మంత్రివర్గ సహచరులతో మోదీ భేటీ
‘వికసిత్ భారత్’పై మేధోమథనం
దార్శనిక పత్రంపై సుదీర్ఘంగా చర్చ
న్యూఢిల్లీ: ‘వికసిత్ భారత్: 2047’ దార్శనిక పత్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేధోమథనం నిర్వహించారు. ఆయన ఆదివారం తన సహచర మంత్రులతో సమావేశమయ్యారు. ‘2047 నాటికి వికసిత్ భారత్’ అనే లక్ష్య సాధన కోసం రాబోయే ఐదేళ్లలో అనుసరించాల్సిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా 100 రోజుల అజెండాను మోదీ తెరపైకి తీసుకొచి్చనట్లు సమాచారం. రాబోయే మే నెలలో ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 100 రోజుల్లో అమలు చేయాల్సిన అజెండాపై ఆయన చర్చించారు.
దీనిపై కొందరు మంత్రులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రివర్గ భేటీలో కొన్ని కీలక అంశాలపై ప్రజంటేషన్ కూడా ఇచి్చనట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందాలని, ఘన విజయమే లక్ష్యంగా పనిచేయాలని సహచర మంత్రులకు మోదీ సూచించారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమంతోపాటు దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 370కిపైగా స్థానాలు, ఎన్డీయే 400కుపైగా స్థానాలు గెలుచుకుంటాయని మరోసారి ధీమా వ్యక్తం చేశారు.
రోడ్‌మ్యాప్ సిద్ధం
ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా ‘వికసిత్ భారత్’ సాధన కోసం రోడ్‌మ్యాప్ సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఇందుకోసం గత రెండున్నరేళ్లలో వివిధ స్థాయిల్లో 2,700 సమావేశాలు, వర్క్‌షాప్‌లు, సెమినార్లు నిర్వహించినట్లు తెలిపాయి. 20 లక్షల మంది యువతీ యువకుల నుంచి సలహాలు సూచనలు అందినట్లు పేర్కొన్నాయి. ఈ రోడ్‌మ్యాప్ ఆర్థిక వృద్ధి, అభివృద్ధి లక్ష్యాలు, సులభతర జీవనం, సులభతర వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర బ్లూప్రింట్ అని అధికారులు స్పష్టం చేశారు.
10 రోజులు.. 29 కార్యక్రమాలు
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాని మోదీ రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. రాబోయే 10 రోజుల్లో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు. ఆ సందర్భంగా మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు అనేక ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశి్చమ బెంగాల్, జమ్మూకశీ్మర్, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, ఢిల్లీలో మోదీ పర్యటిస్తారని అధికార వర్గాలు ఆదివారం పేర్కొన్నాయి. మోదీ సోమవారం తెలంగాణలో పర్యటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment