Darna programs
-
కేంద్రం కాదంటే కొనుడే!
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం సమస్యపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకునే యోచనలో ఉంది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు చేయని కేసీఆర్ సర్కార్ ఈనెల రెండోవారంలో అనూహ్య నిర్ణయం ప్రకటించి రైతుల మద్దతు పొందేలా ప్రణాళిక సిద్ధం చేస్తోందని సమాచారం. ఆదివారం మొదలు 11వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేయడం ద్వారా ధాన్యం విషయంలో బీజేపీని దోషిగా నిలబెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు.. 11న ఢిల్లీలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కలిసి మహాధర్నా నిర్వహించిన అనంతరం.. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా రైతాంగానికి అండగా నిలిచే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని చాటి చెప్పనుంది. రైతులకు అండగా నిలవడం ద్వారా పడే దాదాపు రూ.2,000 కోట్ల ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 11 తర్వాత మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. భారం భరించడం వైపే మొగ్గు.. యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఇప్పటివరకు కొనసాగుతున్న విధానం మొదటిది. అంటే రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి కనీస మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేసి ఉప్పుడు బియ్యంగా ఎఫ్‌సీఐకి పంపించడం. అయితే ఇందుకు కేంద్రం ససేమిరా అంటోంది. ఉప్పుడు బియ్యం తీసుకునే ప్రసక్తి లేదని, ముడి బియ్యంగా ఇస్తే ఎంతైనా తీసుకుంటామని తేల్చి చెబుతోంది. నిర్ణయాన్ని రైతులకే వదిలేయాలనేది రెండో ప్రత్యామ్నాయం. యాసంగిలో వరి వేయవద్దని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని యాసంగి పంట వేసే సమయంలోనే ప్రభుత్వం చెప్పింది. అయినా రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. రాష్ట్ర ప్రభుత్వం కొనదు కనుక.. రైతులు నేరుగా మిల్లర్లు, దళారులకు విక్రయిస్తే కనీస మద్దతు ధర ప్రసక్తే ఉండదు. క్వింటాలుకు రూ.500 వరకు రైతులు నష్టపోయే అవకాశం ఉందని ప్రభుత్వానికి నివేదికలు వచ్చాయి. అందువల్ల ఈ ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ సుముఖంగా లేరని తెలిసింది. మద్దతు ధర రాకపోతే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని ఆయన భావిస్తున్నారు. ఇక మూడో ప్రత్యామ్నాయం.. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయడం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారమైనప్పటికీ, ఈ ప్రత్యామ్నాయంపైనే కేసీఆర్ సర్కార్ దృష్టి సారించినట్లు తెలిసింది. ముడి బియ్యంతో నష్టమెంత? ఇప్పటివరకు సాగిన విధానంలో.. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి, బియ్యంగా రూపంలో (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఎఫ్‌సీఐకి అప్పగించి కేంద్రం నుంచి డబ్బులు వసూలు చేసుకునేది. ఈ విధానంలో 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. అయితే యాసంగిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా మిల్లింగ్‌లో నూకల శాతం ఎక్కువగా ఉంటోంది. దీంతో గత కొన్నేళ్లుగా ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మార్చి కేంద్రానికి ఇస్తున్నారు. అయితే ఉప్పుడు బియ్యానికి డిమాండ్ లేదంటూ గత ఏడాది నుంచి ఈ విధానంపై పేచీ పెడుతోంది. కేవలం ముడి బియ్యం మాత్రమే తీసుకుంటామనిని చెబుతోంది. ఉప్పుడు కాకుండా ముడిబియ్యమే..! కేంద్రం చెప్పినట్లు ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా కాకుండా ముడిబియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి ఇచ్చే ప్రతిపాదనపై పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు తమ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. సాధారణంగా 100 కిలోల ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మారిస్తే యాసంగిలో 68 కిలోల బియ్యం వస్తుంది. ఒకవేళ ముడిబియ్యంగా మారిస్తే 100 కిలోల ధాన్యాన్ని మర పట్టిస్తే నూకలు పోను 40 కిలోల నుంచి 50 కిలోల వరకు బియ్యం వచ్చే అవకాశం ఉన్నట్లుగా నివేదికల్లో వివరించినట్లు తెలిసింది. నూకలను ఇతర అవసరాలకు వినియోగించడం ద్వారా ఎంతమేర నష్టాన్ని పూడ్చుకోవచ్చు అనే దానిపై కూడా నివేదిక రూపొందించినట్లు తెలిసింది. బియ్యం లోటు నష్టాన్ని మిల్లర్లకు చెల్లించేలా.. ముడిబియ్యంగా మార్చి ఇచ్చే పక్షంలో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు భారం పడవచ్చని అంచనా వేసినట్లు తెలిసింది. కనీస మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి, ముడిబియ్యంగా మార్చే ప్రక్రియలో బియ్యం లోటు వల్ల ఏర్పడే నష్టాన్ని మిల్లర్లకే నేరుగా చెల్లించి ఎఫ్‌సీఐ లెక్కల ప్రకారం 68 కిలోల బియ్యాన్ని తీసుకునేలా ప్రణాళిక సిద్ధమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని సాధ్యమైనంత వరకు బద్నాం చేసి, తర్వాత కొనుగోలు కేంద్రాల ద్వారా తానే ధాన్యం సేకరించాలనే వ్యూహంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అధికారులు, మిల్లర్లతో మంత్రి సమావేశం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుక్ర, శనివారాల్లో సంస్థ ఎండీ అనిల్‌కుమార్‌తో పాటు మిల్లర్ల సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుందన్న విషయమై చర్చించారు. నష్టాన్ని భరిస్తే తాము ధాన్యం మిల్లింగ్‌కు తీసుకుని ముడి బియ్యం ఇచ్చేందుకు సిద్ధమేనని మిల్లర్లు చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లింగ్ చేస్తే వచ్చే నష్టాన్ని లెక్కలు వేశారు. దీనిపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
సర్కారు వంచనపై నిరసన భేరి
* 5న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆందోళనలు * విశాఖలో జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో మహాధర్నా సాక్షి, హైదరాబాద్: మాట తప్పిన చంద్రబాబుప్రభుత్వం చేస్తున్న వంచనలు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా డిసెంబర్ అయిదో తేదీన ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాల యాల ఎదుట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మహా దర్నా కార్యక్రమాలు జరుగనున్నాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదు ట జరిగే ధర్నాలో పాల్గొంటారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జగన్ అధ్యక్షతన జరిగిన గుంటూరు జిల్లా నాయకుల సమావేశంలో ఐదో తేదీ ధర్నా నిర్వహణ గురించి ప్రధానంగా చర్చించారు. అధికారంలోకి వస్తే రైతుల, డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు ఆ తరువాత వారిని మోసం చేశారని, పింఛన్ల, రేషన్‌కార్డుల తొలగింపు, ఊరూరా లెసైన్సు పొంది న మద్యం దుకాణాల ఏర్పాటు వంటి నిర్ణయాలతో టీడీపీ ప్రభుత్వం వంచన పరాకాష్టకు చేరుకుందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ఐదు నెలల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే ఈ ధర్నాను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డిసెంబర్ 15కల్లా కమిటీల ఏర్పాటు పూర్తి డిసెంబర్ 15వ తేదీ నాటికల్లా జిల్లా, మండల, పట్టణ, గ్రామ కమిటీల అనుబంధ సంఘాల కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని జగన్ జిల్లా నేతలకు సూచించారు. మిగతా జిల్లాల్లో కూడా కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసేలా చూడాలని ఆయా జిల్లాల నేతలకు వర్తమానం పంపాలని సంబంధిత రాష్ట్ర నేతలను ఆదేశించారు. సమావేశానంతరం గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు.రుణాలను మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు మాట తప్పారని, ప్రజలు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. రాజధాని ప్రాంతంలో మళ్లీ పర్యటన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలోని రాజధాని రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు ఏపీ రాజధాని నిర్మించ తలపెట్టిన గ్రామాల్లో మరో రెండు రోజులపాటు పర్యటిస్తారని పార్టీ పీఏసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించారు. అన్ని గ్రామాల్లో పర్యటించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని పార్టీ అధ్యక్షుడు తమకు సూచించారని చెప్పారు. ఆ తరువాత వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఒక అఖిలపక్ష కమిటీ సమావేశానికి ఆహ్వానిద్దామని కూడా జగన్ అభిప్రాయ పడ్డారని తెలిపారు. పార్టీ ముఖ్య నేతలు ఎంవీ మైసూరారెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మహ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, డాక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ (ప్రకాశం), సామినేని ఉదయభాను (కృష్ణా), కె.ఆగస్టీనాతో సహా పలువురు నేతలు సమావేశానికి హాజరయ్యారు.