ప్రముఖ రచయిత కన్నుమూత
బెంగళూరు: సాహితీ వర్గాలలో చిమూగా సుపరిచితులైన ప్రముఖ పండితుడు, పరిశోధకుడు, రచయిత డాక్టర్ చిదానంద మూర్తి శనివారం తెల్లవారుజామున బెంగళూరులో కన్నుమూశారు. వయోభారం కారణంగా తలెత్తిన అనారోగ్య సమస్యలతో కొద్దికాలంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిదానంద మూర్తి ఉదయం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
కన్నడ శాసనాలు, ప్రాచీనత్వం విషయంలో చిదానంద మూర్తి ఎంతో కృషి చేశారు. 2008లో భారత ప్రభుత్వం కన్నడ భాషకు ప్రాచీన హోదా ఇవ్వడం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. హిందూ- రైట్ వింగ్ ఛాంపియన్గా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. హంపి కళాఖండాలను కాపాడాలంటూ ఆయన చేపట్టిన ప్రచారం విస్తృత ప్రాచుర్యం పొందింది. మూర్తి డిమాండ్ మేరకే హైదరాబాద్ కర్ణాటక పేరును కల్యాణ్ కర్ణాటకగా ముఖ్యమంత్రి యడియూరప్ప ఇటీవల మార్చారు.
ముఖ్యమంత్రి సంతాపం
చిదానంద మూర్తి మరణం పట్ల ముఖ్యమంత్రి యడియూరప్ప సంతాపం ప్రకటించారు. మేధావిగా, పరిశోధకుడుగా, చరిత్రకారుడుగా కన్నడ భాషా పరిరక్షణకు చిదానంద మూర్తి విశేష సేవలందించారని కొనియాడారు. చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయన లేని లోటు భర్తీ కాదని అన్నారు. హంపి కట్టడం పరిరక్షణలో ఆయన పాత్ర, కన్నడ భాషకు క్లాసికల్ లాంగ్వేజ్ (విశిష్ట భాష) గుర్తింపు రావడానికి చేసిన కృషి బహుదా ప్రశంసనీయమని ఆయన గుర్తుచేసుకున్నారు.