KPMG report: 2050 నాటికి ‘నెట్ జీరో’ లక్ష్యం కష్టమే!
న్యూఢిల్లీ: సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని 2050 నాటికి సాధించేందుకు ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్యలు చాలవని కేపీఎంజీ సంస్థ పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వాలు, పరిశ్రమలు గుణాత్మక మార్పు దిశగా కృషి చేయాల్సి ఉందని తెలిపింది. అయితే, ఎన్నో అడ్డంకులు, గణనీయ స్థాయిలో ప్రభుత్వాల రుణ భారం, అంతర్గత ఉద్రిక్తతలు, కర్బన ఉద్గారాల తగ్గింపు ప్రణాళికలపై పెరుగుతున్న వ్యతిరేకత, ఇంధన సరఫరా విషయంలో భరోసా కలి్పంచాల్సిన అవసరం కర్బన ఉద్గారాల విషయంలో అవరోధంగా మారుతున్నట్టు వివరించింది.
ఈ మేరకు కేపీఎంజీ ఓ నివేదికను విడుదల చేసింది. కాలుష్యాన్ని అధికంగా విడుదల చేసే యూఎస్, చైనా, బ్రెజిల్, కెనడా, యూఈ దేశాల్లో తక్కువ కర్బన ఆధారిత ఇంధనాల ఉత్పత్తి విషయంలో కొంత పురోగతి సాధించినప్పటికీ.. ఈ విషయంలో భారీగా అవుతున్న ఖర్చు, దేశీయ పరిశ్రమపై పడే ప్రభావం దృష్ట్యా వస్తున్న వ్యతిరేకత అవరోధంగా మారినట్టు తెలిపింది. విడిగా దేశాల వారీగా చూస్తే.. ప్రజల జీవనోపాధికి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయన్నవ్యతిరేకతతో అర్థవంతమైన పురోగతికి ఆటంకం కలుగుతున్నట్టు వెల్లడించింది.
వివిధ రంగాల్లో కర్బన ఉద్గారాల తగ్గింపు విషయంలో పురోగతి వేర్వేరుగా ఉందని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో పెద్ద ఎత్తున వృద్ధి.. కొన్ని రంగాల్లో వేగంగా కర్బన ఉద్గారాలను ఎలా తగ్గించవచ్చన్న దానికి విజయవంతమైన నమూనాగా పేర్కొంది. విమానయానం, షిప్పింగ్ పరిశ్రమల్లో దీనికి సంబంధించి పురోగతి చాలా నిదానంగా ఉన్నట్టు వివరించింది. 2050 నాటికి సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడం అన్నది సుస్థిర విమానయాన ఇంధనాలను అభివృద్ధి చేయడంపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది.
భారత్‌లో పురోగతి..
భారత్ పునరుత్పాదక ఇంధనాల విషయంలో వేగవంతమైన పురోగతి సాధిస్తున్నట్టు కేపీఎంజీ నివేదిక వెల్లడించింది. 2047 నాటికి ఇంధనాల విషయంలో స్వతంత్ర దేశంగా అవతరించాలన్న ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా అడుగులు పడుతున్నట్టు తెలిపింది. ఫేమ్ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుండడాన్ని పస్త్రావించింది. కాకపోతే వ్యవసాయ రంగం నుంచి వెలువడుతున్న వ్యర్థాల తగ్గింపు భారత్‌కు సవాలేనని పేర్కొంది.
సబ్సిడీతో అందిస్తున్న ఎరువులను అధికంగా వాడుతుండడంతో, పశుగ్రాసం నుంచి మీథేన్ విడుదల తగ్గించడం కష్టమని అభిప్రాయపడింది. ‘‘భారత్ సోలార్, విండ్, హైడ్రోజన్ నుంచి మరింత విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. అయితే, భారత్ ఏటా 6 శాతానికి పైగా వృద్ధి చెందే క్రమంలో ఏర్పడే ఇంధన అవసరాల దృష్ట్యా.. శిలాజ ఇంధనాలపై ఆధారపడడం ఇక ముందూ కొనసాగుతుంది. కాకపోతే కొంత కాలానికి సంప్రదాయ ఇంధనాల వినియోగం మొత్తం ఇంధన వినియోగంలో తగ్గుతుంది’’అని కేపీఎంజీ ఇంటర్నేషనల్ ఎనర్జీ హెడ్ అనిష్ అన్నారు.