Brhanmumbai Municipal Corporation
-
నగరానికి ‘హార్ట్’ ఎటాక్
- ముంబైలో పెరుగుతున్న ‘గుండె’ మృతులు - తర్వాత స్థానంలో క్షయ, క్యాన్సర్ - కాలుష్యం, పని ఒత్తిడే కారణ మంటున్న వైద్యులు సాక్షి, ముంబై: నగరంలో గుండె జబ్బులతో మృతి చెందుతున్నవారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. గుండె జబ్బులతో మృతి చెందుతన్న వారి సంఖ్య మొదటి స్థానంలో ఉండగా తర్వాత రెండు, మూడు స్థానాల్లో క్షయ, క్యాన్సర్ ఉన్నట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) నుంచి ఆర్టీఐ కార్యకర్త చేతన్ కోఠారి సేకరించిన సమాచారంలో వెల్లడైంది. 2014-15 మధ్యలో రోజుకు 18 మంది గుండెకు సంబంధించిన వ్యాధులతో మరణించగా, 15 మంది ముంబైకర్లు క్షయ వ్యాధితో మృతిచెందారు. బీఎంసీ సీనియర్ అధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాధారణ జబ్బుల కంటే గుండెకు సంబంధించిన వ్యాధులే ఆధిపత్యం వహిస్తున్నాయన్నారు. ఇతర ప్రాంతాలతో పోల్చి చూసినపుడు నగరంలో గుండె జబ్బులతో మృతి చెందుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉందని బైకల్లాలోని జేజే ప్రభుత్వ ఆస్పత్రి కార్డియాలజీ విభాగం డాక్టర్ బన్సల్ అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 20 నిమిషాలైనా వ్యాయామం తప్పని సరి అవసరమని సూచించారు. నగర వాసులు ఆహారం విషయంలో శ్రద్ధ వహించడం లేదని, శారీరక వ్యాయామం చేయడం లేదని చెప్పారు. పరేల్‌లోని గ్లోబల్ ఆస్పత్రి డాక్టర్ అజయ్ చౌగులే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికంటే పట్టణ ప్రాంతంలోని వారికే ఎక్కువగా గుండె జబ్బులు వస్తుంటాయన్నారు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా స్వీకరించడం, శరీరానికి సరైన వ్యాయామం ఉండకపోవడం వల్ల రోగాల బారిన పడుతున్నారన్నారు. చక్కర అధికంగా ఉన్న పానీయాలు, పదార్థాలు తినడం వల్ల ఒబెసిటీ, డయబెటీస్, హార్ట్ఎటాక్ లాంటి జబ్బులు పట్టణ వాసులకు వస్తున్నాయని పేర్కొన్నారు. వాతావరణంలో కాలుష్యం పెరిగిపోవడం, పని ఒత్తిడి ఎక్కువ అవడం కూడా రోగాలబారిన పడటానికి ప్రధాన కారణం అన్నారు. నగరవాసులు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవాలని అన్నారు. -
జూన్‌కి ‘పంపు’ల నిర్మాణం పూర్తి
- ప్రకటించిన బీఎంసీ..రూ. 228 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడి - వర్షపు నీటిని తరలింపు కోసం వాటర్ పంపింగ్ స్టేషన్ల నిర్మాణం సాక్షి, ముంబై: వర్షకాలం మొదలుకాక ముందే వర్లీలోని రెండు స్టార్మ్‌వాటర్ పంపింగ్ స్టేషన్లను పూర్తి చేస్తామని బృహన్ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే రూ. 228 కోట్లను ఖర్చు చేసినట్లు పేర్కొంది. జూన్ మొదటి వారంలో ఈ పనులు పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. పనులు పూర్తయితే మహాలక్షి, దాదర్ ప్రాంతాల్లో వర్షపు నీటి సమస్య ఉండదని తెలిపింది. ప్రతి ఏటా వర్షకాలంలో దాదర్ రైల్వే స్టేషన్, పూల మార్కెట్, సేనాపతి బాపట్ మార్గ్, ఎన్.ఎం.జోషి మార్గ్ ఇతర దిగువ ప్రాంతాలను వరదలు ముంచెత్తుతాయి. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు పంపింగ్ స్టేషన్ల ద్వారా వరద నీటిని సముద్రంలో కలిపేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ప్రస్తుతం నగరంలో ఐర్లా, హజిఅలీలో పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి. మరిన్ని పంపింగ్ స్టేషన్ల నిర్మాణాన్ని ఆరేళ్ల క్రితమే బీఎంసీ చేపట్టింది. రూ.3,535 కోట్లతో బ్రిమ్స్టోవాడ్ ప్రాజెక్టులో భాగంగా ఎనిమిది ప్రాంతాల్లో పంపింగ్ స్టేషన్లను నిర్మించాలని నిర్ణయించింది. హజిఅలీ, జుహూలోని ఐర్లా, లవ్‌గ్రోవ్, క్లేవ్‌ల్యాండ్ బందర్ (ఈ రెండు వర్లీలోనే ఉన్నాయి) బ్రిటానియా (రే రోడ్), గజ్దర్బంద్ (ఖార్దందా), మొగ్ర సాంతక్రూజ్, మహుల్లలో వాటిని నిర్మించనుంది. అయితే ఇప్పటి వరకు కేవలం రెండు పంపింగ్ స్టేషన్లను మాత్రమే బీఎంసీ పూర్తి చేసింది. దాదాపు రూ.115 కోట్లను క్లేవ్ బందర్‌కు, లవ్‌గ్రోవ్ పంపింగ్ స్టేషన్‌కు రూ.113 కోట్లను ఖర్చు చేశారు. క్లేవ్లో ఏడు పంపులు, లవ్గ్రోవ్లో 10 పంపులున్నాయి. ఈ పంప్‌ల ద్వారా దాదాపు 6,000 లీటర్ల వరద నీటిని ఒక్క సెకెండ్లో తొలగించవచ్చని సమాచారం.