colleague
-
కస్తూర్బాలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
శాయం పేట: సెల్‌ఫోన్ దొంగతనం చేశారని తోటి విద్యార్థినులు అవమానించారని మనస్తాపం చెందిన ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గోవిందాపూర్ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం సాయంత్రం జరిగింది. టీచర్లు వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. గోవిందాపూర్ కేజీబీవీలో కల్పన, పూర్ణ పదో తరగతి చదువుతున్నారు. ఇందులో హనుమకొండకు చెందిన కల్పన, పూర్ణతో కలిసి మంగళవారం రాత్రి అటెండర్ సెల్ ఫోన్ తీసుకొని తల్లికి ఫోన్ చేసింది. తనకు ఆరోగ్యం బాగా లేదని, ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. అదే సందర్భంగా తోటి విద్యార్థినులు గమనించి ‘దొంగ’‘దొంగ’.. అంటూ అవహేళన చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆ ఇద్దరు విద్యార్థినులు బుధవారం సాయంత్రం తమ వద్ద ఉన్న నెయిల్ పాలిష్‌ను తాగారు. గమనించిన టీచర్స్ వారిని వెంటనే పరకాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రిలో వైద్యసిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వారి ని వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారి ఆరోగ్యం మెరుగు పడటంతో గురువారం తల్లిదండ్రులు వారిని ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ విషయమై కేజీబీవీ స్పెషలాఫీసర్ మాధవిని వివరణ కోరగా కల్పన, పూర్ణ తమ ఇళ్లకు వెళ్తామని అడిగితే పర్మిషన్ ఇవ్వలేదని, ఆ బాధతోనే ఆత్మహత్యకు యత్నించారని పేర్కొన్నారు. -
తల నరికి చంపిన కేసులో నిందితుడికి విముక్తి.. కోర్టు ఏం చెప్పిందంటే...
తన సహోద్యోగిని నరికి చంపిన కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది మహారాష్ట్రలోని థానే జిల్లా కోర్టు. ఈ మేరకు 38 ఏళ్ల నేపాల్ జాతీయుడు రాజేష్‌కుమార్ నేపాలీ అలియాస్ యజ్ఞప్రసాద్ కాలూరామ్ పుఖ్రేల్ (జైసీ)ని నిర్దోషిగా ప్రకటించి ఈ కేసు నుంచి అతనికి విముక్తి లభించేలా చేసింది. ఏప్రిల్ 10 నాటికి ఉత్తర్వుల్లో నిందితుడిపై మోపిన అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని అదనపు సెషన్స్ జడ్జీ పేర్కొన్నారు. నిందితుడు బద్లాపూర్‌లోని కర్జాత్ హైవేపైన కత్రాప్ వద్ద చైనీస్ హోటల్లో పనిచేసేవాడు. ఏప్రిల్ 14, 2017న బాధితుడు జగత్ తేగ్బహదు షాహీతో సహ ఆ హోటల్ యజమానులు, ఇతర సిబ్బంది సమక్షంలో పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత యజమానులు వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడ సదరు నిందితుడు, బాధితుడు మాత్రమేఉన్నారు. మరుసటి రోజు ఒక దుకాణదారుడు బాధితుడి తలతో ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ నుంచి సుమారు వెయ్యి అడుగుల దూరంలో బాధితుడి శరీరాన్ని కనుగొన్నారు. దీంతో ఆ బాధితుడితో ఉన్న వ్యక్తి (రాజేష్ కుమార్)ని నిందితుడిగా అనుమానించి పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఉత్తర ప్రదేశ్‌కు వెళ్తుండగా అరెస్టు చేశారు. ఐతే పోలీసుల విచారణలో పలు లోపాలు ఉన్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అలాగే బాధితుడు మరణానికి ముందు నిందితుడు అక్కడే ఉన్నాడు అనడానికి సరైన ఆధారాలు సమర్పించడంలో కూడా విఫలమైనట్లు పేర్కొన్నారు. దీంతో నిందితుడిని నొర్దోషిగా ప్రకటిస్తూ ఊరట కల్పించింది కోర్టు. (చదవండి: బ్రిటన్ వెళ్లి శివాజీ ఖడ్గాన్ని తెచ్చేందుకు యత్నిస్తా!: మహారాష్ట్ర మంత్రి కీలక వ్యాఖ్యలు) -
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా సునీల్
భోపాల్: ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు గెలుపు వ్యూహాన్ని రూపొందించేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాజీ సహచరుడు సునీల్ కనుగొలును కాంగ్రెస్ రంగంలోకి దించింది. ఆయన ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ తరఫున పనిచేస్తున్నారు. సునీల్ గతంలో ఈయన ప్రధాని మోదీతో కలిసి బీజేపీ ప్రచార వ్యూహాన్ని రచించారు. 2017లో యూపీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో బీజేపీ గెలుపునకు బాటలు వేశారు. అనంతరం కాంగ్రెస్ తరఫున పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం వెనుక సునీల్ కృషి ఉంది. సునీల్ కనుగొలు(39) తండ్రి కర్ణాటక, తల్లి తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు. ఈయన విద్యాభ్యాసం తమిళనాడులో సాగింది. ఎంబీఏ, ఎంఎస్ అమెరికాలో పూర్తి చేశారు. -
యూకే హోం సెక్రటరీగా భారత సంతతి మహిళ
లండన్: భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ యూకే కొత్త హొం సెక్రటరీగా భాద్యతలు చేపట్టారు. ఆమె ఇద్దరు పిల్లల తల్లి. అంతేకాదు ఆమె తల్లి హిందూ తమిళియన్ ఉమా, తండ్రి గోవాకు చెందిన క్రిస్టీ ఫెర్నాండెజ్. ఐతే ఆమె తల్లి మారిషస్ నుంచి యూకే వలస వెళ్లగా, తండ్రి 1960లలో కెన్యా నుంచి వలస వచ్చారు. ప్రస్తుతం బ్రేవర్మన్కి చట్టపరమైన సవాళ్లు ఎదుర్కొంటున్న రువాండాకు చెందిన కొంతమంది శరణార్థులను పంపించాలనే ప్రభుత్వ ప్రణాళికకు సంబంధించిన ప్రాజెక్టులను అప్పగించనున్నట్లు సమాచారం. ఆమె తనతోటి సహోద్యోగి భారత సంతతికి చెందిన ప్రీతీ పటేల్ వారుసురాలిగా ఈ అత్యున్నతి పదవిని చేపట్టారు. ఈ మేరకు బ్రేవర్మన్ మాట్లాడుతూ...బ్రెక్సిట్ అవకాశాలను పొదుపరిచి, సమస్యలను చక్కదిద్దాలనుకుంటున్నాని చెప్పారు. యూరోపియన్ కోర్టు ఆఫ్ హ్యుమన్ రైట్స్ నుంచి యూకేని బయటకు తీసుకువచ్చేలా ఐరోపా నుంచి స్పష్టమైన విరామాన్ని కోరకుంటున్నాని తెలిపారు. ఆమె తన నాయకత్వ ప్రచార వీడియోలో తన తల్లిదండ్రుల గురించి చెబుతూ..వారు బ్రిటన్‌ని ప్రేమిస్తారని, తమకు ఈ దేశం అత్యంత భద్రతనిచ్చిందని అన్నారు. తాను రాజకీయాల్లోకి రావడం వల్లే తన నేపథ్యం గురించి అదరికి తెలిసిందని చెప్పుకొచ్చారు. ఆమె 2018లో రేల్ బ్రేవర్‌మాన్‌ను వివాహం చేసుకుంది. ఆమె గతేడాది రెండోవ బిడ్డకు జన్మనిచ్చే నిమిత్తం ప్రసూతి సెలవుల్లో ఉన్న సయంలోనే క్యాబినేట్ మంత్రిగా అనుమతించేలా ఒక చట్టపరమైన మార్పును తీసుకువచ్చి పేరుగాంచారు. ఆమె బౌద్ధ మతస్తురాలు, పార్లమెంటులో కూడా బుద్ధుని సూక్తులకు సంబంధించిన ధ్మపద గ్రంథంపై ప్రమాణ స్వీకారం చేశారు. (చదవండి: 'తక్షణమే రంగంలోకి దిగుతా'... వర్షంలో తడుస్తూనే) -
పాపం! సహోద్యోగి గట్టిగా కౌగిలించుకున్నాడని కోర్టుకెక్కిన మహిళ..
తనను గట్టిగా కౌగిలించుకోవడంపై కోపగించుకున్న ఓ మహిళ ఏకంగా కోర్టు మెట్లు ఎక్కింది. ఈ వింత ఘటన చైనాలో చోటుచేసుకుంది. యుయాంగ్ నగరంలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన మహిళ ఆఫీసులో ఉండగా మగ సహోద్యోగి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. అతని కౌగిలింతతో ఆమె నొప్పితో విలవిల్లాడిపోయి గట్టిగా కేకలు వేసింది. అతను విడిచిపెట్టిన తర్వత కూడా ఛాతీలో నొప్పి రావడంతో తాత్కాలికంగా ఆయిల్ మసాజ్ చేసుకొని ఉపశమనం పొందింది. అయితే అయిదు రోజుల తర్వాత ఛాతీలో నొప్పి ఎక్కువ అవ్వడంతో ఆసుపత్రికి వెళ్లింది. వైద్యులు ఎక్స్‌రేలో మహిళకు మూడు పక్కటెముకలు విరిగినట్లు తేలింది. కుడి వైపున రెండు, ఎడమ వైపున ఒకటి విరిగిపోయాయి. మహిళ ఆసుపత్రి బిల్లులకు భారీగా డబ్బు ఖర్చైంది. అంతేగాక ఆమె ఉద్యోగానికి కూడా వెళ్లేని పరిస్థితి రావడంతో ఆదాయాన్ని కోల్పోయింది. అనంతరం కోలుకుంటున్న సమయంలో సదరు మహిళ తనను హగ్ చేసుకున్న వ్యక్తి వద్దకు వెళ్లి తన పరిస్థితిని తెలిపింది. అయితే ఆ వ్యక్తి తన కౌగిలింత వల్ల ఇంత గాయం అయ్యిందా? రుజువు ఏంటని ఆమెనే ఎదరు ప్రశ్నించాడు. చదవండి: షాకింగ్: సామాన్య పౌరుడిగా.. లండన్ మెట్రోలో దుబాయ్ యువరాజు దీంతో చివరికి ఆ మహిళ చివరికి తన సహోద్యోగిపై కోర్టులో దావా వేసింది, తన ఆర్థిక నష్టాలకు పరిహారం ఇవ్వాల్సిందిగా కోరింది. ఈ కేసును విచారించిన కోర్టు 10,000 యువాన్లు (రూ. 1.16 లక్షలు) పరిహారంగా చెల్లించాలని సహోద్యోగిని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ అయిదు రోజుల్లో ఎముకలు విరగడానికి కారణమయ్యే ఏ కార్యకలాపంలో కూడా మహిళ పాల్గొన్నట్లు రుజువు చేసేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. -
సహోద్యోగులపై పోలీస్ కాల్పులు.. ముగ్గురు మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ పోలీస్ తన వద్ద ఉన్న తుపాకీతో ముగ్గురు సహోద్యోగులపై కాల్పులు జరిపాడు. సోమవారం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు పోలీసులూ మృత్యువాతపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోహిణి ప్రాంతంలోని హైదర్‌పూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో సిక్కిం రాష్ట్రానికి చెందిన పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. వీరి మధ్య జరిగిన గొడవ కారణంగా ఓ సిక్కిం పోలీస్(32) తోటి సిబ్బందిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు సంఘటన స్థలంలోనే మరణించారు. మృతులను కమాండర్ పింటో నామ్‌గ్యాల్ భూటియా, ఇంద్ర లాల్ చెత్రీగా పోలీసులు గుర్తించారు. మరొకరు దన్‌హంగ్ సుబ్బాకు తీవ్ర గాయాలవ్వగా బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ అతను కూడా మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాల్పులు జరిపిన నిందితుడిని ప్రబిన్ రాయ్‌గా గుర్తించిన ఢిల్లీ పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. కాగా రాయ్ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్స్, సిక్కిం పోలీసులకు చెందిన వాడు. రాయ్, భూటియా 2012 బ్యాచ్ నుంచి గ్రాడ్యూయెట్ పూర్తి చేయగా.. సుబ్బా, చెత్రీ 2013 బ్యాచ్‌కు చెందిన వారు. -
మహిళా ఉద్యోగిపై...
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లా పౌరసరఫరా శాఖా కార్యాలయంలో అసిస్టెంట్ పౌరసరఫరాల అధికారిగా పని చేస్తున్న పీతల సురేష్ సహోద్యోగినిని అసభ్యకర పదజాలాలతో మాట్లాడడంతో గురువారం ఆమె బంధువులు పౌరసరఫరాల కార్యాలయానికి వచ్చి ఆందోళనకు దిగారు. పౌరసరఫరాశాఖలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెన్షన్ వివరాలు కావాలని ఏఎస్ఓ సురేష్ పలుమార్లు సీనియర్ అసిస్టెంట్ ప్రసన్నజ్యోతిని అడిగారు. అయితే ఆమె సమాధానం ఇవ్వకపోవడంతో బుధవారం ఆమెను అనేక సార్లు పిలిచినా ఆమె స్పందించలేదు. దీంతో సురేష్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్యకర పదజాలాలతో మాట్లాడినట్టు ఆమె తన బంధువులకు తెలిపింది. గురువారం ఆమె బంధువులు, ఐద్వా మహిళానాయకురాళ్లు సివిల్సప్లైకు వెళ్లి ఆందోళన చేపట్టారు. అసభ్యకరపదజాలాలతో మహిళలను వేధిస్తున్న సురేష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి పి.ప్రసాదరావు ఆందోళనకారుల వద్దకు వచ్చి పరిస్థితిని తెలుసుకున్నారు. ఉద్యోగిని పట్ల అమర్యాదగా ప్రవర్తించిన సురేష్‌తో ఆమెకు క్షమాపణ చెప్పించడంతో ఆందోళనకారులు శాంతిం చారు. ఒకనొక దశలో ప్రసన్నజ్యోతి బంధువులు సురేష్‌పై దాడికి ప్రయత్నించడంతో పలువురు అడ్డుకున్నారు. పౌరసరఫరాల శాఖా కార్యాలయంలో జరిగిన ఆందోళన, తదితర విషయాలను డీఎస్ఓ ప్రసాదరావు జేసీ లక్ష్మీశ దృష్టికి తీసుకెళ్లారు. -
వినయ విధేయ
ఎప్పుడూ పక్కన కూర్చునే సహోద్యోగే ఇప్పుడు కావాలని ఒదిగి మరీ కూర్చుంటున్నాడు! అన్నెససరీ కదా. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే మనిషి, ఇప్పుడు కేవలం పలకరిస్తున్నాడు. అవసరమా అంత డిస్టెన్స్ ఎడ్యుకేషన్! ఇంకొకరు.. తప్పుకుని, తప్పుకుని వెళుతున్నారు. దీన్నేమనుకోవాలి? డీసెన్సీనా, డిప్లమసీనా, లేక.. ‘చూశావా.. మీటూ వల్ల ఎంత అనర్థమో’ అని చెప్పడమా?! చూసేదే ప్రపంచం. కనిపించేది కాదు. ప్రపంచాన్ని స్త్రీ ఒకలా చూస్తుంది. పురుషుడు ఒకలా చూస్తాడు. ప్రపంచానికి సొంతంగా ఓ షేప్ లేదా మరి? ఉంటుంది. అది ఏ షేప్‌లో ఉందన్నది మాత్రం స్త్రీ, పురుషులకు ఏ షేప్‌లో కనిపిస్తోందో అదే. అప్పుడు ఒకే ప్రపంచానికి రెండు షేప్‌లు అవ్వవా? అవుతాయి. అందుకే ఈ జెండర్ యుద్ధాలు. ‘బ్యాటిల్స్ ఆఫ్ సెక్సెస్’. ఇప్పుడు నడుస్తున్న బ్యాటిల్.. ‘మీ టూ’. చూడ్డంలో స్త్రీ కొంచెం పవర్ఫుల్. చూపు వెనుక చూపేమిటో కూడా ఆమె గ్రహించగలుగుతుంది. పురుషుడిలా ఆమె కూడా మనిషే కదా, ఎలా పురుషుడికన్నా ఆమె చూపు పవర్ఫుల్ అయింది? చాలా చూసింది కాబట్టి! స్త్రీ కూడా తనలా మనిషే అని పురుషుడు ఏ యుగంలోనూ అనుకోలేదు కాబట్టి. ‘ఆమె నన్ను ఎలా చూస్తే నేను అదే అయిపోతానా?’ అని పురుషుడి చికాకు. ‘అతడు నన్ను ఎలాగో లేకపోతే నేను అలా చూస్తానా?’ అని స్త్రీ సమాధానం. మళ్లీ యుద్ధం. బ్యాటిల్ ఆఫ్ సెక్సెస్. యుద్ధంలో కూడా మళ్లీ వైరుద్ధ్యం. పురుషుడు చికాకు పడతాడు. స్త్రీ సమాధానం చెబుతుంది. ఎందుకనంటే అధికుడిననుకుంటాడు పురుషుడు. అందుకని చికాకు పడతాడు. అర్థమయ్యేలా చెప్పాలనుకుంటుంది స్త్రీ. అందుకని సమాధానంతో సరిపెడుతుంది. ఇప్పుడు ఆమె చెబుతున్న సమాధానం.. ‘మీటూ’. కొద్దిగానైనా పురుషుడి చూపును మారుస్తోందా ‘మీ టూ’? పాపం.. ట్రై చేస్తున్నాడు మార్చుకోవాలని. సాటి మగవాళ్ల చూపును కూడా మార్చాలని చూస్తున్నాడు. ఆ చూడ్డం ఎలాగంటే.. ‘బాస్.. బీ డీసెంట్ టువర్డ్స్ హర్.. ఎందుకొచ్చిన షిట్’ అంటున్నాడు. అలాగా చూడ్డం! ‘మర్యాద కావాలా.. అయితే తీస్కో ఇస్తా’ అని పగబట్టినట్లుగానా చూడ్డం?! జపాన్ ప్రభుత్వం ‘మీ టూ’పై ఒక పోస్టర్ వేయించి, దేశంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నిటికీ పంపబోతోంది. అంతకన్నా ముందు శాంపిల్‌గా పోస్టర్ని ట్విట్టర్లో పెట్టి ‘హావ్వీజిట్?’ అంది. ఉద్దేశం ఏంటంటే.. ఆఫీస్‌లో ఎవరైనా ఆడవాళ్లను లైంగికంగా వేధిస్తుంటే, ఆ వేధింపుల్ని ఆపే బాధ్యత మీదే అని. ‘మీదే’ అంటే పురుషులదే అని. ముల్లుతో ముల్లును తియ్యడం. అయితే ఈ ముల్లు మిస్ ఫైర్ అయి తిరిగి ప్రభుత్వం కాల్లోకే వెళ్లి గుచ్చుకుంది. ట్విట్టర్లో అంతా ఇన్ని తలంబ్రాలేస్తున్నారు. ‘మీ టూ’పై సెటైర్ వెయ్యడానికే ఈ పోస్టర్’ అనీ, మగబుద్ధికి ఇంతకన్న మంచి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయనీ, లైంగికంగా వేధించేవాళ్లనే పోస్టర్ సపోర్ట్ చేస్తోందనీ, ఈ పోస్టర్ని తయారుచేసిన టీమ్‌లో ఏ దశలోనూ స్త్రీలు లేనట్లున్నారనీ, ఇదిగో.. ఇందుకే మన దగ్గర ఉమెన్ పొలిటీషియన్లు తక్కువనీ.. ట్వీట్ల వర్షం కురుస్తోంది. ఈ పోస్టర్‌ను రిలీజ్ చేసింది జపాన్ క్యాబినెట్ ఆఫీస్. పోస్టర్లో జపాన్ నటుడు మికిహిసా అజుమా నోరు సగం తెరిచి, ఎంతో అమాయకంగా.. ‘ఇది కూడా సెక్సువల్ హెరాస్మెంటేనా?’ అని ప్రశ్నిస్తుంటాడు. వెనుక.. ఆయనవే రెండు చిన్న తలలు అటు, ఇటు ఉంటాయి. ఒక తల ఓరకంట తన సహోద్యోగిని చూస్తూ.. ‘‘నిన్నటి కన్నా మీరు అందం కనిపిస్తున్నారు. సన్నబడుతున్నారేమో కదా?’’ అంటుంటుంది. రెండో తల, ఇంకో ఉద్యోగిని వైపు చూస్తూ ‘‘ఇవాళ మీ డ్రెస్.. బాగుంది. నాకిలా ఉంటే ఇష్టం’’ అని చెబుతుంటుంది. ఆ కాంప్లిమెంట్లకు ఆ ఇద్దరు అమ్మాయిలు కోపంగా ఒకరు, ఇబ్బందిగా ఒకరు చూస్తుంటారు. పోస్టర్ అడుగున మళ్లీ మికిహిసా అజుమా ప్రత్యక్షం అవుతాడు. ‘ఇది కూడా సెక్సువల్ హెరాస్మెంటేనా?’ అనే ప్రశ్నకు.. ‘ఏది సెక్సువల్ హెరాస్మెంటో నిర్ణయించవలసింది నువ్వు కాదు’ అని అతడే కింద సమాధానం ఇస్తుంటాడు. చురుకైన సందేశం ఉంది. అర్థంకాకనో, మరీ ఎక్కువ అర్థం అవడం వల్లనో గురి తప్పింది. ‘నీ చూపు నీకు వేధింపులా ఉండకపోవచ్చు. ఆమె చూపుకు అది వేధింపులా అనిపించవచ్చు.వేధింపా కాదా అన్నది డిసైడ్ చెయ్యవలసింది మాత్రం నువ్వు కానే కాదు’ అని పోస్టర్ అర్థం. జపాన్‌లో ఏటా ‘వయలెన్స్ అగైన్స్ట్ ఉమెన్’పై క్యాంపెయిన్ జరుగుతుంటుంది. ఆ క్యాంపెయిన్ ఈ ఏడాది నవంబర్ 12 న మొదలైంది. 25 వరకు జరుగుతుంది. అందుకోసం వేసిన పోస్టరే ఇది. ‘మగవాళ్లూ అమాయకత్వం నటించకండి. మీ పక్కన ఉన్న మహిళను ఎవరైనా వేధిస్తుంటే చూస్తూ ఊరుకోకండి’ అని చెప్పడం కోసం చేయించిన ఈ పోస్టర్‌ను ఎవరెంత అర్థం చేసుకున్నా.. వెనక్కు తీసుకునేది లేదని ప్రధాని షింజో అబే చెబుతున్నారు. జపాన్‌లో ఉద్యోగాలకు వచ్చే మహిళల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండడంతో.. ఉమెన్ వర్క్‌ఫోర్స్‌ను పెంచడం కోసం ఆయన ‘ఉమెనామిక్స్’ అనే అత్యవసర విధానాన్ని నాలుగేళ్లుగా అమలు చేస్తున్నారు. ‘మీ టూ’ మొదలయ్యాక ఆఫీస్‌లలో మహిళా ఉద్యోగులకు వేధింపులు తగ్గాయేమో కానీ, సాధింపులు ఎక్కువయ్యాయి. ఎమోషనల్ అత్యాచారాలు మొదలయ్యాయి. ఎప్పుడూ పక్కన కూర్చునే సహోద్యోగే ఇప్పుడు కావాలని ఒదిగి మరీ కూర్చుంటున్నాడు! అన్నెససరీ కదా. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే మనిషి, ఇప్పుడు కేవలం పలకరిస్తున్నాడు. అవసరమా అంత డిస్టెన్స్ ఎడ్యుకేషన్! ఇంకొకరు, తప్పుకుని.. తప్పుకుని వెళుతున్నారు. దీన్నేమనుకోవాలి? డీసెన్సీనా, డిప్లమసీనా లేక.. ‘చూశావా.. మీటూ వల్ల ఎంత అనర్థమో’ అని చెప్పడమా! ‘సారీ, ఏదో ఆలోచిస్తూ మీ వైపు చూశాను. ఇదీ కూడా మీటూ కిందికే వస్తుందా?’ అని ఎక్స్‌ట్రాలు, ఎక్స్ట్రీమ్లు చేసేవాళ్లు కొందరు! ఆఫీస్‌లలో ఆడవాళ్లతో కాస్త మర్యాదగా ఉండండి అంటే.. ఈ అతిమర్యాదేంటి? అమర్యాద కన్నా హీనం అతిమర్యాద. బ్యాటిల్ ఆఫ్ సెక్సెస్కి కూడా యుద్ధనీతి అనేది ఒకటి ఉంటుంది. పనిచేసే చోట దొంగ విధేయతలు, యుద్ధంలో దొంగచాటు సంధింపులు రెండూ ఒకటే. అన్ ఫెయిర్. ∙మాధవ్ శింగరాజు -
ఓహో.. గులాబీ బాలా!
నీకెందుకో అనిపిస్తుంది – మంచి టైలరనేవాడు నిజమైన ప్రేమ, నీతి నిజాయితీ లాంటి కావ్యవస్తువు అని. అందరూ వాడి గురించి మాట్లాడతారు, సినిమాలు తీస్తారు, స్తోత్రాలు చదువుతారు – కానీ తుచ్ఛమైన ఐహిక ప్రపంచంలో వాడి షాపు తాలూకు దారం పోగు కూడా నీకెక్కడా కనబడదు. వెతకాలని నిశ్చయించుకుంటావ్. ఆల్కెమిస్ట్ పుస్తకంలో గుంటడు శాంటియాగోని ఆదర్శంగా తీసుకుని, మీ ఊరి ‘‘జగ్గయ్యాక్లాష్టోరూం’’ వాళ్ళ కర్రల సంచీలో ఎంతో ఇష్టంగా కొనుక్కున్న నీ రెండు పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్సు కుక్కి ఊరిమీద పడతావు.అనుకున్నది పొందటానికి నీలోపల కఠోరమైన దీక్షా, హరితేజా, అర్చనా, పట్టుదలా ఉండాలని ఎనిమిదవ శతాబ్దపు చైనా కవి ఒకాయన రాసిన వ్యక్తిత్వవికాస హైకూ నీ మదిలో గంగానమ్మ స్టైల్ డ్యాన్సు చేస్తూ ఉంటుంది. తిరిగీ తిరిగీ శోషొచ్చి పడే దశలో ఒకానొక షాపు ముందు అరుగు మీద కూర్చుంటావు. ఇక నీవల్ల కాక ఇంటికి వెళ్దామనుకునేసరికి ఎవరో నిన్ను పిలిచినట్టు వినబడుతుంది. తిరిగి చూస్తే చింకిబట్టల్లో ఒక బారుగడ్డం ముసలాయన నీ వైపు వెర్రిగా, వింతగా చూస్తుంటాడు. నువ్వు అజ్ఞానివై పర్సులో చిల్లరకోసం వెదుకుతావు. అతను వికటాట్టహాసంచేసి ‘‘ఎందుకొరకొచ్చావే చిలకా! నీకేమి దొరికినాదే చిలకా!’’ అని ఏదో పాడుతూ వెళ్ళిపోతాడు. వెనక్కి తిరిగి బోర్డు పైన పేరు చదూతావు. ఆకృతీ ఫ్యాషన్ టైలర్స్. ముసలాయన జాడ కనబడదు. నీ బాల్యావస్థలో చూసిన రాడాన్ వారి డబ్బింగ్ సీరియళ్ళలో ఇలా మిస్టీరియస్ ముసలాళ్ళొచ్చి జ్ఞానోపదేశాలూ వగైరా చెయ్యడం కద్దే అని గుర్తొచ్చి కాస్త కంగారు తగ్గుతుంది. కోరమంగళాలో ఉండే మీ కొలీగ్ వాళ్ళ వదిన కజిన్ బెస్ట్ ఫ్రెండ్‌కి భువనైకమోహనమైన సల్వార్లు కుట్టిన టైలర్ షాప్ పేరు కూడా ఆకృతీ ఫ్యాషన్సే అని నీకు వెలుగుతుంది. ఆ అమ్మే ఈ అమ్మగా మళ్ళీ పుట్టిందేమో అనే ఆశతో ఆ గడప తొక్కుతావు. అక్కడ తగిలించివున్న నమూనా డ్రెస్సులుచూసి పైన వ్రాయబడ్డ విశేషణంలోని ‘భు’, ‘వ’, ‘నై’, ‘క’, ‘మో’ అక్షరాలు విసుగ్గా గదిలోకెళ్ళి నీ మొహమ్మీదే ధభీమని తలుపేసేస్తాయి. ముక్కు పగలనందుకు సంతోషిస్తూ ఓ మోస్తరు హనంగా అయినా ఉన్నాయిలెమ్మని లోపలికెళ్తావు. అయినా బట్టల అందం వేసుకునేవాళ్ళల్లో ఉంటుందనే సూక్తి నీ స్ఫురణకొస్తుంది. నీ చిన్నప్పుడు మీ ఊరి కాశీ టైలరు మీ అమ్మ షిఫాన్ చీరతో నీకు కుట్టిన ‘‘స్టెప్స్ ఫ్రాక్’’ అనే వస్త్ర విశేషం తొడుక్కున్నపుడు మీ అమ్మమ్మ తాతయ్యా ‘‘విక్టోరియా మహారాణిలా ఉన్నావే!’’ అని మురిసిపోవటం గుర్తుతెచ్చుకుంటావు. దాన్ని ఒక శనివారం మీ స్కూలుకు వేసుకెళ్లినప్పుడు నిన్ను చూసి స్కూల్‌బస్‌లో కొందరు కెవ్వుమని అరిచి కిటికీ అద్దాలు బద్దలుకొట్టి దూకబోవటం మాత్రం నీ మనసు లోతుల్లోకి ఎన్నడో తోసేశావు. షాపులో కమ్మటి గ్రీజు వాసనకొడుతూ ఉంటుంది. నాలుగైదు మిషను చక్రాలు గిరగిర తిరుగుతూ ఉంటాయి. కత్తిరించిన గుడ్డ పీలికలు రంగురంగులుగా కుప్ప పోసి ఉంటాయి. నీ మనసు ఉప్పొంగుతుంది. ఏ వృత్తికావృత్తి ఎంత ప్రత్యేకమైనది! ప్రతీ పని తాలూకు సౌండ్‌స్కేప్, కలర్స్కేప్ దానికే ప్రత్యేకం కాదూ? శ్రమలో ఎంత జీవనమాధుర్యముంది! ఈ విధంగా శ్రమని రొమాంటిసైజ్ చేస్తూ, శ్రమ దోపిడీని హైలైట్ చేస్తూ చక్కటి అవార్డ్ విన్నింగ్ అభ్యుదయ కవిత ఒకదాన్ని మనసులో పేర్చుకుంటూ ఓనరు లా కనిపిస్తున్న వ్యక్తిని వెళ్ళి అడుగుతావు–‘‘సల్వార్ కుట్టాలి. పార్టీ వేర్. ఎంతౌతుంది?’’అతడి జవాబు విన్నాక నీ కవితా సౌధం కుప్పకూలుతుంది. లేకపోతే! మీ ఊరిలో ఇచ్చేదానికన్నా డెబ్భైరూపాయలు ఎక్కువ అడిగాడు! ఇందాకటి కూలిపోయిన కవితాసౌధపు కాంక్రీట్ రద్దుముక్క ఒకదాన్ని తెచ్చి కాసేపు దాంతో గీకి గీకి బేరమాడతావు. శాల్తీ ఒక్కింటికి కనీసం యాభైరూపాయలు తగ్గిస్తావ్. ఊరుకుంటే ఈ టైలర్లు దోచేస్తారు మరీని!బేరమయ్యాక సంచీలోంచి రెండు జతల మెటీరియల్సూ తీస్తావ్. నీ మెదడులో ఇందాక ముసలాయన చేసిన జ్ఞానోదయం ఇప్పుడు జ్ఞానమధ్యాహ్న దశకు చేరుకుంటుంది. అందుకు ఒకటే జత ముందర కుట్టడానికిచ్చి అది బావుంటే ఆనిక్కి రెండోది ఇద్దామనుకుంటావు. రెండిట్లో కాస్త తక్కువగా నచ్చిన గులాబీ తెలుపు కాంబినేషన్ డ్రెస్సును ప్రయోగానికి సిద్ధం చేస్తావ్. అప్పటిదాకా క్యాఫెటేరియాలో పునుగులు తింటున్న నీలోని నీతా లుల్లా, రీతూ కుమార్‌లు రంగంలోకి దిగుతారు.‘‘మంచి క్వాలిటీ అనార్కలి మెటీరియల్ ఇది. ప్యూర్ క్రేప్. ఈ వైట్ కలర్ పీస్ చెస్ట్ దగ్గరికి రావాలి. దుపట్టా (తెలుగువాళ్ళలాగా చున్నీ అంటే పరువు తక్కువ లుల్లాజీ దగ్గర) పింక్ కలర్ కదా.. కాంట్రాస్ట్ బాగా కనబడుతుంది. అన్నట్టు దుపట్టాకి వైట్ కలర్ ముత్యాల లేస్ బోర్డర్ వెయ్యండి. ప్లెయిన్ జిగ్ జాగ్ బాగోదు. నెక్ ‘‘వీ’’ కాదు, ‘‘యూ’’ కాదు, ఇంగ్లిష్ లెటర్ ‘‘క్యూ’’ ఆకారంలో రావాలి. నీ మనసులోని అంతులేని ఆశలకి అక్షర రూపమిచ్చి అతనికి చేరవేస్తావు. ‘‘క్యూ?’’ అన్నట్టు చూస్తాడు టైలరు.‘‘అంటే ఆ బాటం క్లాత్‌ని డోరీ లాగ డిజైన్ చేసి, ఏటవాలుగా అటాచ్ చేసి, కింద సిల్వర్ కలర్ టాస్సెల్స్ పెట్టాలి. అది రైట్సైడ్కి రావాలి. లెఫ్టైతే మళ్ళీ దుపట్టా కింద కనబడదు. ఇంకా బాటమేమో చూడీ చెయ్యండి.’’టైలరు మౌనంగా మడతేసుకుంటాడు.‘‘ఏవండీ! గుర్తుంటాయా అన్నీ? లేదంటే రాసుకుంటారా?’’ ఆరాటంకొద్దీ అడుగుతావు.‘‘అక్కర్లేదు మేడం. నేనూ డిగ్రీ చదివాను. ఐ కెన్ రిమెంబర్. మీరు చెప్పినట్టే కుడతాను. మీకు నాపైన భరోస లేదా?’’ అంటాడతను.అతని ఉనికిని ప్రశ్నించి ఈగోని దెబ్బతీసినందుకు నీపైన నీకే కోపమొస్తుంది.‘‘సారీ అండీ. నాకు దివాలీ లోపు కావాలి. ఇవ్వగలరుగా?’’‘‘అప్పటిదాకా అక్కర్లేదండీ! వచ్చే శనివారం ఇచ్చేస్తాగా!’’ఆనందభాష్పాలు తుడుచుకుంటూ చీటీ తీసుకుని ఇల్లు చేరుకుంటావు.ఆ రోజు రాత్రి టీవీలో తమన్నా గులాబీ, తెలుపు రంగుల్లో ఉన్న సల్వార్ వేసుకుని కనబడుతుంది. లుల్లాజీ ఆ డ్రెస్సు కన్నా నీదే బాగొస్తుందని వక్కాణిస్తుంది. రెండ్రోజులాగి ఇంట్లో జనం ఏదో సినిమా చూస్తుంటే డైలాగు వినబడుతుంది– ‘‘తెల్లని దుస్తులు ధరించినది. పై వస్త్రము గులాబీ రంగు’’. నీ డ్రెస్సు ఎలా తయారవ్వబోతోందో తలుచుకుని రోమాలు నిక్కబొడుచుకుంటాయి.శనివారం ఉదయం టైలరుకు ఫోన్ చేస్తావు. స్విచాఫ్! సాయంకాలమూ అదే పరిస్థితి. మర్నాడు ఎలాగో ఆదివారం కొట్టుకు సెలవు. సోమవారమూ మనిషి పత్తా ఉండడు. నీకు మెల్లిగా గుబులు మొదలౌతుంది. ఒకవేళ అతను సరుకంతా తీసుకుని పారిపోయుంటే? అతని నంబరు పోలీసులకిచ్చి లొకేషన్ ట్రేస్ చెయ్యిద్దామా అనే విపరీతాలోచనలతో నీలో నువ్వే మదనపడుతుంటావు.మంగళవారం మధ్యాహ్నం అతనే ఫోన్ చేస్తాడు– ‘‘మేడం! అర్జెంటు పని మీద మాండ్య వెళ్ళాను. డ్రెస్సు అద్భుతంగా వస్తోంది. ఇంకొక్క రెండురోజులు.. శుక్రవారం నేనే డెలివర్ చేయిస్తాను. నా పైన భరోసా ఉంచండి.’’ అని.తరువాతి మంగళవారం ఉదయం మొహానికి మంకీటోపీ, కూలింగ్ గ్లాసులూ ధరించిన ఒక ఆగంతకుడు బెదురుగా మీ ఇంటి గుమ్మంలోకొచ్చి గేటుమీంచి మీ వరండాలోకి ఓ ప్యాకెట్ విసిరేసి అదేపోతపోతాడు.ఏముందో తెరిచి చూస్తావు. దాదాపు ఒక గంటపాటు మాటా పలుకూ లేకుండా పడివున్నావని మీ ఇంట్లో జనం చెప్తారు. తిరిగి ఆ ప్యాకెట్ వైపు చూసే ధైర్యం చేస్తావు. దుఃఖం గొంతులో పారసెటమోల్ ఎంజీ మాత్ర లాగా అడ్డుపడుతుంది. ‘‘పోనీ ఓసారి వేసుకుని చూడు. బాగానే ఉంటే ఇంట్లో వేసుకోవచ్చు, లేకపోతే పోయే..’’ మీ అమ్మమ్మ ఊరడించటానికి ప్రయత్నిస్తోంది.ఏమి జరిగిందో నీకు చెదురుమొదురుగా గుర్తొస్తూ ఉంటుంది.నువ్వు పైన వెయ్యమన్న తెల్లటి క్రేప్ క్లాత్ స్థానంలో మస్తు నీలం పెట్టిన దళసరి లోపల్లంగా క్లాతు ఉంటుంది. దానికేవో ముత్యాలు కుట్టి మేకప్పేసి అందంగా చూపించే ప్రయత్నం కూడా చేయబడిందని గ్రహిస్తావు. దుపట్టాకి ఒక మూల దట్టంగా అంటుకున్న గ్రీజు వాసన చూస్తావు. కూలిపోయిన సౌధాల విషాధ గా«థలు వినబడతాయి. చూడీ పైజమా, మీ ఇంట్లో మొక్కలకి నీళ్లు పెట్టే ట్యూబూ ఒకే వ్యాసంతో ఉన్నాయని తెలుసుకుంటావు. ఏలాగోలా ప్లాస్టిక్ కవరేసి దాన్ని మడమలమీంచి ఎక్కించే ప్రయత్నం చేస్తావు. చూడి పైజమా కనిపెట్టినవాడికి గరుడపురాణం ప్రకారం ‘‘సూచీముఖం’’ కరెక్టా లేక ‘‘కుంభీపాకం’’ శ్రేష్టమా? అనే మీమాంసలో పడతావు. కుర్తా నిత్యా మీనన్‌కి ఇలియానా కొలతలతో కుట్టినట్టు ఉంటుంది. నెక్లైన్ అక్షరాలా నీ గొంతు కోస్తూ ఉంటుంది. నీ కుడి చెయ్యి భూమికి సమాంతరంగా ఉంటుంది. ఎడమ మోచేతికి టెన్నిస్ ఎల్బో వస్తుంది.మిగిలున్న కాస్త జీవశక్తినీ కూడగట్టుకుని షాపుకు వెళ్తావు. వాడు వెకిలిగా నవ్వుతూ ‘‘మీ మెషర్మెంట్స్కి క్లాత్ సరిపోలేదు మేడం.. అందుకే ఎగష్ట్రా క్లాత్ కొనివేశాను. బాగా వచ్చిందా?’’ అంటూ వేరే కస్టమర్ దగ్గర బలిబట్టలు మడతేస్తుంటాడు. నీ ఆకృతి పట్ల నీకున్న అపోహలకి ఆజ్యం పోసినట్టౌతుంది. కాళ్ళకింద భూమి కుంగిపోతుంది.లోపలినించి ఒక ఆరేడేళ్ళ పిల్ల వస్తుంది. టైలరు పిల్లవంక మురిపెంగా చూస్తూ ఉంటాడు. ‘‘ఆంటీ ఇవాళ నా హ్యాపి బర్త్‌డే! చాక్లెట్ తీసుకోండి’’ అని ఒక ఆల్ఫెన్లీబే నీ చేతిలో పెడుతుంది. ఈ చాక్లెట్టు పేరు ఏనాడూ ఇంగ్లిష్‌లో సరిగా రాయలేనందుకు నీపైన నీకు అసహ్యం కలుగుతుంది. నువ్వెందుకూ పనికిరావనే భావన నిన్ను నిలువునా ముంచేస్తుంది. నువ్వు ఈ అనంతవిశ్వంలో కేవలం ఒక ధూళికణానివనిపిస్తూ ఉంటుంది. అయినా నీకే ఇన్ని ఆలోచనలూ ఉద్వేగాలూ ఎందుకుండాలనిపిస్తుంది. దీన్నే మేధావి పరిభాషలో ‘ఎక్జిస్టెన్షియల్ క్రైసిస్‘ అంటారని నీ ఇంటలెక్చువల్ ఫేస్బుక్ ఫ్రెండొకాయన చెప్పటం గుర్తొస్తుంది.ఆటో పిలిచి ఎక్కబోతూ ఉంటావు.అప్పుడు గమనిస్తావు. ఆ పిల్ల తెల్లని గౌను ధరించినది. పైన కుచ్చులు గులాబీ రంగు. · - సాంత్వన చీమలమర్రి -
సహోద్యోగినికి సైబర్ వేధింపులు
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్నెట్ ద్వారా ఖరీదు చేసిన అమెరికా నెంబర్ వినియోగించి సహోద్యోగినిని ఆన్లైన్ వేధింపులకు గురి చేసిన నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా అర్జునుడిపాలానికి చెందిన బి.వెంకట సత్యనారాయణరెడ్డి ప్రస్తుతం మాదాపూర్‌లో ఉంటూ ఓ హోటల్లో పని చేస్తున్నాడు. ఇదే హోటల్లో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఓ యువతి సైతం పని చేశారు. ఆమెకు పెళ్లికుదరడంతో నిశ్చితార్థం కూడా జరిగింది. ఆమెపై అసక్తి పెంచుకున్న సత్యనారాయణ పెళ్లి చెడగొట్టాలని భావించాడు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ ద్వారా అమెరికాకు చెందిన ఓ సిమ్‌కార్డు ఖరీదు చేశాడు. దీనిని వైఫై ద్వారా వినియోగిస్తూ వాట్సాప్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నాడు. బాధితురాలి ఫోన్లో ఉన్న ఆమె ఫొటోలు, కాబోయే భర్త నెంబర్ సేకరించిన అతను అభ్యంతరకరమైన వ్యాఖ్యలు జోడిస్తూ సహోద్యోగులతో పాటు కాబోయే భర్తకూ పంపాడు. అతని వేధింపులు తాళలేక బాధితురాలు ఉద్యోగం సైతం మానుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సత్యనారాయణ నిందితుడిగా గుర్తించి శుక్రవారం అతడు పని చేస్తున్న హోటల్లోనే అరెస్టు చేశారు. -
దివాకర్‌కు ఇమేజ్ కొలీగ్ సొసైటీ పురస్కారం
సామర్లకోట : రోహిణి స్టూడియో అధినేత తామరపల్లి దివాకర్‌కు అమెరికాలోని ఇమేజ్ కొలీగ్ సొసైటీ అత్యున్నత గౌరవ పురస్కారాన్ని ప్రకటించింది. స్టూడియో లైటింగ్‌పై పొట్రెట్ ఫొటోగ్రఫీపై 12 చిత్రాలతో కూడిన ఫొటో డాక్యుమెంటరీని అంతర్జాతీయ పోటీల కోసం ఈ ఏడాది మార్చిలో ఫొటోగ్రఫీ సొసైటీ అమెరికా, ఫెడరేషన్ డీలా ఆర్ట్ ఫొటోగ్రఫీ (ఫ్రాన్స్)తో పాటు ఇమేజ్ కొలీజ్ సొసైటీ(అమెరికా)కు ఆయన పంపారు. ఈ ఏడాది దివాకర్ పంపిన తెలుపు–నలుపు విభాగంలోని ఫొటోలు కళ్లకు కట్టినట్టుగా ఉండటంతో, ఇమేజ్ కొలీజ్ సొసైటీ న్యాయనిర్ణేతలు ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. సంస్థ చైర్మన్ టోనీ లీకిమ్ తాన్ ఈ–మెయిల్ ద్వారా సర్టిఫికెట్ జారీ చేశారు. సొసైటీలో జీవిత కాలం సభ్యతాన్ని కూడా పంపారని దివాకర్ బుధవారం విలేకరులకు వివరించారు. అమెరికన్ గౌరవ పురస్కారాన్ని అసెంబ్లీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ ఇటీవల దివాకర్‌కు అందజేశారు. -
సహచరులపై సైనికుడు కాల్పులు: ఒకరు మృతి
కొల్కతా: పశ్చిమ బెంగాల్ మాల్డాలోని బీఎస్ఎఫ్ సైనిక శిబిరంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. శిబిరంలోని ఓ సైనికుడు తన వద్దనున్న తుపాకీతో సహచరులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఒకరు రక్తపు మడుగులో కుప్పకూలి మరణించాడు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని... విచారిస్తున్నారు. క్షతగాత్రులను మాల్డాలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నల్లగా ఉన్నావంటూ వేధించి జైలుపాలు
హైదరాబాద్ : నల్లగా, అందవికారంగా ఉన్నావంటూ తోటి ఉద్యోగినిని వేధించడమే కాకుండా ఆమె మనోభావాలను దెబ్బతీసిన యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ మహేందర్ రెడ్డి కథనం ప్రకారం... జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో ఉన్న లుస్కో ఇటాలియా ఫర్నిచర్లో విశాఖపట్నానికి చెందిన కొండల్ రావు సేల్స్ మెన్. ఇదే షోరూంలో పని చేస్తున్న యువతని నీవు నల్లగా అందవికారంగా ఉన్నావంటూ కొండల్ రావు కొంతకాలంగా వేధిస్తున్నాడు. చెప్పుకోలేని భాష వాడుతూ ఆమెను అవమానిస్తున్నాడు. రెండు రోజుల క్రితం తనను ఎందుకు వేధిస్తున్నావని నిలదీసిన ఆమె ఛాతిపై చేయివేసి బలంగా తోశాడు. దీంతో కిందపడిపోయిన ఆమెకు గాయలయ్యాయి. దీంతో బాధితులురాలు పోలీసులను ఆశ్రయించగా...దర్యాప్తు జరిపి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఐపీసీ 354,323, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.