జవాన్లే చనిపోతున్నారేం?
రాజ్‌నాథ్‌ను నిలదీసిన విమాన ప్రమాద మృతుల బంధువులు
న్యూఢిల్లీ: పాత విమానాలు వాడుతూ జవాన్ల ప్రాణాలను ఎందుకు ప్రమాదంలో పెడుతున్నారని విమానం ప్రమాదంలో చనిపోయిన బీఎస్ఎఫ్ జవాన్ల బంధువులు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను నిలదీశారు. మృతులకు బుధవారం రాజ్‌నాథ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మృతుల బంధువులు మంత్రిపై మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన నిమిషాల్లోనే బీఎస్ఎఫ్ విమానం కుప్పకూలడం, 10 మంది చనిపోవడం తెలిసిందే. ‘ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోండి. సమాధానం చెప్పండి.
ఈ ప్రమాదాల్లో జవాన్లే ఎందుకు మరణిస్తున్నారు. వీఐపీలకు ఎందుకు అలా జరగడం లేదు’ అని మరణించిన వారిలో ఒకరైన సబ్ ఇన్స్పెక్టర్ రబీందర్ సింగ్ కూతురు రాజ్‌నాథ్, బీఎస్ఎఫ్ చీఫ్ డీకే పాఠక్‌లను నిలదీశారు. రాజ్‌నాథ్ ఆమెను ఓదార్చారు. ఈ అంశాన్ని కచ్చితంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కూలిన విమానంలో ఎలాంటి లోపాలూ లేవని, అది 20 ఏళ్ల నాటిదని, అయితే దానికి 40 నుంచి 45 ఏళ్ల జీవిత కాలం ఉందని పాఠక్ తెలిపారు.
అయినా ఈ ఘటనపై డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌విచారణ చేపడుతుందని పేర్కొన్నారు. పైగా విమానంలో తీసుకెళ్లే బరువు కూడా ఎక్కువగా లేదని, విమానం సామర్థ్యానికి తగ్గట్టే బరువు తీసుకెళ్లారనిస్పష్టం చేశారు. హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ.. ‘విమానం పాతది అనడం సరికాదు. అందులో నేనూ గతంలో ప్రయాణించాను. కచ్చితంగా అది సామర్థ్యం ఉన్నదే. అయితే ఎందుకు అలా కుప్పకూలిందో సరిగా తెలియడం లేదు’ అని పేర్కొన్నారు.