రూ.49కే బీఎస్ఎన్ఎల్ కనెక్షన్
రేపు సంగారెడ్డిలో మెగా మేళా
మెరుగైన సేవలందించడమే లక్ష్యం
టెలికాం జనరల్ మేనేజర్ ఏకే సాహు
సంగారెడ్డి మున్సిపాలిటీ: బీఎస్ఎన్ఎల్ సేవలను మరింత విస్తరించేందుకు కొత్త పాలసీని అమలు చేస్తున్నామని సీనియర్ జనరల్ మేనేజర్ ఏకే సాహు అన్నారు. సోమవారం స్థానిక బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ టెలికాం సంస్థల కంటే వినియోగ దారులకు మెరుగైన సేవలందించేందుకు బీఎస్ఎన్ఎల్ పోటీ పడుతోందన్నారు.
ప్రైవేటుగా ఎన్ని టెలికం సర్వీసులు మార్కెట్లోకి వచ్చినా బీఎస్ఎన్ఎల్కు ఉన్న ఆదరణ తగ్గలేదన్నారు. ఇందుకు గత నెల 24వ తేదీన నిర్వహించిన మెగా కనెక్షన్ మేళాలో ఒకే రోజు మూడువేల ల్యాండ్ లైన్ కనెక్షన్ల కోసం దరఖాస్తులు రావడమే నిదర్శనమన్నారు. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో ఏపీలోని విజయవాడ పట్టణంలో మాదిరిగా సంగారెడ్డిలో కూడా 4జీ సేవలందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
కొత్తగా రూ.49కే ల్యాండ్ ఫోన్ ఇస్తున్నామని, ఈ సర్వీసు ద్వారా ఆరు మాసాల వరకు ఇదే సేవలో కొనసాగుతారని ఆరు నెలల తరువాత జనరల్ కనెక్షన్ కింద మారుస్తామన్నారు. ప్రతి రోజూ రాత్రి 9గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు దేశంలోని ఏ నెట్వర్క్ ఉన్న ల్యాండ్‌లైన్, మొబైల్ ఫోన్‌కు ఉచితంగా మట్లాడుకోవచ్చన్నారు.
బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ సేవలను మరింత విస్తరించేందుకు 521 కేబీపీఎస్ నుంచి 1 ఏబీపీఎస్ ప్లాన్ కింద సేవలందిస్తున్నామన్నారు. అన్లిమిటెడ్ బ్రాడ్ బ్యాండ్ 470 ప్లాన్‌లో 2 ఎంబీపీఎస్ నుంచి 10 జీబీలో ( రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ) ఉచిత ఫోన్ కాల్స్ సౌకర్యం ఉందన్నారు.
24న బీఎస్ఎన్ఎల్ మేళా
జిల్లా వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ సేవల విస్తరణకు గాను ఈ నెల 24న మెగా మేళా నిర్వహిస్తున్నట్లు జీఎం సాహు తెలిపారు. ఇందులో విద్యార్థులు, అమూల్య, నేస్తం, మినిట్ ప్లాన్ పేరుతో ఈ సేవలందిస్తామన్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదు చేయగా రాష్ట్రంలోనే కాకుండా జిల్లాలో కూడా మిషన్ భగీరథ, రోడ్ల వెడల్పు తదితర కార్యక్రమాలు చేపట్టడం వల్ల అవాంతరాలు వస్తున్నాయన్నారు. ఈ సమస్యను ఏప్పటికప్పడు పరిష్కరించేందుకు ఐదు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో డిప్యూటీ జనరల్ మేనేజర్లు సిద్ధార్థ కరణ్, రత్నం తదితరులు పాల్గొన్నారు.