Brighton
-
లిఫ్ట్ ఎక్కు... ఆకాశంలో ప్రదక్షిణ కొట్టు!
వావ్ ఫ్యాక్టర్ ప్రతి ఒక్కరూ జీవితంలో పైకి వెళ్లాలనుకుంటారు. అయితే జీవితంలో తర్వాత!... ముందు అబ్జర్వేషన్ టవర్ ఎక్కి ఆకాశంపైకి వెళ్దాం పదండి అంటున్నారు బ్రైటన్ వాసులు. బ్రైటన్‌లో కట్టిన అబ్జర్వేషన్ టవర్ ఎక్కితే ఆకాశంలో అడుగు పెట్టినట్టుంటుంది మరి! పదంతస్తుల అపార్ట్మెంట్ బిల్డింగ్ నుంచి కిందకు చూస్తేనే మనలో చాలామందికి గుండె గుభేల్మంటుంది. అలాంటిది ఏకంగా 531 అడుగుల ఎత్తు నుంచి కిందికి చూస్తే ఎలా ఉంటుంది? అది కూడా అద్దాల గది లోంచి? కళ్లు తిరగవూ? తిరుగుతాయి. కానీ ఆ తిరగడంలోని కిక్కే వేరు. దాన్ని అనుభవించాలంటే చలో బ్రైటన్. ఎందుకంటే అక్కడే ఉంది మరి ప్రపంచంలోనే అతి ఎత్తై అబ్జర్వేషన్ టవర్ ‘ఐ 360’. ఇది ఎక్కితే చుట్టూ 26 మైళ్ల దూరం వరకూ చూడవచ్చునట! లండన్‌లో అతిపెద్ద రంగుల రాట్నమైన ‘లండన్ ఐ’ని కట్టిన హోలాండియా కంపెనీనే ‘ఐ 360’ నిర్మాణ బాధ్యతను చేపట్టింది. లండన్ నగరానికి దక్షిణంగా ఇంగ్లిష్ చానల్ తీరంలో ఉన్న బ్రైటన్ సిటీలో దీన్ని కట్టింది. ఇది బ్రిటిష్ ఎయిర్వేస్ ఆధ్వర్యంలో నడుస్తోంది. నిట్టనిలువుగా పైకి ఎగిరే తొలి కేబుల్ కారు ఇదే కావడం ఒక ప్రత్యేకతైతే... ప్రపంచంలోనే అత్యంత పలుచనైన టవర్గానూ ఇది రికార్డు బుక్కుల్లోకి ఎక్కనుండటం మరో విశేషం. కేవలం నాలుగు మీటర్ల వ్యాసమున్న ఉక్కు గొట్టాల ఆధారంగా దీన్ని నిర్మించారు! నిర్మాణంలో మొత్తం 17 గొట్టాలను వాడారు. గాలి తాకిడిని తట్టుకునేందుకు వీలుగా ఆస్ట్రేలియా కంపెనీ వంద డాంపనర్లను (కంపనాల తీవ్రతను తగ్గించేవి) తయారు చేయగా, గొట్టాలను కలిపే బలమైన వెయ్యి ఉక్కు బోల్టులు జర్మనీలో తయారయ్యాయి. టవర్ ఆధారంగా పైకీ కిందికీ కదిలే కేబుల్ కారు నిర్మాణానికి వాడిన గాజు ఇటలీలోను, అల్యూమినియం కవరింగ్ యూకేలోను తయారయ్యాయి. అంతా బాగానే ఉందిగానీ.. ఈ టవర్ ఎక్కాలంటే ఖర్చెంతవుతుందో అనుకుంటున్నారా? ఎంత... జస్ట్ 15 పౌండ్లు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.1,500. అంటే ఒక్క పదిహేనొందలు మనవి కాదనుకుంటే... జీవితంలో మర్చిపోలేని ఓ మధురమైన అనుభూతి మన సొంతమవుతుందన్నమాట! -
కారు ఢీకొట్టడంతో.. ఎగిరిపడినా..!
లండన్: హిట్ అండ్ రన్ కేసులో ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి తప్పించుకుని మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. వేగంగా వెళ్తున్న కారు 53 ఏళ్ల వ్యక్తిని ఢీకొట్టి, ఆపకుండా వెళ్లిపోయింది. కారు ఢీకొట్టగానే బాధితుడు కారుపై ఎగిరిపడి వెనకాల రోడ్డుపై పడ్డాడు. ఈ నెల 14న ఇంగ్లండ్‌లోని బ్రిగ్టన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు నమోదైన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. కెంప్టౌన్ ప్రాంతంలో బాధితుడు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితుడి తలకు తీవ్రంగా గాయలయ్యాయి. బాధితుడు కోలుకుంటున్నాడని, ప్రమాదం లేదని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. అలాగే ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
రోడ్డుపై కూలిన విమానం ఏడుగురు మృతి
లండన్: ఇంగ్లాండ్‌లోని బ్రిగ్టన్ సిటీ సమీపంలో వైమానిక విన్యాసాల్లో పాల్గొన్న ఓ యుద్ధ విమానం కూప్పకూలడంతో ఏడుగురు చనిపోయారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, దాదాపు 14 మంది గాయాలపాలయ్యారని శనివారం పోలీసులు వెల్లడించారు. దక్షిణ ఇంగ్లాండ్‌లోని బ్రిగ్టన్ దగ్గర్లో శనివారం మధ్యాహ్నం సమయంలో ‘షోరెహామ్ ఎయిర్ షో’లో 1950లనాటి హ్యాకర్ హంటర్ యుద్ధవిమానం వృత్తాకారంలో వైమానిక విన్యాసం ప్రదర్శిస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో ఎయిర్‌పోర్టు సమీపంలో రద్దీగా ఉన్న రహదారిపై కుప్పకూలింది. విమానం నిట్టనిలువుగా పడడంతో ఏడుగురు అక్కడిక్కడే మరణించారని వెస్ట్ ససెక్స్ విభాగం పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పిం చారు. రోడ్డుపై విమానం కూలడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. -
ఎయిర్ షోలో కుప్పకూలిన విమానం
వైమానిక ప్రదర్శనలో భాగంగా ఆకాశంలో చక్కర్లు కొడుతున్న విమానం.. ఒక్కసారిగా నేలకూలింది. ప్రదర్శన జరుగుతున్న ప్రాంతానికి సమీపంలోని ఇళ్లపై పడిపోయింది. పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు, పొగ ఎగిసిపడ్డాయి. ఇంగ్లాండ్‌లోని బ్రిడ్జ్‌టన్ ఎయిర్‌పోర్టులో శనివారం స్థానిక కాలమానం ప్రకారం మద్యాహ్నం 1:30కు ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని, ప్రాణ, ఆస్తినష్టం వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని అత్యవసర సిబ్బంది పేర్కొన్నారు. కాగా, ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ఇంగ్లాండ్ తూర్పు తీరంలోని బ్రిడ్జ్‌టన్ ఎయిర్‌పోర్టులో జరుగుతున్న ఎయిర్ షోలో.. ఏ 27 అనే సింగిల్ సీటర్ జెట్ ఫైటర్ విన్యాసాలు ప్రదర్శించింది. చివరి లూప్‌ను పూర్తి చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి నేలకూలిందని, ఎయిర్‌పోర్టుకు సమీపంలోని పార్కింగ్ ప్రదేశంలో అది కూలిపోయిందని, ఆ స్థలానికి సమీపంలో ఇళ్లు కూడా ఉన్నాయని సహాయక బృందం ప్రతినిధులు వెల్లడించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.