drop outs
-
నాటి డ్రాపవుట్... నేటి డాక్టరమ్మ!
చదువుకు దూరమై మేకలు, గొర్లు కాసింది... డ్రాపవుట్స్ జాబితాలో చేరింది. నాలుగేళ్ల తరవాతమళ్లీ బడిబాట పట్టింది. పట్టుదలతో చదివి ‘డాక్టర్ విజయ’ గా నిలబడింది. గిరిజన తండాకే గర్వకారణంగా నిలిచింది. చదువు మానేసి మేకల వెంట తిరిగిన విజయ ఇప్పుడు డాక్టరమ్మ అయ్యింది. ఇదేమిటి.. చదువు మానేసిన విద్యార్థిని డాక్టర్ ఎలా అయ్యిందనుకుంటున్నారా? అవును నిజమే, చదువు మానేసి నాలుగేళ్లపాటు మేకలను కాసింది. అయితే ఓ ఉపాధ్యాయుడి చొరవతో తిరిగి బడిబాట పట్టిన విజయ ఇప్పుడు మెడలో స్టెతస్కోప్‌తో కనిపిస్తోంది. చదువుపై ఆసక్తి, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, తల్లిదండ్రులు అందించిన సహకారంతో ఆమె డాక్టర్‌గా ఇప్పుడు ఆ తండాలో అందరికీ ఆదర్శంగా నిలిచింది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఎల్లంపేట తండాకు చెందిన మాలోత్ గన్యా, చంద్రవ్వ దంపతుల కూతురు ‘విజయ’ గాథ ఇది. తల్లిదండ్రులకే కాదు తండా వాసులందరికీ గర్వకారణంగా నిలిచింది. విజయ మూడోతరగతి చదువుతున్న సమయంలో ఆమెతో పాటు ఆమె చెల్లెలు జ్యోతిని తల్లిదండ్రులు చదువు మాన్పించారు. వ్యవసాయ పనుల్లో ఉండే తల్లిదండ్రులు ఆడపిల్లలిద్దరినీ మేకలను మేపడానికి పంపించేవారు. అక్కాచెల్లెల్లిద్దరూ నాలుగేళ్లపాటు మేకల వెంటే తిరిగారు. అడవి, మేకలు, ఇల్లే వాళ్లకు లోకమైంది. ఆ ఊరి బడికి కొత్తగా వచ్చిన టి.శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు డ్రాపవుట్ల గురించి ఇల్లిల్లూ తిరుగుతూ వాళ్లింటికి చేరాడు. చదువుకోవలసిన వయసులో మేకల వెంట తిప్పడం సరికాదని, చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఆయన మాట మేరకు... విజయ తల్లిదండ్రులు పిల్లలిద్దరినీ బడికి పంపించారు. కొన్నిరోజులకే చిన్నపాప తిరిగి చదువు మానేసింది. కాని పెద్దమ్మాయి విజయ మాత్రం అలాగే కంటిన్యూ అయ్యింది. చదువు మీద విజయకు ఉన్న శ్రద్ధతో నాలుగేళ్లు చదువుకు దూరమైనా తనతో కలిసి చదువుకున్న స్నేహితులతో కలిసి వారి తరగతిలోనే చేరింది. రెగ్యులర్ విద్యార్థులతో చదువులో ఓ రకంగా పోటీ పడింది. విజయలో ఉన్న ఆసక్తిని గమనించిన ఉపాధ్యాయులు ఆమెను ప్రోత్సహించారు. గ్రామంలో ఏడోతరగతి వరకు మాత్రమే ఉండేది. ఏడోతరగతి పూర్తి చేసిన విజయ ఐదు కిలోమీటర్ల దూరాన ఉన్న అన్నారం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో చేరింది. రోజూ అందరితో కలిసి సైకిల్‌పై వెళ్లేది. రాను, పోను పది కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ చదువు కొనసాగించింది. పదో తరగతిలో ద్వితీయ శ్రేణిలో పాసైన విజయకు డాక్టర్ కావాలన్న ఆసక్తి ఏర్పడింది. 15 కిలోమీటర్ల దూరాన ఉన్న రామారెడ్డి గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ గ్రూపులో చేరింది. ఇంటర్లో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. అయితే మెడిసిన్‌లో సీటు సంపాదించాలంటే అప్పుడు ఉన్న పోటీని తట్టుకోలేని పరిస్థితి ఉంది. విజయ బంధువు అయిన స్థానిక ఆర్ఎంపీ హీరామన్ సలహా మేరకు బీయూఎంఎస్‌లో చేరింది. బీయూఎంఎస్ చదవాలంటే ఉర్దూ చదవడం, రాయడం రావాలి. ఇందుకోసం హైదరాబాద్‌కు వెళ్లిన విజయ రెండు నెలలపాటు ఉర్దూను అభ్యసించింది. పట్టుదలతో ఉర్దూ చదివి, బీయూఎంఎస్‌లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణురాలై కర్నూల్లోని అబ్దుల్ హక్ యునానీ మెడికల్ కళాశాలలో సీటు సంపాదించింది. బీయూఎంఎస్ పూర్తి చేసిన విజయ ఇప్పుడు పీజీపై దృష్టి సారించింది. పీజీ ప్రవేశపరీక్షలో ఎలాగైనా సీటు సంపాదించాలన్న పట్టుదలతో కష్టపడుతోంది. గ్రామీణ ప్రజలకు సేవలందిస్తా... మధ్యలో చదువు మానేసి నాల్గేళ్లు మేకల వెంట, పొలాల వెంట తిరిగిన నేను డాక్టర్‌ను అయ్యానంటే శ్రీనివాస్‌సార్ పుణ్యమే. ఆ రోజు నన్ను బడికి పంపమని మా ఇంటికి వచ్చి అమ్మా,నాన్నలకు సార్ నచ్చజెప్పడం వల్లే నేను బడికి వెళ్లగలిగాను. చదువుమీద ఆసక్తి పెరిగిన సందర్భంలో సార్లందరూ ప్రోత్సహించారు. ఎల్లంపేటలో ఏడోతరగతి కాగానే మళ్లీ చదువుకు ఎక్కడ దూరమైతానో అనిపించింది. కాని చదవాలన్న సంకల్పంతో రోజూ సైకిల్‌పై అన్నారం వెళ్లి పదోతరగతి దాకా చదివాను. ఇంటర్ రామారెడ్డిలో పూర్తి చేసిన. అప్పుడు మా బంధువు హీరామన్ బీయూఎంఎస్‌కు సంబంధించి ఎంట్రెన్స్ రాయమని సలహా ఇవ్వడంతో ఉర్దూ నేర్చుకున్నాను. మూడునెలల కోర్సు రెండు నెలల్లో పూర్తి చేసి ఎంట్రెన్స్ రాసి కర్నూల్లోని యునానీ కాలేజీలో సీటు సంపాదించాను. నా ముందు ఉన్న లక్ష్యం పీజీ. ఎలాగైనా పీజీ చేయాలని పట్టుదలతో ఉన్నాను. యునానీతోపాటు అల్లోపతి వైద్యం కూడా నేర్చుకుంటున్నాను. రాబోయే రోజుల్లో డాక్టర్‌గా గ్రామీణ ప్రజలకు వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తా. మా అమ్మ, నాన్నలతోపాటు కుటుంబ సభ్యులంతా నా కోసం ఎంతో కష్టపడ్డారు. నేను అది ఎప్పటికీ మరచిపోను. అమ్మానాన్నల రుణం తీర్చుకుంటాను. మా తండా ప్రజలందరికీ అండగా ఉంటాను. – డాక్టర్ మాలోత్ విజయ, ఎల్లంపేట తండా గర్వంగా ఉంది! నేను ఉద్యోగరీత్యా ఎల్లంపేట వెళ్లినపుడు డ్రాపవుట్ల గురించి ఇంటింటికీ తిరిగేవాళ్లం. నాతోపాటు మిగతా ఉపాధ్యాయులు కూడా అందరం కలిసి తండాలు తిరిగి డ్రాపవుట్లను బడిబాట పట్టించాం. అందులో విజయ ఒకరు. ఆమెలో చదవాలన్న కాంక్షను గమనించి ప్రోత్సహించాం. ఆమె ఇప్పుడు డాక్టర్ అయ్యిందంటే ఎంతో గర్వంగా ఉంది. – టి.శ్రీనివాస్, ఉపాధ్యాయుడు మస్తు సంతోషమైతుంది ఆడపిల్లలకు సదువు ఎందుకని మ్యాకలకాడికి పంపిస్తుంటిమి. ఒక దినం శ్రీనివాస్ సారు వచ్చి పిల్లల్ని బడికి పంపుమని ఒక్కటే తీర్గ చెప్పిండు. అడగంగా అడగంగా నాలుగేండ్ల తరువాత బడికి తోలిచ్చినం. ఊళ్లె చదువు అయిపోయినంక సైకిల్ మీద బిడ్డ అన్నారంకు పోయింది. తరువాత రామారెడ్డిల చదివింది. డాక్టర్ కోర్సు చదువుతానంటే మాకైతే ఏం తెలువదు. ఎన్నో కష్టాలు పడ్డం. ఆమెకు అయ్యే ఖర్సులకు తండ్లాడి మరీ పైసలు పంపిస్తుంటిమి. డాక్టరమ్మ అయ్యిందంటే మస్తు సంతోషంగ ఉన్నది. సర్కారు ఉద్యోగం వస్తే మంచిగుండు. లగ్గం చేద్దామనుకుంటున్నం. – మాలోత్ గన్యా, చంద్రవ్వ(విజయ తల్లిదండ్రులు) – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి -
వ్యాక్సిన్ డ్రాపౌట్స్ లేకుండా చూడండి
విజయవాడ(లబ్బీపేట) : జిల్లాలో ఇమ్యునైజేçషన్ కార్యక్రమం వందశాతం జరగాలని, డ్రాపావుట్స్ ఎవరూ ఉండరాదని గుంటూరు, రాజమండ్రి జోన్ల రీజినల్ డైరెక్టర్ డాక్టర్ డి.షాలినీదేవి అన్నారు. లబ్బీపేటలోని మలేరియా కార్యాలయంలో జిల్లాలోని వైద్యాధికారులు, ఇమ్యునైజేషన్ సిబ్బందితో శనివారం వేర్వేరుగా అవగాహన సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో పుట్టిన వెంటనే వేసే జీరో వ్యాక్సిన్ల నుంచి ప్రతి వ్యాక్సిన్లు చిన్నారులకు సకాలంలో వేయాలన్నారు. హైరిస్క్ ఏరియాల్లో డ్రాపవుట్స్ ఉంటున్నట్లు గతంలో గుర్తించామని, ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా సంచార జాతులు, ఇటుక బట్టీలు, నిలవ కూలీలు, క్రషర్స్‌లో ఉండే కుటుంబాలకు చెందిన పిల్లలకు వ్యాక్సిన్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నారి పుట్టినప్పటి నుంచి క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేసేలా ఆరోగ్య కార్యకర్తలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం తగదని ఆమె సూచించారు. అంతేకాకుండా చిన్నారికి వేసిర టీకాలను ఆ«ధార్ ఆధారంగా ఆన్లైన్ చేయాలన్నారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వారంలో ఆరు రోజులు వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకు రావడం జరిగిందని, జీరో బేస్ వ్యాక్సిన్‌లుఏడురోజులువేస్తారని డాక్టర్ షాలినీదేవి చెప్పారు. ఇమ్యునైజేషన్‌ను సమర్థంగా ఎలా నిర్వహించాలో పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునేజేషన్ అధికారి డాక్టర్ అమృత, వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఆర్.నాగమల్లేశ్వరి, జిల్లాలోని వైద్యులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
గిరిపుత్రులు డ్రాపౌట్
- పాఠశాలకు దూరమవుతున్నగిరిజన చిన్నారులు - ఏటా పెరుగుతున్న డ్రాపౌట్స్ సంఖ్య - పరిస్థితి చక్కదిద్దేందుకు సర్కారు చర్యలు సాక్షి, హైదరాబాద్: దేశంలో నిర్బంధ ఉచిత విద్య అమలులోకి వచ్చినా.. వంద శాతం అక్షరాస్యత దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా.. అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరడమే లేదు. బడిబాట పట్టని గిరిజన చిన్నారుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతూనే ఉంది. అంతేకాదు మధ్యలో బడి వదిలేసే ( డ్రాపౌట్స్) వారి సంఖ్య కూడా అధికమవుతోంది. తెలంగాణలోని 10 జిల్లాల్లో దాదాపు 20 వేల మంది గిరిపుత్రులు బడులకు దూరమైనట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. దాదాపు 1,500 మంది అసలు పాఠశాలలో అడుగు కూడా పెట్టలేదని స్పష్టమైంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి రాజీవ్‌విద్యామిషన్ నివేదికను సమర్పించింది. పెరుగుతున్న అవుట్ ఆఫ్ స్కూల్స్ సంఖ్య.. రాష్ట్రంలో అసలు బడికి వెళ్లని పిల్లల (అవుట్ ఆఫ్ స్కూల్స్) సంఖ్య గత ఏడాదితో పోల్చితే ఈసారి అధికంగానే ఉంది. గత ఏడాది (2013-14) బడికి వెళ్లని పిల్లలు 10,795 కాగా, 2014-15లో వీరి సంఖ్య 13,059 కు పెరిగినట్లు రాజీవ్‌విద్యామిషన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ సేకరించిన వివరాలను బట్టి వీరి సంఖ్య నాలుగు వేల వరకు ఉంది. ఈ రెండింటిని కలిపితే దాదాపు 20 వేల మంది వరకు చిన్నారులు బడికి వెళ్లని వారు ఉన్నట్లు తెలుస్తోంది. గిరిజన శాఖ నివేదిక ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 2,110 మంది, ఖమ్మంలో 1,442, నిజామాబాద్‌లో నుంచి 352 మంది బడికి వెళ్లని గిరిపుత్రులు ఉన్నట్లుగా తేలింది. రెగ్యులర్ పాఠశాలల నుంచి, ఆయా కాలాలను బట్టి బడి మానేస్తున్న వారిని అవుట్ ఆఫ్ స్కూల్‌గా పేర్కొంటుండగా, వారిసంఖ్య 1,348 గా ఉంది. వీరిలో అత్యధికంగా 1,205 మంది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అవగాహనారాహిత్యమే కారణం గిరిజనులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమవడం, వారి అక్షరాస్యత శాతం తక్కువగా ఉండడంతో తమ పిల్లలను బడికి పంపించాలన్న ఆలోచన గిరిజనులకు రావడం లేదు. గిరిపుత్రులు పశువుల కాపరులుగా కొనసాగుతున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో తమ పిల్లలను బడి మధ్యలో మాన్పిస్తున్నవారు కూడా ఎక్కువగా ఉంటున్నారు. కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిన సర్కార్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఒక కార్యాచరణ ప్రణాళిక అనుగుణంగా గిరిజన సంక్షేమ శాఖ జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించాలని ఆదేశించింది. స్కూల్ డ్రాపౌట్స్లను ముందుగా వేసవి శిక్షణా శిబిరాల్లో చేర్పించి, వారిని బడులకు అలవాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంఈఓలకు ఆదేశించింది. జిల్లా, డివిజన్‌స్థాయిలో శిక్షణా తరగతులను నిర్వహించడంతోపాటు అంగన్వాడీల ద్వారా ఈ సమస్యపై లోతుగా పరిశీలించి ఈ పిల్లలు బడులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆయా జిల్లాలకు సంబంధించి ప్రాజెక్టు అధికారులు, డీడీలు, జిల్లా గిరిజనసంక్షేమ అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి వాటికి జిల్లా కలెక్టర్లు, పీవోల ఆమోదం పొందాలని ఆదేశించింది. -
డ్రాపవుట్స్ కోసం పోలీసు సాయం
పీఆర్టీయూ(టీ) జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్ : ‘‘బాల కార్మికులను, బడి మానేసిన చిన్నారుల (డ్రాపవుట్స్)ను తిరిగి బడిలో చేర్పించే బాధ్యతను పోలీసులకు అప్పగిస్తాం. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని ఈ పనులకు వినియోగిస్తాం’’ అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్ (ఆఫ్టో), పీఆర్టీయూ (తెలంగాణ) సంయుక్తంగా మాదాపూర్‌లోని జూబ్లీరిడ్జీ హోటల్లో ‘అందరికీ గుణాత్మక విద్య’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ఏర్పాటు చేశారుు. శనివారం తొలిరోజు సదస్సును ప్రారంభించిన మహమూద్ అలీ మాట్లాడుతూ.. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా బడిఈడు చిన్నారుల్లో 30 శాతం మంది స్కూలుకు రావడం లేదన్నారు. విద్యామంత్రి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యను అందిస్తామన్నారు. ఎంపీ కె.కేశవరావు వూట్లాడుతూ విద్యాభివృద్ధి కోసం శాస్త్రీయ ధృక్పథంతో విధానాలను రూపొందించాలన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకరరెడ్డి భూపాల్‌రెడ్డి, భానుప్రకాశరావు, జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి, ఆఫ్టో చైర్పర్సన్ అన్నపూర్ణ, సెక్రటరీ జనరల్ ధర్మవిజయ్ పండిట్, పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్థన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాలస్వామి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.