లిఫ్ట్ ఎక్కు... ఆకాశంలో ప్రదక్షిణ కొట్టు!
వావ్ ఫ్యాక్టర్
ప్రతి ఒక్కరూ జీవితంలో పైకి వెళ్లాలనుకుంటారు. అయితే జీవితంలో తర్వాత!... ముందు అబ్జర్వేషన్ టవర్ ఎక్కి ఆకాశంపైకి వెళ్దాం పదండి అంటున్నారు బ్రైటన్ వాసులు. బ్రైటన్‌లో కట్టిన అబ్జర్వేషన్ టవర్ ఎక్కితే ఆకాశంలో అడుగు పెట్టినట్టుంటుంది మరి!
పదంతస్తుల అపార్ట్‌మెంట్ బిల్డింగ్ నుంచి కిందకు చూస్తేనే మనలో చాలామందికి గుండె గుభేల్‌మంటుంది. అలాంటిది ఏకంగా 531 అడుగుల ఎత్తు నుంచి కిందికి చూస్తే ఎలా ఉంటుంది? అది కూడా అద్దాల గది లోంచి? కళ్లు తిరగవూ? తిరుగుతాయి. కానీ ఆ తిరగడంలోని కిక్కే వేరు. దాన్ని అనుభవించాలంటే చలో బ్రైటన్. ఎందుకంటే అక్కడే ఉంది మరి ప్రపంచంలోనే అతి ఎత్తై అబ్జర్వేషన్ టవర్ ‘ఐ 360’. ఇది ఎక్కితే చుట్టూ 26 మైళ్ల దూరం వరకూ చూడవచ్చునట!
లండన్‌లో అతిపెద్ద రంగుల రాట్నమైన ‘లండన్ ఐ’ని కట్టిన హోలాండియా కంపెనీనే ‘ఐ 360’ నిర్మాణ బాధ్యతను చేపట్టింది. లండన్ నగరానికి దక్షిణంగా ఇంగ్లిష్ చానల్ తీరంలో ఉన్న బ్రైటన్ సిటీలో దీన్ని కట్టింది. ఇది బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఆధ్వర్యంలో నడుస్తోంది. నిట్టనిలువుగా పైకి ఎగిరే తొలి కేబుల్ కారు ఇదే కావడం ఒక ప్రత్యేకతైతే... ప్రపంచంలోనే అత్యంత పలుచనైన టవర్‌గానూ ఇది రికార్డు బుక్కుల్లోకి ఎక్కనుండటం మరో విశేషం. కేవలం నాలుగు మీటర్ల వ్యాసమున్న ఉక్కు గొట్టాల ఆధారంగా దీన్ని నిర్మించారు! నిర్మాణంలో మొత్తం 17 గొట్టాలను వాడారు. గాలి తాకిడిని తట్టుకునేందుకు వీలుగా ఆస్ట్రేలియా కంపెనీ వంద డాంపనర్లను (కంపనాల తీవ్రతను తగ్గించేవి) తయారు చేయగా, గొట్టాలను కలిపే బలమైన వెయ్యి ఉక్కు బోల్టులు జర్మనీలో తయారయ్యాయి.
టవర్ ఆధారంగా పైకీ కిందికీ కదిలే కేబుల్ కారు నిర్మాణానికి వాడిన గాజు ఇటలీలోను, అల్యూమినియం కవరింగ్ యూకేలోను తయారయ్యాయి. అంతా బాగానే ఉందిగానీ.. ఈ టవర్ ఎక్కాలంటే ఖర్చెంతవుతుందో అనుకుంటున్నారా? ఎంత... జస్ట్ 15 పౌండ్లు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.1,500. అంటే ఒక్క పదిహేనొందలు మనవి కాదనుకుంటే... జీవితంలో మర్చిపోలేని ఓ మధురమైన అనుభూతి మన సొంతమవుతుందన్నమాట!