dalatis
-
పక్కదారి పడుతున్న సబ్‌ప్లాన్ నిధులు
– నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని నందికొట్కూరు ఎమ్మెల్యే వై. ఐజయ్య అన్నారు. శనివారం.. కర్నూలు నగరం సుంకేసుల రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ జీఎం కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, పక్కనే పీఅండ్‌టీ కాలనీలో బాబూ జగజ్జీవన్‌రామ్‌ల సిమెంటు విగ్రహాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని పారుమంచాల గ్రామ సమీపంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ. 3 కోట్ల సబ్‌ప్లాన్ నిధులు వాడారన్నారు. ఎస్సీలకు 15, ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, దళితులు కలిసికట్టుగా వాటిని పెంచుకునేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. పోస్టల్, టెలికాం శాఖలు కలిసి ఉన్న సమయంలో పీఅండ్‌టీ కాలనీ ఏర్పడిందని, 1956లో ఈ కాలనీ నిర్మాణానికి అప్పటి డిప్యూటీ ప్రధాని బాబుజగజ్జీవన్రామ్ శంకుస్థాపన చేశారని తెలిపారు. ఆయన శంకుస్థాపన చేసిన కాలనీలోనే విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా చాలా ఆనందం కలిగిందన్నారు. బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ పి.ఎస్.జాన్ అధ్యక్షతన నిర్వమించిన కార్యక్రమాల్లో జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు, పోస్టుమాస్టర్ వై.డేవిడ్, బీఎస్ఎన్ఎల్ డీజీఎంలు టి.సురేశ్, ఎస్.పి.నాగరాజురావు, అక్బర్‌బాష, ప్రభుత్వ ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ శ్రీరాములు, మాజీ కార్పొరేటర్ గున్నామార్క్ పాల్గొన్నారు. రెండు విగ్రహాలను సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడం పట్ల దళిత సంఘాల నాయకులను ఐజయ్య అభినందించారు. తాను ఇప్పటి వరకు 36 అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించినట్లు తెలిపారు. -
11 నుంచి 'మనగుడి'
కర్నూలు(కల్చరల్) : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 11 నుంచి 14 వరకు జిల్లాలో ఎంపిక చేసిన ఆలయాల్లో మన గుడి ప్రత్యేక ఆరాధనోత్సవాలు జరగనున్నాయని ధర్మప్రచార మండలి జిల్లా అధ్యక్షులు పత్తి ఓబులయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 11న జిల్లాలో ఎంపిక చేసిన దళిత వాడల్లోని పది ఆలయాల్లో మంగళకైశికి పూజలు, 12న ఆలయ శోభ, 13న సంకీర్తనలు, భజనలు, 14న జిల్లా వ్యాప్తంగా ప్రతీ మండలంలోని పది శివాలయాల్లో మన గుడి కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. శివాలయాల్లో శ్రీవారి పాదముల వద్ద ఉంచిన కంకణధారణ, అక్షింతలు, కలకండ భక్తులకు పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో మొత్తం 530 శివాలయాల్లో 14న మనగుడి ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. అదే రోజున జిల్లాలో ఎంపిక చేసిన ఒక శివాలయంలో బిల్వార్చన నిర్వహించనున్నామన్నారు. శ్రీవారి సేవకులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. 31న ధర్మప్రచార మండలి సమావేశం.. మన గుడి ప్రత్యేక ఆరాధనోత్సవాల నిర్వహణ గురించి చర్చించేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు స్థానిక సి.క్యాంప్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో ధర్మప్రచార మండలి సభ్యుల సమావేశం జరగనున్నదని సభ్యులందరూ ఈ సభలో పాల్గొనాలని ఆ సంస్థ జిల్లా అధ్యక్షులు పత్తి ఓబులయ్య విజ్ఞప్తి చేశారు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలి
- డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కర్నూలు సిటీ: ప్రభుత్వం దళితులకు కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సూచించారు. నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా దళిత యువత ముందుకు రావడం లేదన్నారు. సోమవారం స్థానిక ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండులో చంద్రన్న దళితబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల్ కిశోర్‌బాబు హాజరైయ్యారు. సభలో కేఈ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల కోసం అమలు చేస్తున్న పథకాలు పూర్తిస్థాయిలో వారి దరికి చేరడంలేదన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ ప్రభుత్వం ఎస్సీల కోసం పాటుపడుతోందన్నారు. మంత్రి రావెల్ కిశోర్‌బాబు మాట్లాడుతూ సబ్‌ప్లాన్ గురించి అధికారులకు సైతం అవగహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకర్లు ఎస్సీలకు రుణాలు ఇవ్వడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని ఇకపై బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించే బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ డ్వాక్రా సంఘాలకు 43.82 కోట్ల రుణాల చెక్కు, 226 మందికి 3.55 కోట్ల చెక్కు, 20 మంది గిరిజనులకు 10 లక్షల చెక్కును మంత్రులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్, జేసీ హరికిరణ్, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎస్సీ కమిషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు, డైరెక్టర్లు దేవానంద్, ప్రభాకర్, ఎమ్మెల్యే మణిగాంధీ, ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, మాజీ మంత్రి ములింటి మారెప్ప పాల్గొన్నారు. -
దళిత జీవన ప్రతిబింబాలు కన్నడ కథలు
కర్నూలు (కల్చరల్): ప్రముఖ రచయిత రంగనాథ రామచంద్రరావు రచించిన కన్నడ కథలు దళిత జీవన ప్రతిబింబాలుగా నిలిచిపోతాయని ప్రసిద్ధ కథా రచయిత సింగమనేని నారాయణ తెలిపారు. స్థానిక సిల్వర్ జూబ్లీ కళాశాలలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జరిగిన ‘కన్నడ దళిత కథలు’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కథా సంకలనం భారతీయ సామాజిక దర్శనానికి దోహద పడుతుందన్నారు. కథారచయిత రంగనాథరామచంద్రరావు బాధ్యత కల్గిన రచయితగా అణగారిన వర్గాల బాధలను అక్షరీకరించడం అభినందనీయమన్నారు. ఈ సంకలనంలోని ప్రతి కథలో కన్నడ దళితుల కడగండ్లను చిత్రీకరించారన్నారు. రచయితను ఆయన సాహిత్య సాంస్కృతిక వారధిగా అభివర్ణించారు. సభలో పాల్గొన్న సిల్వర్ జూబ్లీ కళాశాల తెలుగు శాఖ అ«ధ్యక్షుడు విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. దళిత కథలు పాఠకుల మనసును కలిగించి పాఠకులను కర్తవ్యోన్ముఖులు చేస్తాయన్నారు. సంకలనంలోని గొడ్డుకాఫీ కథలో దళిత బాలుని జీవిత హదయ విదారకంగా చిత్రించి రచయిత అణగారిన జీవిత చిత్రాన్ని దర్శింపజేశారన్నారు. దేశ వ్యాప్తంగా దళితులపై అగ్రవర్ణాల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో రంగనా«థరామచంద్ర రావు దళిత కథలను పాఠకుల ముందుకు తీసుకురావడం అభినందనీయమని సాహితీ స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంధ్యాల రఘుబాబు అన్నారు. సాహితీ స్రవంతి సిల్వర్‌జూబ్లీ కళాశాల విద్యార్థులో సామితీ సభ నిర్వహించి సమాజంలోని బడుగు జీవుల కథల గురించి వారికి తెలియజేయడం హర్షణీయమని కథా రచయిత ఇనాయతుల్లా అన్నారు. అనంతరం సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో రచయిత రంగనాధరామచంద్ర రావుకు ఘనసన్మానం చేశారు. కార్యక్రమంలో సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి కెంగార మోహన్, రచయిత్రి నాగమణి, రచయితలు వియోగి, ఎస్‌డీవీ అజీజ్, సిల్వర్ జూబ్లీ కళాశాల తెలుగు అధ్యాపకురాలు డా.దండెబోయిన పార్వతి, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆర్థిక చేయూతతో అభివృద్ధి
– ఎస్సీ కార్పొరేషన్ ఎండీ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ కర్నూలు(అర్బన్): ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక చేయూతతో ప్రతి ఒక్కరూ యూనిట్లు నెలకొల్పుకొని తమ జీవన ప్రమాణాలను మెరుగు పరచుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఎండీ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ అన్నారు. బుధవారం నగర శివారుల్లోని వీజేఆర్ కన్వెన్షన్ హాల్లో యువ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని దళితవర్గాలు సమష్టిగా ఉంటు సంఘాలుగా ఏర్పడి సమాజంలోని రుగ్మతలపై పోరాడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అభివద్ధి కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. భూ అభివద్ధి, భూమి కొనుగోలు పథకాల ద్వారా ఎక్కువ మందికి లబ్ధి చేకూరే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. భూమి కొనుగోలు పథకానికి సంబంధించి బడ్జెట్‌ను పెంచాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఆయా పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు త్వరలోనే మండల స్థాయిలో అవగాహన సదస్సులను నిర్వహిస్తామని చెప్పారు. ఎస్సీ నిరుద్యోగ యువత తమకు ఇష్టమైన రంగంలో నైపుణ్యాలను పెంచుకొని ఆయా రంగాల్లో స్థిరపడాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వీర ఓబులు, ఈఓ సుశేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ లాలా లజపతిరావు, మెప్మా పీడీ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.