స్పీడ్ అందుకోలేదని..
సదానందగౌడ శాఖ మార్పు రైల్వే నుంచి న్యాయశాఖకు
మోదీ కర్ణాటక కు అన్యాయం చేశారన్న ఖర్గే
సదానంద ఏ శాఖనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారన్న అశోక్
బెంగళూరు : ఊహించనంత చురుగ్గా పనిచేయలేక పోవడం.. రైల్వే శాఖలో అనుకున్నంత వేగంగా మార్పులను చేపట్టకపోవడం.. కుమారుడు కార్తీక్‌గౌడ, నటి మైత్రేయిగౌడ మధ్య తలెత్తిన వివాదం.. ఇవన్నీ కలిసి సదానందగౌడను శక్తివంతమైన రైల్వే శాఖ నుంచి దూరం చేశాయి. ఆదివారం జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా సదానంద గౌడ తన వద్ద ఉన్న రైల్వేశాఖను చేజార్చుకున్న విషయం తెలిసిందే. కాగా కేంద్ర న్యాయశాఖ మంత్రిగా సదానందగౌడ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇక ప్రత్యేక బడ్జెట్‌తో పాటు కేబినెట్లో అత్యంత ప్రాధాన్యం ఉన్న రైల్వేశాఖ నుంచి పెద్దగా ప్రాముఖ్యత లేని న్యాయశాఖను సదానందగౌడకు కేటాయించడంపై రాష్ట్రానికి చెందిన నేతలు స్పం దించారు. సదానందగౌడ నుంచి రైల్వేశాఖను లాక్కొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తప్పు చేశారని పార్లమెంట్లో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు.
గుల్బర్గాలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...‘తన ఆప్తులకు మేలు చేకూర్చేందుకు గాను కర్ణాటకకు చెందిన పార్లమెంటు సభ్యుడికి కేటాయించిన శక్తివంతమైన రైల్వేశాఖను లాక్కోవడం ఎంత మాత్రం సరికాదు. ప్రధాని నరేంద్ర మోదీ వన్‌మ్యాన్ షో తరహాలో ప్రవర్తిస్తున్నారు. తనవల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందనే భావనతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారు. ప్రజా ప్రభుత్వంలో ఏకచత్రాధిపత్యంలా వ్యవహరించడం సరికాదు. ఈ మంత్రివర్గ విస్తరణలో కర్ణాటకకు తీవ్ర అన్యాయమే జరిగింది’ అని పేర్కొన్నారు.
ఏశాఖనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు.. అశోక్
ఇక సదానందగౌడ శాఖ మార్పుపై కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్ అశోక్ స్పందించారు. సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ....‘ రైల్వేశాఖ నుంచి సదానంద గౌడను తప్పించడం కాస్తంత ఇబ్బందికరమైన అంశమే. అయితే ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే ఏ నిర్ణయానికైనా ఓ కారణమంటూ ఉంటుంది. కేంద్ర న్యాయశాఖ కూడా ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న శాఖ. ఇప్పటి వరకు రైల్వేశాఖను చాలా సమర్థవంతంగా నిర్వహించిన సదానందగౌడ ఏ శాఖనైనా సమర్థవంతంగా నిర్వహించగలరనే నమ్మకం నాకుంది’ అని అన్నారు.