సర్కారు వంచనపై నిరసన భేరి | On the 5th the state-wide YSR CP as concerns | Sakshi
Sakshi News home page

సర్కారు వంచనపై నిరసన భేరి

Published Thu, Nov 20 2014 1:51 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM

సర్కారు వంచనపై నిరసన భేరి - Sakshi

సర్కారు వంచనపై నిరసన భేరి

* 5న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆందోళనలు
* విశాఖలో జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో మహాధర్నా

సాక్షి, హైదరాబాద్: మాట తప్పిన చంద్రబాబుప్రభుత్వం చేస్తున్న వంచనలు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా డిసెంబర్ అయిదో తేదీన ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాల యాల ఎదుట వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మహా దర్నా కార్యక్రమాలు జరుగనున్నాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదు ట జరిగే ధర్నాలో పాల్గొంటారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జగన్ అధ్యక్షతన జరిగిన గుంటూరు జిల్లా నాయకుల సమావేశంలో ఐదో తేదీ ధర్నా నిర్వహణ గురించి ప్రధానంగా చర్చించారు.

అధికారంలోకి వస్తే రైతుల, డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు ఆ తరువాత  వారిని మోసం చేశారని, పింఛన్ల, రేషన్‌కార్డుల తొలగింపు, ఊరూరా లెసైన్సు పొంది న మద్యం దుకాణాల ఏర్పాటు వంటి నిర్ణయాలతో టీడీపీ ప్రభుత్వం వంచన పరాకాష్టకు చేరుకుందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ఐదు నెలల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే ఈ ధర్నాను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
 
డిసెంబర్ 15కల్లా కమిటీల ఏర్పాటు పూర్తి
డిసెంబర్ 15వ తేదీ నాటికల్లా జిల్లా, మండల, పట్టణ, గ్రామ కమిటీల అనుబంధ సంఘాల కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని జగన్ జిల్లా నేతలకు సూచించారు. మిగతా జిల్లాల్లో కూడా  కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసేలా చూడాలని ఆయా జిల్లాల నేతలకు వర్తమానం పంపాలని సంబంధిత రాష్ట్ర నేతలను ఆదేశించారు. సమావేశానంతరం గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు.రుణాలను మాఫీ చేస్తానని చెప్పి  చంద్రబాబు  మాట తప్పారని, ప్రజలు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు.
 
రాజధాని ప్రాంతంలో మళ్లీ పర్యటన
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలోని రాజధాని రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు ఏపీ రాజధాని నిర్మించ తలపెట్టిన గ్రామాల్లో మరో రెండు రోజులపాటు పర్యటిస్తారని పార్టీ పీఏసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించారు. అన్ని గ్రామాల్లో పర్యటించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని పార్టీ అధ్యక్షుడు తమకు సూచించారని చెప్పారు. ఆ తరువాత వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఒక అఖిలపక్ష కమిటీ సమావేశానికి ఆహ్వానిద్దామని కూడా జగన్ అభిప్రాయ పడ్డారని తెలిపారు.

పార్టీ ముఖ్య నేతలు ఎంవీ మైసూరారెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మహ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, డాక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ (ప్రకాశం), సామినేని ఉదయభాను (కృష్ణా), కె.ఆగస్టీనాతో సహా పలువురు నేతలు సమావేశానికి హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement