Dear Zindagi
-
జిందగీ షురూ
రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, నీల ప్రియా, ‘మిర్చి’ కిరణ్, హర్ష వర్ధన్ ప్రధాన పాత్రల్లో ‘డియర్ జిందగి’ అనే సినిమా షురూ అయింది. ఈ చిత్రం ద్వారా పద్మారావ్ అబ్బిశెట్టి (పండు) దర్శకునిగా పరిచయమవుతున్నారు. రాజా రవీంద్ర సమర్పణలో ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభంఅయింది. తొలి సీన్‌కి దర్శకుడు కల్యాణ్ కృష్ణ కెమెరా స్విచ్చాన్ చేసి, గౌరవ దర్శకత్వం వహించగా, డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ కొట్టారు. రాజా రవీంద్ర మాట్లాడుతూ– ‘ఇందులో ముగ్గురు పిల్లల తండ్రి పాత్రలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేస్తున్నాను’’ అన్నారు. ‘‘ప్రేక్షకులకు మంచి కాన్సెప్ట్ సినిమాలను అందించాలనే ఉద్దేశంతో స్నేహితులతో కలిసి ఈ బ్యానర్‌ని స్థాపించాను’’ అన్నారు శరత్ చంద్ర చల్లపల్లి. ‘‘మధ్య తరగతి వారికి మా సినిమా కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు పద్మారావ్ అబ్బిశెట్టి (పండు). -
మేకింగ్ ఆఫ్ మూవీ - డియర్ జిందగి
-
షారూఖ్ సినిమాకు నోటీసులు.?
ఇటీవల వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో పడ్డ షారూఖ్ ఖాన్, డియర్ జిందగీ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చాడు. రోటీన్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా గ్లోబలైజేషన్ నేపథ్యంలో తెరకెక్కిన డియర్ జిందగీ మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా ఓ కెనడియన్ టీవీ సీరీస్‌కు కాపీ అన్న వాదన రిలీజ్‌కు ముందు నుంచే వినిపిస్తోంది. సినిమా రిలీజ్ తరువాత ఆ టాక్ మరింత ఎక్కువైంది. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గౌరీషిండే.. షారూఖ్, అలియా భట్లు లీడ్ రోల్లో డియర్ జిందగీ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా కెనడియన్ టీవీ సీరీస్ 'బీయింగ్ ఎరికా'కు కాపీ అన్న టాక్ పెద్ద ఎత్తున వినిపించింది. షారూఖ్ లాంటి స్టార్ హీరో సినిమా కావటంతో ఆ టాక్ ఒరిజినల్ వర్షన్ మేకర్స్ వరకు చేరిందట. దీంతో బీయింగ్ ఎరికా యూనిట్ సభ్యులు నిర్మాత కరణ్ జోహార్‌తో పాటు షారూఖ్ ఖాన్లకు నోటిసులు పంపించారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై డియర్ జిందగీ యూనిట్ సభ్యులు మాత్రం స్పందించలేదు. -
పాక్ దెబ్బ షారుఖ్‌కి పడదు..!
వచ్చే నెల వస్తున్న ‘రయీస్’ సినిమా విషయంలో షారుఖ్‌కి పెద్దగా కష్టాలు ఉండకపోవచ్చు అని చెప్పవచ్చు. దేశమంతా పెద్దనోట్ల రద్దు, చిల్లర కష్టాల్లో మునగడం ఒక కారణం అయితే, ఇండియా కూడా పాక్‌కు దీటైన చెబుతూ ఉండటం మరో కారణం. ఇంతకీ సంగతేమి టంటే ‘రయీస్’లో పాకిస్తాన్ హీరో యిన్ మాహిరా ఖాన్ నటించింది. ‘పాక్ వాళ్లు ఎవరైనా మన సినిమాల్లో నటిస్తే ఆ సినిమాలను నిషేధించండి’ అని గతంలో రాజ్ థాక్రే నుంచి హెచ్చరిక వచ్చింది. దాని నుంచి బయటపడటానికి పాక్ వాళ్లు నటించిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా చాలా తిప్పలు పడాల్సి వచ్చింది. అయితే పాక్ హీరో అలీ జాఫర్ నటించిన ‘డియర్ జిందగీ’కి ఈ సమస్యలు తగ్గాయి. దానికి కారణం దేశంలో నెలకొన్న పరిస్థితులే. కనుక ఇప్పుడు ‘రయీస్’కి కూడా ఏ అడ్డంకులూ ఉండవని భావిస్తున్నారు. 1980లలో గుజరాత్లో మద్యం మాఫియాను నడిపిన ‘రయీస్ ఆలమ్’ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ పాత్రను షారుఖ్ ధరించగా ఇతని ఆట కట్టించే పోలీస్ ఆఫీసర్ ఏసిపి మజ్ముదర్ పాత్రలో నవాజుద్దీన్ సిద్దిఖీ నటించాడు. -
ప్రతి మనసుకు వైద్యం కావాలి
ప్రతి జీవితం ప్రియమైనది కావాలి కాయ్రాకు తన ప్రాబ్లం తనకు తెలియదు. అందంగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్‌గా మంచి ప్రతిభ ఉంది. ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. తనకు మంచి భవిష్యత్తు కూడా ఉంది. కాని తను ఒక రిలేషన్‌ను, జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో మాత్రం విఫలమవుతోంది. మొదటి బాయ్‌ఫ్రెండ్ ఒక హోటల్ యజమాని. మంచివాడు. పొడుగ్గా ఉంటాడు. కాని అతడికి నో చెప్పేస్తుంది. సింగపూర్‌లో ఔట్‌డోర్ షూటింగ్లో ఉండగా ఆ సినిమా నిర్మాతైన యువకునితో చనువుగా ఉండాల్సి వచ్చింది కనుక నో చెప్తున్నానని చెప్తుంది. ఆ తర్వాత ఆ నిర్మాతైన యువకుడు ఆమెకు సన్నిహతం కాబోతాడు. అమెరికాలో తీయబోతున్న సినిమాకు ఆమెను సినిమాటోగ్రాఫర్‌గా తీసుకుంటాడు. అయితే చిన్న ఇబ్బంది చెబుతాడు. తనకు గతంలో ఒక గర్ల్‌ఫ్రెండ్ ఉండేదని ఆమెతో తెగదెంపులు అయిపోయాయని అయితే ఆమె ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాల్సి వస్తోందని ఈ విషయం ముందే చెప్పడం మంచిదని చెప్పేస్తున్నానని అంటాడు. అంతేకాదు ఇక మనం మన అనుబంధం పట్ల సీరియస్ అవుదాం, పరస్పరం దీనిని ముందుకు తీసుకెళదాం అని కూడా చెప్తాడు. కాని అతడికీ నో చెప్పేస్తుంది. బతిమిలాడినా వినదు. దాంతో అతడు అమెరికా వెళ్లి తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌తోనే ఎంగేజ్మెంట్ చేసుకుంటాడు. అక్కడ సమస్య మొదలవుతుంది. పర్సనల్ వెర్సస్ ప్రొఫెషనల్. పర్సనల్‌గా ఆమె అతడిని వద్దనుకుంది. ప్రొఫెషనల్‌గా అతడి సినిమాలో పని చేయాలనుకుంటోంది. కాని అలా పని చేయాలంటే రోజూ అతణ్ణి చూడాలి, అతడి గర్ల్‌ఫ్రెండ్‌ని చూడాలి, వాళ్లిద్దరి సాన్నిహిత్యాన్ని చూడాలి ఇదంతా తాను పడగలదా అనే సందేహం. వద్దనుకుంటే బంగారంలాంటి సినిమా అవకాశం పోతుందే అని బాధ. ఈ రెంటి మధ్య నలిగిపోయి నిద్రకు కరువవుతుంది. వారాల తరబడి నిద్ర పట్టదు. నిద్రమాత్రలు మింగినా నిద్ర పట్టదు. దాని నుంచి బయటపడటానికే చివరకు గోవా వస్తుంది. అక్కడ ఉండే తల్లిదండ్రులతో నిత్యం గొడవ పడుతుంది. చివరకు గోవా సైకియాట్రిస్ట్ అయిన జహంగిర్ ఖాన్‌తో తన సమస్య చెప్పుకుని దాని నుంచి బయటపడుతుంది. అప్పటి వరకూ నరకంగా మారిన ఆ జీవితం ఆమెకు ఇప్పుడు ప్రియమైనదిగా మారుతుంది. ‘డియర్ జిందగీ’ వర్తమాన సమాజంలో వస్తున్న భావోద్వేగ సమస్యలకు వైద్యం ఎలా అవసరమో సున్నితంగా చెప్పే సినిమా. ఇందులో కాయ్రాగా ఆలియాభట్, సైకియాట్రిస్ట్ జహంగిర్ ఖాన్‌గా షారూక్ ఖాన్ కనిపిస్తారు. షారూక్ తన ఎంట్రీలోనే మన దేశంలో ఉన్న సమస్యను బహిరంగ పరుస్తాడు- ‘మన దేశంలో కిడ్నీ పాడైందనో లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చిందనో ఇరుగుపొరుగువారికి ధైర్యంగా చెప్తాము. కాని మనసు పాడైంది అని మాత్రం చెప్పుకోము. ఇంట్లో కూడా అదొక రహస్యంగా భావిస్తాము’ అంటాడతడు. ‘మన మెదడు మన దేహంలో భాగం కాదా?’ అని ప్రశ్నిస్తాడు. అతడు వైద్యం చేసే పద్ధతి కూడా భిన్నంగా ఉంటుంది. మందులూ మాకులతో చేసే వైద్యం కాదు అది. కేవలం మాట్లాడటం ద్వారా ఎదుటివారికి తమను తాము అర్థం చేయించడం ద్వారా చేసే వైద్యం. ‘పజిల్ని పూర్తి చేయాల్సింది నువ్వే. నేను కేవలం అందుకు సహాయకుణ్ణి మాత్రమే’ అంటాడు ఒకచోట. ఇంతకూ కాయ్రా సమస్య ఏమిటి? ఆమెకు ఆరేళ్ల వయసప్పుడు తల్లిదండ్రులు ఆమెను అమ్మమ్మ, తాతయ్య దగ్గర వదిలేసి జీవిక కోసం విదేశాలకు వెళ్లారు. ఆ ఎడబాటు ఆమె భరించలేకపోయింది. అక్కడ తమ బతుకు పోరాటంలో వాళ్లు కాయ్రాను పూర్తిగా అలక్ష్యం చేశారు. అంతే కాదు కన్నకూతురు తమకు దూరంగా ఉందని కాక రెండో తరగతిలో ఆమె ఫెయిల్ అయ్యిందనే కారణాన విదేశాల నుంచి స్వదేశం వచ్చి ఇక్కడే ఉండిపోయారు. తనంటే ప్రేమ లేదా? తానెంతో ప్రేమించిన తల్లిదండ్రులు తన పట్ల చూపే ప్రేమ ఇదా అని ఆమె మనసులో లోతైన గాయం అయ్యింది. ఆ గాయం వల్ల తాను మనస్ఫూర్తిగా ఎవరినీ ప్రేమించలేకపోయింది. ఎవరైనా దగ్గర కావడానికి ప్రయత్నించినా వాళ్లు ఎక్కడ ‘నో’ చెప్తారో అని తానే ముందు ‘నో’ చెప్పేస్తుంది. ఎందుకంటే తాను ఎవరినైనా కోరుకుంటే వాళ్లు దూరం అవుతారేమోనన్న భయం. ఇది ఆమెకు తెలియజేసి ఆమెను ఆ సమస్య నుంచి దూరం చేస్తాడు సైకియాట్రిస్ట్ షారుక్. తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారని కనుక తల్లిదండ్రుల తప్పును క్షమించేస్థాయికి ఎదగాలని అంటాడు. నువ్వు ఎవరి సమక్షంలో భద్రంగా సంతోషంగా ఫీలవుతావో అతను దొరికే దాకా వెతకడం, రిజెక్ట్ చేయడం తప్పు కాదని చెబుతాడు. ‘ఇష్టం లేకపోయినా కఠినమైన నిర్ణయాలు తీసుకుని మనసునూ శరీరాన్ని బాధించుకోవడం కంటే అసలు ఆ నిర్ణయాన్ని వదులుకోవడం మేలు’ అనే సూచన చేస్తాడు. ఇవన్నీ కాయ్రాకు మాత్రమే కాదు... థియేటర్లో ఉన్న ప్రేక్షకులకు కూడా సూచనలే. ఈ సినిమాలో ఆలియాతో పని మనిషి ‘ఎందుకమ్మా పిచ్చి డాక్టర్ దగ్గరకు వెళ్లావు? నీకు పిచ్చా?’ అని అడిగితే ‘కాదు. మానసికంగా కొన్ని సమస్యలను ఎదుర్కోలేనప్పుడు డాక్టర్ని కలిస్తే ధైర్యం వస్తుంది’ అని జవాబు చెప్తుంది ఆలియా. అప్పుడు పని మనిషి ‘అలాగైతే మంచిదే. నిజానికి అందరికీఅలాంటి డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉంది’ అంటుంది అర్థం చేసుకున్న దానిలా. నిజమే. మెదడు మన శరీరంలో భాగం అయినప్పుడు శరీరానికి ఏవో ఒక సమస్యలు వచ్చినట్టే మనసుకు కూడా ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. అలాంటి సమయంలో అది అనారోగ్యం కాదు అని అనుకోరాదు. చేయి తెగి రక్తం కారితే వైద్యం అవసరమనీ మనసు చెదిరి గాయపడితే వైద్యం అక్కర్లేదని అనుకోరాదు. మనందరం ఏదో ఒక సందర్భంలో మానసిక వైద్యం తీసుకోవాల్సిందే. తీసుకోవడమే మంచిది. ఎందుకంటే వైద్యం కన్నా జీవితం ప్రియమైనది. మళ్లీ మళ్లీ దక్కనిది. ఈ సినిమా దర్శకురాలు గౌరి షిండే, నిర్మాతలు గౌరి ఖాన్, కరణ్ జొహర్ ఇలాంటి సున్నితమైనసమస్యను తీసుకుని సినిమా తీసినందుకు అభినందనీయులు. 22 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే దాదాపుగా ఇప్పుడు 50 కోట్లు వసూలు చేసింది. ఇంకా చేయొచ్చు కూడా. చిన్న సినిమా అయినా షారూక్ ఇందులో నటించడం అతనికీ ప్రేక్షకులకూ ఒక మార్పు. ఆలియా భట్ తనలో ఉన్న టాలెంట్‌ని ప్రదర్శించడానికి ఈ సినిమా ఒక సవాలు. అందులో ఆమె ఒకటో ర్యాంకులో పాస్ అయ్యింది. సంగీతం, సినిమాటోగ్రఫీ అన్నీ అమరిన అలంకరణలు. సెకండ్ హాఫ్‌లో కొంచెం స్లో అయినా క్లయిమాక్స్‌కు అందుకుంటుంది. గోవాలో హాయిగా ఉండే వాతావరణంలో హాయిగా సాగే కథతో ఒక సినిమా చూడాలనుకుంటే డియర్ జిందగీ చూడొచ్చు. ఇది మీకు కొద్దోగొప్పో మేలే చేయగలదు. హాని కాదు. కెన్ గో ఫర్ ఇట్. -
చంద్రుడికన్నా పైనున్నట్లుంది: హీరోయిన్
లాస్ ఎంజెల్స్: తన నటనను మెచ్చుకుంటూ ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు పాల్ ఫెయిగ్ ప్రశంసలు కురిపించడంతో తనకు చంద్రుడికంటె పైన ఉన్నట్లుందని ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ పేర్కొంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, నటి అలియా భట్‌కు ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు పాల్ ఫెయిగ్ నుంచి ప్రశంసలు దక్కాయి. ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోన్న డియర్ జిందగీ చిత్రంలో వారిద్దరు చాలా అద్భుతంగా నటించారని అన్నారు. గోస్ట్ బస్టర్స్, ది హీట్ వంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన పాల్.. డియర్ జిందగీ దర్శకుడు గౌరీ షిండేను కూడా ప్రశంసల్లో ముంచెత్తారు. ఆమె చాలా అద్భుతమైన రచయిత అని అన్నారు. ‘డియర్ జిందగీ చిత్రంలో అద్భుతమైన నటనను కనబరిచిన షారుక్ ఖాన్, అలియా భట్‌కు నా అభినందనలు’ అంటూ ఆయన తన పోస్ట్‌లో రాశారు. పాల్ కు షారుక్ స్నేహితుడు కాగా.. పాల్ భార్య లౌరీ కారన్ షారుక్‌కు మంచి అభిమాని. పాల్ తమను పొగడటంపట్ల ఈ ఇద్దరు బాలీవుడ్ నటులు కూడా పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు. అలియా అయితే.. తనకు చంద్రుడిపైకి వెళ్లినట్లు ఉందంటూ ట్వీట్ చేసింది. -
అక్కడ రెండు రోజుల ముందే రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరోలందరూ వందల కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంటే.. కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ మాత్రం కొద్ది రోజులుగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్నాడు. ముఖ్యంగా అసహనంపై షారూఖ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాలకు దారితీయటంతో ఆయన సినిమాలపై కమర్షియల్‌గా కూడా తీవ్ర ప్రభావం పడింది. దీంతో కొద్ది రోజులుగా షారూఖ్ సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. అందుకే తన నెక్ట్స్ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బాద్షా. లిమిటెడ్ బడ్జెట్లో అలియా భట్‌తో కలిసి డియర్ జిందగీ సినిమాలో నటించాడు షారూఖ్. ఎలాంటి హడావిడి లేకుండా తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో మరోసారి తన కమర్షియల్ స్టామినా ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్న షారూఖ్ కొత్త ప్లాన్ చేస్తున్నాడట. రెగ్యులర్‌గా ఇండియన్ సినిమాలన్నీ ఒక్క రోజు ముందుగానే ఓవర్సీస్లో రిలీజ్ అవుతాయి. అయితే షారూఖ్ మాత్రం డియర్ జిందగీ సినిమాను రెండు రోజుల ముందే ఓవర్సీస్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అక్కడి ప్రేక్షకులకు నచ్చే అంశాలన్ని ఉన్న సినిమా కావటంతో ముందుగా అక్కడ రిలీజ్ అయితే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. అందుకే ఇండియాలో నవంబర్ 25న రిలీజ్ కానున్న డియర్ జిందగీ సినిమాను ఓవర్సీస్లో మాత్రం నవంబర్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
’నావాడు హాట్‌గా కాదు.. నైస్‌గా ఉండాలి’
ముంబయి: తనకు కాబోయే వాడు యూత్ ఐకాన్ అవ్వాల్సిన పనిలేదని, మనసులు దోచుకునేవాడు కావాల్సినవసరం లేదని ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ చెప్పింది. అయితే, అతడు మంచి లక్షణాలు కలిగి ఉండాలని, మంచి మనసున్నవాడై ఉండాలని చెప్పింది. ’నా జీవితంలో భాగస్వామి వచ్చినప్పుడు అతడు యూత్ ఐకాన్ అవ్వాల్సిన పనిలేదు.. అతడు హాట్ గా ఉన్నాడా లేదా అని కాదు.. మంచి మనసున్న వాడైతే చాలు. చాలా ఫన్నీగా ఉండాలి. బాధ్యతతో ఉండాలి. నన్ను బాగా ప్రేమించాలి’ అని చెప్పింది. ఈ ఏడాది ఆమె నటించిన ఉడ్తా పంజాబ్, కపూర్ అండ్ సన్స్ చిత్రాలకు అవార్డులు వస్తాయా అని ప్రశ్నించగా ఇంకా ఏడాది పూర్తవలేదుగా.. చూద్దాం ఏం జరుగుతుందో. నేను అవార్డులు రివార్డులు ప్రేక్షకుల నుంచి కోరుకుంటాను. వారు డియర్ జిందగీ సినిమాకు వచ్చి ఆ చిత్రాన్ని ఇష్టపడతారని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.