ప్రియుడి పెళ్లికి పోలీసులతో వచ్చిన టీవీ యాంకర్
పెళ్లి వేడుకల్లో అంతా బిజీగా ఉన్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల సందడితో పెళ్లి మండపం కళకళలాడుతోంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో కల్యాణ మండపం హోరెత్తిపోతోంది. ముహూర్తం సమయం దగ్గరపడటంతో వధువు, వరుడు సిద్ధమయ్యారు. కొద్ది క్షణాల్లో పెళ్లి ప్రక్రియ పూర్తికానుంది. ఇంతలో ఊహించని పరిణామం.
పోలీసులు మండపంలోకి వచ్చారు. వారిని చూసిన పెళ్లి కొడుకు ఉడాయించాడు. పెళ్లికి ముందు ఓ యువతితో సహజీవనం చేశాడన్న ఆరోపణలతో బంధువుల ఇంట్లో దాక్కున్న అతడిని హైదరాబాద్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి ప్రాంతానికి చెందిన సార మల్లికార్జునరావు బీటెక్ పూర్తిచేసి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఓ చానల్లో పనిచేస్తున్న యాంకర్‌తో పరిచయం ఏర్పడింది.
పెళ్లి చేసుకోవడానికి పెద్దల అంగీకారం అవసరమని ఆమెను నమ్మించాడు. అంతవరకూ సహజీవనం చేద్దామని చెప్పడంతో ఆమె అంగీకరించింది. నాలుగేళ్లుగా వీరు హైదరాబాద్‌లో సహజీవనం చేస్తున్నారు. 15 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి స్వస్థలం కత్తిపూడికి మల్లికార్జునరావు వచ్చాడు. అప్పటికే తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లికి అంగీకరించాడు. మర్రిపాలేనికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. శుక్రవారం తెల్లవారుజామున 4.20 నిమిషాలకు ముహూర్తం.
మాధవధార ఉడా కాలనీ సామాజిక భవనంలో పెళ్లికి ఏర్పాటుచేశారు. ముహూర్తం అర గంట ఉందనగా హైదరాబాద్ దరి వికారాబాద్ ఎస్ఐ, సిబ్బంది మండపానికి చేరుకున్నారు. వారితో ప్రేమికురాలు(హైదరాబాద్) మండపానికి రావడంతో మల్లికార్జునరావు అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసుల రాకతో రహస్యం బట్టబయలు అయ్యింది. పెళ్లి ఆగిపోయింది. తమ మధ్య సంబంధాన్ని ప్రియురాలు వివరించింది. 15 రోజులుగా మల్లికార్జునరావు సెల్‌ఫోన్ పనిచేయకపోవడంతో అనుమానం వచ్చిందని, స్నేహితుల ద్వారా పెళ్లి సంగతి తెలుసుకుని పోలీసుల సహాయంతో వచ్చినట్టు చెప్పింది.
మల్లికార్జునరావు కంచరపాలెంలో బంధువుల ఇంట్లో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. స్థానిక ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులకు సమాచారం అందించి హైదరాబాద్ తీసుకెళ్లారు. అతడిపై చీటింగ్ కేసు నమోదు కావడంతో హైదరాబాద్ పోలీసులు వచ్చినట్టు ఎయిర్పోర్ట్ జోన్ సీఐ బి.తిరుమలరావు తెలిపారు. వధువు కుటుంబ సభ్యులు ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.