సాగుకు నీరివ్వలేం!
హెచ్ఎల్సీ కింద పంటలు వద్దు
- నార్లు పోసుకుని నష్టపోతే మేం బాధ్యులం కాదు
- టీబీ డ్యామ్ పరిస్థితిని అర్థం చేసుకోండి
- డీఈఈ రామసంజన్న
కణేకల్లు: ‘‘తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ దారుణంగా ఉంది. హెచ్ఎల్సీ ద్వారా ఆయకట్టుకు నీరిచ్చే పరిస్థితి లేదు. వచ్చే నీటిని తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తాం. రైతులు తాజా పరిస్థితిని అర్థం చేసుకోవాలి.’’ అని కణేకల్లు హెచ్ఎల్సీ సబ్ డివిజన్ డీఈఈ రామసంజన్న అన్నారు. స్థానిక హెచ్ఎల్సీ అతిథి గృహంలో శుక్రవారం సాగునీటి సంఘం అధ్యక్షుల సమావేశం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు కేశవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఈ మాట్లాడుతూ తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో వర్షం సమృద్ధిగా కురవకపోవడంతో డ్యాంకు ఇన్ఫ్లో బాగా తగ్గిందన్నారు.
ప్రస్తుతం నీటి మట్టం 1,613 అడుగులు కాగా.. 41.312 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. దామాషా ప్రకారం హెచ్ఎల్సీకి వచ్చే నీళ్లు తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతాయన్నారు. రైతులు ముందుగానే వరినార్లు పోసుకున్నాం.. నీళ్లివ్వండని డిమాండ్ చేసినా ఫలితం ఉండబోదన్నారు. అందుకు తాము బాధ్యులం కామన్నారు. కర్ణాటకలో శనివారం టీబీ బోర్డు సమావేశం నిర్వహిస్తున్నారని.. ఆ తర్వాత నీటి విడుదల ఆధారంగా హెచ్ఎల్సీ కోటాను తీసుకుంటామన్నారు. ప్రత్యేకించి నీళ్లు తీసుకుంటే కర్ణాటక రైతులు జల చౌర్యానికి పాల్పడే అవకాశం ఉందన్నారు. ఏఈఈ నరేంద్ర మారుతి మాట్లాడుతూ బోర్లు లేకపోతే పంటల జోలికి వెళ్లకపోవడమే మేలన్నారు. సాగుకు నీరివ్వలేమనే విషయాన్ని కరపత్రాలు, పత్రికల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు.
నాన్ ఆయకట్టును చూస్తూ ఊరుకోం
ప్రస్తుత పరిస్థితిని తాము అర్థం చేసుకోగలమని.. అయితే నాన్ ఆయకట్టు రైతులు హెచ్ఎల్సీ నీటిని చోరీ చేస్తే మాత్రం ఊరుకునేది లేదని, రైతులతో కలిసి షట్టర్లను ధ్వంసం చేసి అయినా నీళ్లు పారించుకుంటామని ఉద్దేహాల్ బ్రాంచ్ కాలువ టీసీ మెంబర్ అప్పారావు అన్నారు. హెచ్ఎల్సీ పొడవునా నాన్ ఆయకట్టు రైతులు కాలువ గట్ల మధ్యే పైపులు వేశారని.. యూటీల వద్ద కూడా పైపులు ఉన్నాయన్నారు. చాలా మంది పట్టపగలే కాలువపై మోటార్లు పెట్టి నీళ్లను చోరీ చేస్తూ దర్జాగు పంటలు సాగు చేస్తున్నారన్నారు.
ఆ విషయాన్ని మేం చెప్పలేం
పంటలు సాగు చేయొద్దనే విషయాన్ని తాము ఆయకట్టు రైతులుకు చెప్పలేమని డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు కేశవరెడ్డి తెలిపారు. సాగునీటి కోసం రైతులు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారని.. ఈ క్రమంలో పంటలు సాగు చేయవద్దని ఎలా చెప్పగలమని ఆయన ప్రశ్నించారు.
- కేశవరెడ్డి, డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు