commercial tax office
-
ఏసీబీ వలలో కమర్షియల్ ట్యాక్స్ అధికారి
రాజమహేంద్రవరం క్రైం: నగరంలోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఉండ్రాజపు రాజేంద్ర ప్రసాద్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ పి.రామచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. రాజానగరం మండలం కృష్ణపట్నం వద్ద ఉన్న యర్త్ గిఫ్ట్ కమ్యూలిటీస్ ఫ్యాక్టరీ (జీడిపిక్కల ప్రోసెసింగ్ ఇండస్ట్రీ) యాజమాని కర్రి రామచంద్రారెడ్డి నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు. నిందితుడు రాజేంద్రప్రసాద్‌ను ఏసీబీ డీజీ పి.ఎస్.ఆర్.ఆంజనేయులు ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రా రెడ్డి మన రాష్ట్రంతో పాటు కేరళ, మహారాష్ట్రలకు జీడిపప్పు ఎగుమతి చేస్తుంటారు. ఎగుమతి చేసిన జీడి పప్పుకు రాష్ట్రంలో 2 శాతం కమర్షియల్ ట్యాక్స్ చెల్లిస్తారు. ఇతర రాష్ట్రాలలో 3 శాతం ట్యాక్స్ చెల్లిస్తారు. ఇతర రాష్ట్రాలలో చెల్లించిన ట్యాక్స్‌కు సీ ఫారం సమర్పించాల్సి ఉంటుంది. 2016 –17 సంవత్సరాలకు గాను రామచంద్రా రెడ్డి రూ.3 కోట్ల విలువైన జీడిపప్పును ఎగుమతి చేశారు. దీనికి సంబంధించి ఆయన అన్ని ట్యాక్స్‌లు చెల్లించినప్పటికీ మరో రూ.9 లక్షలు చెల్లించాలంటూ గత నెల 7న కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. తాను అన్ని ట్యాక్స్‌లు చెల్లించానని, మరో సారి పరిశీలించాలంటూ రామచంద్రారెడ్డి అధికారుల నోటీసుకు సమాధానం పంపారు. అయినప్పటికీ రూ.9 లక్షలు చెల్లించాల్సిందే అంటూ అధికారులు అతడిపై ఒత్తిడి తెచ్చారు. నష్టాలు కారణంగా చాలా కాలంగా తాను జీడిపప్పు వ్యాపారం చేయడం మానేశానని రామచంద్రా రెడ్డి చెప్పినా పట్టించుకోకుండా రూ.9 లక్షలు చెల్లించకుండా ఉండాలంటే కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు రూ.2 లక్షల లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనిపై రామచంద్రా రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి రూ.60 వేలు ఇచ్చేలా కమర్షియల్ ట్యాక్స్ అధికారులను ఒప్పించేలా పథకం రచించారు. లంచం సొమ్ము రూ.60 వేలు బుధవారం మధ్యాహ్నం కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయానికి తీసుకువచ్చి ఇస్తానని సీనియర్ అసిస్టెంట్ రాజేంద్రప్రసాద్‌కు రామచంద్రా రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. తమ కార్యాలయానికి రావొద్దని, తానే బయటకు వచ్చి తీసుకుంటానని రాజేంద్రప్రసాద్ చెప్పారు. కార్యాలయం సమీపంలోని ఐశ్వర్య అపార్ట్మెంట్ వద్దకు వచ్చి రామచంద్రా రెడ్డి నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా రాజేంద్ర ప్రసాద్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న నగదుతో పాటు కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ చేపట్టారు. సీటీఓకూ సంబంధం! ఈ సంఘటనలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఆర్.త్రినాథరావుకు కూడా సంబంధం ఉందని బాధితుడు చెబుతున్నారు. తనకు ఏవిధమైన సంబంధం లేదని సీటీఓ త్రినాథరావు ఏసీబీ అధికారుల విచారణలో చెప్పారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి లంచం తీసుకోవడంలో ఎవరి ప్రమేయం ఉందో గుర్తిస్తామని ఏసీబీ డిఎస్సీ పి.రామచంద్రరావు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఈ దాడులలో ఏసీబీ సీఐలు వి.పుల్లారావు, పి.వి.జి.తిలక్, సూర్యమోహనరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో కమర్షియల్ ట్యాక్స్ అదనపు కమిషనర్
సాక్షి, అమరావతి/లక్ష్మీపురం (గుంటూరు)/విశాఖ క్రైం/శ్రీకాకుళం/హైదరాబాద్: విజయవాడ వాణిజ్య పన్నుల శాఖలో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న జి. లక్ష్మీప్రసాద్ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దాడులు చేసింది. గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలతోపాటు హైద్రాబాద్‌లో మొత్తం 20చోట్ల బుధవారం ఏకకాలంలో సోదాలు జరిపింది. దాడుల్లో రూ.1.84 కోట్ల విలువ చేసే చరాస్తులను గుర్తించినట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆర్.పి.ఠాకూర్ వెల్లడించారు. లక్ష్మీప్రసాద్‌తోపాటు ఆయన బంధువులు, బినామీల నివాసాల్లో జరిపిన సోదాల్లో పలు ఇళ్లు, ఇంటి స్థలాలు, వ్యవసాయ భూమిని గుర్తించారు. వీటికి సంబంధించిన దస్తావేజులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో లక్ష్మీప్రసాద్ అత్త పేరిట రెండు ఎకరాల వ్యవసాయ భూమి, తెలంగాణలోని మహేశ్వరం మండలం అమీర్‌పేటలో ఆయన బంధువు పేరిట రెండెకరాల వ్యవసాయ భూమి, పరిగిలో నాలుగు ప్లాట్లు, 30తులాల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, విలువైన సెల్ఫోన్లు, రూ.34లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో గుర్తించిన చరాస్తుల్లో.. రూ.కోటి విలువ చేసే ప్రాంసరీ నోట్లు, బ్యాంకు నిల్వ రూ.34 లక్షలు, నగదు రూ.32 వేలు, రూ.40 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, గృహోపకరణాలు రూ.10 లక్షలు, మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక లాకర్ ఉన్నాయి. స్థిరాస్తుల విలువ తెలియాల్సి ఉంది. శ్రీకాకుళంలోని లక్ష్మీప్రసాద్ ఇంట్లో తనిఖీలు చేస్తున్న అధికారులు -
ఏసీబీ వలలో మరో అవినీతి చేప
-
ఏసీటీవో లంచాలను బయటపెట్టిన ఫేస్బుక్
-
ఏసీటీవో లంచాలను బయటపెట్టిన ఫేస్బుక్
అనంతపురం జిల్లా హిందూపురంలోని వాణిజ్య శాఖ కార్యాలయంలో చోటుచేసుకుంటున్న అవినీతి బాగోతాన్ని ఓ ఫేస్బుక్ పోస్టింగ్ బయటపెట్టింది. ఆ కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీఓ) హబీబ్ లక్షల్లో లంచాలు వసూలు చేస్తున్నారంటూ వాణిజ్య శాఖకు చెందిన నాగరాజు అనే ఓ ప్రైవేటు ఉద్యోగి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దాంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో అలజడి చెలరేగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఏసీటీవో, జూనియర్ అసిస్టెంట్, స్పెషల్ వింగ్ స్టాఫ్, ప్రైవేటు బాయ్స్‌తో ప్రతి నెలా ఒక్కొక్క షాపు నుంచి రూ.3 వేలు మొదలుకుని రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ వసూళ్ల చిట్టాను ఫేస్బుక్లో పెట్టారు. ఏసీటీవో రూ.70 లక్షలకు పైగా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఐరన్, సిమెంట్ షాపుల నుంచి రూ.20 వేలు, ఫైర్ వర్క్ డీలర్స్ నుంచి రూ.30వేలు, హోల్‌సేల్ కిరాణా మర్చంట్స్ నుంచి రూ.50 వేలు, తూమకుంట, గోళాపురం ఐరన్ ఫ్యాక్టరీల నుంచి రూ.లక్ష, సోప్స్ వ్యాపారుల నుంచి రూ.25 వేలు, ముద్దిరెడ్డిపల్లి పట్టుచీరల వ్యాపారుల నుంచి రూ.లక్ష, బెంగళూరు పార్సిల్ సర్వీసు నుంచి రూ.50 వేల చొప్పున.. ఇలా ప్రతినెలా మామూళ్లు వసూలు చేస్తున్నారంటూ చిట్టా ఉంచారు. కాగా.. తూమకుంట చెక్‌పోస్టులో జనరేటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నాగరాజు ఈ వివరాలు ఫేస్బుక్లో ఉంచి తన ప్రతిష్ఠకు భంగం కల్గించారని ఏసీటీవో హబీబ్ హిందూపురం రూరల్ ఎస్సై ఆంజనేయులుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై నాగరాజును స్టేషన్‌కు పిలిపించి విచారించారు. కేసు నమోదు చేస్తున్నామని, పూర్తిస్థాయి విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. ఫేస్బుక్లో ఉంచిన అక్రమ వసూళ్ల వివరాలపైనా ఆరా తీస్తున్నామన్నారు. -
పక్కాగా నొక్కేశారు
కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో రూ.2.70కోట్లు స్వాహా తప్పుడు సీళ్లు, బిల్లులతో నలుగురు ఉద్యోగుల అక్రమార్జన 2011 నుంచి కొనసాగిన స్వాహాపర్వం... ఇటీవల వెలుగులోకి రావడంతో విచారణకు కమిషనర్ ఆదేశం సాక్షిప్రతినిధి, అనంతపురం: వ్యాపారులు ప్రతి నెలా ట్యాక్స్ చెల్లిస్తున్నారు... ఆ డబ్బులు అకౌంటెంట్ బ్యాంకులో చెల్లించి బ్యాంకుసీలుతో ముద్రవేసి చలానాలు అధికారులకు ఇస్తున్నారు. వీటిని చిట్టాబుక్కులో పొందుపరుస్తున్నారు. పన్ను వసూళ్లపై క్లియర్ రిపోర్టు ఇస్తున్నారు. - ఇది బయటికి తెలిసిన వ్యవహారం అయితే ఆ నలుగురికే తెలిసిన తతంగం మరొకటి ఉంది. వ్యాపారులు ప్రతినెలా ఇచ్చేట్యాక్స్ డబ్బులు బ్యాంకులో చెల్లించరు. నకిలీ సీళ్లు తయారు చేసి చెల్లించినట్లు చలానాపై తప్పుడు ‘ముద్ర’ వేస్తారు. వాటిని చిట్టాబుక్కులో పెట్టి ‘క్లియర్ రిపోర్టు’ ఇస్తున్నారు. 2011 నుంచి వాణిజ్య పన్నుల శాఖ (కమర్షియల్‌ట్యాక్స్) కార్యాలయంలో నలుగురు అధికారులు కలిసి చేసిన స్వాహాపర్వం. వారంతా కలిసి ఏకంగా రూ.2.70కోట్లు స్వాహా చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే నాలుగేళ్ల బిల్లులు ఒక్కసారి తిరగేస్తే 7కోట్ల కుంభకోణం దాకా ఉంటుందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ స్వాహాపర్వం వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురంలో వాణిజ్యపన్నులశాఖ సర్కిల్-1, -11 ఉన్నాయి. వీటి పరిధిలోని వ్యాపారులు ప్రతీనెలా పన్నులు చెల్లించాలి. ఈ డబ్బులు స్వాహా చేసేందుకు నలుగురు అధికారులు ఓ వ్యూహం రచించారు. ఇందులో ఓ అకౌంటెంట్, ఓ జూనియర్ అసిస్టెంట్, సీటీవోతో పాటు మరో అధికారి ఉన్నట్లు తెలుస్తోంది. పన్ను డబ్బులను బ్యాంకులో చెల్లించకుండానే చెల్లించినట్లు అకౌంటెంట్ నకిలీసీళ్లతో చలానాలపై సీలు వేశాడు. ఈ చలానాలను చిట్టాబిక్కులో అతికించి జూనియర్ అసిస్టెంట్ క్లియరెన్స్ రిపోర్టు ఇచ్చాడు. ఇలా తమ పరిధిలోని కొన్ని దుకాణాల పన్నులు చెల్లిస్తూ... మరికొన్ని తప్పుడు సీళ్లతో చెల్లించనట్లు చూపిస్తూ సర్కారు సొమ్మును మింగేస్తూ వచ్చారు. వీరిద్దరితో మరో అధికారి చేతులు కలిపారు. వీరి ముగ్గురూ ఓ సీటీవీ చాంభర్‌లో రోజూ రాత్రి 8-9గంటల వరకూ ఉండేవాళ్లు! అయితే వీరేం చేస్తున్నారో? ఎందుకు రాత్రిదాకా ఆఫీసులో ఉన్నారో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. కుంభకోణం వెలుగులోకి వచ్చిందిలా: వెంకటేశ్వర ట్రేడర్స్‌కు చెందిన రూ.67వేల బిల్లు పెండింగ్‌లో ఉంది. ట్రేడర్స్ యాజమాన్యం ఐపీ పెట్టారు. దీంతో ట్రేడర్స్‌కు సంబంధించి బిల్లులు తనిఖీలు చేశారు. ట్రేడర్స్ చెల్లించినట్లు చలానాలు ఉన్నాయి. కానీ పన్ను మొత్తం జమకాలేదు. ఆరా తీస్తే కుంభకోణం బయటపడింది. ఈ విషయం వాణిజ్యపన్నులశాఖ కమిషనర్‌కు తెలిసింది. ఇది ఒక్కటే ఇలా ఉందా? ఇంకేమైనా ఉన్నాయా? అని విచారణకు ఆదేశించారు. దీంతో విచారణ కమిటీ అనంతపురానికి వచ్చి తనిఖీలు చేపట్టింది. తీగ లాగితే డొంక కదిలింది. నాలుగేళ్లుగా కొన్ని బిల్లులు బ్యాంకులో చెల్లించకుండానే తప్పుడు చలానాలతో మాయ చేసినట్లు గ్రహించారు. ఇప్పటివరకూ కోటిరూపాయల దాకా గోల్మాల్ అయినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. అయితే అది రూ.2.70కోట్లదాకా ఉంటుందని ఆశాఖ వర్గాలు చెబుతున్నాయి. నాలుగేళ్లుగా నలుగురు డీసీలు గుర్తించలేకపోయారా? 2011 నుంచి ఈ కుంభకోణం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కాలంలో శోబాబు, నరసింహం, ద్వారకనాథరెడ్డి డిప్యూటీ కమిషనర్లుగా పనిచేశారు. ప్రస్తుతం కల్పన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తప్పుడు చలానాతో సొమ్ముస్వాహా చేస్తున్నా వీరి నలుగురిలో ఏఒక్కరూ గుర్తించకపోవడం గమనార్హం. వీరికి తెలీకుండానే ఇదంతా జరిగిందా? అనేది తేలాల్సి ఉంది. డిప్యూటీ కమిషనర్ ఏమన్నారంటే!: ఈ విషయంపై కమర్షియల్‌ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ కల్పనను 'సాక్షి' వివరణకోరగా ‘ నా దృష్టికి వచ్చింది. అయితే ఎలా జరిగింది? ఎవరు పాత్రదారులు? అనే విషయాలపై క్లారిటీ లేదు. అంతకు మించి ఇప్పుడు తానేమీ చెప్పలేనన్నారు.