచారం. ‘‘ఇండియా అని వచ్చేలా కూటమికి ఆకర్షణీయమైన పేరును పార్టీలన్నీ సూచిస్తాయి. ‘యునైటెడ్ వుయ్ స్టాండ్’ అన్నది ట్యాగ్‌లైన్‌గా ఉండనుంది’’ అని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
► అంతేగాక యూపీఏ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన సోనియాగాం«దీని కొత్త కూటమి సారథిగా వ్యవహరించే అవకాశముందని చెబుతున్నారు.
► సామాజిక న్యాయం, సమ్మిళిత వృద్ధి, జాతీయ సంక్షేమమే ప్రధాన లక్ష్యాలుగా ఉమ్మడి కార్యాచరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
► కనీ్వనర్‌గా బిహార్ సీఎం నితీశ్ కీలక బాధ్యతలు తీసుకోవచ్చు.
► మంగళవారం భేటీ అనంతరం సంయుక్త ప్రకటనతో పాటు ఉమ్మడి ఆందోళన ప్రణాళికను కూడా విపక్ష కూటమి ప్రకటించవచ్చని సమాచారం.
► కీలకమైన రాష్ట్రాలవారీగా పార్టీలవారీగా పోటీ చేయాల్సిన లోక్‌సభ స్థానాల సంఖ్యను ఖరారు చేసుకోవడం వంటివీ చర్చకు వస్తాయంటున్నారు.
► ఒక కమిటీతో పాటు కనీస ఉమ్మడి ప్రణాళిక, విపక్షాల సంయుక్త నిరసన కార్యక్రమాల ఖరారుకు రెండు సబ్ కమిటీలు కూడా ఏర్పాటు చేసే అవకాశముంది.