compensation increase
-
వన్యప్రాణుల దాడులకు పరిహారం పెంపు
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణులు–మనుషుల సంఘర్షణలో మరణాలు లేదా గాయపడటం వంటివి సంభవిస్తే.. వివిధ కేటగిరీల వారీగా చెల్లించే నష్టపరిహారాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ దాడుల్లో మనుషులు చనిపోతే గరిష్టంగా ఇచ్చే రూ.5లక్షల పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గాయపడిన వారికి (సింపుల్ ఇంజూరి) వైద్య ఖర్చులకయ్యే మొత్తాన్ని చెల్లిస్తుండగా, వెంటనే సహాయం అందించేందుకు రూ.పదివేలు ఎక్స్‌గ్రేషియాగా ఇవ్వనున్నారు. ఈ ఘటనల్లో తీవ్రంగా గాయపడినవారికి వాస్తవ వైద్యఖర్చుతో పాటు శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి ఎక్స్‌గ్రేషియా రూ.75 వేలు ఇస్తుండగా, ఇప్పుడు ఆ ఎక్స్‌గ్రేషియా రూ.లక్షకు పెంచారు. ఈ దాడుల్లో పశువులు చనిపోతే పశుసంవర్థకశాఖ ఇన్స్పెక్టర్ అంచనాలకు అనుగుణంగా మార్కెట్ ధర చెల్లిస్తుండగా దానిని పశుసంవర్థకశాఖ ఇన్స్పెక్టర్తో పాటు అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ (ఎఫ్ఎస్వో) , గ్రామసర్పంచ్ సంయుక్తంగా సమర్పించే నివేదిక ఆధారంగా మార్కెట్ ధర (రూ.50వేలుమించకుండా) చెల్లించనున్నారు. పంట నష్టానికీ పరిహారం పెంపు పంటనష్టం వాటిల్లినపుడు గతంలో ఎకరానికి రూ.6 వేలు చెల్లిస్తుండగా, వ్యవసాయ అధికారి, ఎఫ్ఎస్వో, రెవెన్యూ అధికారి సంయుక్తంగా వేసే అంచనా ఆధారంగా ఎకరానికి రూ.ఏడున్నర వేల కు పరిహారం పెంచారు. ఇతర ఉద్యానవన పంట లకు రెవెన్యూ అధికారుల అంచనాకు అనుగుణంగా రూ.ఏడున్నర వేల నుంచి రూ.50 వేల దాకా పరిహారం చెల్లిస్తుండగా, ఉద్యాన అధికారి, ఎఫ్ఎస్వో, రెవెన్యూ అధికారి సంయుక్త నివేదిక ఆధారంగా గతంలో చెల్లిస్తున్న మొత్తాన్ని అందజేయనున్నా రు. మరణం / గాయం / పంటనష్టం వంటి వాటికి ఆయా కుటుంబాల్లోని పెద్దలకు రెవెన్యూ అధికారుల సర్టిఫికెట్ ఆధారంగా వేగవంతంగా పరిహారం చెల్లించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఈ మేరకు అటవీశాఖ ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. వివిధ కేటగిరీలకు అర్హత మార్గదర్శకాలు ఇవీ... ♦ అడవులు, రక్షిత ప్రాంతాల్లో వలస పశువులు, మేకలు, గొర్రెలు చనిపోతే ఎలాంటి పరిహారం లేదు ♦ జాతీయపార్కుల్లో జరిగిన దాడుల్లో పశువులు చనిపోతే పరిహారం చెల్లించరు ♦ ఫారెస్ట్‌బీట్ ఆఫీసర్/ ఎఫ్ఎస్వో పరిశీలించేదాకా దాడిలో పశువులు చనిపోయిన ప్రాంతం నుంచి తరలించొద్దు ♦ పశువులను చంపడంపై ఎఫ్ఎస్వో ఆ పై స్థాయి అధికారి సర్టిఫికెట్ (పంచనామా, ఫొటోలతో సహా) ఇవ్వాల్సి ఉంటుంది ♦ డీఎఫ్‌వో/ ఎఫ్‌డీవోలు మంజూరు చేసి చెక్కుల ద్వారా చెల్లించాలి ♦ వన్యప్రాణుల దాడుల్లో మనుషుల మరణం లేదా గాయపడినపుడు (పాములు, కోతులు మినహా) దాడి జరిగిన ప్రాంతాన్ని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లేదా ఎస్ఐ ర్యాంక్‌కు తక్కువలేని ఉద్యోగి 48 గంటల్లో స్పాట్ ఇన్స్పెక్షన్ చేయాలి ♦ మృతికి కారణంపై అసిస్టెంట్ సివిల్ సర్జన్‌తో పోస్ట్‌మార్టమ్ నిర్వహించి సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దాడి జరిగినపుడు అటవీ, వన్యప్రాణుల చట్టాలను బాధితుడు ఉల్లంఘించి ఉండకూడదు. -
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు దీపావళి ధమాకా
బెంగళూరు : దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్, అంచనాలు మించి లాభాలు ఆర్జించడంతో తన ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించింది. టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు, అత్యద్భుతంగా పనితీరు కనబరిచిన ఉద్యోగులకు భారీగా పరిహారాలను పెంచేసింది. కీలకమైన మేనేజర్ స్థాయిలో ఉన్న ఎనిమిది మందికి వేతన ప్యాకేజీలను సవరించింది. వీరిలో సీఎఫ్‌వో ఎండీ రంగనాథ్, ప్రెసిడెంట్స్ మోహిత్ జోషి, సందీప్ డాడ్లానీ, రాజేష్ కే మూర్తి, రవికుమార్ ఎస్, జనరల్ కౌన్సిల్, చీఫ్ కంప్లీయన్స్ ఆఫీసర్ డేవిడ్ కెనెడీ, హెచ్ఆర్ హెడ్ కృష్ణమూర్తి శంకర్, కంపెనీ సెక్రటరీ మణికాంత్ ఏజేఎస్లకు పరిహారాలను పెంచింది. నవంబర్ 1 నుంచి ఈ పరిహారాలు అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ఎక్కువగా ఈ పరిహారాలు స్టాక్ ఆప్లన్లు, వేరియబుల్ పరిహారాల కింద కంపెనీ మంజూరుచేసింది. సవరించిన వేతనాలు ప్రకారం ఈ ఎనిమిది ఎగ్జిక్యూటివ్‌లకు స్థిరమైన పరిహారం కింద రూ.24 కోట్లు, వేరియబుల్ పరిహారం కింద రూ.20 కోట్లు వరకు పొందనున్నారు. అదనంగా 2016 ఆర్థిక నిర్వహణలో భాగంగా రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్(ఆర్ఎస్యూలు) 2.45 లక్షలు, స్టాక్ ఆప్షన్లు 5.02 లక్షలు నవంబర్ 1 నుంచి వీరికి కంపెనీ మంజూరు చేయనుంది. అదేవిధంగా 425 మంది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఉద్యోగులకూ 906,275 ఆర్ఎస్యూలు, 943,810 స్టాక్ ఆప్షన్లను కంపెనీ మంజూరుచేసింది. ఇవి నాలుగు సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటాయి. ఇక సూర్య సాప్ట్వేర్ సిస్టమ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ డి.ఎన్. ప్రహ్లాద్‌ను బోర్డులోకి స్వతంత్ర డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈయన ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణమూర్తికి దగ్గరి బంధువని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నియామకం అక్టోబరు 14, 2016 నుంచే అమల్లోకి వస్తుంది.