ఇన్ఫోసిస్ ఉద్యోగులకు దీపావళి ధమాకా
బెంగళూరు : దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్, అంచనాలు మించి లాభాలు ఆర్జించడంతో తన ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించింది. టాప్ ఎగ్జిక్యూటివ్లకు, అత్యద్భుతంగా పనితీరు కనబరిచిన ఉద్యోగులకు భారీగా పరిహారాలను పెంచేసింది. కీలకమైన మేనేజర్ స్థాయిలో ఉన్న ఎనిమిది మందికి వేతన ప్యాకేజీలను సవరించింది. వీరిలో సీఎఫ్వో ఎండీ రంగనాథ్, ప్రెసిడెంట్స్ మోహిత్ జోషి, సందీప్ డాడ్లానీ, రాజేష్ కే మూర్తి, రవికుమార్ ఎస్, జనరల్ కౌన్సిల్, చీఫ్ కంప్లీయన్స్ ఆఫీసర్ డేవిడ్ కెనెడీ, హెచ్ఆర్ హెడ్ కృష్ణమూర్తి శంకర్, కంపెనీ సెక్రటరీ మణికాంత్ ఏజేఎస్లకు పరిహారాలను పెంచింది. నవంబర్ 1 నుంచి ఈ పరిహారాలు అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ఎక్కువగా ఈ పరిహారాలు స్టాక్ ఆప్లన్లు, వేరియబుల్ పరిహారాల కింద కంపెనీ మంజూరుచేసింది.
సవరించిన వేతనాలు ప్రకారం ఈ ఎనిమిది ఎగ్జిక్యూటివ్లకు స్థిరమైన పరిహారం కింద రూ.24 కోట్లు, వేరియబుల్ పరిహారం కింద రూ.20 కోట్లు వరకు పొందనున్నారు. అదనంగా 2016 ఆర్థిక నిర్వహణలో భాగంగా రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్(ఆర్ఎస్యూలు) 2.45 లక్షలు, స్టాక్ ఆప్షన్లు 5.02 లక్షలు నవంబర్ 1 నుంచి వీరికి కంపెనీ మంజూరు చేయనుంది. అదేవిధంగా 425 మంది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఉద్యోగులకూ 906,275 ఆర్ఎస్యూలు, 943,810 స్టాక్ ఆప్షన్లను కంపెనీ మంజూరుచేసింది. ఇవి నాలుగు సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటాయి. ఇక సూర్య సాప్ట్వేర్ సిస్టమ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ డి.ఎన్. ప్రహ్లాద్‌ను బోర్డులోకి స్వతంత్ర డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈయన ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణమూర్తికి దగ్గరి బంధువని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నియామకం అక్టోబరు 14, 2016 నుంచే అమల్లోకి వస్తుంది.